మిసెస్ కామేశ్వరీ దేవి ఒక్కొక్క వాక్యమూ వామన్ మనసును చిత్ర విచిత్రంగా ఊపెయ్యసాగింది.
"అది కాదు! అది కాదు! సుధను నేను ప్రేమిస్తున్నాను" గట్టిగా అరిచాడు. బలహీనమయి ఊగిపోతున్న తన మనసుకు బలాన్ని అందిస్తున్నట్లు అరిచాడు.
మిసెస్ కామేశ్వరీ దేవి వెటకారంగా నవ్వింది.
"సుధను ప్రేమిస్తున్నావా? నేను నమ్మను. సౌందర్య పక్కన ఉండగా సుధను ప్రేమించే వెర్రెవాళ్ళు ఉంటారని ఒక్కనాటికీ నమ్మను."
"సౌందర్య .....సౌందర్య నన్నెందుకు అంగీకరిస్తుంది?"
మిసెస్ కామేశ్వరీ దేవి పెదవుల మీద విజయసూచకమైన చిరునవ్వు తళుక్కుమంది.
"ఎందుకు అంగీకరించదు? నీకేం తక్కువ? సౌందర్య లాంటి అందాల రాణిని నలుగురికీ నీ భార్యగా పరిచయం చేసుకోగలగడం ఎంత అదృష్టం! శశాంక గారు నీకు మావగారయితే సంఘంలో నీకు ఎడురేముందీ? అయినా అదంతా ఎందుకులే! నువ్వు సుదనే చేసుకో! సౌందర్యకు నిన్ను మించినవాళ్ళు ఎవరైనా దొరుకుతారు. పాపం, సుధను చేపట్టేవాళ్ళేవరు?"
వామన్ లో ఏదో సంక్షోభం మొదలయింది. నిలదొక్కుకోలేకపోతున్నాడు.
"సౌందర్య.... సౌందర్య నన్ను చేసుకుంటే "
"నువ్వు చాలా అదృష్టవంతుడివి!"
"మీరు చెప్పగలరా? ఆమె నన్ను అంగీకరించేలాగా చెయ్యగలరా?"
తన నోటి నుంచి వస్న్తోన్న మాటలు వింటూ తనే విస్తుపోతున్నాడు వామన్.
ప్రయత్నిస్తాను. శశాంక గారు నా మాట కాదనరు. సౌందర్య తండ్రి మాట కాదనదు. కాని నువ్వు సుదనే చేసుకో!"
"చేసుకోను! సౌందర్య నాకు దక్కితే అంతకంటే నాకేం కావాలి? మీ మేలు మరిచిపోను!"
"సరేలే! నీ కోసం ఏం చెయ్యటానికైనా నేను సిద్దమే!"
మిసెస్ కామేశ్వరీ దేవి గడపలోంచి అడుగు బయట పెట్టిన తరువాత "ఏం జరిగింది? ఏం చేశాను?" అనుకున్నాడు వామన్. ఒక్కసారి పునరాలోచించుకోవడానికి ప్రయత్నిస్తూ.
ఆమె తనను చేసుకోదు. చేసుకున్నా తను సుఖపడలేడు. ఆమె పట్ల తనకు పట్టరాని ప్రలోభం ఉన్నమాట నిజమే! కాని ఆమెను చూస్తేనే తనలో జవసత్త్వాలు నశించి పోతాయి. ఆ మూర్తి, ఆ వాక్కు, ఆ పరిహాసం ..... తనను ఊపిరాడనియ్యవు. మరి, ఎందుకు ....ఎందుకు ..... ఎందుకు ..... తను ఆమెను చేసుకుంటానని అన్నాడు?
రెండు చేతులతో కసిగా జుట్టు పీక్కున్నాడు వామన్.
మిసెస్ కామేశ్వరీ దేవి సౌందర్యకు విషయమంతా చెప్పింది.
"వామన్ తనే సుధను చేసుకోనన్నాడా? నేను నమ్మను. వామన్ సుధను ప్రేమిస్తున్నాడు" అంది సౌందర్య.
"ఆ! ప్రేమిస్తున్నాడు! ప్రేమ! ఇలాంటి వాళ్ళకా ప్రేమ! ఎన్ని జన్మలెత్తగలగాలి ప్రేమించడానికి? సుధను చేసుకుంటానని నన్ను అడగటానికి వచ్చి నిన్ను ఒప్పించమని బ్రతిమాలి వెళ్ళిపోయాడు."
