Previous Page Next Page 
తపస్వి పేజి 36


    "అతనే! ఒకప్పుడు మనం ఉద్యోగంలో నుండి తొలగించిన వ్యక్తీ."
    "మనం తీసేసిన మనిషిని తిరిగి మనమే వేసుకోవటం అవమానం కదూ!"
    "పొరబాటు గుర్తించి సరిదిద్దుకోవటం గౌరవమే అవుతుంది."
    "నేను కాంతరావునే సెలెక్ట్ చెయ్యాలని అంటే...."
    "నేను డాక్టర్ విక్రమ్ ను సెలెక్ట్ చేశానని చెప్తున్నానుగా!"
    "చూడండి! ఇదంత మంచిది కాదు!"
    "ఎవరికి?"
    ఫోన్ పెట్టేసింది మిసెస్ కామేశ్వరీ దేవి.....!
    ఒకనాడు డాక్టర్ విక్రం విదిలింపు మిసెస్ కామేశ్వరీ దేవి మరిచిపోలేదు. ఎదుటి వ్యక్తుల చేత స్తోత్రపాఠాలు చదివించుకోవటానికి అలవాటు పడ్డ వ్యక్తులు అపురూపంగా లభించే విదిలింపులను అతి పదిలంగా దాచుకుంటారు.
    తను రావాలనుకున్న కాంతారావు రాకపోవటం - తనను విదిలించిన విక్రం రావటం ..... పుండు మీద కారం రాసినట్లుగా ఉంది. కాని , శశాంక తలచుకుంటే డాక్టర్ విక్రం రాక తప్పదు. కానియ్యి, ఇల్లలకగానే పండుగ అవుతుందా? ఆ విక్రం ఆ ఉద్యోగంలో ఎన్నాళ్ళూ నిలవగలడో తను చూడదా?
    వామన్ తో పట్టరాని ఉక్రోషంతో అంది.
    "శశాంక డాక్టర్ విక్రంని మన హాస్పిటల్ కు సెలెక్ట్ చేశారు!"
    "నిజమా?"
    వామన్ ముఖంలో అనందం చూసి మిసెస్ కామేశ్వరీ దేవి మొదట తెల్లబోయింది. తర్వాత కంటగించుకుంది.
    "డాక్టర్ విక్రం మన హాస్పిటల్ కు రావటం నీకు ఇష్టమేనా?' ఈసడింపు గా అంది.
    "విక్రమ్ కు పేరు ప్రఖ్యాతులు రావటం ఇష్టం లేదు. కానీ పేషెంట్లు చావటమూ ఇష్టం లేదు.
    "విక్రమ్ ఉంటే పేషెంట్లు చావరా?"
    "కాలదేవతతో తప్ప మరే జబ్బుతో నయినా విక్రం పోరాడి జయించగలడు!"
    "అతడంటే నీకు అంత అభిమానమా?"
    "కాదు ! అంతులేని ఈర్ష్యా!"
    "మరి ఈ ఆరాధనకు అర్ధమేమిటి?"
    "ప్రతిభ లేకపోయినా, ప్రతిభను గుర్తించే అంతరంగాన్ని చంపుకోలేక పోతున్నానని...."
    "ఓహో!"
    మొదటిసారిగా వామన్ మీద మండిపడింది మిసెస్ కామేశ్వరీ దేవి.
    'అయితే ఇకనేం? అతని అడుగులకు మడుగులోత్తు - ఆ ప్రతిభ లోకానికంతా చాటు!"
    వామన్ నవ్వి "నన్ను మీరు అపార్ధం చేసుకుంటున్నారు. విక్రంను అణచటానికి అన్ని విధాలా ప్రయత్నిస్తానే కాని అతని ప్రతిభ పైకి రానియను!" అన్నాడు.
    'అయితే ఇక చూసుకో! ఆ విక్రంను , అతణ్ణి ఎంచుకున్న శశాంకను నలుగురిలో నవ్వులపాలు చెయ్యకపోతే నా పేరు కామేశ్వరీ దేవి కాదు."
    "మీ ప్రయత్నం ఫలించాలనే నా కోరిక. శక్తి వంచన లేకుండా సహాయపడతాను. కానీ నాకు అనుమానం - కాదు నమ్మకం! విక్రంను ఎవ్వరూ నవ్వులపాలు చెయ్యలేరు. అతడు ఎప్పుడూ అందరినీ చూసి నవ్వుకుంటాడు."
