"మంచిదేగా!"
"నువ్వు ఇక్కడైనా నిలబడగలిగితే!"
"సార్! ఎక్కడైనా నేను నేనుగానే నిలబడతాను!"
"ఓ.కె. విక్రమ్. విష్ యు బెస్ట్ ఆఫ్ లక్!"
విక్రంను సాదరంగా ఆహ్వానించాడు డాక్టర్ చంద్రమోహన్.
"నా ప్రాక్టీస్ మరీ పెరిగిపోతుంది. అసిస్టెంట్ కావాలనుకుంటున్నాను. డాక్టర్ కిరణ్ కుమార్ నిన్ను తీసుకోమన్నారు. నేను ఆయన మాట కాదనలేను!"
ఒక రకమైన దర్జాతో గర్వంగా అన్నాడు చంద్రమోహన్. విక్రం మాట్లాడలేదు. డాక్టర్ చంద్రమోహన్ చెప్పిన దాన్లో అతిశయోక్తి లేదు. మహా ప్రవాహంలా కార్లు అతని హాస్పిటల్ ముందు ఆగుతూ ఉంటాయి. అతని రోగులు దీనంగా వడిలిపోయిన ముఖాలతో మూలుగుతూ ఉండరు. నలగని బట్టలతో, చెదరని చిరునవ్వులతో తమ జబ్బులు చెప్పుకుంటూ ఉంటారు.
ఖరీదైన కారులో వచ్చాడు ఒకాయన.
డాక్టర్ చంద్రమోహన్ ఆయనను విక్రమ్ దగ్గరకు పంపించాడు.
అతి మామూలు బట్టలతో ఉన్న విక్రమ్ ను చూడగానే ఆయనకు కొంత నిరసన భావం కలిగింది.
ఆయనకు విపరీతమయిన తలనొప్పి ఎప్పుడూ వస్తుందట!
"డాక్టర్ చంద్రమోహన్ గారి చెయ్యి చాలా మంచిది. ఆయన మందు తీసుకున్నప్పుడు కొంచెం తగ్గుతూ ఉంటుంది. కానీ మళ్ళీ వస్తూ ఉంటుంది" అన్నాడు అతడు.
డాక్టర్ విక్రమ్ ఆయనను పరీక్షించాడు. ఏ లోపమూ లేదు. పేషెంట్ ని ప్రశ్నించి తెలుసుకున్న దాన్నిబట్టి ఆయన అతిగా తింటాడని, అజీర్ణ రోగి అని...ఆ తలనొప్పి అజీర్తి వలన వస్తున్నదేనని అర్థం చేసుకున్నాడు.
"మీకు ఏ జబ్బూ లేదు. ఏ మందులూ అక్కర్లేదు. మీరు తిండి తగ్గించాలి! మీ జీర్ణశక్తి పాడవకుండా...అజీర్తి రాకుండా చూసుకోండి! తలనొప్పి అదే తగ్గిపోతుంది" అని చెప్పాడు.
ఆయన ముఖం చిట్లించుకుని వెళ్ళిపోయాడు.
కొంచెం సేపటికే డాక్టర్ చంద్రమోహన్ విక్రం దగ్గరకు వచ్చి నవ్వుతూ "డాక్టర్ విక్రమ్! ఇలా అయితే నువ్వు వైద్యం చేసినట్లే!" అన్నాడు.
"ఏం? నేను చెప్పింది తప్పా?"
"అక్షరాలా నిజం! కానీ ఆ నిజం చెప్పినంత మాత్రాన నువ్వు డాక్టర్ వి కాలేవు! ఒక్కటి గుర్తుంచుకో! నీ దగ్గరకు పేషెంట్ గా వచ్చిన వ్యక్తికి జబ్బేమీ లేదని ఎప్పుడూ చెప్పకూడదు. ఏదో ఒక పేరు పెట్టేయాలి! అతనికి జబ్బేమీ లేదని నాకు తెలియదనుకుంటున్నావా? కానీ ఏదో ఉందని అతననుకుంటున్నాడు, నువ్వూ అలాగే చెప్పాలి! ఏదో మందివ్వాలి. ఆ మందుకు అవి తినకూడదు- ఇవి తినకూడదు అని చెప్పాలి. అప్పుడు అజీర్తి తగ్గుతుంది- తలనొప్పి తగ్గుతుంది.