విరగబడి నవ్వసాగింది మిసెస్ కామేశ్వరీ దేవి. సృష్టిలోని క్షుద్రత్వాన్ని చూసి రాక్షసత్వం పరహిస్తున్నట్లున్న ఆ నవ్వుకు చైతన్య మూర్తి అయిన సౌందర్య సహితం క్షణకాలం గడ్డ కట్టుకుపోయింది.
మిసెస్ కామేశ్వరీ దేవి నవ్వు ఆపి, "ఏం సౌందర్యా! నువ్వు వామన్ ను చేసుకో! అన్ని విధాలా మంచిది...." అంది.
"నేను చేసుకోను!"
"ఎందుకని?"
"వామన్ మీద దయ తలచి"
"నీకు అతని మీద ప్రేమ లేదా?"
"ఎవరి మీద నాకు ప్రేమ లేదు!"
"కానీ నువ్వు"
"అవును, అందరితోనూ కులాసాగా తిరుగుతాను!"
'అది మంచిదేనా?"
"నాకు మంచి చెడ్డలు , తప్పొప్పులు లేవు!"
"నిజంగా అలాంటివేవీ లేవా!"
"నాకు లేవు!"
"నాకు నిన్నోక్కటి అడగాలని ఉంది. ఊరికే తెలుసుకోవాలని."
"అడగండి!"
"అదే! అనేక మందితో .....ఆ శృంగార కార్యకలాపాలేలా ఉంటాయి?"
ఎంతో కుతూహలంతో జారిపోయిన చెక్కిళ్ళు ఎర్రబడుతుండగా ..... కళ్ళలో కడలేని కోరికలు కదం తొక్కుతుండగా .... ఆ ప్రశ్న అడిగిన కామేశ్వరీ దేవిని చూస్తూ కొన్ని క్షణాలు అలాగే నిలబడిపోయింది ఆమె.
"నన్ను క్షమించండి. ఆ ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేను. నా దృష్టిలో శృంగార సంబంధం కేవలం దైహిక సంబంధం కాదు! ఏదైనా ఒక తీవ్రమైన భావోద్వేగం.... అది ప్రేమ కావచ్చు.... ద్వేషం కావచ్చు.... ఈర్ష్య కావచ్చు..... వ్యక్తీకరించుకునే మార్గం..... అలాంటి తీవ్రమైన భావోద్వేగాలేవీ ఇంత వరకూ నాలో ఎవరూ రగిలింపలేకపోయారు. అందుకని నేనేం చెప్పలేను! అయినా మీకంత తెలుసుకోవాలని ఉంటే మార్గం లేకపోలేదు."
"ఏమిటది?"
"మీ దగ్గర చాలా డబ్బుంది. డబ్బు కోసం వచ్చే మగవాళ్ళు కూడా ఉంటారని విన్నాను. మీరు రకరకాల మనుష్యుల్ని పిలిపించి......"
"షటప్! ఎవరనుకుంటున్నావు నన్ను?"
"ఇప్పటికీ ఎవరో తెలుసుకోలేకపోతున్నాను. అయినా ఇందులో తప్పేముందీ? జ్ఞానోపార్జన! నిష్కామ కర్మ..... భగవద్గీత నలభయ్యో అధ్యాయంలో యాభై అయిదో శ్లోకంలో చెప్పినట్లు...."
"గెటవుట్!" అరిచింది కామేశ్వరీ దేవి.
పకపక నవ్వింది సౌందర్య.
23
అనాధశరణాలయానికి వార్షికోత్సవాలు ఏర్పాటు చేసింది మిసెస్ కామేశ్వరీ దేవి. ఆ ఏర్పాట్లు చూడటంలో మునిగి ఉన్న సుధ తన కోసం వచ్చిన సౌందర్యను చూడగానే ఆనందంతో తన పని చూసుకుంటూనే రా!" కూర్చో!" అంది.
ఏ పరిస్థితుల్లోనూ తన చేతులలో ఉన్న పని సుధ వదలదని సౌందర్యకు తెలుసు. అందుకే అక్కడే కూర్చుని సంభాషణ ప్రారంభించింది.
"వామన్ నిన్ను పెళ్ళి చేసుకుంటానని అడగటానికి మిసెస్ కామేశ్వరీ దేవి దగ్గరకు వేళ్ళాడట. చివరకు నన్ను తనతో పెళ్ళికి ఒప్పించమని బ్రతిమాలి వెళ్ళిపోయాడట."
సుధ చిరునవ్వు నవ్వింది.....
"ఇందులో ఆశ్చర్యమేముంది? నీ ప్రలోభాన్నుండి ఎవరు తప్పించుకోగలరు? నిన్ను అధీనం చేసుకోలేక నీకు దూరంగా ఉండలేక - నీ సౌందర్య జ్యాలలో పడి ప్రతి ఒక్కరూ శలభాలలా మాదిపోవలసిందే!"
"ఇప్పటికీ ఇంకా వామన్ ను ప్రేమిస్తూనే ఉన్నావా?"
"ఎందుకు ప్రేమించను?"
"నిన్ను కాదన్నవాడ్ని...."
"ఇవాళ కాదన్నాడు. రేపు వెతుక్కుంటూ వస్తాడు. ఆ రేపు పై నెల కావచ్చు.... పై సంవత్సరం కావచ్చు.... పై జన్మ కావచ్చు ..... కానీ రాక తప్పదు!"
"వామన్ లో నీకా విశ్వాసం ఉందా?"
"నా ప్రేమలో నాకా విశ్వాసం ఉంది. విశ్వాసం లేక ప్రేమ నిలవలేదు. ప్రేమ లేక నేను నిలవలేను. నేను నిండుగా బ్రతకటానికి..... ఈ సృష్టిలో అందాలన్నీ నావి చేసుకోవటానికి ఎలాంటి చికాకుల లోనూ సమాశ్వాసించగలిగే ఆనందాన్ని నాలో నిర్లిప్తం చేసుకోవటానికి నేను ప్రేమించకుండా ఉండలేను."
ప్రసన్న మందహాసంతో వెలిగే సుధను చూస్తూ సౌందర్య ఏమీ మాట్లాడలేదు....
వార్షికోత్సవాలు బ్రహ్మాండంగా ఏర్పాటు చేసింది మిసెస్ కామేశ్వరీ దేవి... వినోద ప్రదర్శనలకు జనం ఇసుక వేస్తె రాలకుండా వచ్చారు. సౌందర్య , సుధ ప్రక్క ప్రక్కనే కూర్చున్నారు.
రంగం మీద నటుడు హాస్యరసం ప్రదర్శిస్తానని చెప్పుకొని వచ్చాడు. రంగస్థలం మీద కొచ్చాడు. పిల్లి మొగ్గలు వేశాడు. వెకిలి వేషాలు వేశాడు. పిచ్చివాడిలా కూశాడు. పెద్ద పెద్ద పళ్ళాలలో తిండి పదార్ధాలు ఆబగా మెక్కుతున్నాడు.
జనమంతా ఏం చెయ్యాలో తోచక ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారు. ఆ రంగస్థలం మీద ప్రదర్శింపబడుతున్నది ఏమిటో, ఎందుకో, ఎవరికీ అర్ధం కాలేదు.
అంతలో ప్రేక్షకులలో నుండి ఎవరో ఎందుకో నవ్వారు. మిగిలిన వాళ్ళందరికీ ఏం చెయ్యాలో అర్ధమయిపోయింది. మరుక్షణంలో హాలంతా నవ్వులతో దద్దరిల్లిపోయింది. రంగ స్థలం మీద ప్రదర్శింపబడుతున్నది హాస్యంగా, ఆ నటుడు హాస్యనటుడుగా ముద్ర పడిపోయింది.
సౌందర్య సుధ ముఖంలోకి చూసింది. సుధ తలవంచుకుంది.
ఆ తరువాత నాటకం ప్రదర్శింపబడింది.
హీరోయిన్ జీవం చచ్చిన ..... అరిగిపోయిన ..... పడికట్టు రాళ్ళ తోటి స్లోగన్లు ఉద్రేకంగా చెప్పేస్తుంది. ఆ మాటలలో ఒక్కటీ తన హృదయాన్ని తాకకపోయినా, ఏ విధంగానూ ఎలాంటి స్పందనా కలిగించకపోయినా.... తరతరాలుగా వినటానికి అలవాటు పడిపోయిన ఆ మాటలు వింటూ ప్రేక్షకులు తన్మయులవుతున్నారు. ప్రతి మలుపూ సరిగ్గా తాము ఊహించిన విధంగానే వస్తున్నందుకు ఆనందిస్తూ ..... క్రొత్త క్రొత్త మలుపులతో తమ మేధకు పని చెప్పనందుకు రచయితను అభినందిస్తున్నారు. తమ అంతరంగంతో , తమ ఆలోచనలతో తమ చిత్ర విచిత్ర భావోద్వేగాలతో .... ఏ విధంగానూ ఏ సంబంధమూ లేకపోయినా, అలవాటు పడిపోయిన ఆ సన్నివేశ కల్పనలకూ ఎవ్వరికీ అర్ధం కాక, ఏ ఒక్కరూ ఆచరించక అందరూ గౌరవించే ఆ ధర్మసూత్ర ప్రవచానాలకూ ముగ్ధులయిపోతున్నారు.
