Previous Page Next Page 
తపస్వి పేజి 35


    సుధ చెక్కిట చెయ్యి చేర్చుకుని ఒక ప్రక్కకు వాలింది. సౌందర్య కళ్ళు చీత్కారం చేశాయి.
    ఆ తరువాత ఎవరో మహాకవి కావ్యపఠనం ప్రారంభించాడు.
    ఎవ్వరికీ ఏమీ అర్ధం కాలేదు. ఆవులింతలు వస్తున్నాయి. ఆ కవిత్వం ఏమిటి? దేనిని గురించి? అందులో అంతరార్ధమేమిటి? అని అడిగే సాహసం ఎవరికీ లేదు. అందులో చాలామందికి అక్కడి నుండి లేచిపోవాలని ఉంది. కానీ, లేవలేకపోయారు.
    సరిగ్గా ఆ సమయంలో ప్రేక్షకులలో ఎవరో "వవ్వా! శభాష్!" అన్నారు. అంతే! అప్పటి వరకూ లోలోపల విసిగిపోతున్న ప్రేక్షకులు ఒక్కసారిగా ఉత్సాహంగా "శభాష్! భలే! భలే! అని కేకలు వెయ్యసాగారు. ఊరికే విసుగ్గా కూచోవటం కంటే ఇలా కేకలు వెయ్యటం చాలామందికి బాగుంది! హాలంతా ప్రశంశాత్మక అరుపులతో దద్ద్రరిల్లిపోయింది. కవివరెన్యుడు ఆ రసిక శేఖరులని చూసి ఆనందించాడు.
    సుధ కళ్ళు చెమ్మగిల్లాయి.
    సౌందర్య ఫకాలున నవ్వింది.
    ఆ ప్రదర్శనలన్నీ ముగియగానే "సుధా! నీకు సిగ్గూ లేదు! ఇలాంటివాళ్ళ కోసమా , నువ్వు శ్రమపడుతున్నావు?" అంది సౌందర్య మండిపడుతూ.
    "సిగ్గెందుకూ? వాళ్ళ తప్పేముంది?"
    "మూర్ఖులు! తెలివన్నది లేనివాళ్ళు - ఆలోచన చెయ్యలేని వాళ్ళు .... ఇలాంటివాళ్ళని ఏం చెయ్యగలవు నువ్వు!"
    "ఏమైనా చెయ్యగలను!"
    "సుధా! అసాధ్యం! అసంభవం!"
    "సౌందర్యా! నువ్వన్నది కాదనను - 'మేధ ' సృష్టిలో చాలా అపురూపం. ప్రతి వారూ తమ మేధకు పదును పెట్టుకుంటూ జీవితాన్ని అర్ధం చేసుకోలేరు. అంత మాత్రాన సృష్టి మొత్తం వ్యర్ధమంటావా? ప్రాణికి మేధకు మించినది మరొకటి ఉంది. హృదయం .... ఆ హృదయాన్ని స్పృశించగలిగినప్పుడు ...... స్పందింపచెయ్యగలిగినపుడు నువ్వు చెయ్యలేని దేముంది?"
    "కానీ , హృదయాలను స్పృశించగలగటానికి కళ తప్ప మరో మార్గమే ముంది?"
    "అవును, మరే మార్గమూ లేదు."
    "అలాంటప్పుడు నీత్య జీవితంలో...."
    సుధ సౌందర్య ముఖంలోకి చూస్తూ సౌందర్యను గెలిచినట్లే నవ్వింది.
    "ఏం? సృష్టి మొత్తం కళా స్వరూపం కాదా? బ్రతకటం మాత్రం ఒక కళ కాదా?"
    
