Previous Page Next Page 
తపస్వి పేజి 32

 

    "డాక్టర్ వామనమూర్తి గొప్ప సర్జన్ అని నలుగురూ చెప్పుకుంటారు. అయన చేత ఆపరేషన్ చేయించుకుంటాను!"

                                      20


    విక్రమ్ రీసెర్చ్ చేస్తోంటే అప్పుడప్పుడు వచ్చి చూస్తూ కూర్చోవటం సౌందర్యకు అలవాటయిపోయింది. సౌందర్య విక్రమ్ తో ఏమీ మట్లాడదు. కానీ ఒకనాడు అతడన్న "మీరు రాగానే నా నిరుత్సాహం మాయమయినది. ఏదో క్రొత్త ఉత్సాహం కలిగింది. " అనే మాటలు మాత్రం అక్కడున్నంత సేపూ ఆమె మనసులో ప్రతిధ్వనిస్తుంటాయి.
    ఇటీవల కొద్ది కాలంగా అతడే ప్రయోగాలు చేయ్యటం లేదు . సౌందర్య రాకపోకలు గమనించనంత నిస్తబ్దంగా ఉండిపోతున్నాడతను. సౌందర్య నిగ్రహించుకోలేకపోయింది.
    "మీరు ప్రయోగాలు చెయ్యటం లేదా?"
    "మెటీరియల్ లేదు - డబ్బు లేదు....." బాధగానే అన్నాడు.
    "ఎందుకని? డాక్టర్ చంద్రమోహన్ గారిది బాగా రన్నింగ్ ప్రాక్టీస్ అని విన్నానే!"
    "అవును, కానీ నేను వాళ్ళను జబ్బుల నుండి బయట పడేయ్యాలని ప్రయత్నిస్తున్నాను. కానీ వాళ్ళకు ఆ జబ్బుల్లోనే ఏదో అనందం. అందుకని ......"
    "అనందం కాదు, అలవాటు! పరంపరగా వచ్చే భావాలకు భిన్నంగా ఊహించలేని అలవాటు! నలుగురిలో ఒకడుగా కాక సొంతంగా ఏదీ నిర్ణయించుకోలేని అలవాటు. ఈ అలవాటుకు బానిసలం మనమంతా."
    "ఆ బానిసత్వంలో నేను బ్రతకలేను. ఈ భాధలన్నింటికంటే ఆ బాధే ఎక్కువ నాకు."
    ఆమె కళ్ళు మెరిశాయి. కుతూహలంగా అడిగింది.
    "ఈ రిసెర్చి పట్ల మీ కేందుకంత ఆసక్తి?" కీర్తి కోసమా?"
    "కీర్తి కావాలని నాకు లేకపోలేదు. కానీ ఈ రిసెర్చ్ మానలేకపోతున్నది కీర్తి కోసం కాదు."
    "ప్రజాసేవ చెయ్యాలనా?"
    "ఒకళ్ళకు ఉపకారం చెయ్యగలిగితే చేస్తాను. కానీ, అది నా ఆదర్శం కాదు, నాకసలు ఆదర్శాలంటూ లేవు. ఎవరికో సేవ చెయ్యాలని నేనింత అరాటపడటం లేదు."
    "మరి ఎందుకీ ఏటికి ఎదురీత?"
    "ఎందుకంటె ఈ రీసెర్చ్ చేస్తున్నప్పుడే నా ఉనికికి ఒక అర్ధం కనిపిస్తోంది. ఈ ప్రయోగ ఫలితాలలోనే నా జీవితానికి వ్యాఖ్యానం ప్రతిఫలిస్తోంది. ఇందులో నన్ను నేను చూసుకుంటున్నాను. బహుశ అందుకు."
    ఆమె మనసులోని ఎన్నెన్నో ప్రశ్నలకు సమాధానం లభించినట్లయింది. విక్రమ్ మాటలు ఎవరికయినా, ఏ పనికయినా వర్తిస్తాయేమో! తమ ఉనికిని అర్ధం తమ పనిలో చూసుకోగలిగినపుడే ఆ పని సార్ధకమవుతుందేమో! కధల్లో నవలల్లో "సర్వ మానవ సౌబ్రాతృత్వం సాధించాలి! ఉన్నతాదర్శాలు ఉండాలి' ఇత్యాది చిలకపలుకులు తనకెందుకు పేలవంగా అనిపిస్తాయో అర్ధమయినట్లయింది.
    

                                 *    *    *

    జీవితంలో మొట్టమొదటిసారిగా హాస్పిటల్ లో అడుగుపెట్టింది సౌందర్య.
    ఆమెను చూడగానే విక్రమ్ ముఖం వికసించలేదు. పైగా ముడుచుకు పోయింది.
    అది గమనించిన ఆమె "న రాక మీకు ఇబ్బంది కలిగిస్తోందా?" అంది.
    "మిమ్మల్ని నా లాబ్ లో చూడటం ఎంత ఉల్లాసంగా ఉండేదో, ఈ హాస్పిటల్ లో చూడవలసి రావటం అంత చిరాగ్గా ఉంది. మీరు జబ్బు మనిషి కావటం నేను సహించలేను."
    ఆమె నవ్వి "సృష్టిలో ప్రతిదీ ఎప్పుడో ఒకప్పుడు జబ్బుపడక తప్పదు." అంది.
    "సౌందర్య జబ్బు పడదు! పడటానికి వీల్లేదు. ఒకవేళ ఏదైనా కాస్త అస్తవ్యస్తత వచ్చినా అదే సహజంగా సర్దుకుంటుంది. హాస్పిటల్లో మ్రగ్గటం, మందులు మ్రింగటం, సౌందర్యకు సంభవించే అవస్థ కాదు."  
    ఉద్రేకంగా అని తనను తాను నిగ్రహించుకుంటున్నట్లు కొన్ని క్షణాల్లో "ఏం జబ్బు ?" అన్నాడు యాంత్రికంగా.
    "తలనొప్పి! కళ్ళు మంటలు!"
    ఆమెను పరీక్షించి స్టేతస్కోప్ బల్ల మీద పడేసి కుర్చీలో వెనక్కు వాలి పకపక నవ్వుతూ "వాట్ ఎ రిలీఫ్ !" అన్నాడు.
    "రిలీఫ్! ఎందుకు?"
    "సౌందర్య ఎప్పుడూ జబ్బు పడదనే నా విశ్వాస్వాన్ని రుజువు చేసుకోగలిగినందుకు."
    "ఏమిటి మీ ఉద్దేశ్యం?" నేను...."
    "మీరు నన్ను అనుగ్రహించదలచుకున్నారని ..... ప్రస్తుతం నేను ప్రయోగాలు చెయ్యలేని దశలో ఉన్నమాట నిజమే! మీరు దానం చెయ్యదలుచుకుంటే ఎందుకు కాదంటాను? సరే! ఏ సహాయం చెయ్యదలుచుకున్నారో చెయ్యండి"
    బల్ల మీదుగా కొద్దిగా ముందుగు వంగి తన చెయ్యి జాపాడు విక్రమ్.
    విక్ర,మ్ ను చూస్తూ తనను తను మరిచిపోయింది ఆమె. ఏదో పారవశ్యంతో ఆ జాపిన చేతిలో తన చేతిని ఉంచింది. ఆ చేతిని మృదువుగా నొక్కుతూ "థాంక్స్ " అన్నాడు.
    మైకంలోంచి తెప్పరిల్లిన ఆమె తన చేతిని లాక్కుని అక్కడి నుండి పారిపోయింది.
    తను కూడా సిగ్గుపడింది - ఒక పురుషుని ముందు! తనను ఓదిగించుకోగలిగే ధీర వ్యక్తిత్వం కూడా సృష్టిలో ఉంది.
    ప్రయోగాలు చెయ్యటానికి డబ్బు లేక, చెయ్యకుండా ఉండలేక విక్రమ్ పడుతోన్న అవస్థ చూస్తూ సహించలేక పోయింది ఆమె. తను ఏ జబ్బు లేకుండా విక్రమ్ దగ్గరకు వెళ్ళీ లాభం లేదు. అంచేత వర్షంలో తడిసి తడి బట్టలతో ఉండి.... ఎంతో అవస్థ పడి జ్వరం తెచ్చుకుంది. ఆనందంతో హాస్పిటల్ కు వచ్చింది. విక్రమ్ ను విజయ సూచిక మందహాసంతో చూచి "నాకు జ్వరం ! రెండు రోజుల నుంచి" అంది సాధ్యమయినంత నీరసంగా.
    విక్రమ్ సమాధానం చెప్పలేదు. వెనుకటిలా చిరాకు పడనూ లేదు. ఆమెను చూస్తూ కూర్చున్నాడు.
    "ఎందుకలా చూస్తున్నారు? ఏమిటి మీ ఉద్దేశ్యం? నాకు జ్వరం లేదనుకుంటున్నారా?"
    "అనుకోవటం లేదు. మీ జబ్బు మీ ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఒక్క క్షణం ఉండండి."
    ఆ గది లోంచి వెళ్ళిపోయాడు విక్రమ్.
    విక్రమ్ తనకు చెయ్యబోయే ట్రీట్ మెంట్ ఎలా ఉంటుందా అని ఊహించటానికి ప్రయత్నిస్తోన్న ఆమె డాక్టర్ చంద్రమోహన్ రావటం చూసి తెల్లబోయింది.
    "మీరు....మీరు..... వచ్చారా?"
    "ఇలాంటి కేసులు తను ట్రీట్ చెయ్యలేనని డాక్టర్ విక్రమ్ నన్ను పంపించాడు. అతనో వింత మనిషి, ఏదీ టెంపరేచర్ చూడనియ్యండి."
    ఆశాభంగంతో వెంటనే ఏదీ మాట్లాడలేకపోయింది ఆమె.
    డాక్టర్ చంద్రమోహన్ ఆమె ధనవంతురాలని అర్ధం చేసుకున్నాడు. తనకు అలవాటైన ధోరణిలో ఎక్కడ లేని అరాతమూ ప్రదర్శించసాగాడు.
    "హమ్మ బాబోయ్! నూట నాలుగు డిగ్రీలుంది జ్వరం! మీరు జాగ్రత్తగా ఉండకపోతే కంప్లేకేషన్స్ లీడ్ చెయ్యొచ్చు. వెంటనే ...."
    "నాన్సెన్స్!"
    ఒళ్ళు మండిన ఆమె గట్టిగా విదిలించింది.
    విస్తుపోయి చూశాడు డాక్టర్ చంద్రమోహన్.
    "మేడమ్! మీకు...."
    శాంతంగా ఏదో చెప్పబోయాడు.
    విసురుగా లేచి నిలుచుంది ఆమె.
    "నాకే జబ్బూ లేదు. పువ్వులా ఉన్నాను. గుడ్ బై."
    కప్పుకున్న షాల్ కూడా అక్కడే పడేసి నూట నాలుగు డిగ్రీల జ్వరంతో చరచర నడిచిపోతున్న ఆమెను చూస్తూ తెల్లబోయి నిలబడిపోయాడు డాక్టర్ చంద్రమోహన్.
    "కంగ్రాట్యులేషన్స్!"
    విక్రమ్ కంఠస్వరం విని చటుక్కున ఆగిపోయింది ఆమె. రుసరుసలాడుతూ విక్రమ్ ముఖంలోకి చూసి విసురుగా తల తిప్పుకుంది.
    ఆమె దగ్గరగా వచ్చాడు విక్రమ్.
    "సౌందర్యా! నిన్ను చేరుకోవాలని తపస్సు చేస్తున్నాను. నువ్వే నాకు ఆటంకాలు కలిగించకు."
    ఉలిక్కిపడి అతని ముఖంలోకి చూసిన ఆమె ఆ కళ్ళలో ప్రతిఫలించే ఆత్మవిశ్వాసానికి ముగ్ధురాలై చిరునవ్వు నవ్వింది.

                                   21


    తన ఎదుట నిలిచిన సుధను చూసి కొంచెం ఆశ్చర్యంతో "మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుంది." అన్నాడు విక్రం.
    "నా పేరు సుధ. నేను మీకు ఆ మాత్రంగానైనా గుర్తుండటం నా అదృష్టం. నన్ను మిసెస్ కామేశ్వరీ దేవిగారింట్లో చూశారు."
    'అవును, గుర్తు వచ్చింది. అక్కడ ఎందుకున్నారు మీరు?"
    కొద్దిపాటి ఆశ్చర్యం విక్రం గొంతులో ....'అక్కడ' అనటంలో అతని ఉద్దేశం అర్ధమయింది సుధకు. నవ్వింది.
    "నేను ఎక్కడైనా ఉండగలను. ఆవిడ అనాధశ్రమంలో అనాధ బాలబాలికల సంరక్షణ చూస్తున్నాను."
    "ఓహో! ఏం పని మీద వచ్చారు?"
    "మా పిల్లల్లో ఒకరికి సుస్తీ చేసింది. టైఫాయిడ్ అని నాకు అనుమానంగా ఉంది. అది మిగిలిన పిల్లలకు కూడా వ్యాపిస్తుందేమోనని భయంగా ఉంది."
    "మిసెస్ కామేశ్వరీ దేవి నన్ను పిలిపించమన్నారా? ఆవిడకు నా మీద ఆ మాత్రం విశ్వాసం ఉందా?"
    "ఆవిడకు ఎవరిలోనూ విశ్వాసం లేదు. తన మీద తనకే విశ్వాసం లేదు. ఆవిడ మిమ్మల్ని పిలిపించమనలేదు. నేనే మీ కోసం వచ్చాను."
    "అదేం?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS