Next Page 
స్వాతి జల్లు  పేజి 1

 

                                 స్వాతి జల్లు

                                              ------   సి. ఆనంద రామం

 

                             


    కొందరి కధలు వివాహంతో అంతమవుతాయి. మరికొందరి కధలు వివాహంతో ప్రారంభమవుతాయి. అరుంధతి కధ వివాహంతోనే ప్రారంభమవుతుంది. అరుంధతి వివాహాన్ని ఆమె తలిదండ్రులోక సమస్యగా తీసికోలేదు. ఎందుకంటె, అరుంధతి పుట్టకముందే , ఆమె క్కాబోయే భర్త , ఆమె మేనత్త కడుపున పుట్టి తయారుగా ఉన్నాడని వాళ్ళు నమ్మారు. జ్ఞానం వచ్చిన దగ్గర్నుంచీ అరుంధతి అలానే నమ్మింది.అలాగని అరుంధతీ సుందర్రావులు చిన్నప్పటి నుండీ చెట్టాపట్టాలు వేసికొని తిరగలేదు.
    సుందర్రావు అరుంధతి బావ! అతని అసలు పేరది కాదు! ఏదో పాతకాలపు పేరు! జ్ఞానం వచ్చాక ఆ పాత పేరును వదిలేసి , తన అందానికి తగినట్టు సుందర్రావని మార్చుకొన్నాడు.
    అరుంధతికి పది పన్నెండేళ్ళప్పుడు కావచ్చు-- సుందరరావు రాగానే, పెద్దల్లో ఎవరో,'వోయ్! ఆరూ! నీ మొగుడోచ్చాడే! ఏం కావాలో చూడు!" అని ఎగతాళి చేసారు. మొగుడంటే అర్ధం తెలియని ఆ పిల్లకు , ఆ మాట వినగానే, పారిపోవాలని మాత్రం తెలుసు! ఆ ముహూర్త బలం ఎటు వంటిదో కాని, ఆనాటి నుండి ఏనాడూ అరుంధతి , సుందర్రావు ఎదుట పడలేదు. ప్రమాదవశాన తారసిల్లినా , రాని ఆకులా వణికి పోయి, మరో దిక్కుకు పారిపోయేది. ఆమెను వెంబడించేటంత చురుకైన వాడు కాడు సుందర్రావు.
    కానీ, అరుంధతి ప్రపంచమంతా , సుందర్రావు నా క్రమించుకొనే ఉంది-- ఆమె చిన్నప్పటి వూహల్లో రాజకుమారుడూ, పెరిగిన తరువాత కలలో కధా నాయకుడు సుందర్రావే!
    అరుంధతి ధర్డ్ ఫారం చదువుతుండగా సుందర్రావు బి.ఏ. ఫెయిలయినాడని తెలిసింది.
    'ఈ ప్రశ్నలిచ్చేవాళ్ళకు బుద్ది లేదు- అన్నీ బావకు తెలియని విచ్చి ఉంటారు. లేకపోతె బావ ఫేయిలవ్వట మేమిటీ?' అనుకొంది అరుంధతి.
    అరుంధతి మెట్రిక్ కు వచ్చేవరకూ , సుందర్రావు బి.ఏ. , ఎకనామిక్స్ చదువుతూనే ఉన్నాడు. అరుంధతి స్కూలు కంతటికి , మొదటిదానిగా పరీక్ష పాసైన తరువాత, మళ్ళీ సుందరరావు బి.ఏ ఫెయిలయ్యాడని వింది.
    'బావకు ఎకనామిక్స్ లో అభిరుచి లేదు. గ్రూప్ మార్చుకుంటే బాగుండును. ఆమాత్రం సలహా చెప్పేవాళ్ళు కూడా లేరు.' అని విసుక్కుంది. కాస్త పెద్దదయిన అరుంధతి.
    తనే చెప్పి చూస్తె ....అయ్య బాబోయ్! తనసలు బావతో ఎన్నడూ మాట్లాడలేదు. కానీ, అతడా పరిసరాల్లో ఉన్నాడని తెలిస్తే, ఏదో ఉద్వేగం తన నావరించుకొని ఉక్కిరిబిక్కిరి చేసేది. అప్పుడప్పుడు దూరం నుంచి సిగ్గు బరువున వాలిపోయే , కనురెప్పలను , కష్టం మీద ఎత్తి బావ వంక చూసేది. బావకు ఎలా తెలిసేదో అతనూ తన చూపులతో చూపులు కలిపేవాడు. గుండెలు ఝల్లుమనగా, రెప్పలు వాల్చుకుని అక్కడి నుండి వెళ్ళిపోయేది.
    బావకూ తనకూ ఎలాగూ పెళ్ళి జరుగుతుంది. బావను చూస్తూనే వణికి పోయే తను..... అప్పుడు -- ఎలా తట్టుకోగలుగుతుంది? కొంపదీసి స్పృహ తప్పదు కదా! వూహ మాత్రం గానే, తన గుండె ఇంత వేగంగా కొట్టుకుంటుంది. "అప్పుడు ' ఆగిపోయినా , ఆశ్చర్య మేముందీ? ఆనాడు బావ పురుషత్వం మూర్తిభవించిన, తన గంబీర కంఠంతో, ఇన్నాళ్ళుగా సాగిన తమ మూగ బాషలకు వ్యాఖ్యానం వినిపిస్తాడా?    కానీ, అరుంధతి ఆ "అప్పుడు" గురించి అధికంగా ఆరాట పడవలసిన అవసరం లేకపోయింది. ఎందుకంటె, అసలా 'అప్పుడు" ఆమె జీవితం లోకి రానేలేదు.
    బి.ఏ . ఎకనామిక్స్ ఫెయిలయినా, సుందర్రావు జీవితంలో ఎకనామిక్స్ బాగానే తెలిసి కొన్నాడు. పాఠ్య గ్రంధాలు అర్ధం కాకపోయినా బి.ఏ. ఫెయిలయినా తన భవిష్యత్తు మాత్రం బాగానే అర్ధమయింది. అందుకనే ఒక ప్రముఖ వ్యాపారస్థుడు , తన కుమార్తెను , తన వ్యాపారంలో వాటాను ఇస్తానన్నప్పుడు , ఎగిరి గంతేసి ఒప్పుకున్నాడు. కధల్లో లాగ తర్వాత మోసపోకుండా, ముందే కట్టుదిట్టం చేసుకొని మరీ పెళ్ళి చేసుకొన్నాడు. ఆ అమ్మాయి సుందర్రావును తప్ప మరొకరిని చేసుకోనని పట్టు బట్టటం ఇందుకు కారణ మంటాడు ఆ పిల్ల తండ్రి! కానీ, ఆయనకూ , తన సంచి వదులుతేనే కాని, తన కూతురి కన్నె చెర వదలదని రూడిగా తెలుసు. ఈపాటికి ఆమె రూపురేఖలు పాఠకులు తేలిగ్గానే వూహించుకోగలరు. అవును మరి! ఈలోకంలో వ్యర్ధంగా డబ్బు ఖర్చు పెట్టుకునే మూర్కు లేవరుంటారు? అయినా ఈ విషయంలో సుందరరావుకు లేని బాధ మన కెందుకు?    
    ఈ వార్త విన్న అరుంధతి తన గుండె ఆగిపోనందుకూ , కనీసం మూర్చ అయినా రానండుకూ తనే ఆశ్చర్య పోయింది. క్షణంలో సగం కాలం మ్రాన్పడి పోయింది అంతే!
    బావకు తను నచ్చకపోతే , ఆమె కర్ధమయ్యేది!  తన గుణం మంచిది కాదని బావ అనుకొంటే, ఆమె కర్ధమయ్యేది.
    కానీ, బావ డబ్బు కోసం పెళ్ళి చేసికొంటున్నాడు! డబ్బు! ఇదేమిటి? మొట్టమొదటిసారిగా డబ్బును గురించి ఆలోచించింది అరుంధతి.
    ఎంతయినా , బావ ఇంకొకరిని చేసికో బోతున్నాడనే, సత్యాన్ని ఆమె జీర్ణించుకోలేక పోయింది. చివరి వరకూ ఏదో అద్భుతం జరిగి తీరుతుందని కధల్లోలాగ అన్ని సమస్యలూ తీరిపోయి, బావ తనవాడవుతాడనీ, ఏవో వెర్రి కలలు కనకండా ఉండలేకపోయింది. కానీ, ఏ అద్భుతమూ జరుగలేదు. అంతా సవ్యంగా, మాములుగా జరిగి పోయింది.
    అరుంధతి కెంతమాత్రమూ ఇష్టం లేకపోయినా బంధువులందరూ సుందర్రావు పైకి దండెత్తకమానలేదు. సుందర్రావు చాలా ప్లయభ్యంగా నిలబడ్డాడు.
    "నేను ఎవరికీ, ఎన్నడూ మాటివ్వలేదు. ఎవరో ఏదో అనుకొంటే, అందుకు నేను బాధ్యుణ్ణి కాను" ఈ మాటలు అరుంధతికి తెలిసాయి. మరి, ఆప్యాయత రంగరించుకొన్న బావ చూపులకు అర్ధమేమిటి? అవి చూపులు! -- మాట కాదూ!
    పెళ్ళి చేసేద్దామని చదువు మానిపించిన తల్లిదండ్రులతో , శాయశక్తులా పోరాడి పి.యు.సి లో చేరింది అరుంధతి. అరుంధతి బి.ఏ. మూడవ సంవత్సరం చదువుతుండగా ఒక విచిత్రం జరిగింది.
    అరుంధతి మేనమామ మంచి ఆస్థి పరుడు -- అతనికి పిల్లలు లేరు! భార్య కూడా ఇటీవలే చనిపోయింది. అప్పటి నుండి, పిల్లలు గల అతని బంధుకోటి అంతా అతని మీద అపారమైన ప్రేమను ప్రదర్శించసాగారు. వారిలో అరుంధతి తండ్రి కూడా ఒకడు -- కానీ, ఒకసారి తన బావ ఏదో కొంచెం చులకనగా మాట్లాడేసరికి పౌరుష పడి, ఆస్థి మీది ప్రలోభాన్ని కూడా వదులుకొని బావ గారితో తెగతెంపులు చేసి కొన్నాడు. ఆస్థి కోసం కంటే అన్నగారి కోసమే నిజంగా ప్రాకులాడిన అరుంధతి తల్లి కూడా తన భర్తను చులకన చేసి మాట్లాడినందుకు కష్టపెట్టుకొంది. తరువాత అతడు రెండు మూడు సార్లు కబురు చేసినా అరుంధతి తలిదండ్రులాతని ఇంటికి వెళ్ళనే లేదు. ఇది జరిగిన చాలా రోజులకు అయన చనిపోయాడు. ఆత్రుతగా వీలునామా చూసిన బంధువులందరూ ముక్కు మీద వేలు వేసుకునేలాగ ఆస్థి అంతా అరుంధతి తల్లి పేర ఉంది.ఇంక అరుంధతి తండ్రికి పట్ట పగ్గాలు లేకుండా పోయాయి. "ఆ సుందర్రావు తాతలాంటి సంబంధం తెస్తాను. ఆ బి.ఏ , ఫెయిలయిన చవట , మా అమ్మాయిని చేసికొకపోవటమే, మంచిదయింది." అని నలుగురి లోనూ దర్పంగా అని, నెల తిరక్కుండా అరుంధతి ని కొద్దో, గొప్పో అస్థిపరుడూ , లా పట్ట భద్రుడూ , అయిన ప్రకాశరావు కిచ్చి పెళ్ళిచేసి తన మాట నిలబెట్టు కొన్నాడు.

                                 *    *    *    *


Next Page 

WRITERS
PUBLICATIONS