అందిన ద్రాక్ష
"సినిమా ఎలా ఉంది?" సాయంత్రం ఆరున్నరకి హుషారుగా ఈలవేసుకుంటూ ఇల్లు చేరిన మొగుణ్ణి ఉక్రోషంగ అడిగింది ప్రభావతి. గతుక్కుమన్నాడు భాస్కర్. నిమిషంలో మొహంలో భావం మార్చేసి 'సినిమా, ఏ సినిమా' అంటూ అమాయకం నటించాడు. 'చాలించండి నటన' ప్రభావతి తీక్షణంగా ఏదో అనేలోగా రాహుల్ పరిగెత్తుకొచ్చాడు. 'డాడీ!, డాడీ! మమ్మీ. నేను, 'నిన్నే పెళ్లాడుతా' సినిమాకెళ్ళాం. మరేం నాగార్జున పండు, పండు అంటూ ఆంటీని భలే ఏడ్పించాడు.' సినిమాని ఏకరువు పెడ్తున్నాడు సంబరంగా రాహుల్. ప్రభావతి తమని చూసిందన్నది అర్ధమై కలవరపడ్డాడు. 'నన్ను తీసుకెళ్ళకుండా మీరిద్దరూ వెళ్ళిపోయారా?' బుంగమూతి పెట్టాడు వాతావరణాన్ని తేలికపరచడానికి.
"పాపం మీకెక్కడ తీరికలెండి. మాతో రావడానికి. తీరికున్నా కోరుకుండద్దూ. ఆఫీస్ లో ఓవర్ టైం చేసి అలిసిపోతున్నారు." కొడుకు ముందు ఇంకేం అనకుండా తీక్షణంగా ఓ చూపు విసిరి, వంటింట్లోకి వెళ్ళిపోయింది ప్రభావతి. కాస్త ఊపిరి పీల్చుకుని ఏం చెప్పాలో ఆలోచించసాగాడు భాస్కర్.
రాహుల్ పడుకున్నాక ఆపేసిన సంభాషణ మళ్ళీ మొదలెట్టింది, "మీ పక్కన కూచున్న అమ్మాయెవరు? భాస్కర్ నిర్లక్ష్యంగా, పుస్తకంలోంచి తలెత్తకుండానే "సినిమా హాల్లో ఎవరో లక్షమంది కూర్చుంటారు. అందర్నీ పేర్లడిగితే తంతారు." చాలా విట్టీగా మాట్లాడాననుకున్నాడు.
"ఆహా. అలాగా, సినిమా హాల్లో పక్కనున్న మగాడి భుజాలమీద తలవాల్చి, మగాడు భుజాల చుట్టూ చేతులు వేస్తున్నా ఊరుకుందంటే బజారు సరుకు అయి ఉండాలి. కాలక్షేపానికి ఎవరినన్నా తీసికెళ్ళారా" వ్యంగ్యంగా అంది. భాస్కర్ మొహం ఎర్రబడింది. "ఎవరో ఫ్రెండ్ బాగుందంటే, వర్క్ తొందరగా అయిపోయిందని మ్యాట్నీకి వెళ్ళాం. పక్కన ఏ ఆడదో వచ్చి కూచుంటే నా తప్పా?" తెచ్చిపెట్టుకున్న కోపంతో దబాయించాడు.
'ఆఁహాఁ, అలాగా, ఆ ఆడది ఎవరో! రంజనా!?" ఎగతాళిగా ఎత్తిపొడిచింది. ప్రభావతి తామిద్దర్నీ చూసిందన్నది భాస్కర్ కి అర్ధమైంది.
"నేనేం కల్సివెళ్ళలేదు. ఆవిడ సినిమాకి వచ్చింది. మాకు టిక్కెట్లు దొరక్కపోతే ఆవిడచేత కొనిపించాం. సీట్లు పక్కపక్కన వచ్చాయి." తెలివైన సంజాయిషీ ఇచ్చానని గర్వంగా ఇప్పుడేమంటావు అన్నట్టు చూశాడు.
"టిక్కెట్లు పక్కపక్కన వచ్చిన ఆడవాళ్ళంతా పక్కనున్న మగాడి భుజాలమీదకి ఒరిగిపోతారు కాబోలు".
"ఇదిగో, అనవసరంగా లేనిపోనివి ఊహించి మాటలనకు, చీకట్లో పెద్ద చూసినట్లు ఫోజులు మాను. ఒక ఆఫీసులో పనిచేస్తున్నవాళ్లం. సీటు నంబర్లు పక్కన వస్తే మాట్లాడుకోమా. నీవు మీ ఆఫీసులో మగాళ్ళతో మాట్లాడవా. పెద్ద పతివ్రతలా ఫోజులు పెట్టకు.
"మగాళ్ళతో మాట్లాడతాను, కానీ, భుజాలమీద చేతులు వేయించుకోను. వాళ్ళ భుజం మీద తలపెట్టను. ఇంతకీ నాదంతా అనుమానం, అపోహ అంటారు."
"అక్షరాలా", కోపంగా అన్నాడు. "ఆఁహాఁ, అలాగా, అయితే ఉండండి" ప్రభావతి లేచి బీరువాలోంచి ఓ ఉత్తరం పట్టుకిచ్చి 'ఇది చదివి చెప్పండి మీ జవాబు!' అంది సూటిగా నిలేస్తూ అదో ఆకాశరామన్న ఉత్తరం.
"మీ భర్త తనాఫీసులో పనిచేసే అమ్మాయి రంజనతో సినిమాలు, షికార్లు, హోటళ్ళు, తిరుగుతున్నారు గత రెండు మూడు నెలలుగా. కళ్లు తెరవండి, మీ సంసారం కాపాడుకోండి. మీ ఆయన చేసే ఓవర్ టైం ఆఫీసులో కాదు, రంజన ఇంట్లో - మీ శ్రేయోభిలాషి."
ఎవరో ఆకాశరామన్న, నెలరోజుల క్రితం రాసిన ఉత్తరం అది, భాస్కర్ మొహం నల్లబడింది ఎవరు రాశారు? తన ఆఫీసులో వాళ్ళే ఎవరో అయి ఉంటారు. మరి ఉత్తరం నెల రోజులక్రితం వచ్చిన ప్రభావతి అడగలేదే!
"ఇంతేకాదు, పదిరోజులక్రితం ఓ ఫోను వచ్చింది. నా బ్యాంకుకి - 'మీవారు, ఆ రంజన ఫలానా హోటల్లో, ఫలానా రూమ్ లో ఉన్నారు. మీకనుమానం అయితే స్వయంగా వచ్చి చూసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోండి' అని ఎవరో మగవాళ్ళు ఫోన్ చేశారు. ఏదో ఆకాశరామన్న ఉత్తరం ఎవరో అసూయతో రాసి ఉంటారు. నిజానిజాలు తెలుసుకోకుండా మిమ్మల్ని అడగడం ఎందుకు అని కొన్నాళ్లుగా మిమ్మల్ని కనిపెడుతున్నాను. ఆ రోజు ఫోను వచ్చాక నేను బయలుదేరి వెళ్ళేసరికి మీ ఇద్దరూ వెళ్ళిపోయారు. ఈ రోజు స్వయంగా నా కళ్ళారా చూశాను. ఇంకా ఇదంతా అబద్ధం అంటారా" ప్రభావతి సూటిగా అంది. భాస్కర్ కలవరపడిపోయాడు. ఏం జవాబు చెప్పాలో తెలియక తడబడ్డాడు.
"ఏం మాట్లాడరు?" ప్రభావతి రెట్టించింది.
"ఎవరో పనీపాటా లేని ఆకాశరామన్నలు ఉత్తరాలు, ఫోన్లు చేస్తే జవాబులు చెప్పాల్సిన అవసరం నాకు లేదు" బింకంగా అన్నాడు.
"సరే, అది వదిలేసి ఇవాళ స్వయంగా నేను చూసినదానికి మీ సంజాయిషీ ఏమిటి?" తీక్షణంగా అంది. భార్య అలా నిలేసేసరికి మగ అహం దెబ్బతిని పౌరుషం పొడుచుకు వచ్చింది.
"కోర్టులో ముద్దాయిని నిలబెట్టి అడిగినట్లు ఏమిటలా దబాయిస్తున్నావు? నాకు తెలియదని చెప్పాను. నమ్మాలంటే నమ్ము, లేకపోతే మాను, నీ చెత్త ప్రశ్నలకి జవాబు చెప్పాల్సిన అవసరం నాకు లేదు" అవసరం అయినదానికంటే గట్టిగా, కోపంగా దబాయించాడు. "మగాణ్ణి, లక్ష పనులుంటాయి. లక్ష మందితో మాట్లాడుతాను అన్నీ నీకు చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు" పొగరుగా అన్నాడు.
"ఆఁహాఁ, అలాగయితే నేనూ ఉద్యోగం చేస్తున్నాను. నాకూ లక్షమందితో పనులుంటాయి. అవసరం అయితే నాకు నచ్చినవాడితో సరదాగా ఏ సినిమాకో, హోటల్ కో వెడతాను మీరు చూడనట్టు ఊరుకుంటారా?" నిలేసి అడిగింది.
"ఏమో! నీ ఆఫీసులో నీవేం చేస్తున్నావో, ఎవరితో మాట్లాడుతావో, ఎవరితో తిరిగావో నేను చూశానా. పట్టుబడేవరకు అందరూ పతివ్రతలే." హేళనగా అన్నాడు. ఈ దెబ్బ తన మీదకి తిరిగితే నోరు మూసుకుంటుందని బాణం వదిలాడు.
"అవును, నేనూ అదే అంటున్నాను. నేనలా పట్టుబడిననాడు, మీరు సంజాయిషీ అడిగితే తప్పకుండా ఇచ్చుకుంటాను. ఇప్పుడు మీరు పట్టుబడ్డారు కనుక సంజాయిషీ ఇవ్వండి". ప్రభావతి అతని బాణాన్ని తిప్పి కొట్టింది.
"సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే, నేను మీ భార్యని కనుక, పెళ్ళి అంటే ఒకరికొకరు నీతినియమాలకు కట్టుబడి ఉంటామన్న ప్రమాణం కనుక. ఇద్దరిలో ఎవరన్నా నీతి తప్పి ప్రవర్తిస్తే అడిగే హక్కు రెండోవారికుంటుంది". కచ్చితంగా ఒక్కొక్కమాట ఒత్తి పలికింది.
