"నేను టైఫాయిడ్ కావచ్చని చెప్పినా, మిసెస్ కామేశ్వరీ దేవి వినిపించుకోలేదు. డబ్బు ఖర్చు పెట్టి మంచి డాక్టర్ ను పిలిపించటానికి ఆవిడ ఒప్పుకోవడం లేదు."
ఫకాలున నవ్వాడు డాక్టర్ విక్రం.
"అంచేత డబ్బియ్యకపోయినా వచ్చే చెత్త డాక్టర్ నని నా దగ్గరకు వచ్చారా?"
"కాదు, కేవలం డబ్బు కోసమే ఆశించకుండా నాకు సహకరించగల ఉన్నత పురుషులని వచ్చాను."
"నా ఔన్నత్యం మీకెవరు చెప్పారు?"
"ఆనాడు మిసెస్ కామేశ్వరీ దేవి ఉదారంగా అందించబోయిన క్షమను విదిలించగలిగిన మీ స్థయిర్యం వివరించింది."
"మీరు చెయ్యవలసింది ఇది కాదు. పై అధికారులకు మిసెస్ కామేశ్వరీ దేవి మీద రిపోర్టు చెయ్యాలి! ఈ అన్యాయాన్ని ఖండించాలి."
"నేను ఎవరి క్రింద పని చేస్తున్నానో వాళ్ళ మీద రిపోర్టు చెయ్యటం మాత్రం అన్యాయం కాదా? 'ఏది న్యాయం? ఏది అన్యాయం?' అని విచారించటం నా మతం కాదు. ఈ న్యాయాన్యాయాలు యెంత సంకీర్ణంగా ఉంటాయంటే ఒక దృష్టిలో న్యాయమని తోచింది మరో దృష్టికి అన్యాయంగా భాసిస్తుంది. నాకు కావలసింది నా సంరక్షణలో ఉన్న పిల్లల ఆరోగ్యం , వాళ్ళ అనందం, దాని కోసమే నా ప్రయత్నం .... మిసెస్ కామేశ్వరీ దేవిని శిక్షించే ప్రయత్నంలో ఆ పసికందు ప్రాణాలకే మోసం రావచ్చు. అప్పుడు నేను ఖండించగలిగిన అన్యాయం ఏముంటుంది? సాధించిన న్యాయం ఏపాటిదవుతుంది? నా మనసులో కక్ష లేదు. మమత మాత్రమే ఉంది. తర్కంతో నాకు నిమిత్తం లేదు. అన్ని తర్కాలకు అతీతమయిన ఆనందాన్ని సృష్టించుకుంటాను. లౌకిక ధర్మ సూత్రం సంక్షిప్తం కావచ్చు --- కాకపోవచ్చును. కానీ మానవత్వమే నా ధర్మం!"
సుధ మాటలు వింటున్న కొద్దీ తనకు అంతకు ముందు పరిచయం లేని మరో లోకమేదో తలుపులు తెరచుకుంటున్నట్లు అనిపించసాగింది విక్రంకి! కార్య దీక్షతో కరుడుగట్టిన అంతరంగాన్ని ఏవేవో ఆనంద తరంగాలు అర్ధం చేస్తున్నట్లనిపించింది. ఎందుకనో అతనికి వామన్ గుర్తుకొచ్చాడు.
"మీకు వామన్ తెలుసనుకుంటాను?"
"బాగా తెలుసు!"
"అతనికి మీమీద చాలా అభిమానం కదూ!"
సుధ చిత్రంగా నవ్వింది.
"దానిని ఏమంటారో నేను చెప్పలేను. కానీ నన్ను ఆశ్రయించినాక అతడు ఆనందాన్ని పొందలేదు. తనకు తానుగా సాధించలేని శాంతి సౌఖ్యాలను ఆ ఆనందంలో ప్రతిఫలింప చేసుకొని తృప్తి పడటానికి ప్రయత్నిస్తాడు."
"మరి మీరు వామన్ దగ్గరకే ఎందుకు వెళ్ళలేదు? మీ మాట కాదంటాడా?"
"ఏమంటాడో నేను అడిగి చూడలేదు. నన్ను ఆశ్రయించిన వాళ్ళకు నేనివ్వగలిగిన ఆనందాన్ని ఇవ్వటమే తప్ప నేను ఎవ్వరినీ ఆశ్రయించను."
"కొంపతీసి నన్నూ మిమ్మల్ని ఆశ్రయించమంటారా?"
"మీకు ఎవరి ఆశ్రయమూ అక్కర్లేదు. మీరు ఆనందాన్ని వెతుక్కోనక్కర్లేదు. అది మీలోనే ..... మీతోనే ఉంది. నిరంతారమూ జ్వలించే సౌందర్య తానుగా మీ సాన్నిధ్యానికి వచ్చింది. మరేం కావాలి మీకు?"
"సాన్నిధ్యానికి వచ్చింది కాని, స్వాధీనం కాలేదుగా!"
"ఆ ప్రయత్నంలో నేను మీకు సహకరించగలనేమో!"
"సౌందర్యను తెచ్చి నాకు అర్పించగలరా?" వెటకారంగా అడిగాడు విక్రమ్.
"ఉహు! అంత సూటిగా నేనేం చెయ్యలేను. నా సహకారం మీ ప్రయత్నానికి ఉపకరణం మాత్రమే అవుతుంది. నేను మీకిప్పుడు డబ్బియ్యలేను. కానీ ప్రఖ్యాతి తేగలను. అది మీ ప్రయోగాలు సాగటానికి ఉపకరిస్తుంది. మీ ప్రయోగాలు ఫలిన్చినపుడు మీరు సౌందర్యను స్వాధీనం చేసుకోగలరు!"
వెంటనే లేచాడు డాక్టర్ విక్రమ్.
"పదండి!" అన్నాడు.
ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకే విక్రమ్ ను వెతుక్కుంటూ వచ్చారు వేణుగోపాలరావు గారు!
"మీరేదో రీసెర్చ్ చేస్తున్నారనీ మెటీరియల్ దొరక్క అవస్థ పడుతున్నారనీ విన్నాను. మీకేవేవి కావాలో వ్రాసివ్వండి. నేను తెప్పించి ఇస్తాను." అన్నాడు .
ఆశ్చర్యంగా చూసిన విక్రమ్ చూపులకు సమాధానంగా నవ్వి "సుధ మా అమ్మాయికి చదువు చెపుతుంది. ఆవిడంటే మాకందరికీ గౌరవం. ఆవిడ మాట మీద విలువ. సుధ మీ గురించి చెప్పి వీలయితే సహాయం చేయ్యమంది. అందుకనే వచ్చాను."
"మీరు నాకు దానంగా ఏమీ ఇయ్యక్కర్లేదు!"
"ఇది దానం కాదు. పెట్టుబడి . సుధ మాటలను బట్టి మిమ్మల్ని అర్ధం చేసుకోగలిగాను. సహజమైన ప్రతిభ ఏ కారణాల వల్లనైనా కొన్నాళ్ళు వెలుగులోకి రాలేక పోవచ్చును. కానీ, ఏదో ఒకనాడు అది అందరి కళ్ళకూ మిరుమిట్లు గొలుపుతూ ప్రకశించక మానదు. ఆనాడు మీ పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. ఒకనాడు నేను మీకు సహకరించగలిగానని ఆనాడు నేను గర్వంగా చెప్పుకోవచ్చు!"
ఊపిరి బిగపట్టి విన్న విక్రమ్ ఒక్క నిట్టుర్పూ విడిచాడు.
"ఒకవేళ నేను గుర్తించబడకపోతే"
"అదీ అసంభవమేమీ కాదు. ఎందరెందరో మేధావులు ----- ప్రతిభా సంపన్నులు..... కాలపు ఇనుప చక్రాలలో నలిగిపోయి ..... మూర్ఖుల అవివేకాలకు బలి అయిపోయి నామరూపాలు తెలియకుండా నశించిపోతూనే ఉన్నారు. ఈ ఎదురీతకు తట్టుకునే మహా పురుషులు ఏ ఒకరిద్దరో ఉంటారు. తరువాత వారినే అందరూ భక్తితో అనుసరిస్తారు. ఇది సృష్టి పరిభ్రమణంలో నిత్య నూతనమైన సత్యం..... ఒకవేళ మీరు గుర్తించబడకపోతే నాకు నేనుగా ఏ ప్రయోగాలూ చెయ్యలేకపోయినా, ఒక సత్యన్వేషికి సహకరించగలిగాననే సంతృప్తి నాకు మిగులుతుంది.