                                        24


    డాక్టర్ విక్రం ప్రయోగాలు మళ్ళీ సక్రమంగా సాగుతున్నందుకు సౌందర్య చాలా సంతోషించింది. ఎలా సాగుతున్నాయని ఎప్పుడూ ప్రశ్నించలేదు. ఎలా అయితేనేం? విక్రం పరిశోధన ముందుకు సాగి అతడు ఫలితాన్ని పొందటమే సౌందర్యకు కావలసింది.
    విక్రం తన ప్రయోగాల మీద వ్రాసిన పేపర్ ఒక మెడికల్ మాగజైన్ లో పబ్లిష్ అయింది. ఆ తరువాత దాని మీద ప్రశంసలు వచ్చాయి. డాక్టర్ కిరణ్ కుమార్, డాక్టర్ శ్రీ రాములు గారు - మొదలయినవాళ్ళంతా మెచ్చుకుంటూ ఉత్తరాలు వ్రాశారు. అవి చదివి అనందం పట్టలేకపోయింది సౌందర్య.... వెంటనే ఆ మాగజైన్ , ఆ ఉత్తరాలూ తండ్రికి చూపించింది. శశాంక గారు అది చదివి కూతురి ముఖంలోకి చూసి ఆలోచనలో పడిపోయి, "ఈ విక్రం నీకు తెలుసా అమ్మా!" అన్నారు.
    "చాలా కష్టపడి తెలుసుకున్నాను, నాన్నగారూ!"
    "ఎవరితను?"
    "ప్రతిభాశాలి! పరిశోధనాశీలి! తనను ఎదుర్కొంటున్న అజ్ఞానవాహినికి ఎదురొడ్డి నిలిచిన జ్ఞాని! ఎలాంటి ఆటంకాలలో నయినా తన పరిశోధన ఆపని స్థిర సంకల్పుడు - ఎవరికీ తలవంచని - ఎవరినీ ఆశ్రయించని ధీరుడు!"
    "ఇలాంటి వ్యక్తీ పరిశోధన ఫలించక ఏమవుతుంది?"
    "ఏమో నాన్నగారూ! ఎవరు చెప్పగలరు? ఇదివరలో ఎందరెందరు ఎన్నెన్ని విధాలుగా పరిశోధనలు జరపటానికి ప్రయత్నించలేదు? అందరూ ఫలితాలు పొందగలిగారా?"
    కొంత నిరాశగా పలికింది సౌందర్య.
    "ప్రయత్నించిన అందరూ ఫలితం పొందలేని మాట నిజమే కావచ్చు! కానీ ఇతనికి లభించిన ప్రశంసలు చూశావా? ఈ మెడికల్ మాగజైన్స్ సామాన్యులు చదవరు. అంచేత సామాన్యులలో ఇతని పేరు వెంటనే రాణింపుకు రాకపోవచ్చును. డాక్టర్ వామన్ కు వచ్చినట్లు అర్ధం లేని ఖ్యాతీ, గాలివాటుగా సంపదా రాకపోవచ్చు! కానీ మేధావుల మన్నన పొందిన ఇతని ప్రతిభ ఒక నాటికీ జగత్తుకే కళ్ళు జిగేల్ మానిపించి చిరస్థాయిగా నిలుస్తుంది ...."
    "కానీ అప్పటి వరకూ ఎదురు దెబ్బలకు తట్టుకుని నిలవాలి కదా! ఇంచుమించు ఇంతటి వ్యక్తిత్వమూ ఉండి..... అలా నిలవలేక జారిపోయినవాళ్ళెందరు?"
    సౌందర్య మాటలు తన మనసులో నిరంతరమూ పచ్చిగా ఉండే మానని గాయాన్ని తాకినట్టు కాగా తలవంచేసుకున్నాడు శశాంక.
    శశాంక బి.ఎ పాసయిన క్రొత్తలో ఆదర్శాలు రూపుకట్టిన మూర్తి ..... ఎంత ప్రయత్నించిన ఉద్యోగం దొరకలేదు.
    తను నమ్మిన ఆదర్శాలూ ..... విలువలూ.... వగయిరా.... వగయిరా..... ఎంత అర్ధ రహితమైనవో అర్ధమయ్యేసరికి మనోధైర్యం కరిగిపోలేదు కానీ మరో దూపం దాల్చసాగింది. ఏదో ఉక్రోషం.... కసి..... పెరగసాగాయి. తనను అవమానించి ఆదలించిన వారి మీద ఆధిపత్యం సాగించాలనే కాంక్ష ప్రబలింది. అడుగడుగునా ఎదురయ్యే అక్రమాలు, అవినీతి - వంచన - ఆత్మవంచన - అతడికి ఏ యూనివర్శిటీలోనూ నేర్పనంత విజ్ఞానాన్ని అందించాయి. బి.ఏ పాసయి ఒక కంట్రాక్టర్ ఆఫీస్ గుమాస్తాగా చేరవలసి వచ్చిన రోజున - బ్రతుకు తెలివికీ - యూనివర్శిటీ డీగ్రీలకూ సంబంధం లేదని తెలిసిపోయింది. సంఘాన్ని దాని ఆయుధంతోనే ఎదుర్కొనాలనుకున్నాడు. ఒకప్పుడు ఒక మార్గంలో ఉపయోగించిన తెలివి మరో మార్గంలో ఉపయోగించాడు. కాంట్రాక్టరు అయ్యాడు.డబ్బూ పలుకుబడి సంపాదించుకున్నాడు. సాధించాలనుకున్నవన్నీ సాధించాడు. కానీ ఒక్కటి .....తను అతి గాడంగా కోరుకుంటున్నది సౌందర్య అనందం. అది సాధించలేకపోతున్నాడు. తన సౌందర్య సంతృప్తిగా నవ్వలేకపోయిన తర్వాత తను సాధించినదంతా అర్ధరహితంగా బోలుగా కనిపించసాగింది.
    ఆరోజే విక్రమ్ ను వెతుక్కుంటూ వెళ్ళాడు శశాంక. విక్రమ్ ను చూడగానే శశాంక మనసు పొంగింది. ఏదో ఆవేదన కూడా కలిగింది.
    విక్రమ్ శాశంకను సాదరంగా ఆహ్వానించాడు.
    శశాంక చిరునవ్వు నవ్వుతూ "నేనెవరో తెలుసా?" అన్నాడు.
    "మా ఇంటికి వచ్చినవారు ..... ఆ విషయాలు చెప్పకుండా ఉంటారా?"
    "ఒకప్పుడు నిన్ను ఉద్యోగంలోంచి తొలగించినవాణ్ని."
    విక్రమ్ కు మొదటిసారిగా సౌందర్య తన దగ్గరకు వచ్చిన రోజు గుర్తుకొచ్చింది. అప్పుడు సౌందర్య పోలికలు శశాంకలో గుర్తించగలిగాడు. సౌందర్యలో ఉన్న తీక్షణత్వానికి మారుగా గడుసుతనం ముఖంలో ప్రతిఫలిస్తోంది. అంతే తేడా.
    "మీరు సౌందర్య తండ్రిగారన్నమాట! నన్ను వెతుక్కుంటూ వచ్చినందుకు సంతోషం!"
    "ఊరికే రాలేదు. నువ్వు మళ్ళీ ఉద్యోగానికి అప్లయ్ చెయ్యి. వేకెన్సీ ఉంది! నీకు నచ్చేలా చేస్తాను."
    "వద్దు! అక్కర్లేదు!"
    "అదేం? నన్ను ఆశ్రయించడానికి అభిమానపడుతున్నావా?"
    "భలేవారు! మీరు నన్ను ఆశ్రయించడానికి వచ్చి' పకపక నవ్వాడు శశాంక. అతని కళ్ళు ఉత్సాహంతో వెలిగాయి.
    "అంత అర్ధం చేసుకోగలిగిన వాడివి వద్దనటం దేనికి?"
    "మన మార్గాలు ఒకటి కాదు. నా మార్గంలో ఉన్న వ్యక్తులు నాకు సహకరించగలిగితే, ఆ సహకారాన్ని రెండు చేతులు జాపి అందుకుంటాను. కానీ మీరు నాకు సహాయం చెయ్యడానికి పూనుకోవడం వల్ల మనలో ఏ ఒక్కరికీ మేలు జరగదు!"
    "భయపడుతున్నావా?"
    "మీకోసం...."
    "అయితే ఫరవాలేదు. ఒక్కటి అర్ధం చేసుకో! ఒకనాడు నేను పొందాలనుకున్న దాని కోసం తీవ్రమైన పోరాటం ప్రారంభించాను. కానీ, మధ్యలో నేను దేనిని పొందాలనుకుంటున్నానో అది అసలు లేదేమోనని భ్రమ కలిగింది. పోరాటం ఆపేశాను. నా శక్తిని వివిధ మార్గాలలో ఉపయోగించి నా భ్రమ నిజమేనని ఋజువు చేసుకుంటూ నన్ను నేను ఒదార్చుకుంటున్నాను. ఇప్పుడు నిన్ను చూశాక - ఒకనాడు నేను దేనిని సాధించాలనుకున్నానో అది ఉందని ఆశ కలుగుతోంది. ఈ చరమ దశలో సహితం దాని కోసం నీ ప్రక్కన నిలబడి పోరాడాలనిపిస్తోంది. ఆ ప్రయత్నంలో ఇది వరకు నేను సాధించినవన్నీ సర్వనాశనమయినా ఫరవాలేదు."
    విక్రమ్ ఆలోచిస్తూ కూర్చున్నాడు. మాట్లాడలేదు. శశాంక విక్రంను చేతులు పట్టుకుని కుదుపుతూ "విక్రమ్! సే యస్! ప్లీజ్!" అన్నాడు.
    ఆ కంఠంలో అర్తికీ, ఆ కళ్ళలోని అరాటానికీ కదిలిపోయాడు విక్రమ్.
    'అల్ రైట్! అప్లయ్ చేస్తాను!"

                                     25


    మిసెస్ కామేశ్వరీ దేవి శశాంకకు ఫోన్ చేసింది. తన సహజమైన విలాసధోరణిలో కోమల స్వరంతో పలికింది.
    "మన హాస్పిటల్లో వచ్చిన ఆ వేకెన్సీకి మన కాండిడేట్ ఉన్నారు. పేరు కాంతారావు. మరచిపోకండి."
    శశాంక నవ్వి, "ఆ వేకెన్సీ కి "మాన కాండిడేట్ ' నే సెలెక్ట్ చెయ్యటం జరిగిపోయింది" అన్నాడు.
    "అదేమిటి ? నాకు తెలియకుండానే నిర్ణయం జరిగిపోయిందా? ఎవరతను?"
    "డాక్టర్ విక్రమ్!"
    "డాక్టర్ విక్రమ్! ఈ పేరు ఎక్కడో విన్నట్లు గుర్తుకొచ్చింది. ఆ! గుర్తుకొచ్చింది..... అతను.... అతనేనా?...."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS