Previous Page
తపస్వి పేజి 43


    "నిన్ను అర్థం చేసుకోవటం కష్టం. ఈ నిర్ణయానికి ఎందుకు వచ్చావో చెప్పగలవా?"
    శాంతంగా అడిగాడు.
    "నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోలేకపోతే నేను ఎవరికి చెప్పుకోగలను? ఏనాడో నీ శక్తి సామర్థ్యాలకు అంకితమయిపోయాను. కానీ, నిర్మలాంతఃకరణకు.. ఆ అంతఃకరణలో పొంగిపొరలిన మమతానురాగాలకు లొంగిపోయాను. నాన్న గారి కోసం వామన్ ను చేసుకుంటున్నాను."
    "మంచిది! అయితే ఇక నేనీ దేశంలో ఉండక్కర్లేదు. విదేశాలకు వెళ్ళిపోతాను."

                                   *  *  *
            
    విక్రం నిర్ణయం విన్న దేశం హాహాకారాలు చేసింది. విక్రం తమను విడిచి వెళ్ళటానికి వీల్లేదనీ, అతని అండదండలు తమకే కావాలనీ ప్రతి ఒక్కరూ అభ్యర్థించసాగారు. విక్రంను తమ మధ్య ఉంచగలిగిన శక్తి సౌందర్యకు మాత్రమే ఉందని తెలిసినవాడు డాక్టర్ కిరణ్ కుమార్ ఒక్కడే! కానీ సౌందర్యను ఎవరూ శాసించలేరు.
    కామేశ్వరీ దేవికి ఎంతో పరపతి ఉంది. అయినా ఆమెను కంటగించుకునే వారి సంఖ్య తక్కువ లేదు. అందరూ ఓహో అంటే ఓహో అంటున్నంత కాలం ఇదేమీ బయటకు రాలేదు. సాహసించి వామన్ కామేశ్వరీదేవి మీద రిపోర్టు చేసేసరికి వామన్ కే బాసటగా నిలిచి కామేశ్వరీ దేవికి ఎదురు తిరిగిన వాళ్ళు ఎందరో ముందుకు వచ్చారు. తనకు ఇందరు వ్యతిరేకులున్నారనీ- తనను ఇంత సులభంగా పడగొట్టగలరనీ ఊహించలేని కామేశ్వరీదేవి తనకు విధింపబడిన జైలుశిక్ష వినగానే మతి పోగొట్టుకుంది.
    "ఏదైనా ఇంతే! ఎవరో ఒకరు దారి తీయాలి" అనుకుని నవ్వుకున్నాడు డాక్టర్ కిరణ్ కుమార్.
    సుధ బ్రతికింది. విక్రంకు మరోమారు ప్రశంసలు దక్కాయి.
    "థాంక్యూ విక్రం! నా సుధను బ్రతికించావు" కృతజ్ఞతతో అన్నాడు వామన్.
    "నాకు కృతజ్ఞత చూపించక్కర్లేదు. నువ్వు ఎంత బలహీనుడివయినా నీ మనసు పూర్తిగా చంపుకోలేకపోయావు. ఎంత స్వార్థపరుడివైనా సంఘర్షణను అణచలేకపోయావు. అందుకే సుధను దక్కించుకోగలిగావు. సమయానికి సుధను నా దగ్గరకు తీసుకురాకపోతే నేనేం చెయ్యగలను?" మామూలుగా అన్నాడు విక్రం.
    కృతజ్ఞత...త్యాగం...ఔదార్యం..ఇలాంటి మాటలు అనాలన్నా, వినాలన్నా విక్రంకి ఎప్పుడూ చికాకు.
    విక్రం విజయానికి ఆనందం పట్టలేకపోతున్నాడు శశాంక.
    "విక్రం! భగవంతుడి దయ వల్ల నీ పరిశోధనలు సఫలమవడం నా కళ్ళతో చూడగలిగాను" అన్నాడు.
    "నాకు దేవుడిలో నమ్మకం లేదు." నిర్లక్ష్యంగా అన్నాడు విక్రం.
    "పచ్చి అబద్ధం! భగవంతునిలో నీకున్న విశ్వాసం నేను స్పష్టంగా చూడగలుగుతున్నాను.
    "స్పష్టంగా చూడగలుగుతున్నారా? ఎలా?" ఆశ్చర్యంగా అడిగాడు విక్రం.
    "నీ ప్రయోగాలలో"
    కనులు విప్పార్చుకుని చూశాడు విక్రం. వెంటనే ఆహ్వానపూర్వకంగా చేతులు జాపాడు. ఆ ఆహ్వానాన్ని అందిపుచ్చుకుని విక్రంను ఆదరంతో ఆలింగనం చేసుకున్నాడు శశాంక.
    "సౌందర్యా! ఆనాడు నేను ఆత్మహత్య చేసుకోకుండా అడ్డుపడి ఎంత ఉపకారం చేశావు? నిన్నూ, విక్రంను కలిపి చూసుకోగలిగే అదృష్టం నాకు దక్కింది"
    సౌందర్య చాలా బాధ పడింది. తన కోసం కాదు. తన మాటలు విని తండ్రి పడే బాధను ఊహించుకోలేక... "నేను వామన్ ను చేసుకుంటున్నాను నాన్నగారూ!"
    శశాంకకు చాలాసేపటివరకూ నోట మాట రాలేదు.
    "ఎందుకు సౌందర్యా! నాకోసమా? విక్రం ఉండగా నాకు మరొకరి అండ అవసరమా?"
    "విక్రం పరిశోధన ఇప్పుడు ఫలించింది. ..కాని..."
    "సౌందర్యా! ఏనాడయినా, ఏ పరిస్థితులలోనయినా విక్రం కంటే కావలసిన వాళ్ళుంటారా?"
    "అది నాకు..."
    "పిచ్చి తల్లీ! నీకే కాదు. అందరికీ! అందరూ అది అర్థం చేసుకోలేరు. కానీ నేను అర్థం చేసుకోగలిగాను. నువ్వు గుర్తించలేదు. ఇప్పటికయినా వామన్ ను చేసుకోనని చెప్పెయ్యి."
    "వాగ్ధానం చేసేశాను. నా వల్ల కాదు. వామన్ తానే నన్ను కాదంటే తప్ప నాకు విముక్తి లేదు."
    దిగులు పడిపోయాడు శశాంక. లోలోపలి మాటలు పైకి వచ్చేశాయి.
    "వామన్ స్వార్థపరుడు - బలహీనుడు...తనకే విధంగానూ ఆనందం కలగకపోయినా నిన్ను వదులుతాడా?"
        
                                    *  *  *

    సౌందర్యను చూడగానే వామన్ వణికిపోతూ సుధ చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు.
    "సౌందర్యా! ప్లీజ్! నువ్వు ఒంటరిగా నాకు కనిపించకు-నేను తట్టుకోలేను. విక్రం ప్రక్కన నిలబడు. అప్పుడు నీ స్థానమేదో గుర్తిస్తాను, నా స్థానమేదో అర్థమవుతుంది. నా సుధను నేను దక్కించుకోగలుగుతాను."
    శశాంక ముఖం వికసించింది. సౌందర్య చిరునవ్వుతో విక్రం ప్రక్కన నిలిచింది. సౌందర్య చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు విక్రం.
    ధృఢమైన ఆ హస్తాలకు తనను అర్పించుకోగానే జ్వలించే ఆ మూర్తి జ్యోతిర్మయిగా వెలిగింది.
    కటకటాల వెనుక ఉన్న కామేశ్వరీదేవిని చూడటానికి అందరూ వెళ్ళారు.
    కామేశ్వరీ దేవి అందరి ముఖాలూ చూసింది, ఎవరి ముఖం చూసినా కలగని ఉక్రోషం ఆవిడకు వామన్ ముఖం చూస్తే కలిగింది.
    "వామన్! నువ్వు...నువ్వే నామీద కక్ష కట్టావా?"
    వామన్ నిజంగానే చాలా బాధపడ్డాడు. ఆవిడను అలా చూడలేకపోయాడు.
    "నాకే ఆశ్చర్యంగా ఉంది కామేశ్వరీ దేవి గారూ! ఇప్పటికీ మీ ముందు నిలిచి మీ మాటలకు ఎదురు చెప్పలేను నేను! మిమ్మల్ని ఎదిరించగలిగే శక్తీ నాకు లేదు. కానీ నా సుధను దక్కించుకోవాలనే ఆర్తి, విక్రం గర్జన కలిగించిన హెచ్చరిక- నాకీ శక్తిని క్షణికంగా కలిగించాయి. ఇప్పుడు మళ్ళీ వెనుకటి వామన్ నే! మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నాను."
    చెమ్మగిల్లిన వామన్ కళ్ళు చూసి ఏమనాలో అర్థంకాలేదు కామేశ్వరీ దేవికి.
    "నేను మీకోసం చెయ్యగలిగింది ఒకటే ఉంది. మీకోసం ఇది తీసుకొచ్చాను."
    ఒక పాకెట్ కామేశ్వరీ దేవి చేతిలో పెట్టాడు వామన్. ఆత్రుతతో విప్పింది కామేశ్వరీ దేవి.
    భగవద్గీత!
    పట్టరాని కోపంతో...కసితో...ఆ పుస్తకాన్ని విసురుగా నేలకేసి కొట్టింది.
    పట్టరాని ఆనందంతో ప్రకృతి పులకరించి పాడినట్లు పకపక నవ్వింది సౌందర్య.
    "అబ్బా! ఎలాంటి దృశ్యం చూడగలిగాను! ఎలాంటి వ్యక్తి అయినా తన చుట్టూ తాను అల్లుకున్న ఆవరణలన్నీ చీల్చుకుని తాను తానుగా నిలిచే రోజు రాకపోదన్నమాట! కామేశ్వరీ దేవీ! ఇంత కాలంగా ఎన్నెన్నో రకాలుగా బ్రతికారు! కానీ ఈ క్షణం... ఈ క్షణం...మాత్రమే మీ బ్రతుకులో చిరస్మరణీయమైనది!"

                                  * సమాప్తం *


 Previous Page

WRITERS
PUBLICATIONS