విక్రమ్ ముందుకు వచ్చి వేణుగోపాలరావుగారి చెయ్యి తన చేతిలోకి తీసుకున్నాడు.
"మీలాంటివారి సహకారంతో కాని నా శ్రద్దాసక్తులు రాణించవు. నా శ్రమ ఫలించదు. ఇప్పుడే నాకు కావలసినవి వ్రాసిస్తాను. మీరు నా దగ్గరకు రావటమే నా అదృష్టం!"
వేణుగోపాలరావుగారు చిరునవ్వు నవ్వారు.
"మిమ్మల్ని కలుసుకోగలిగినందుకు నాకూ సంతోషంగానే ఉంది. కానీ ఒక విషయం మరిచిపోతున్నారు. నన్ను మీ దగ్గరకు పంపించింది సుధ."
22
వామన్ తనకే అర్ధం కాని ఒక అయోమయావస్తలో ఉక్కిరిబిక్కిరయి పోతున్నాడు. తనకు అన్నీ ఉన్నాయి. ఏమీ పొందలేకపోతున్నాడు.
ఐశ్వర్యం ఉంది. అనుభవించలేకపోతున్నాడు.
పేరు ప్రఖ్యాతులున్నాయి. అనందించలేకపోతున్నాడు.
ఉద్యోగం ఉంది. నిర్వహించలేకపోతున్నాడు.
సుధ కావాలి! సుధ తనదయితేనే కాని తనకున్నవేవీ ......ఉన్నాయని అనుకుంటున్నవేవీ తను అనుభవించలేడు.
సాహసించి ఈ విషయం మిసెస్ కామేశ్వరీ దేవి దగ్గర ప్రస్తావించాడు.
విషయం వింటూనే కామేశ్వరీ దేవి విస్తుపోయింది. మతి లేని వాడిని చూసినట్లు వామన్ ను చూసింది.
అయితే వామన్ భయపడినట్లు చిరాకు పడలేదు. మందలించనూ లేదు. ప్రసన్న మందహాసంతో "కంగ్రాచ్యులేషన్స్ !" అంది.
"నువ్వంటే నాకెందుకో చాలా అభిమానం! నువ్విలాంటి మంచిపని చేస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది."
వామన్ కు తల తిరుగుతున్నట్లనిపించసాగింది. ఏం మాట్లాడలేకపోతున్నాడు.
"సుధకేముందీ? అందమా? కులమా? డబ్బా?"
"కాని...."
ఏదో అనబోయాడు వామన్ -- వామన్ మాటలు జారనీయలేదు కామేశ్వరీ దేవి . తనే చెప్పుకుపోసాగింది.
"అయినా నువ్వు సుదనే చేసుకోవాలనుకుంటున్నావు. ఎంత ఉదారహృదయం నీది? సుధ నీ ప్రక్కన నడుస్తొంటే అందరూ నిన్ను చూసి ఆ అమ్మాయి అనాధ శరణాలయంలో పిల్ల పెద్ద రూపము. విద్య, ఐశ్వర్యము ఏమీ లేకపోయినా డాక్టర్ వామన్ గారు ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు అని నిన్ను గురించి గొప్పగా చెప్పుకుంటారు. ఈ వామన్ లో ఏం లోపం ఉందొ, లేకపోతే పోయిపోయి ఆ దిక్కు మాలిన దాన్ని ఎందుకు చేసుకుంటాడు?" అని చెప్పుకునేవాళ్ళూ ఉంటారనుకో! ఆ మాటలు లక్ష్య పెట్టక్కర్లేదు. సుధను సగర్వంగా "నాభార్య" అని ఎవరికీ చెప్పుకోలేవు. ఫరవాలేదు. సంఘంలో నీ అభివృద్దికి అండగా నిలవటానికి సుధ తరపు బంధువు లెవరూ లేరు. అయితేనేంలే! ఒక మంచి పని చేస్తున్నావు."