    మిసెస్ కామేశ్వరీదేవి వెంటనే తన పని ప్ర్రారంభించింది. క్షణాలలో నగరమంతా శశాంక తన స్వార్ధం కోసం అనర్హుడని తీసివేయబడ్డ విక్రంను మళ్ళీ హాస్పిటల్లో డాక్టర్ గా తీసుకున్నాడన్న వార్త వ్యాపించింది. పత్రికలన్నీ శశాంకను దుయ్యబట్టాయి. ప్రజల యోగక్షేమాలలోచించకుండా అసమర్ధుడైన డాక్టర్ ను తీసుకున్న శశాంక అన్యాయాన్ని ఖండిస్తూ సంఘంలో పెద్ద మనుష్యుల పేరిట చెలామణి అవుతున్నవాళ్ళు చేస్తున్న అరాచక కృత్యాలను తీవ్రంగా విమర్శించాయి.
    విక్రం శశాంకతో "నేను చెప్పినదంతా జరుగుతుంది చూశారా?" అన్నాడు.
    శశాంక నవ్వి, "నేను చెప్పింది కూడా జరగాలిగా? ఉండు!" అన్నాడు.
    ఈ దుమారంతో విక్రం అందరి దృష్టిలోకి వచ్చాడు. అతని నైపుణ్యం కూడా కొందరి దృష్టిలోకి వచ్చింది.
    అతడు నయం చేసిన కొన్ని కొన్ని కంప్లికేటేడ్ కేసెస్ చూసి తెలిసిన వాళ్ళు విస్తుపోయారు.
    అయితే ఇప్పటికీ విక్రం, వామన్ లా పేషెంట్ల ముందు నిలబడి కబుర్లు చెప్పలేదు. అంచేత సామాన్య జనానికి విక్రం మంచి డాక్టరని తెలియటమూ లేదు. వామన్ లో విశ్వాసం సడలటమూ లేదు.తెలిసినవాళ్ళు మాత్రం వామన్ ను చిరునవ్వుతో మర్యాదగా తప్పించుకుని విక్రం దగ్గరకే వెళుతున్నారు. విక్రం ప్రతిభ గుర్తించేవాళ్ళు పెరుగుతున్నారు. అయినా వాళ్ళు పత్రికలకు వ్రాయరు. ఉపన్యాసాలియ్యరు. వార్తలు ప్రచారం చెయ్యరు. వాళ్ళలో వాళ్ళు విక్రంను గౌరవిస్తారు. విక్రం పరిశోధనలకు ఏ సహాయమైనా చెయ్యటానికి సిద్దంగా ఉంటారు.
    విక్రం పరిశోధన చురుగ్గా సాగుతోంది. అతని పేపర్లు మెడికల్ మేగజైన్లలో రావటమూ, వాటిని మెచ్చుకునే మేధావుల సంఖ్య పెరగటమూ జరుగుతోంది.
    విచిత్రమేమిటంటే ఎన్నదగిన మేధావులు మన్ననలు కురిపిస్తోన్నా .....అధిక సంఖ్యాకులు "డాక్టర్ విక్రంను తొలగించాలి! అన్యాయం నశించాలి!" అని ఆందోళన చెయ్యడం మానలేదు.
    విక్రంను గురించిన ప్రశంసలు..... అదీ అతను ప్రచురించిన పేపర్ల మీద .... ఏదో కొన్ని మెడికల్ మాగజైన్ల లో మాత్రమే వస్తే వామన్ ను ఇంచుమించు అన్ని పత్రికలూ పొగుడుతూనే ఉన్నాయి.
    విక్రంను పొగుడుచున్నది వైద్య విజ్ఞానం తెలిసిన శాస్త్రవేత్తలు.
    వామన్ ను పొగుడుతున్నది ఏదో ఒక విధంగా వార్తలు సేకరించే పాత్రికేయులు!
    ఈ భేదం సామాన్యుకెలా తెలుస్తుంది? విని, విని చదివి .... వామన్ ను మించిన డాక్టర్ లేడనే భావం వాళ్ళ నరనరాల దాకా జీర్ణమయిపోయింది.
    అతని మీద గౌరవంతో అతనినే వెతుక్కుంటూ వచ్చే పేషెంట్లు.... వామన్ తనకు శక్యంగాక అతని దగ్గరకు పంపే పేషెంట్లు ..... వీళ్ళందరితో విక్రంకు ఉక్కిరిబిక్కిరి అయిపొయింది.
    ఆ రోజు విక్రమ్ పని ముగించుకుని తన లాబ్ లోకి వెళ్లబోతుండగా వామన్ ఒక పేషెంట్ ను తీసుకొచ్చాడు.
    అతను చిరాగ్గా కనుబొమ్మలు చిట్లించాడు.
    ఆ రోగి విక్రం ముందే "డాక్టర్ బాబు ! మీరే నన్ను చూడండి!" అన్నాడు వామన్ తో.
    వామన్ దర్జాగా నవ్వి "ఫరవాలేదోయ్! నేను దగ్గరే ఉంటానుగా! నాకు ఊపిరాడని పని! నేనొక్కడినే అందరినీ చూడగలనా చెప్పు! అయినా నేను కనిపెట్టి ఉంటానుగా!" అన్నాడు.
    ఈ రకమైన సంభాషణలకు బాగా అలవాటు పడిపోయిన విక్రం దీనినంతగా పట్టించుకోలేదు కాని ఆ రోజు అతనికి నిజంగానే అలసటగా అనిపించింది.
    "లాభం లేదు వామన్! నేను వెళ్ళాలి. నువ్వే చూసుకో" అంటూ లేచాడు.
    "నేను చూసుకోగలిగితే నీ దగ్గరకు తీసుకురానని నీకు తెలుసు."
    "నాకు చాలా అలసటగా ఉంది. వెళుతున్నాను."
    "వెళ్ళు! నేనే ట్రీట్ చేస్తాను. కానీ నీ మాట మీదే ట్రీట్ చేస్తున్నాను. భాద్యతలన్నీ నీకే!"
    ముందుకు అడుగు వేసిన విక్రం ఆగిపోయాడు.
    వామన్ చిరునవ్వుతో అన్నాడు. "నేను దుర్మార్గుడ్ని కాను. కానీ, అంతా కలిసి నన్ను దుర్మార్గుడ్ని చెయ్యదలుచుకుంటే .....ఒకే!"
    "ఆ మాటలు నాకెందుకు చెపుతున్నావు? నీకు డిగ్రీ ఇచ్చిన వాళ్ళకు చెప్పు! నిన్ను ఉద్యోగంలో ఉంచిన వాళ్ళకు చెప్పు"
    "ఈ మాటలు వాళ్ళకు అర్ధమయితే నాకు డిగ్రీ ఎలా వస్తుంది? ఉద్యోగంలో ఎలా ఉంటాను? ' అని రోగి వంక తిరిగి "సరే! రావోయ్! అదృష్టవంతుడివి. నేనే ట్రీట్ చేస్తాను. డాక్టర్ విక్రం గారికి థాంక్స్ చెప్పు" అన్నాడు.
    ఆ రోగి గంపంత ముఖం చేసుకుని విక్రం వేపు తిరిగి "థాంక్స్!' అని వామన్ వెనుక నడవబోయాడు.
    "అగు !" అన్నాడు విక్రం విసుగ్గా.
    వామన్ ఆగి విక్రంను చూసి చిరునవ్వు నవ్వాడు.
    విక్రం ఫకాలున నవ్వి అన్నాడు "యూ రోగ్! నా బలహీనత బాగా కనిపెట్టావు. ఆ రోగిని కూడా వదలి నా కంటికి కనబడకుండా పో!"
    

                                    26


    నైట్ డ్యూటీలో నిద్రపోతున్న నర్స్ ను చూసి సహించలేకపోయాడు డాక్టర్ విక్రం. ఆ నర్స్ ఎన్ని విధాల క్షమాపణలు చెప్పుకున్నా క్షమించలేకపోయాడు. వెనుకటి రోజుల్లో పనిచేసే నర్సు గుర్తుకొచ్చింది. నర్స్ గా ఆవిడ ప్రవర్తన అతనికెంతో నచ్చింది.
    "ఇదివరకు మన దగ్గర నర్స్ గా పనిచేసిన ఆవిడ ఏమయింది?" అడిగాడు.
    అక్కడివాళ్ళు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు.
    "ఎవరు? పేరేమిటి ?" అన్నారు.
    "ఏమో! పేరు తెలియదు. నైట్ డ్యూటీలో నిద్రపోయేది కాదు...."
    "ఏ టైం లో ఏ పేషెంటుకు ఏదో ఇవ్వాలో , ఎప్పుడూ అశ్రద్ధ చేసేది కాదు. ఏమయింది?"
    "అందరు నర్సులు అలాగే ఉంటారు."
    "అందరూ అలా ఉంటే నేను ప్రత్యేకించి ఈవిణ్ణి గుర్తుపెట్టుకోగలిగేవాడ్ని కాదు."
    "పోనీ , ఎలా ఉంటుంది?"
    "చూస్తె గుర్తుపట్టగలను. కానీ అంత బాగా వర్ణించలేను!"
    విక్రం అడుగుతున్నది ఎవరిని గురించో వెంటనే అర్ధం చేసుకోగలిగినడు వామన్ ఒక్కడే....
    "ఆవిడ కుసుమ! ఎక్కడుంటుందో ఎవరు వెతగ్గలరు?" నిరసనగా నవ్వుతూ అన్నాడు.
    "అంత మంచి నర్సును ఉద్యోగంలోంచి ఎందుకు తీసేశారు?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS