Previous Page Next Page 
సంసారంలో శ్రీశ్రీ పేజి 9

    "అది ఊరుకున్నా  మీరు వుండలేరు. మీరిద్దరే  వుండండి. నేను వెళ్ళిపోతాను" అని కోపంతో  చేతినున్న  బంగారు గాజులన్నీ  తీసేసి విసిరేశారావిడ.

    దీపాలు  పెట్టేవేళ అవుతోంది.

    నేను గబగబా  వెళ్ళి ఆ గాజులన్నీ  తీసి ఆవిడ చేతికిచ్చి, "చూడండీ మరెప్పుడూ  ఇలాంటి పని చెయ్యకండి. నేను కూడా మీ మనసు నొప్పించే పని చెయ్యను. ముందు మీరీ గాజులు  తొడుక్కోండి. ఇప్పుడు  చెపుతున్నాను. నా మాట నమ్మండి. మీరే వచ్చి నన్ను పిలిచేవరకూ మళ్ళీ మీ గుమ్మంలో  అడుగుపెట్టన"ని చెప్పేసి చకచకా  నడుచుకుంటూ  వెళ్ళిపోయాను.


                                               *    *    *    *


    ఇంటికెళ్ళి  జరిగినదంతా  చెప్పాను.

    "పెళ్ళి విషయం  చెప్పావా?" అని అడిగారు.

    "మీకు  చెప్పద్దని చెప్పి నేనెలా  చెప్తాననుకున్నారు?" అన్నాను.

    నాకు మాత్రం  మనసు మనసులోలేదు. పరిస్థితులు  చక్కబడి, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ  హాయిగా  వుంటామన్న ఆశ లేదనుకుంటూనే నిద్రపోయాను.


                                                    *    *    *    *


    మర్నాడు ఉదయం ఎనిమిది గంటలు  కూడా కాలేదు. శ్రీశ్రీగారు వచ్చేశారు. నాడు చెప్పలేనంత  ఆనందం, ఆశ్చర్యం కలిగాయి.

    "అదేమిటి? మీరొచ్చేశారు?" అన్నాను.

    "నువ్వెలాగూ  అక్కడికి రావని నిర్ధారణ అయిపోయింది. అందుకే నేనే వచ్చేశాను" అన్నారు.

    "ఒంట్లో ఎలా వుంద"ని  మావాళ్ళందరూ  ప్రశ్నించారు.

    "బాగుంది" అన్నారాయన.

    "ఏవండీ! డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నారుగా! మీరిలా  తిరిగితే  ఎలా?" అని అడిగాను.

    "మరేం ఫరవాలేదు సరోజా! వారం పైగా   అయింది. ఇంట్లోనే  వుండి, నాకూ బోరే" అన్నారు.

    మా అమ్మ కాఫీ ఇచ్చింది.

    "ఇక రెండు పూటలా  నేనే వచ్చి వెళుతూ  వుంటాను" అనీ, కొంతసేపు కూర్చొని ఇంటికి వెళ్ళిపోయారు.

    అలా మరో పదిరోజులైపోయింది. పెళ్ళివారి దగ్గరి నుండి మాకు కూడా ఉత్తరాలు వస్తున్నాయి. మా ఇంట్లో 'శ్రీశ్రీగారితో  ఈ మాట ఎప్పుడు చెప్తామా?' అని కాచుకు కూర్చున్నారు.

    శ్రీశ్రీగారు బాగా  కోలుకున్నారు. కంపెనీలకి  కూడా వెళ్ళి వస్తున్నాం.

    ఓ రోజు సాయంకాలం ,అయిదు గంటలప్పుడు  శ్రీశ్రీగారు వచ్చారు. మా నాన్నగారు కూడా ఇంట్లోనే వున్నారు. అందరం కూర్చున్నాం.

    "మా సరోజకి  పెళ్ళి చెయ్యాలనుకుంటున్నామండీ" అని మా నాన్నగారు శ్రీశ్రీగారితో అన్నారు.

    ఆయన సిగరెట్ దమ్ము తీస్తూ  ఏదో ఆలోచనలో వున్నట్టున్నారు. ఈ మాట సరిగ్గా గమనించలేదు.

    నేను వెంటనే "మిమ్మల్నేనండీ! నాన్నగారు ఏదో అంటున్నారు" అన్నాను.

    'ఏమిటి' అన్నట్టు  మా నాన్నగారివైపు  చూశారు.

    "మా సరోజకి  పెళ్ళి చెయ్యాలనుకుంటున్నాం. సంబంధం కూడా సెటిలయింది" అన్నారు.

    "సంబంధం సెటిలయిందా? సరోజకి  పెళ్ళి చేస్తారా? అదెలా  చేస్తారండీ" అన్నారు శ్రీశ్రీగారు.

    "ఎలా చెయ్యడం ఏమిటి? ఆడపిల్లని కన్నాక  ఎప్పుడైనా పెళ్ళి చేసి పంపాల్సిందేగా? తప్పుతుందా?" అన్నారు  మా నాన్నగారు.

    "మీరు సరోజకి పెళ్ళి చెయ్యడానికి  వీల్లేదండి" అని శ్రీశ్రీగారన్నారు.

    "మీరన్నది  మరీ బాగుంది. వీల్లేదంటే  ఎలా? అలాగనడంలో  మీ ఉద్దేశం ఏమిట"ని నాన్నగారు  అడిగారు. 

    "ఇందులో  ఉద్దేశానికేముంది? సరోజ  నాకు కావాలి. అది లేకుంటే నేను బతకలేను. సరోజ నాది_నా స్వంతం" అన్నారు శ్రీశ్రీగారు.

    "అంటే  అది లేకుంటే  మీరు..." అని ఆశ్చర్యంతో ఏదో అడగబోయి ఆగిపోయారు నాన్నగారు.

    "అవును. నేను చచ్చిపోతాను" అన్నారు శ్రీశ్రీగారు.

    "ఇలాంటి మాటలాడకండి. అనడం తేలికే_ఒకరికోసం ఒకరు చనిపోవడమన్నది అనుకున్నంత, అన్నంత తేలిక కాదు" అన్నారు మా  నాన్నగారు.

    "మీకు శ్రీశ్రీ సంగతింకా  తెలీదు. నేను  అనుకుంటే  తిరుగులేదు. మీరు సరోజని  ఇంకొకడికిచ్చి  పెళ్ళి చేస్తే నేను సముద్రంలో  పడిపోతాను" అంటూ చటుక్కున లేచి, సిగరెట్ దమ్ము లాగుతూ, చకచకా  గేటుదాటి వెళ్ళిపోయారు.


                                         ఐ లవ్ యూ సరోజా!


    "ఏవండీ_ఏవండీ" అని  పిలుస్తూ  ఆయనవెంట  పడ్డాను.

    వెనక్కి తిరిగి చూడకుండా  వెళ్ళిపోతున్నారు. నేనూ  తొందరగా వెళ్ళి  "ఎక్కడికండీ వెళుతున్నారు" అని చటుక్కున  చెయ్యి  పట్టుకుని  ఆపాను.

    ఆయన వెళుతున్నది  సముద్రంవైపే! ఆయన కళ్ళు ఎర్రగా  వున్నాయి. "చెయ్యి వదులు సరోజా!" అన్నారు.

    అంతవరకూ  ఆయన ముఖాన్నే  చూస్తున్న  నేను ఆ మాటలతో  కోలుకొని చెయ్యి వదిలేశాను.

    మళ్ళీ ఆయన నడవడం  ప్రారంభించారు. ఆయనతోపాటు  నేనూ నడుస్తున్నానని  చెప్పడం కన్నా, పరుగు పెడుతున్నానంటే  బాగుంటుంది.

    "నీకీ పెళ్ళి  విషయం ముందే తెలుసా?" అని ప్రశ్నించారు.

    "తెలుసు" అన్నాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS