సంపెంగ పొదలు
సి. ఆనందా రామం

ఆ ఉత్తరం పైన చిరునామా చూడగానే ఆ ఉత్తరం ఎవరు వ్రాశారో అర్ధమైంది గిరికి. దస్తూరీ , మనుష్యుల స్వభావానికి కొంతవరకు నిదర్శన మంటారు.
ఈ విషయం ఎవరి విషయంలో ఎంతవరకూ నిజమో కానీ, హరి విషయంలో మాత్రం , నూటికి నూరు పాళ్ళూ నిజం. వంకరటింకర గా వాలిపోయినట్లుండే , ఆ అక్షరాలూ , హడావుడి గా పరుగు నడకతో వచ్చే వారిని గుర్తు చేస్తాయి.
హరి దగ్గర తనకు ఉత్తర మనం గానే దిగ్భామ తో కాసేపు మతి పోయినట్లని పించింది గిరికి.
ఆదుర్దాగా విప్పాడు.
"గిరికి,
నీతో అత్యవసరంగా మాట్లాడాలని మీ యింటికి వచ్చాను. నువ్వు లేవు. నీవు వీలైనంత తొందర లో వచ్చి నన్ను కలుసుకో! సాయంత్రం ఐదు తర్వాత ఇంట్లోనే ఉంటాను.
-- హరి."
ఎంతో పొడిగా ఉన్నా ఈ ఉత్తరం గిరి మనసు కెలికినట్లయింది. దిగులుగా సోప్జాలో కూలబడ్డాడు. ప్రాణానికి ప్రాణంగా ఉండే హరి, ఈవిధంగా మారిపోయాడు-- మనుష్యుల మధ్య ఇంత విచిత్రంగా అపార్ధాలు ఎందుకు వస్తాయో అనుకున్నాడు గిరి.
హరి గిరి ల పరిచయం ఈనాటిది కాదు. పసితనం నుంచీ కలిసి మెలిసి ఆదుకున్నారు. హరి చెల్లెలు దుర్గ -- హరి, గిరి, దుర్గ కలిసి బడికి పోయేవారు. కలిసి వచ్చేవారు. సాధారణపు చిలిపి తగువులు కూడా వాళ్ళ మధ్య ఎప్పుడూ వచ్చేవి కావు. బలపాలూ, పెన్సిళ్ళూ, చాక్ లేట్లూ పిప్పర మెంట్లూ, కాళీ స్వీటు బాక్సులూ, ఒకరి కోసరం ఒకరు తేలికగా త్యాగం చెయ్యగలిగే వారు-- హరీ, దుర్గా, ప్రతి సెలవుల్లో వాళ్ళ మేనమామ గారి వూరికి వెళ్ళేవారు. వాళ్ళు వచ్చేవరకూ గిరికి పిచ్చెత్తినట్లుగా ఉండేది. వాళ్ళు వూరి నుండి వచ్సారని వినగానే తింటున్న అన్నమైనా వదిలి పరుగెత్తుకొని వచ్చేవాడు-- హరీ, దుర్గా , వాళ్ళ మేనమామగారి వూర్లో విశేషాలన్నీ ఏకరువు పెట్టేవారు. గిరి, తమ స్వంత విశేషాలన్నీ వివరించేవాడు. ఈవిధంగా బాల్యమంతా ఒక మధుర స్వప్నంలా గడిచిపోయింది.
ముగ్గురూ హైస్కూలు వదిలారు. దుర్గ చదువుకు స్వస్తి చెప్పి ఇంట్లో కూర్చుంది. హరీ, గిరి కాలేజీ లో చేరారు. వాళ్లకు వయసులలో మార్పు వచ్చింది. కానీ, మనసులో ఏమీ మార్పు రాలేదు.
వెనుక సెలవుల్లో మాత్రం మేనమామ గారి వూరుకు వెళ్ళిన హరి, , ఆప్పుడు వీలు చిక్కినప్పుడల్లా వెళుతున్నాడు. ఈ మార్పు గమనించిన గిరి హరిని కులాసాగా అడిగాడు. "ఏం హరీ! ఈ మధ్య మేనమామ మీద మక్కువ పెరిగినట్లుందే!"
హరి ముఖం ఎర్రబడింది. ఒకసారి నవ్వి తల వంచుకున్నాడు. గిరి, హరి దగ్గరగా వెళ్లి భుజాలు పట్టుకుని వూపుతూ "ఈ పప్పులెం ఉడకవు! పదరా, కధ వినిపించు" అంటూ హరిని సోఫాలో కూలేశాడు.
హరి నవ్వుతూ "చెప్పడాని కేం? కానీ, ప్రేమ కధలు వినడానికి చాలా వోపిక ఉండాలి తెలుసా?' అన్నాడు.
గిరి, హరి ప్రక్కనే కూర్చుంటూ "కావాల్సిందానికి రెట్టింపు ఉంది. మొదలుపెట్టు -- పేరు ఉమ -- " అన్నాడు.
హరి నవ్వాడు.
"నీకు బాగానే గుర్తుందే! అవును, ఉమే ఈ కధ నాయిక. చిన్నతనపు స్నేహమే, ప్రణయంగా మారింది. నా మరదలే కనుక, పెద్ద వాళ్ళు పెట్టె ఆటంకాలు కూడా ఏమీ ఉండవు. చదువులు పూర్తయ్యాక పెళ్లి చేసుకుంటాం. ఏం కద కుతూహలజనకంగా లేదు కదూ!" అన్నాడు.
"ఇంటరెస్టింగ్ లేని మాట నిజమే కానీ, నేను ఇంకా కుతూహలం పుట్టిస్తా నుండు-- ఉమతో నీ అభిప్రాయం చెప్పి, ఆమె సమ్మతి తీసుకునే మాట్లాడుతున్నావా? లేకపోతె ఇది నీ ఊహగానమా? నిన్నొక ఆడది పెళ్లి చేసుకుందుకు ఒప్పుకుందంటే నమ్మలేక పోతున్నాను మరి."
హరి కూర్చున్న చోటు నుంచి చటుక్కున లేచి రోషంగా ముక్కు పుటా లెగరేస్తూ "అవునులే! లోకంలో అందరూ నీలాంటి అందగాళ్ళే ఉంటారా?' అన్నాడు.
గిరి పకపక నవ్వుతూ లేచిన హరిని భుజాలు పట్టుకుని కూర్చో బెడుతూ "నా, అంతా ఇంకా నీకంటే నూ అందమైన వాళ్ళు లక్ష మంది-- కానీ నీలాంటి తొందరపాటు మనుష్యులు మాత్రం ఎక్కడా ఉండరు." అని హరి ముఖాన్ని తన వైపుకు తిప్పుకొని "హరీ! చిన్నతనం నుంచీ కలిసి మెలిసి తిరిగాం . నన్నే అర్ధం చేసుకోలేక పొతే నువ్వెవరి నర్దం చేసుకోగలవో చెప్పు.నీ మేలు కోరేవారిలో నేనూ ఒకడిని నువ్వు నమ్మటం లేదూ?' అన్నాడు.
అంతలో హరి మనసు ఆర్ద్ర మైపోయింది. గిరి చేతిని తన చేతిలోకి తీసుకొని మృదువుగా నొక్కుతూ "ఏమీ అనుకోకు గిరీ! నాకు మరీ ఉద్రేకం ఎక్కువ. నా అత్మీయులందరి కంటే నువ్వే నాకు ఎక్కువ. అసలు ఒక రకంగా చెప్పాలంటే నేను నిన్నెంతో అరాదిస్తున్నాను.' అన్నాడు.
గిరి, హరి వీపు మీద చరుస్తూ "చాలు నాయనా, చాలు! ఈ ఆరాధన వద్దు. ఆ ఆగ్రహము వద్దు -- స్నేహమనే మాటకు అర్ధం తెలుసుకో చాలు! అసలింతకూ అ అమ్మాయి అభిప్రాయం తెలుసుకున్నావా? అన్నాడు.
"ఇంకా వేరే అడగటమెందుకూ?"
"అంటే!"
హరి నవ్వాడు. కొన్ని క్షణా లాగి ఇలా అన్నాడు.
"ఒకరోజున ఉమా నాకు ఏకాంతంగా లభించింది. అలాంటి క్షణాలు చాలా అరుదుగా వస్తాయి. నేను సాహసించి పరాకుగా ఏదో చదువుతున్న ఉమ కళ్ళు వెనుక నుండి మూసాను. ఉమ ఉలిక్కిపడి వెనక్కూ, నామీద వాలిపోయి "ఏమిటి బావా?' అంది గాబరాగా -- ఆమె కళ్ళు పెంకెగా నన్ను మరింత రెచ్చ గొట్టాయి. నామీద ఒరిగిన ఉమను, నా వైపుకు తిప్పుకొని, బలంగా గుండె లకు హత్తుకుని ముద్దు పెట్టుకున్నాను. చిరునవ్వు నవ్వుతూ, మృదువుగా నన్ను విడిపించుకుని పారిపోయింది. అప్పటి ఆమె చిరునవ్వు లో మెరుపులు చెక్కిళ్ళ లో కెంపులు కళ్ళలోని పారవశ్యపు కాంతులు, ఆమె మనసు నాకు విప్పి చెపుతుంటే, ఇంకా నేను వేరే అభిప్రాయ మడగటం ఎందుకూ?"
కలలోని వాడిలాగ, అరమోడ్పు కనులతో చెపుతున్న హరిని చూసి గిరి నవ్వుకున్నాడు. ఏ భావోద్వేగన్నయినా, ఇంత తీవ్రంగా అనుభవించగలిగే హరి జీవితం సుఖ మయవ్వాలని మనసులో కోరుకున్నాడు. ఇంతలో హరి కూర్చున్న చోటు నుంచి లేచి తన సూటు కేసు తెరిచి ఉమ ఫోటో తెచ్చి గిరి కిచ్చాడు. చాలా సామాన్యంగా ఉంది. అందగత్తె అని చెప్పడానికి కూడా వీల్లేదు. కానీ, ఈ మాట గిరి పై కనలేదు. గిరి ఏమీ అనకుండానే హరి చెప్పాడు.
"ఉమ ఫోటో -- జేనిక్ కాదు-- ఫోటోలో అలా సామాన్యంగా ఉందని అందమైనది కాదనుకో వద్దు -- ఉమను చూస్తె నువ్వే నాకు పోటీకి రావచ్చు."
గిరి ఉలిక్కిపడ్డాడు -- "ఛీ! ఉమను నేనెప్పుడూ చూడకపోయినా, ఆమెను నీ భార్య గానే వూహిస్తున్నాను. వేళాకోళంగా నైనా అలా మాట్లాడకు హరీ! ఉమ నీ భార్య కావాలని నీకంటే కూడా నేనే ఎక్కువగా కోరుకుంటున్నాను."
గాఢనురాగాన్ని వ్యక్తపరిచే ఈ మాటలకు సమాధానంగా హరి గిరిని కౌగలించు కున్నాడు.
2
"చాలా అందంగా ఉన్నావులే! కానీ ఈ దొరగారెక్కడ? కనబడడెం?"
అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకు మురిసి పోతున్న దుర్గ గిరి ఈ మాటలతో ఉలికి పడి సిగ్గుపడి గర్వపడింది.
మూతి ముడిచి, "పోనీలే! ఇప్పటికైనా అందం నీకు కనిపించింది." అంది.
దుర్గ మాటలకూ, ఆ మాట్లాడిన తీరుకూ, గిరి తెల్లబోయాడు. అతడు తన సహజ ధోరణి లో యధాలాపంగా అన్నాడు. సంభాషణ మళ్ళించాలని "నా ప్రశ్నలో ముఖ్యమైన భాగం అది కాదు." అన్నాడు కుర్చీలో కూర్చుంటూ.
దుర్గ చిన్న బుచ్చుకుంది--
"ప్రశ్నలూ సమాధానాలూ తప్ప మన మధ్య ఇంకేమీ లేవా, గిరీ?"
"లేకేం? దెబ్బలాటలూ, అలకలూ, కన్నీళ్ళూ మూతి ముడుపులూ...." వాక్యం పూర్తీ చేయకుండానే గిరి పకపక నవ్వాడు.
దుర్గకి కూడా నవ్వొచ్చింది.
"ఫో! ఏదీ సీరియస్ గా మాట్లాడవు-- ఇంకోళ్ళని మాట్లాడనియ్యవు. " గిరి స్థిరంగా కూర్చుని "ఇదుగో , బుద్దిగా కూర్చున్నాను. రాజకీయ నాయకుల ఉపన్యాసం వినేవాడి లాగ! నాకు మొదటి అట సినిమాకు టైం దాటిపోకుండా , నువ్వు చెప్పదలచుకున్నదంతా చెప్పెయ్యి." అన్నాడు.
