Previous Page Next Page 
తపస్వి పేజి 37

 

    ప్రవర్తన మంచిది కాదని..."
    "నేను నమ్మను ... ఆవిడ ..... కుసుమ అన్నావు కదూ! ఆ కుసుమ ఎన్నడూ తన డ్యూటీ నిర్లక్ష్యం చెయ్యదు...."
    'డ్యూటీ నిర్లక్ష్యం చేసిందని ఎవరన్నారు? ఆవిడ వ్యభిచారిణి అని రుజువయింది. అందుకని తీసేశారు."
    "దానికీ నర్సుగా ఆవిడ ఉద్యోగానికి సంబంధమేమిటి?"    
    అమాయకంగా అడిగాడు విక్రం.
    అతని ప్రశ్న కంటే ఆ ముఖంలో అమాయకత్వానికి ఆశ్చర్యపోయాడు వామన్.
    వెంటనే ఏ సమాధానమూ చెప్పలేకపోయాడు. కొంత సేపటికి ఆ ప్రశ్నకు తను చెప్పగల సమాధానం ఏమీ లేదని కూడా అర్ధమయింది.
    ఆ రోజే కుసుమని వెతుక్కుంటూ బయలుదేరాడు విక్రం. ఆమె జాడ కనుక్కోవటం కష్టమే అయింది. చివరకు ఒక ఇరుకు సందులో ఆటకలాంటి మెడ గదిలో కుసుమ కనిపించింది. నాటుసారా తాగుతున్న కుసుమ అతన్ని చూడగానే ఒక్కసారి ఉలిక్కిపడింది. సర్దుకుంటూ లేచి "మీరు..... మీరు ఇక్కడికి...." అంటూ తడబడింది. ఏం మాట్లాడాలో , ఎలా మాట్లాడాలో కూడా అర్ధం కాక.
    "మీరు అదేదో త్రాగేయ్యండి. ఆ తర్వాత మాట్లాడతాను." మాములుగా అన్నాడు విక్రం.
    విక్రం రాకకే కదిలిపోయిన కుసుమ ఈ మాటలకు తట్టుకోలేకపోయింది. పొంగి రాబోయిన దుఃఖం ఉక్రోషంగా మారింది.
    "మీరు నా ఇంటికి వచ్చి నన్ను అవమానించనక్కర్లేదు. నా ఇష్టం.... నేను త్రాగుతాను. నా ఇష్టం వచ్చినట్లు ఉంటాను. మీరెవరు నన్ను అడగటానికి?"
    కసిగా అతనిముందే త్రాగింది కుసుమ....
    కుసుమ ఏమంటుందో అర్ధం కాక కుసుమని పరిశీలనగా చూసిన విక్రం ఆ కళ్ళలో ఏ భాషకూ అందని వ్యధను గమనించి చూడలేక ముఖం తిప్పుకున్నాడు.
    "ఏం? నన్ను చూడలేకపోతున్నారా? అసహ్యం కలుగుతోందా? అసహ్యించుకొండి . వెళ్ళండి - మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు ఇక్కడికి? నా దగ్గరికి ఎవరూ రాకండి. నా ఖర్మాన నన్నెందుకు ఉండనివ్వరు? నన్ను వెతుక్కుంటూ వచ్చి నన్నెందుకు పొడిచి పొడిచి చంపుతారు? త్వరగా పొండి."
    ప్రయత్నం మీద ఆమె వేపు తిరిగాడు విక్రం.
    "నేను మీతో పని మీద వచ్చాను."
    "ఏం పనో చెప్పండి! ఎవరి దగ్గర కెళ్ళాలి? ఎంతిస్తారు?"
    "మా హాస్పిటల్ కి రావాలి. నర్స్ గా రావాలి. నర్స్ కిచ్చే జీతమే ఇస్తారు."
    ఆమె రెండు కళ్ళు పెద్దవి చేసి చూసింది. పిచ్చిదానిలా చూసింది. తరువాత విరగబడి నవ్వింది.
    "డాక్టర్ గారూ! మీరేమిటి మిగిలిన వాళ్ళకంటే ఎక్కువనుకునేదాన్ని..... మీ కన్నూ నా మీద పడిందన్న మాట. జేబులోంచి డబ్బు తీసి ఇయ్యటమెందుకని ఉద్యోగం ఎరగా చూపిస్తున్నారా! బాగుంది."
    విక్రం సహించలేకపోతున్నాడు. అందరిలోనూ , చివరకు తనలో తనకు కూడా నమ్మకం నశించిన అభాగ్య దశ. ఈ దశగా ఒక మానవ హృదయాన్ని తరిమికొట్టిందేవరు?
    ఆమె ఎదురుగా నిలబడడానికి , ఆమెతో మాట్లాడటానికి శక్తి చాలటం లేదు అతనికి....
    "మీరు తిరిగి మా హాస్పిటల్ కి నర్సుగా రావాలి. అందుకే వచ్చాను."
    ఆమె అతణ్ణి నిర్లక్ష్యంగా చూసి వెటకారంగా అంది.
    "ముందు మీరింత అనుగ్రహం నా మీద ఎందుకు చూపిస్తున్నారో చెప్పండి."
    "అనుగ్రహమా? నేను అనుగ్రహం చూపిస్తున్నానా? మీమీద ఆగ్రహం కాని, అనుగ్రహం కాని నాకెందుకూ?"
    ఆ మాటలు , ఆ మాటలు పలికే ముఖంలో అమాయకత్వం, ఆ కళ్ళలో నైర్మల్యం, నిండుగా నిలిచిన ఆ పూర్ణ వ్యక్తిత్వం, ఒక్కసారి ఆ కాళ్ళకు చుట్టేసుకుని కరువుతీరా ఏడవాలనే కోరికను బలవంతాన అణచుకుంది.
    "మరి నన్నెందుకు రమ్మంటున్నారు? నాతొ వ్యభిచరించిన ఎవడైనా నన్ను రికమెండ్ చేశాడా?"
    "మీతో వ్యభిచరించిన వాళ్ళెవరూ నాకు తెలియదు."
    ఆమె ఒక్కసారి తలెత్తి అతని ముఖంలోకి చూడలేక ఎటో చూస్తూ అంది .
    "మనసులో కూడా అనుకోలేక పోతున్నాను అయినా అడుగుతున్నాను. మీకే నా మీద కోరిక కలిగిందా? అయితే...."
    అతను అసహనంగా అడ్డు తగిలాడు.
    "ఏవేవో ఊహిస్తారు కాని అసలు కారణం అర్ధం చేసుకోలేరు . ఎందుకని!"
    "ఏమిటీ అసలు కారణం?"
    "నాకు మంచి నర్స్ కావాలి! నర్సుగా మీరు నాకు తెలుసు. అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను."
    "కానీ, నేను చెడిపోయినదాన్ని  మీకు తెలుసునా?"
    "నాకు చెడిపోవటం అంటే ఏమిటో తెలియదు!"
    కుసుమకు డాక్టర్ విక్రంను చూసిన మొదటి క్షణం నుంచి ఆరాధనా భావం ఉండేది. ఈ మాటలు వింటూనే లేచి వచ్చి అతని చేతులు కళ్ళకద్దుకుని "నేనిలా ఎందుకు తయారయ్యానో చెప్తాను వింటారా?" అంది.
    "ఎందుకు చెప్పడం? విని నేనేం చేస్తాను? అసహ్యించుకుని నన్ను నేను అవమానించుకోలేను. జాలిపడి నన్ను నేను హీనపరచుకోలేను."
    ఆమె కళ్ళలో కరుడుకట్టిన వ్యధ ఈ మాటలు వింటూనే కరిగిపోయి ఆ కళ్ళు తళుక్కుమన్నాయి.
    "అందుకే మీకు చెప్పాలనుకుంటున్నాను. నన్ను అసహ్యించుకున్నవాళ్ళు నాలో పగను రగిలించారు. నా మీద జాలిపడినవాళ్ళూ నాకు అస్తిత్వమే లేకుండా కుంచించుకు పోయేలా చేశారు. నన్ను నన్నుగా సాటి మనిషిగా చూస్తోన్న మీ ముందు నా మనసు విప్పుకోనీయండి. నాకోసం ..... నా మనశ్శాంతి కోసం...."
    "మీ ఇష్టం !"
    నిర్వికారంగా అతి మాములుగా ఉన్న విక్రం ముందు స్వేచ్చగా సహజంగా దొర్లిపోయాయి కుసుమ మాటలు.
    "అతి బీద కుటుంబం మాది. అన్నయ్యకు భార్య, ముగ్గురు పిల్లలున్నారు. కాని ఉద్యోగం ఊడింది. ముగ్గురు చెల్లెళ్ళున్నారు. నాన్నను పోగొట్టుకున్న అమ్మ ఉంది. ఒక్కసారి అన్నయ్య స్నేహితుడు నాతో అసభ్యంగా ప్రవర్తించబోతే చీదరించుకున్నాను. ఆ తరువాత మా అన్నయ్య .... సొంత తోబుట్టువు...."పెద్ద మనుష్యులతో అమర్యాదగా ప్రవర్తిస్తావా?' అని చెడామడా తిట్టాడు. ఆ తిట్లలో -- ఆ పెద్ద మనిషితో ఎలా ప్రవర్తించాలో .... ఎలా ప్రవర్తించాలని ఇంట్లో అందరూ అనుకుంటున్నారో అర్ధమయింది. కుటుంబంలో అవసరాలు, చిన్న పిల్లలు, ఆకలి ఏడ్పులు నన్ను ఆ పెద్ద మనిషి మీది నుంచి మరింత ముందుకు నడిపించుకుపోయాయి. నేను ఏ వేళ ఇంటికి వచ్చినా ఎవరూ ప్రశ్నించలేదు. ఎంత డబ్బు ఇచ్చినా ఎక్కడిదని అడగలేదు. ఆనందంగా తీసుకున్నారు. ఆదరంగా లాలించారు. ఎంతో గౌరవించారు. ఇదంతా నేను పోలీసులకు చిక్కనంత వరకూ..... పోలీసులకు చిక్కాను. ఆ తరువాత మరో రంగం ప్రారంభమయింది.
