"డాక్టర్, చూశారా... మీ రిపోర్టు కోసం వెతుకుతుంటే ఆయన ముందు చేయించుకున్న రిపోర్టు మందులు వాడాక చేయించుకున్న రిపోర్టు కూడా కనపడింది. ఎక్కడో కనపడకుండా అడుగున దాచారు. ఇవి కూడా చదవండి" అంది. మర్నాడు సుజాత రిపోర్టు తీసుకెళ్ళి, ప్రభాకర్ ని అడిగితే చెప్పడని అతను ఆఫీసుకి వెళ్ళాక అతని కప్ బోర్డు, డ్రాయర్లు వెదికింది. ఓ డ్రాయరు అడుగున రెండు రిపోర్టులు కనబడ్డాయి. ముందు దాన్లో పన్నెండు మిలియన్లు, మొటిలిటీ 10శాతం అంటూ ఏవేవో ఉన్నాయి.
డాక్టర్ అన్నపూర్ణ రెండు రిపోర్టులు జాగ్రత్తగా పరిశీలించింది. "చూశావా, ఈ ముందు చేయించుకున్న దానిలో పన్నెండు మిలియన్లు ఉంది. మొటిలిటీ 10శాతం ఉంది. మేం చేసినప్పుడు కూడా ఇంచుమించు అంతే - పది మిలియన్లు ఉంది. మరి మేం ఇచ్చిన రిపోర్టులో 60 మిలియన్ల కౌంట్, 40శాతం మొటిలిటీ అని ఎలా ఉంది. సుజాత ఈ అంకెలు చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది. మేం రాసింది దిద్దినట్లుంది. చూడు పదిని 60గా మార్చడం సులువు. అలాగే, 10శాతం మొటిలిటీ నలభై పర్సెంట్ అని మార్చినట్లు కనిపిస్తోంది. నాకు స్పష్టంగా పది మిలియన్ కౌంట్, 10శాతం మొటిలిటీ అన్నది గుర్తుంది. మందులవల్ల కూడా ఏం లాభం ఉండదు బహుశా. పాపం, సుజాతకి పిల్ల కోరిక తీరదు. అని బాధపడ్డాను. ఇది మీవారి పనే. నీకు చూపించి నమ్మించడానికి."
సుజాత మొహం వివర్ణమయింది. అంటే మొదటిసారి పరీక్షించినప్పుడు అతనికి తనలో లోపం ఉందన్నది తెల్సినట్టుంది. అందుకే ఆ చిరాకు, కోపం, రెండోసారి రమ్మంటే తన గుట్టు బయటపడుతుందని రానన్నాడు. ఈ రిపోర్టులో అంకెలు ఇలా తారుమారు చేసి తనని ఎంత నమ్మించాడు.
"ఐయామ్ సారీ సుజాతా, మీవారు ఇదంతా ఇలా మానివ్యులేట్ చేస్తారనుకోలేదు. కానీ, ఆయన ధైర్యాన్ని మెచ్చుకోవాలి. నీకు బాగా తెల్సిన డాక్టరుని మళ్ళీ ఎప్పుడైనా నీతో ఈ ప్రసక్తి వచ్చి నిజం తెలుస్తుందేమోనన్న భయం లేకుండా... ఇప్పుడెళ్లి అడుగు. ఏం చేస్తాడో విను. హుఁ. ఎన్నాళ్ళయినా ఈ మేల్ ఇగో పోదు మగాళ్ళకీ. పురుషత్వం తమలో లేదు అంటే భరించలేరు. తన అసమర్ధతని అంగీకరించని పురుషాహంకారం.. ఇలా తెలియకుండా దాస్తారు. అసలు నన్ను అడిగితే పెళ్ళిళ్ళకి కావల్సింది జాతకాలు సరిపోవడం కాదు. బ్లడ్ టెస్టులు, స్మెర్మ్ టెస్టులు చేయించాలంటాను. చాలా గర్వంగా ఎంతోమంది వస్తారు. తమలో లోపం ఉన్నట్లు తెలిసి కుంగిపోతారు. ఈ మాట బయటికి తెలియనివ్వద్దంటారు. భార్యకి కూడా చెప్పరు కొందరు. హుఁ... నీవు అడుగు ఎందుకిలా చేశారో. ఊరుకుంటే మరీ ఆడిస్తారు ఈ మగాళ్ళు."
సుజాత ఏదో నిశ్చయించుకున్న దానిలా "ఊఁహూఁ అడగను. ఏం తెలీనట్టే నేనూ ఊరుకుంటాను" అంది.
అన్నపూర్ణ ఆశ్చర్యంగా చూసింది.
'డాక్టర్ గారూ, నేను తల్లిని కావాలి. ఎలాగైనా.. నాకు బిడ్డ కావాలి. బిడ్డని కంటాను.' సుజాత మొహంలో దృఢనిశ్చయం. అన్నపూర్ణ ఆశ్చర్యంగా చూసింది.
"డాక్టర్ గారూ నాకు ఆర్టిఫిషియల్ ఇన్ సెమినేషన్ ద్వారా డోనర్ స్పెర్మ్ తో ప్రెగ్నెన్సీ వచ్చేట్టు చెయ్యండి. ప్లీజ్, డాక్టర్ హెల్ప్ మీ" అంది వేడుకుంటున్నట్లు.
"అదెలా సుజాతా మీవారి పర్మిషన్ లేకుండా?" ఆశ్చర్యంగా అంది డాక్టర్.
"అవసరం లేదు డాక్టర్, నేను చెపుతున్నాను" సుజాత ధృడంగా అంది.
"రూల్సు ఒప్పుకోవు సుజాతా. మీవారు, నీవు - ఇద్దరూ కలిసి ఇష్టపడాలి. అదీ అంత సులువు కాదు. మంచి డోనర్ స్పెర్మ్ తో ప్రయత్నించాలి. ఒకసారితో గర్భం వచ్చేయదు. కనీసం రెండు మూడుసార్లు ప్రయత్నించాలి. నెలలో అండం విడుదల అదీ లెక్కకట్టీ... చాలా తతంగం ఉంది దానికి. పోనీ మీవారితో చెప్పి ఇద్దరూ నిర్ణయించుకోండి".
"మీరు మీ ప్రయత్నం చెయ్యండి డాక్టర్. మావారికి ఏం చెప్పాలి అన్నది నేను చూసుకుంటాను. అది నాకు వదిలిపెట్టండి." సుజాత బతిమిలాడింది.
"అంటే.. అదెలా సుజాతా. ఆయనకీ సంగతి తెలిస్తే డాక్టర్ గా నేను దోషినవుతాను. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి శిక్షించే హక్కు కూడా ఉంటుంది."
"ప్లీజ్, నాకోసం మీరు చిన్న సాయం చెయ్యండి డాక్టర్. ఆయనకి ఏం లోపం లేదని కదా చెప్పుకున్నారు. నాకు ప్రెగ్నెన్సీ వస్తే నన్ను ఎలా అనుమానిస్తారు? ఎలా నిలేస్తారు? దేవుడు దయదలిచాడు అంటాను. టిట్ ఫర్ టాట్ - ఆయన చేసిన మోసానికి నేనూ మోసం చేస్తాను" కసిగా అంది సుజాత. సుజాత పాయింటు అర్ధమై ఆలోచనలో పడింది డాక్టర్. "ఇది రిస్క్ తో కూడింది ఇది నీ సొంత ఆలోచన, నాకేం సంబంధం లేదు. నీ ఇష్టప్రకారం చేయించుకున్నట్టు నీవు ఓ కాగితం ఇవ్వాలి. రేపు ఏదన్నా అనుకోనిది జరిగినా బ్లేమ్ నీవు తీసుకోవాలి. ఇది కూడా నీకోసం ఎంతో సాహసం చేయాలి".
"నేను అన్నింటికీ సిద్ధం. ఈ విషయం మీకు, నాకు తప్ప ఎవరికీ తెలియకూడదు. మీ ప్రయత్నం మీరు చెయ్యండి. ఖర్చు బాధ నాది" సుజాత అన్నపూర్ణ చెయ్యి పట్టుకుంది. అన్నపూర్ణ సగం అంగీకారంతోనే తల ఊపింది.
* * *
మూడు నెలల తరువాత పీరియడ్స్ మిస్ కాగానే సుజాత వెళ్ళి చూపించుకుని, ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకుని కన్ ఫర్మ్ చేసుకుంది. ఆ రాత్రి ప్రభాకర్ రాగానే గదిలో చాలా సంబరంగా, సినిమాటిక్ గా సిగ్గుపడ్తూ "మన కోరిక ఇన్నాళ్ళకి తీరిందండి. దేవుడు ఇన్నాళ్లకి దయ తలిచాడు. నాకు నెల తప్పిందండి. వారం రోజుల బట్టి అనుమానంగా ఉంటే ఈ రోజు వెళ్ళి టెస్ట్ చేయించుకున్నా, కన్ ఫర్మ్ అయింది". గోముగా అంది. ప్రభాకర్ ఒక్కక్షణం తెల్లపోయాడు. షాకింగ్ న్యూస్ విన్నట్లు కలవరపడిపోయాడు. మొహంలో రంగులు మారిపోయాయి.
"అదేమిటి? ఎలా.. ఎలా అయింది" అన్నాడు తడబడ్తూ.
"ఎలా అవడం ఏమిటండీ? భలేవారే మొగుడూ పెళ్ళాలు కాపురం చేస్తే పిల్లలు పుట్టరా'.
"అది కాదు.. అది కాదు. ఇప్పుడెలా .. ఇన్నాళ్లకి" తడబడిపోయాడు.
"ఏదో ఇప్పటికన్నా అయింది. డాక్టర్లు ఏ లోపం లేదు, దేవుడి మీద భారం వేయమన్నారుగా. ఏమిటో అన్నీ మన చేతిలో ఉన్నాయనుకుని విర్రవీగుతాం. పుట్టుక, చావు మన చేతిలో ఏముంది. ఎప్పటికి జరగాలని ఉందో. జరిగింది. అమ్మయ్య ఇంక ఈ శుభవార్త మీ అమ్మగారికి చెప్పాలి." సంబరంగా అంది.
"సుజాతా, డాక్టరు దగ్గరికి వెళ్ళావా? ఆవిడ ఏం అంది? నసుగుతూ అన్నాడు.
"యూరిన్ టెస్ట్ చేయించి కన్ఫర్మ్ చేసి చెప్పింది." ఇంకేం జరగనట్లు మామూలుగా అంది. అతని మొహం నల్లబడింది. ఏమనాలో తోచలేదు. మనసులో రకరకాల భావాలు, అనుమానాలు! 'అసంభవం, సంభవం' ఎలా అయింది. సుజాత ఏం చేసింది? ఈ బిడ్డ తనదేనా లేక సుజాత ఏదన్నా కాని పని చేసిందా?..'
"ఏమిటండీ అలా ఆముదం తాగినట్లు మొహం పెట్టారు? ఈ వార్త విని ఎంతో సంతోషిస్తారనుకున్నాను. మీకేం సంతోషంగా లేదా" బుంగమూతి పెట్టింది. "ఆఁ... అదికాదు. ఏమిటో నమ్మకం కలగడం లేదు. ఇన్నాళ్లూ అవనిది ఇప్పుడెలా అయిందా అని..." తడబడుతూ అన్నాడు. సుజాత కొంటెగా చూసింది. బావుంది వరస. అయిందన్న సంతోషం కంటే," ఎందుకయిందన్న సందేహం ఎక్కువగా ఉన్నట్లుంది. ఆలోచనలు చాలించి ఈ శుభవార్త అత్తగార్కి చెప్దాం రండి." ప్రభాకర్ బలవంతంగానే చెయ్యిపట్టి లాక్కెళ్ళింది.
* * *
"మిస్టర్ ప్రభాకర్, గర్భం ఇన్నాళ్ళూ రాలేదు. ఇప్పుడెందుకు వచ్చింది అన్నదానికి ఏ డాక్టరూ జవాబు చెప్పలేరు" అన్నపూర్ణ నవ్వుతూ అంది.
"అదికాదు. రిపోర్టు చూసి, ఇంపాజిబుల్ అన్నారు కదా, పది మిలియన్ కౌంట్ తో గర్భం వస్తుందా." సందేహంగా చూస్తూ అడిగాడు.
"ఏమో ఆ మధ్య మీరు మందులు వాడారు కదా. సడన్ గా అప్పుడప్పుడు కాస్త కౌంట్ ఎక్కువవుతూంటుంది. తగ్గుతూంటుంది. ఏమో, మీ అదృష్టం బాగుండి, దేవుడి దయవల్ల జరిగి ఉండచ్చు ఏం చెప్పగలం?" అన్నపూర్ణ నిర్వికారంగా అంది ఇంకేం అనాలో, ఇంకేం అడగాలో తెలియక, మనసులో అనుమానం తొలగిపోక ఇబ్బందిగా చూస్తూ లేచాడు, అన్నపూర్ణ నవ్వుకుంది. "చూడండి, మిస్టర్ ప్రభాకర్. అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకుండా భగవంతుడిచ్చినది స్వీకరించండి. విష్ యూ ఆల్ ద బెస్ట్" సుజాతని నెలకోసారి చెకప్ కి పంపుతూండండి" అంది.
* * *
"డాక్టర్ గారూ, పాపం మావారి అవస్థ చూస్తే జాలేస్తోంది. నేనెవరితోనన్నా సంబంధం పెట్టుకుని కంటున్నానేమోనని ఆయన అనుమానం అనుకుంటాను. నేనిలా ధైర్యం చేసి మీ సహాయంతో గర్భం దాల్చానన్న ఊహే ఆయనకు వచ్చినట్లు లేదు. నా శీలం మీద కొంచెం అనుమానం. ఒకవేళ నిజంగానే తనవల్లే గర్భం వచ్చిందా అన్న సందేహంలో కొట్టుమిట్టాడుతున్నారు పాపం, ఈ వార్త విన్న దగ్గరనుంచి ఆయన మొహం చూడాలి" సుజాత నవ్వుతూ అంది.
"ఐ మస్ట్ కంగ్రాజ్యులేట్ యూ, చాలా తెలివిగా ప్లాన్ చేశావు. ఇంత ఇద్దరం కష్టపడ్డందుకు ఫలితం దక్కింది. పాపం, మీవారి సందిగ్ధత తీరేది కాదు" ఆవిడా నవ్వింది. "మొదట ఆయన రాగానే ఏం అంటారోనని భయపడ్డాను కాసేపు".
"ఉండనీండి అలాగే, ఆ అనుమానం, నన్ను మోసం చేసినందుకు ఈ శిక్ష చాలు ఆయనకు. జీవితాంతం ఈ బిడ్డ తనదా, కాదా అన్న అనుమానంతో కక్కలేక మింగలేక పడే అవస్థ చాలు ఆయనకు. హుఁ. భార్య దగ్గర నిజం దాచి తెచ్చుకున్న అవస్థ ఇది. నిజం చెపితే హాయిగా ఏ బిడ్డనో తెచ్చి పెంచుకునేవాళ్లం. ఈ మాత్రం దానికోసం మగ అహంకారంతో భార్యల్ని మోసం చేద్దామనుకున్నందుకు ఈ శిక్షచాలంటాను." సుజాత అంది. అన్నపూర్ణ అంగీకారంగా తల ఊపింది.
*ఇండియా టుడే, ఏప్రిల్-మే, 1997
* * * *
