"మీరు కోలుకున్నాక చెప్పాలని నేనే మా వాళ్ళతో కూడా చెప్పొద్దన్నాను."
"ఈ పెళ్ళి నీకిష్టమేనా?"
నేనేమీ సమాధానం చెప్పలేదు.
"పెళ్ళికొడుకుని చూశావా?" అని ప్రశ్నించారు.
"లేదు..." అన్నాను.
"నన్ను చూడకుండా వుండగలవా?" అని అడిగారు.
జవాబివ్వలేదు.
"మాట్లాడవేం సరోజా?" అన్నారు.
"ముందు ఇంటికిపోదాం రండి. తర్వాత ఆని విషయాలూ మాట్లాడుకుందాం" అన్నాను.
"ఈ సంగతేదో తేలేదాకా నేను రాను సరోజా!" అన్నారు.
"ప్లీజండి! మొండిపట్టు పట్టకండి. అసలే నామనసు బాగులేదు. ఈ రోడ్డుమీద మన సంభాషణ బాగుండదండీ. రండి. ఇంటికిపోదాం" అన్నాను. "ముందు నీ ఉద్దేశం చెప్పు" అని అడిగారు.
నేనేమీ మాట్లాడలేదు.
"పోనీ ఓపని చెప్తాను చేస్తావా?" అన్నారు.
"చెప్పండి" అన్నాను.
"నాతో బీచ్ కి వస్తావా? అక్కడో అరగంట కూర్చుని వెళ్ళిపోదాం" అన్నారు.
"బీచ్ కా? నేను రాను. మీతో సాల్లేం. నాకసలే భయంగా వుంది" అన్నాను.
"నువ్వు ఉత్తమూర్ఖురాలివి సరోజా! నా సంగతి నీకు తెలీదు. నీ అభిప్రాయం నాకర్ధమయ్యింది. వీడెవడనుకుంటున్నావు? శ్రీశ్రీ! వస్తావా. రావా? ఎస్ ఆర్ నో?" అని చాలా నెమ్మదిగా అడిగారు.
"పదండీ" అన్నాను.
మా ఇంటికి దగ్గరే బీచ్. నడుచుకుంటూనే వెళ్ళికూర్చున్నాం.
"నేనడిగిన దానికి సమాధానం చెప్పావు కాదు" అన్నారు.
"దేనికీ?" అన్నాను.
"నీకీ పెళ్ళి ఇష్టమేనా?" అని అడిగారు.
"ఏ పెళ్ళి?" అన్నాను.
"మీవాళ్ళు చూసింది" అన్నారు.
నేనేమీ మాట్లాడలేదు.
"మౌనానికి అర్ధం ఏమిటో తెలుసా?" అని అడిగారు.
"తెలీద"న్నాను.
"మౌనం అర్ధాంగీకారమని" అన్నారు.
చురుగ్గా ఆయన కళ్ళలోకి చూశాను.
"అయినప్పుడు పదిసార్లు అదే ప్రశ్న వేసి నన్ను విసిగిస్తారెందుకు?" అని అడిగాను.
"విసిగించడం కాదు సరోజా! నీ అభిప్రాయం నాకు తెలియాలి" అన్నారు.
"తెలుసుకొని ఏం చెయ్యగలరు?" అన్నాను.
"నీకోసం ఏమైనా చేస్తాను. ఐ లవ్ యూ సరోజా! నాకు నువ్వు కావాలి. నువ్వు నాకే స్వంతం అవాలి. ఇంకెవ్వరికీ కాకూడదు. నువ్వు లేకుండా నేను వుండలేను. మరి నీకెలాగుందో నాకు తెలియాలి" అన్నారు.
"ప్రేమంటే ఏమిటో నాకు తెలియదుకానీ మిమ్మల్ని చూడకుండా మీరు లేకుండా నేనూ వుండలేనని తెలుసుకున్నాను" అన్నాను.
"పిచ్చి సరోజా! దానికి అర్ధం ఏమిటి? నీకు తెలీకుండానే నన్ను ప్రేమిస్తున్నావన్నమాట. ప్రేమంటే అదే. ఒకరినొకరు మనస్పూర్తిగా కోరుకోవడమే ప్రేమ..." అని ఆయన అంటూవుంటే నా కాళ్ళకింద భూమి కదలిపోతున్నట్టనిపించింది.
"మరి ఇంతచెప్పినా మాట్లాడవేమిటి సరోజా!" అని అడిగారు.
"ఏమిటి మాట్లాడాలి?" అన్నాను.
"నేనంటే నీకిష్టమేనా?? చెప్పు సరోజా?" అన్నారు.
"ఇష్టమేనండి కానీ ఏంచెయ్యను?" అన్నాను.
"ఏం చెయ్యనంటావేమిటి సరోజా!" అన్నారు.
"అవునండి మీ విషయంలో నేనేమీ ఒక నిర్ధారణకి రాలేకపోతున్నానండి తర్వాత ఆలోచిద్దాం. నాకు వ్యవధికావాలి. మీ ఆవిడతో తగువుపడి మీ కుటుంబంలో చిచ్చు పెట్టడం నాకిష్టంలేదండి" అన్నాను.
"ఇంక మరేమీ మాట్లాడకు. వ్యవధి కావాలన్నావుగా? నీ ఇష్టం. ఎంతకాలం తీసుకోవాలో తీసుకో. మీ ఇంట్లో పరిస్థితుల్ని మనుషుల్నీ నువ్వే చక్కదిద్దుకో. మిగిలిన విషయాలు నాకు వదిలేయి. పద ఇంటికిపోదాం" అన్నారు.
మేము ఇంటికి చేరుకొనేసరికి మా వాళ్ళంతా గేటు దగ్గరే వున్నారు. శ్రీశ్రీగారు "వెళ్ళొస్తా" నన్నారు.
"లోపలకిరండి కాఫీ తాగి వెళుదురుగాని" అన్నాను.
మా నాన్నగారు కూడా రమ్మని పిలిచారు.
శ్రీశ్రీగారు కాఫీతాగాక మా నాన్నగారితో "సరోజ మీకన్నీ చెప్తుంది. నేను ఒక్కటిమాత్రం మీకు చెప్తున్నాను సరోజని నేను ప్రేమిస్తున్నాను. నాకు సరోజ కావాలి. మీరు సరోజకి పెళ్ళి చెయ్యడానికి వీలులేదు. నేనే చేసుకుంటాను" అని చెప్పి వెళ్ళిపోయారు.
మా అమ్మా నాన్నగారూ నిశ్చేష్టులైపోయారు. నాకంతా అయోమయంగా వుంది. నా మనస్సు శ్రీశ్రీగారివైపే మొగ్గుతోంది. కానీ మరోవైపు వెళ్ళడంలేదు. ఏమిటి చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను.
"నువ్వేం చేస్తావో నాకు తెలియదు కానీ ఈ సంబంధంమాత్రం చేసుకోక తప్పదు. శ్రీశ్రీగారి విషయం మర్చిపో. ఆయనకి భార్యా పిల్లా వున్నారు. వాళ్ళని బాధపెట్టే పాపం మనకెందుకు? ఈ సంబంధం మంచి సంబంధం. అబ్బాయి ఇంజనీర్. నీకు పెళ్ళయితేకాని మిగిలిన వారి విషయం ఆలోచించడానికి లేదు. కాబట్టి త్వరగా నీ నిర్ణయం చెప్పు" అని నాన్నగారు చెప్పేశారు.