    "మాకు ఆడపిల్లలున్నారు నువ్వు మా ఇంట్లో ఉంటే వాళ్ళ గతేం కావాలి?" అనేసింది వదిన ముఖం మీద.
    "నాకు నువ్వొక్కదానివే కూతురివికాదు. అభం శుభం తెలియని నీ చెల్లెళ్ళున్నారు వాళ్ళ సంగతి కూడా ఆలోచించాలి" అంటూ నాన్చింది అమ్మ.
    ఆ ఇంట్లోంచి అన్ని రోజులుగా నా వాళ్ళు అనుకున్న ఆ వ్యక్తుల మధ్య నుంచి బయటపడ్డాను. చివరకు " కుమిలి కుమిలి ఏడవసాగింది కుసుమ.
    "ఏడవకండి ! చెయ్యవలసింది చెయ్యకుండా ఏడ్చేవాళ్ళంటే నాకు కోపం" కటువుగా అన్నాడు విక్రం.
    కుసుమ ఏడుపు ఆగిపోయింది. విక్రం ను ఆశగా చూసింది.
    "ఇప్పుడు నేనేం చెయ్యగలను?"
    "ఎవరు చెయ్యగలిగినదైన ఒకటే! మీ జీవశక్తి ప్రతిఫలించే మీ పనిలో మీ ఉనికిని సార్ధకం చేసుకోండి."
    "కాలం మించిపోయింది."
    "మన ముందున్నది అనంతమైన కాలం. కాలం మించిపోవటమనేది అసంభవం!"
    కుసుమ చిరునవ్వు నవ్వింది.
    "నన్ను డ్యూటీలోకి ఎప్పుడు రమ్మంటారు?"
    "ఆర్డరు అందగానే ! త్వరలోనే అందుతుంది."
    
                               27

    విక్రమ్ శశాంక దగ్గరకు వచ్చేసరికి అక్కడ సౌందర్య శంశాంకలు మాత్రమే కాక మిసెస్ కామేశ్వరీదేవిని చూసి "మీరు కూడా ఇక్కడ ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు మీ సహాయం కూడా కావాలి!" అన్నాడు.
    ఆ మాటలు వింటూనే సౌందర్య ముఖం పాలిపోయింది. శశాంక కళ్ళలో కుతూహలం కదలాడింది. విక్రంను చూడగానే చికాకుపడిన మిసెస్ కామేశ్వరీ దేవి మనసు పొంగింది.
    "ఆనాడు అంత పొగరుగా మాట్లాడవు. ఈనాడు నా సహాయం కోరటానికి వచ్చావన్నమాట!" హుందాగా అంది.
    "నేను పొగరుగా మాట్లాడలేదు. సూటిగా మాట్లాడాను. అలాంటి మాటలు వినటం అలవాటు లేని మీరా మాటలు పొగరుగా అర్ధం చేసుకున్నారు."
    "ఇంకా అలాగే మాట్లాడుతున్నావు!"
    "నేనెప్పుడూ సూటిగానే మాట్లాడతాను!"
    "నువ్వెరితో మాట్లాడుతున్నావో తెలుసా?"
    "మీ జీవితంలో ఇతరులు తప్పనిసరిగా తెలుసుకోవలసిన ప్రత్యేకమైన విషయాలేమైనా ఉన్నాయా?"
    సౌందర్య నవ్వేసింది. కామేశ్వరీ దేవి రగిలిపోయింది. కానీ ఆ సమయంలో బయట పడటం తనను తాను తేలిక పరుచుకోవటమే అవుతుందని గ్రహించగలిగే తెలివి తేటలు ఆవిడకున్నాయి. చిరునవ్వుతో అంది. "ఊహు! అలాంటివేమీ లేవులే! నేను అతి సామాన్యమైన దానిని. ఇంతకూ నీకు కావలసిన సహాయమేమిటి?"
    "కుసుమను తిరిగి మన హాస్పిటల్ లో నర్స్ గా తీసుకోవాలి!"
    "వాట్?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS