Previous Page Next Page 
సంసారంలో శ్రీశ్రీ పేజి 8

    శ్రీశ్రీగారిని  చూడకుండా, వారితో  మాట్లాడకుండా వుండగలనా? పెళ్ళయిపోతే అత్తవారింటికి  వెళ్ళిపోవాలి కదా?

    అంటే....మద్రాస్ జీవితాన్నీ, సినిమా ఫీల్డునీ, శ్రీశ్రీగారిని  వదులుకోవాలన్నమాట. అంతవరకూ  ఏమీ అనుకోని నేను శ్రీశ్రీగారి  కోసం  ఎందుకింత  దిగులుపడుతున్నాను? దీనికి అర్ధం ఏమిటి? అని ఆలోచించి గతుక్కుమన్నాను.

    ఈరోజు  శ్రీశ్రీగారి దగ్గరకి  వెళ్ళడానికి  వీల్లేదంటేనే  గుండెపగిలిపోతుందా  అని భయపడ్డ నేను, రేపు శ్రీశ్రీగారు లేకుండా  బ్రతకగలనా?

    ప్రేమ అంటే ఇలాగే వుంటుందా? అయ్యయ్యో! కొంపదీసి నేను శ్రీశ్రీగారిని  ప్రేమించలేదు  కదా? మరి ఈ బాధకి, ఈ ఆలోచనలకి  అర్ధం ఏమిటి?

    'ఏమైనా....మా వాళ్ళు పెళ్ళి చెయ్యక తప్పరు. నేనీ సినిమా ప్రపంచానికి  శ్రీశ్రీగారికి కూడా  మంగళ హారతి పాడక తప్పదు' అనుకున్నాను.

    పోనీలే....ఇదీ మంచికే! ఆవిడ చేత  చివాట్లు  తింటూ, అవమానాలుపడుతూ ఎంతకాలం పనిచేస్తాం?__అనుకుంటూంటే, "ఏమిటాలోచిస్తున్నావే? లే. అన్నం తిని పడుకుందువుగాని" అని అన్న మా అమ్మ మాటతో "ఆఁ" అన్నాను.

    నా పరధ్యానం చూసి, "మనకెందుకు  వచ్చిన బాధలు సరోజా! ఆవిడ కూడా  మన ప్రాణాలు తీస్తోంది. మంచి సంబంధం  వచ్చింది. పెళ్ళి చేసేసుకోవే" అంది మా అమ్మ.

    "సరేనమ్మా. మీ ఇష్టం" అన్నాను.

    ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా  అలజడిని  ఆపలేకపోయాను. శ్రీశ్రీగారు డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్ళిపోయారు. మూడు రోజులయ్యింది. నేను వారిని  చూడలేదు. రోజూ  కారు వస్తోంది, వెళుతోంది.

    ఓ రోజు  తప్పనిసరై, ఇక వారిని  చూడకుండా  వుండలేనన్న దృఢనిశ్చయంతో  శ్రీశ్రీగారి ఇంటికి వెళ్ళాను.

    మధ్యహాలులో, వాలు కుర్చీలో  కూర్చున్నారు. 

    "నమస్కారమండీ" అన్నాను.

    "జ్ఞాపకం వచ్చానా? ఏం అలాగున్నావు? ఒంట్లో  బాగోలేదా?" అని అడిగారు.

    'అబ్బే! అదేం లేదండీ. మీ ఒంట్లో  ఎలా వుంది? ఇంట్లో  ఎవరూ కనిపించరేం" అని అడిగాను.

    "అందరూ పెరట్లో  వున్నారు. నువ్వు కూర్చో" అన్నారు.

    "మీ ఇంటి పరిస్థితులు సర్దుకున్నాయా?" అని అడిగాను.

    "ఇది రావణాసురుడి  కాష్ఠం. ఈ సంగతి మరచిపో. అయినా నన్ను చూడకుండా మూడు రోజులై ఎలా వుండగలిగావు?" అని అడిగారు. నవ్వేశాను.

    నా బాధ ఆయనకేం తెలుసు! పెళ్ళన్న  మాట  విన్నది మొదలు శ్రీశ్రీగారి మాటల్ని, వారిని  స్టడీచేయడం  నాకు  తెలియకుండానే  ప్రారంభించాను. వారికోసం  నేను బాధపడుతున్నట్టే, నాకోసం  వారు కూడా బాధపడతారని  నాకు తెలుసు. కానీ ఇంకా గట్టిగా  తెలుసుకోవాలన్న  ప్రయత్నం!

    "ఈ మూడు రోజులు  మీరేం చేశారు?" అని అడిగాను.

    "ఏం చేస్తాను? తినడం, పడుకోవడం. ఎంతకని  నిద్రపోను? నీకు ఎన్నిసార్లు  కబురు చేసినా కదిలి రాందే! ఏం చేస్తాను? కంపెనీవాళ్ళెవరయినా  వచ్చారా?" అన్నారు.

    "వస్తే  ఇక్కడికే  పంపిస్తానని  చెప్పానుగా. మనసేమీ  బాగులేదు. మంచి మాటలేవయినా  చెబుదురూ" అన్నాను.

    "ఏమిటీ? నీకు మనస్సు  బాగులేదా? ఆశ్చర్యంగా వుందే?" అన్నారు.

    "ఆశ్చర్యానికేం  వుంది? కానీ....ఏవండీ  నికరమైన  మీ పుట్టిన తేదీ నాకుకావాలి" అని అడిగాను.

    "చెప్తారా....లేదా?" అన్నాను.

    "2_1_1910 అని  నా స్కూల్  రిజిష్టర్ లో  వున్న  దాఖలాతప్ప, నా పుట్టినతేదీ  విషయమై ఇంకో సాక్ష్యం లేదని  చెప్పాను కదా? నా జాతకం  మా బంధువుల్లో  ఎవరి దగ్గరా  వుందని  కూడా నేననుకోను. మా పెద్దబావ (భాగవతుల నరసింగరావు_ఆరుద్ర తండ్రి)ఏదో  జాతకం  రాశాడు. తను రాసిన దానికి తిరుగులేదంటాడు. అతడో రకం కర్మ సిద్ధాంతి. నా జాతకచక్రంతో పాటూ, జరిగినవీ, జరగబోయేవీ చాలా రాసిచ్చాడు. ఆ రాసిచ్చింది  ఎక్కడో  పోయింది.

    ఏ తేదీన  పుట్టానో  నాకు  తెలియనప్పటికీ  1910 అని మాత్రం  నికరంగా చెప్తున్నాను. చాలా ఏళ్ళ తర్వాత  మళ్ళీ తోకచుక్క ఆ ఏడే కనిపించింది. మా అమ్మ పోయిన కొద్ది కాలానికే  మా నాన్న మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడని చెప్పానుగా.

    నా సవతి తల్లి పేరు సుభద్రమ్మ. సాధారణంగా  సవతి తల్లంటే  రాక్షసి అని అందరూ అభిప్రాయ పడతారు. మా సుభద్రమ్మ మాత్రం  నా పాలిటి  దేవతే  అయ్యింది. మా నాన్న గణితశాస్త్రంలో  మంచి పండితుడు. అలాగే జూదంలో కూడా. మా ఆస్తి  చాలావరకు  పేకాటలో  కరిగిపోయిందని చెప్పచ్చు" అన్నారు.

    "అయితే....మీరు చదివింది  ఎక్కడండీ" అని అడిగాను.

    "విశాఖపట్నంలోనే  చదివాను. బి.ఏ. డిగ్రీ మాత్రం  మద్రాసు క్రిస్టియన్ కాలేజీలో  చేశాను" అని చెప్పారు.

    "విశాఖపట్నంలో  మీ ఇల్లు  ఎక్కడండీ" అని అడిగాను. (కారణం....నేను విజయనగరం దాన్ని. మీ బాల్యంలో  హరికథలు  చెప్పేదానినని రాశానుగా. విశాఖపట్నంలో  చాలాచోట్ల  కథలు  చెప్పాను. ఆ రోజుల్లో విశాఖ వీధులు  కొంతవరకూ నాకు పరిచయమే.)

    "విప్పర్తివారి వీధి" అని చెప్పారు.

    ఇంతలో  రవణమ్మగారు వచ్చారు.

    నేనక్కడికి  రావడం  ఇష్టంలేదని, ఆవిడ మాటలూ, చూపులతోనే  అర్ధమైపోయింది.

    "నేను కబురు పంపితేనే వచ్చిందిలేవే" అన్నారు శ్రీశ్రీగారు.  


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS