"కానీ, నేనిది సహించలేను. ప్లీజ్!"
"అవును, సహించలేవు. అబద్ధాలని తెలుసు! అయినా అబద్ధాలనే నిజాలలా మాట్లాడతాము. నిజాలని మనను మనం భ్రమ పెట్టుకుంటాము. ఆ భ్రమలో హాయిగా బ్రతికేస్తాము. నిజంలో ఒక్క క్షణం నిలవలేము. నిలిచేలాగా మన వ్యక్తిత్వాలు రూపుదిద్దుకోలేదు. సరే! అయితే! నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను. నీ కోసం వచ్చాను!"
"సౌందర్యా! నువ్విలా మాట్లాడితే వెక్కిరించినట్లుగా ఉంది"
పకపక నవ్వింది సౌందర్య.
"సరే! ఎలా మాట్లాడమంటావో చెప్పు!"
"సౌందర్యా! నేను..నేను.."
"ఆలోచించుకోలేకపోతున్నావు కదూ! సరే! నీ బదులు నేనే ఆలోచించి పెడతాను. నన్ను పెళ్ళి చేసుకోలేనని చెప్పెయ్యి. అదే మంచిది."
"సౌందర్యా!"
"ఏం చెయ్యాలో కూడా చెప్పనా? సౌందర్యా! నువ్వు వెళ్ళిపో! నువ్వు నా ముందు ఉన్న కొద్దీ నేను బలహీనుణ్ణవుతున్నాను- అను, నేను వెళ్ళిపోతాను. వెంటనే సుధ దగ్గరకు వెళ్ళు- సుధను పెళ్ళి చేసుకో! సుఖంగా ఉండు."
"నేను నిన్ను పెళ్ళి చేసుకుంటాను."
"గుడ్! నాకు నీ మీద చాలా జాలిగా ఉంది, కానీ అశక్తురాలిని. నీకోసం నేను ఏమీ చెయ్యలేను. మనం పెళ్ళి చేసుకుందాం! కానీ నువ్వొక పని చెయ్యాలి! ఈ విషయం సుధకు చెప్పి మరీ రావాలి!"
ఒక్కక్షణం వామన్ మనసు వేదనతో మెలితిరిగింది. కానీ జంకు కలగలేదు. సుధ తనను ఏమీ అనలేదు. తనలో ఎలాంటి లోపాన్నైనా క్షమిస్తుంది. సుధతో తను ఎంతటి దారుణ విషయమైనా చెప్పగలడు.
"చెపుతాను!"
"నేను మళ్ళీ వస్తాను. మనం పెళ్ళి చేసుకుందాం!"
సౌందర్య వెళ్ళిపోయింది.
* * *
వామన్ సుధ దగ్గరకు బయలుదేరాడు. అంతకు కొద్ది క్షణాల క్రిందట సుధను పెళ్ళి చేసుకోవటానికి బయలుదేరాడు. ఇప్పుడు సౌందర్యను పెళ్ళి చేసుకోబోతున్నానని చెప్పటానికి బయలుదేరాడు.
వామన్ వెళ్ళేసరికి అనాథాశ్రమమంతా గగ్గోలుగా ఉంది. అక్కడి వాళ్ళలో చాలామంది కుమిలి కుమిలి ఏడుస్తున్నారు. కొందరు కంగారుగా తిరుగుతున్నారు. సుధ చావుబ్రతుకుల మధ్య కొట్టుకుంటూ ఉంది. చిరునవ్వు తప్ప మరొకటి ఎరుగని సుధ అలా వేదనతో గిలగిలలాడుతుంటే చూసి సహించలేకపోయాడు వామన్.
"నువ్వు నన్నెంత గాఢంగా కోరుకుంటే- నాకోసం ఎంత తీవ్రంగా ప్రయత్నిస్తే నేను అంత శక్తితో మిసెస్ కామేశ్వరీ దేవిని ఎదిరించగలను" అన్న సుధ మాటలు గుర్తుకొచ్చాయి.
సుధ ఈ దశకు రావటానికి తనే కారణమా? వామన్ బలహీనమయిన మనసు ఇంత తాకిడికి తట్టుకోలేకపోయింది.
సుధను తన చేతులతో ఎత్తుకుని పిచ్చివాడిలా విక్రం దగ్గరకు పరుగెట్టాడు.
"విక్రం! నా సుధను బ్రతికించు. నేను డాక్టర్ ని కాను. ఏమీ కాను. సుధ లేక నేనసలు మనిషినే కాను. నా సుధను బ్రతికించగలిగినవాడివి నువ్వొక్కడివే! విక్రం ప్లీజ్" గట్టిగా ఎలుగెత్తి అరిచాడు. అంత గట్టిగా "నేను డాక్టర్ని కాను" అనే సరికి గుండెల మీద పెద్ద బరువేదో తొలగినట్లయింది. అంతకు పది రెట్ల బలం గుండెలకు చేరుకున్నట్లయింది."
అనాథాశ్రమంలో ఆనాడు వంటలో జరిగిన పొరపాటు కారణంగా పులుసులో ఏదో పురుగు పడింది. అది సుధ చూసింది. మిసెస్ కామేశ్వరీ దేవికి చెప్పింది.
"సింగినాదం! ఆ పురుగు అవతల పారేసి వడ్డించెయ్యండి. హోటళ్ళలో అడ్డమైన తిండీ పెడుతుంటే తినటంలా!" తేలిగ్గా అనేసింది మిసెస్ కామేశ్వరీ దేవి.
సుధకేం చెయ్యాలో తోచలేదు. అన్నంలోకి ఆ పులుసు తప్ప మరో ఆధరువు లేదు. పచ్చళ్ళు లేవు. నీళ్ల మజ్జిగ ఉంది. అదీ కొద్దిగా ఉంది.
ఆ పులుసు పిల్లలకు వడ్డించలేకపోయింది. "కొంచెం ఆగండి! నేనెలాగయినా ఏదో ఒకటి సంపాదిస్తాను" అని బయలుదేరింది.
సుధ తిరిగి వచ్చేసరికి దారుణం జరిగిపోయింది. పిల్లలు ఆకలికి ఉండలేక పోయారు. కామేశ్వరీ దేవిలాగే వాళ్లు కూడా "సింగినాదం" అనుకుని ఆ పురుగును ఏరిపారేసి పులుసు వేసుకుని తినేశారు. అమాయకులు! తాత్కాలికమైన ఆకలి బాధ తీర్చుకునేవరకే ఆలోచించగలరు. ముందు సంగతి ఊహించలేరు.
తన ఎదురుగా బాధతో విలవిలలాడుతున్న ఆ ప్రాణుల్ని చూడలేకపోయింది సుధ.
త్వరత్వరగా వాళ్ళందరినీ విక్రం హాస్పటల్ కు చేర్చింది.
ఆలోచించినకొద్దీ ఇందులో తన తప్పు కూడా ఉందని అనిపించసాగింది సుధకు.
ఆ పులుసు వెంటనే పారపొయ్యవలసింది. వాళ్ళకు అందకుండా ఉంచవలసింది.
ఎదగని ఆ పసివాళ్ళు తన మాటలు అర్థం చేసుకోగలరని ఎంత పొరబాటుగా ఊహించింది? అప్పటికి ఆ దైహికావసరం తీరటమే ప్రధానం వాళ్ళకు! తరువాత ఎలాంటి వేదనలకు గురికావలసినా సరే! ఎంతగా విలవిలలాడవలసినా సరే!
తనను తను క్షమించుకోలేకపోయింది సుధ. తన కారణంగా ఇతరులు పడుతోన్న ఆవేదన తనూ రుచి చూడాలనుకుంది. అందులో మిగిలిన పులుసు తను వేసుకుని తింది.
విక్రం తల ఎత్తి వామన్ ను చూశాడు. ఆ చూపులలో కాఠిన్యానికి తట్టుకోలేకపోయాడు వామన్.
"సారీ వామన్! సుధను నేను బ్రతికించను"
వామన్ పసివాడిలా విక్రం కాళ్ళను పట్టుకున్నాడు.
"అలా వీల్లేదు విక్రం! సుధ బ్రతికి తీరాలి. ఏం చెయ్యమన్నా చేస్తాను" అని పసివాడిలా బావురుమన్నాడు.
ఆ నిగ్రహం లేని ఉద్వేగాన్ని కంటగించుకుంటూ "సుధను బ్రతికించాలంటే నువ్వు నాకు తగిన మూల్యం చెల్లించాలి" అన్నాడు విక్రం.
"తప్పకుండా చెల్లిస్తాను. ఎంత డబ్బు కావాలన్నా..."
ఆగిపోయాడు వామన్. విక్రం పెదవుల మీది చీదరింపుతో కూడిన నవ్వు అతనికి తన పొరబాటును చెప్పింది.
"ఏం మూల్యం చెల్లించాలి?" ఆర్తితో అడిగాడు.
"ఇప్పటికీ అర్థం చేసుకోలేవన్నమాట!"
విక్రం మాటల్లో కటుత్వం మనసును కొరడాలతో కొట్టినట్లయింది. మెరుపులా స్ఫురించింది.
"తప్పకుండా మూల్యం చేల్లిస్తాను. ఇప్పుడే కామేశ్వరీ దేవి మీద ఫిర్యాదు చేస్తాను."
"అయితే నీ సుధను బ్రతికిస్తాను. నీకోసం బ్రతుకుతుంది."
33
విక్రం పరిశోధన ఫలించింది. దేశ విదేశాలలో అతని కీర్తి మార్మోగి పోయింది. డాక్టర్ శ్రీరాములు గారు, డాక్టర్ కిరణ్ కుమార్ ప్రశంసలు కురిపించారు. డాక్టర్ మాధవయ్య గారు స్వయంగా వచ్చి విక్రంను కౌగిలించుకుని 'అయామ్ సారీ విక్రం! జరిగిన దానికి నిజంగా సిగ్గుపడుతున్నాను. ఏమయినా నిన్ను చూసి చాలా గర్వపడుతున్నాను" అన్నారు.
విదేశాలలో అనేక చోట్ల నుండి విక్రమ్ కు ఎన్నెన్నో ఉద్యోగాలకు ఆహ్వానాలు వచ్చాయి.
సౌందర్య చిరునవ్వుతో "కంగ్రాట్యులేషన్స్! ఈనాడు నువ్వు విశ్వాన్నంతా ఆక్రమించేశావు" అంది.
"ఇక నువ్వు నా ప్రక్కన నిలవకుండా నేను ఏం సాధించినా వ్యర్థమే"
"సారీ విక్రమ్! నేను వామన్ ని పెళ్ళి చేసుకోబోతున్నాను."
విక్రమ్ ముఖంలో చిరునవ్వు ఎగిరిపోయింది. బాధ అనేది ఎరుగని అతని ముఖం దారుణమైన వ్యథతో ముడుచుకుపోయింది, అయినా సహజ స్థితికి కొన్ని క్షణాలలోనే రాగలిగాడు.