తాత్కాలికంగానే అనుకో! ఇలాంటి వాళ్ళకు నిగ్రహం ఉండదు. తమ ఆరోగ్యం తగలబడినా తిండి మానుకోలేరు. ఈ పేషెంట్ పుణ్యమా అని నేనెంత సంపాదిస్తున్నానో నీకేం తెలుసు?"
"జబ్బుల్ని తొలగించవలసిన మనం వాటిని కల్పించటమా?"
"మనం కల్పించటం లేదు- వాళ్ళు కల్పించుకుంటున్నారు. మనం కాదన్నా సహించరు. ఆ భ్రమలో నుండి వాళ్ళను తొలగించటానికి ప్రయత్నిస్తే మన మీద కూడా వాళ్ళకు విశ్వాసం ఉండదు. ఇవాళ ఆ పేషెంట్ నీ దగ్గర నుండి నా దగ్గరకు వచ్చాడు. నువ్వసలు డాక్టర్ వే కాదన్నాడు. నీకేం తెలియదన్నాడు. నిన్ను వెంటనే పంపెయ్యమని నాకు సలహా ఇచ్చాడు. నా దగ్గర మందు తీసుకుని తృప్తిగా వెళ్ళిపోయాడు."
విక్రమ్ నుదురు గట్టిగా పట్టుకున్నాడు.
"నా వల్ల కాదు- వాళ్లందరినీ అన్ని రకాల జబ్బుల నుండి దూరంగా ఉంచటానికే ప్రయత్నిస్తాను నేను!"
"గో టు హెల్!"
పకపక నవ్వుతూ వెళ్లిపోయాడు డాక్టర్ చంద్రమోహన్. మరొకసారి దగ్గర దగ్గర నలభై సంవత్సరాల వయసులో ఉన్నావిడ వచ్చింది- తనకెందుకో విపరీతంగా ఒళ్ళు వస్తుందని, తగ్గటానికి మందియ్యమని అడిగింది.
విక్రమ్ నవ్వి "నలభై దగ్గర పడే వయసులో కొందరికి సహజంగానే ఒళ్ళు వస్తుంది. ఆహారంలో నియమం పాటించి వ్యాయామం చేస్తే కొంత తగ్గుతుందేమో! దానికి మందేమిటి?" అన్నాడు.
ఆవిడ రుసరుసలాడుతూ వెళ్ళిపోయింది.
తర్వాత డాక్టర్ చంద్రమోహన్ వచ్చి నవ్వుతూ "విక్రం! నువ్వసలు డాక్టర్ గా పనికిరావోయ్!" అన్నాడు.
"ఎందుకు? ఆవిడ ఒళ్లు తగ్గటానికి మందియ్యలేకపోయినందుకా?"
"అలాంటి మందు ఎవరూ ఇవ్వలేరు- కానీ, నువ్వు ఆవిడ వయసు ఆవిడ మొహం మీదే చెపితే! ఆ ఒళ్ళు రావటం సహజం అంటే ఎలా భరించగలదు? నది వయసులో ఉన్న ఏ ఆడదీ తన వయసుని భరించలేదు. చిన్న వయసు- కన్నె వయసు- అందమైనవి ఫరవాలేదు. వృద్ధాప్యం అంగీకరించక తప్పదు. ఎటొచ్చీ ఈ ఎదురు పోరాటమంతా నడి వయసులోనే!"
"అవుననుకో! ఆ ఒళ్ళు తగ్గించే మందెక్కడ దొరుకుతుంది?"
"ఏదో ఒక మందు...లేకపోతే కలర్డ్ యాక్వా ఇచ్చేది, దానికి ఆహారంలో నియమం పాటించాలని చెప్పేది... నియమం పాటిస్తే ఒళ్ళు తగ్గుతుంది. కొంచెమైనా మన మందు గుణమిచ్చినట్లు...లేదా పత్యం చెయ్యలేదు గనుక మందు ఎఫెక్ట్ ఇవ్వలేదు! అంతే!"
విక్రమ్ మాట్లాడలేదు! అడుగడుగునా...అంతటా అన్ని రంగాలలోనూ ఎదురయ్యే ఈ మిథ్యా నాటకాల నుండి తనకు, తన వారికి విముక్తి ఎలాగో అతనికి అర్థం కావటం లేదు. డాక్టర్ చంద్రమోహన్ దగ్గరకొచ్చే పేషెంట్లందరూ ఇంచుమించు ఇలాంటి వారే! అతడు వేలాది రూపాయలు గడిస్తున్నది ప్రధానంగా ఇలాంటి వైద్యాల వల్లనే! ఒకసారి ఒక నడివయస్కుడు వచ్చాడు- కడుపు నొప్పి అని...ఇది వరకు ఒకటి రెండు సార్లు వచ్చిందట! డాక్టర్ చంద్రమోహన్ ఏదో మందిస్తే తగ్గిపోయిందట! విక్రమ్ అతడిని పరీక్షించాడు- అల్సర్ సంబంధమైనదేదో ఉన్నట్లు అభిప్రాయపడ్డాడు. ఆపరేషన్ వల్ల కాని అతనికి బాధ నుండి పూర్తిగా విముక్తి దొరకదు...
తన అభిప్రాయం డాక్టర్ చంద్రమోహన్ తో చెప్పాడు.
"అవును- నాకూ ఆ అనుమానం తోచింది" అన్నాడు చంద్రమోహన్.
"మరి, ఆపరేషన్ చేద్దామా?"
"అతని సంగతి నాకు తెలుసు. ఏమీ ఇచ్చుకోలేడు. మనకెందుకొచ్చిన బెడద? గవర్నమెంట్ హాస్పిటల్ కు పెంపెయ్యి. ఏదో మామూలు జబ్బే అని చెప్పు...లేకపోతే కంగారు పడతాడు."
"రాక రాక ఒక్క నిజమైన జబ్బు మనిషి వస్తే పంపెయ్యమంటారా?"
"పంపకపోతే పాటుపడు. నీ ఇష్టం! నీ ఓపిక!"
విక్రమ్ ఆ పేషెంటుని పిలిచి సాధ్యమయినంత నిదానంగా అతని జబ్బు గురించి చెప్పాడు- ఆపరేషన్ చేస్తే తప్ప ఆ బాధ నుండి విముక్తి ఉండదని కూడా చెప్పాడు...అతడు గడగడలాడాడు.
"మామూలు మధ్యతరగతివాణ్ని డాక్టర్ బాబూ! ఈ ఆపరేషన్లూ అవీ నావల్ల అవుతాయా?" అన్నాడు.
"డాక్టర్ చంద్రమోహన్ నీ పరిస్థితి చెప్పారు- భయపడకు! నేను నీ డబ్బుకు ఆశపడను. ఆపరేషన్ చేస్తాను."
"డాక్టర్ చంద్రమోహన్ బాబు ఆపరేషన్ చేస్తారా?"
"ఆయన చెయ్యరు. నేనే చేస్తాను."
అతను బితుకు బితుకుమంటూ చూశాడు. లోగొంతుకతో ప్రారంభించాడు.
"బాబుగారు ధర్మస్వరూపులు- ఇంతటి దయామూర్తిని నేనెక్కడా చూడలేదు!"
విక్రమ్ ఇబ్బందిగా నవ్వి "దానికేంలే! నా వృత్తి ధర్మం!" అన్నాడు.
"బాబుగారు మరోలా అనుకోనంటే నాదొక చిన్న మనవి!"
వినయంగా చేతులు నలుపుకుంటూ అన్నాడు.
విక్రమ్ ఆశ్చర్యంగా "ఏమిటీ?" అన్నాడు.
అతడు రెండు చేతులు జోడించి అన్నాడు-
"తమరు దేవతామూర్తులు- దయా స్వరూపులు! నాకు ఆపరేషన్ చెయ్యక్కర్లేదు! ఏదైనా కొంత ధనం సహాయం చెయ్యండి!"
"ధన సహాయం...దేనికి?"
"బాబుగారు క్షమించాలి!"
"చెప్పు!"
