"చచ్చిపోయిన కూలీల కుటుంబాలకు కాంపెన్సేషన్ ఇచ్చుకోవాలి. ఇంక మీదట కాంట్రాక్ట్స్ రావు."
"ఈ కాంట్రాక్ట్స్ విషయాలు మీకంటే నాకే బాగా తెలుసు. నాకు వివరించి చెప్పాలని ఈ సంగతులన్నీ ప్రత్యేకించి తెలుసుకుని వచ్చారా? థాంక్స్!"
మిసెస్ కామేశ్వరీదేవి వళ్ళు మండిపోతోంది.
'ఇప్పుడింక సర్వనాశనమే కదూ!" కసిగా అంది.
"సర్వనాశనమా? ఎవరికీ? ఏ విధంగా?"
కామేశ్వరీదేవి రెచ్చిపోయింది.
"ఇంకెవరికండీ! మీకే! తలచుకుంటే గుండె పగిలిపోతోంది!"
"తలచుకోకండి, ఆ గుండె పగలకొట్టుకోకండి. అది అలాగే రాయిలాగా నాలుగు కాలాలపాటు ఉండాలి!"
అందులో వ్యంగ్యం అర్థమయింది కామేశ్వరీ దేవికి- ఆమె కళ్ళు భగ్గున మండాయి. ఆ కళ్ళలోకి చూసిన శశాంక తనకు కలిగిన నష్టమంతా ఒక్క క్షణం మరిచిపోయాడు. నవ్వాడు.
"బికారిలాగా నడిరోడ్డుమీద నిలవ వలసిందే!"
ఒక్కొక్క మాట నొక్క పలుకుతూ అంది కామేశ్వరీ దేవి.
"అది నాకు కొత్త కాదు కదా! ఒకనాడు ఆ దశ నుండే ఈ దశకు వచ్చాను. మళ్ళీ ఆ దశలోకి వెళ్తున్నాను. కాలచక్ర పరిభ్రమణంలో ఇలాంటివి జరగటం సహజమే!"
కామేశ్వరీ దేవి ముఖం పాలిపోయింది. ఆవిడ పెదవులను పంటి కొనలు కసిగా నొక్కాయి.
శశాంక లేచాడు.
"మీకిప్పుడేమైనా పని ఉందా?"
"ఎందుకు?"
"ఎవరో ప్రఖ్యాత నర్తకి డాన్స్ ప్రోగ్రాం ఉంది. వెళ్తున్నాను. మీరూ వస్తారా? ఆవిడ డాన్స్ చాలా బాగుంటుందిట!"
షాక్ తగిలినట్లయింది కామేశ్వరీ దేవికి. వెంటనే ఏమీ మాట్లాడలేకపోయింది.
"ఓ! అయామ్ సారీ! ఇది మీకు పూజా సమయం కదూ! ఊరి మీద ఊరు పడ్డా మీరు పూజ మానరనే మాట మరచిపోయాను. వస్తాను."
చిరునవ్వుతో ఠీవిగా నడిచి వెళ్ళే శశాంకను చూస్తూ అలా నీరసంగా కూర్చుండి పోయింది కామేశ్వరీ దేవి.
ఇదేమిటి? తానెంతో ప్రయాసపడి సాధించినది- ఇదేనా? ఏమీ లేదా?
శశాంక ఉల్లాసంగా తిరుగుతున్నాడు. పకపక నవ్వుతున్నాడు. స్నేహితులతో విందులూ వినోదాలూ జరుగుతున్నాయి. అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏ మాత్రం ఆశ్చర్యపోనిదీ...లోలోపల కృంగిపోతున్నదీ, శశాంకను అనుక్షణం కనిపెడుతున్నదీ...ఒకే ఒక వ్యక్తి...సౌందర్య!
"సౌందర్యా! నువ్వు విక్రంను పెళ్ళి చేసుకోవటానికి ఇంకా చాలా కాలం పడుతుందా?"
ఎంత ప్రయత్నించినా శశాంక కంఠంలో జీర ధ్వనించక తప్పలేదు. పదిమందిలో అతడు ప్రదర్శించే ఠీవి, గాంభీర్యము- ఎంత ప్రయత్నించినా సౌందర్య ముందు నిలవటం లేదు.
"ఏమో నాన్నగారూ! ఎవరు చెప్పగలరు? ఏనాడూ ఎవరికీ ఆధీనం కాని కాలానికి మనం కట్టుబడి ఉండవలసిందేనన్నాడు విక్రం."
తలెత్తి కూతురి ముఖంలోకి చూశాడు శశాంక. సౌందర్య ముందు ఎవరూ ఏమీ దాచలేరు. దాచాలని ప్రయత్నించటం దేనికి?
"నువ్వూ, విక్రం ఒకటి కావటం నేను చూడలేనేమో!"
"మేము ఒకటి కావటం అంటూ జరిగితే మీరు తప్పకుండా చూడగలరు!"
"అది జరుగుతుంది. జరిగి తీరుతుంది."
"ఆ విశ్వాసాన్ని అలాగే ఉంచుకోండి. ఈ సంకల్ప బలాన్ని సడలనియ్యకండి!"
శశాంక విక్రం లాబ్ లోకి వెళ్ళాడు.
విక్రమ్ శశాంకను చూసి స్నేహంగా నవ్వాడు.
"జీవితం మిమ్మల్ని మరోసారి ఛాలెంజ్ చేసింది."
"ఇది వెనుకటి ఛాలెంజ్ కాదు విక్రం! ఆనాడు నేను ఒక్కణ్ని స్వతంత్రంగా నిలబడ్డాను. నా గుండె బలంతో ఎదుర్కొని నా శక్తి సామర్ధ్యాలతో నిలబడ్డాను. కానీ, ఆ తరువాత చాలా మందితో చేతులు కలిపాను. ఎన్ని భాగాలుగానో చీలిపోయాను. ఇప్పుడు నాలో మిగిలిన 'నేను' చాలా తక్కువ. ఈ ఛాలెంజ్ ని నేను ఎదుర్కోలేకపోవచ్చు."
`నిష్ఠూరమైన ఆ సత్యం ముందు తలవంచాడు విక్రం. ఆ సత్యపు అనునయ వాక్యాలు అతనికి రావు.
"నేను నీ ప్రక్కన నిలబడాలనుకున్నాను. అందువల్ల నీకు మేలే జరిగిందో, కీడే జరిగిందో, నాకే అర్థం కావటం లేదు. కానీ, ఈ రోజున - ఇంత పతనంలో కూడా నా మనసులో నిండిన సంతృప్తి అదొక్కటే!"
విక్రం చిరునవ్వు నవ్వాడు.
"ఆ నవ్వు చాలు! నా జీవన యాత్రకు ప్రాధాన్యం ముట్టినట్లే!" అనుకున్నాడు శశాంక.
* * *
తన చేతిలో పిస్టల్ ను కణతలపై పేల్చుకోవటానికి సిద్ధంగా ఉన్న శశాంక సౌందర్య రాకతో ఆగిపోయి పిస్టల్ ను బల్ల మీద పెట్టాడు.
సౌందర్య తండ్రి ఎదురుగా కూర్చుంది.
"నాన్నగారూ! మీరిలాంటి పని చెయ్యడానికి వీల్లేదు!"
"గత్యంతరం లేదమ్మా! ప్రతి వ్యక్తికీ తాను స్థిరంగా నిలబడగలిగే ఆధారం ఒకటి ఉంటుంది. ఇన్నాళ్లుగా డబ్బు మీద-అది అందించే అధికారాల మీద- పలుకుబడి మీద నిలబడ్డాను. అది కదిలిపోయింది. ఇంక నేను నిలవలేను."
"మీ ఆధారం మళ్ళీ దక్కుతుంది. కొంచెం ఓపిక పట్టండి."
"ఎలా సౌందర్యా! డబ్బుకు సంబంధించినంత వరకు సర్వనాశనమయి పోయింది. నేను బికారిని."
"ఎలా అన్నది నాకు వదలండి. మీరు నిశ్చింతగా ఉండండి. ఒక్కటి అర్థం చేసుకోండి. ఇలా ఆత్మహత్య చేసుకోవటం పిరికితనం. నేను సహించలేను. క్షమించలేను."
చివరి మాటలకు బెదిరాడు శశాంక.
ఆశగా, అయోమయంగా చూశాడు.
32
వామన్ సంతోషానికి అవధి లేదు. ఎలాగయితేనేం? తను సుధను పెళ్ళి చేసుకోబోతున్నాడు. సుధ తనకోసం ఎదురుచూస్తూ ఉంటుంది. వెంటనే వెళ్ళి సుధను రిజిస్ట్రార్ ఆఫీస్ లో పెళ్ళి చేసుకుంటే...సుధ తన ప్రక్కన నిలబడితే..
వామన్ ఆలోచనలు ఆగిపోయాయి. తన దగ్గరకు వస్తోన్న సౌందర్యను చూసి మతిపోయి నిలబడ్డాడు. సౌందర్య వచ్చింది. తనంత తను వచ్చింది. వామన్ కు అంతులేని సంతోషం కలిగింది. చెప్పరాని భయం కలిగింది.
"సౌందర్యా! నువ్వు ...నా ఇంటికి.."
"అవున్ వామన్! ఈనాడు సౌందర్య నిన్ను వెతుక్కుంటూ వచ్చింది.
'ఎందుకు?" మూర్ఖుడిలా అడిగాడు.
"నిన్ను పెళ్ళి చేసుకోవటానికి"
"సౌందర్యా!"
"ఏం వామన్! నన్ను పెళ్ళి చేసుకోలేవా?"
"అది కాదు సౌందర్యా! నువ్వు నన్ను పెళ్ళి చేసుకుంటావా?"
తనను తాను ఎంత హీనపరచుకుంటున్నాడో అర్థం కావటం లేదు వామన్ కు.
"అవును. చేసుకోవలసి వచ్చింది. మా నాన్నగారి విషయం విన్నావుగా! ఆయన సంపద..దానితో పాటు వచ్చే పరువు అన్నీ పోయాయి. దీనికి ఆయన తట్టుకోలేక పోతున్నారు. తిరిగి సంఘంలో తన స్థానాన్ని స్థాపించుకోవటానికి నీ సంపద ఆయనకు పెట్టుబడిగా కావాలి! ఆయన వ్యాపార దక్షతలో నాకు నమ్మకం ఉంది. నీ డబ్బు నీకు తిరిగి వస్తుంది."
"అలా మాట్లాడకు సౌందర్యా!"
"నేను ఎలా మాట్లాడినా నిజం నీకు తెలుసుగా వామన్! అబద్ధాలాడి ప్రయోజనం ఏముందీ?"
