"రామాయణ భారతాది పురాణాలు ఆ గ్రంథాల్లోని దేవదానవులలాగానే 'కామరూపు"లని ఒక విమర్శకుడన్నాడు-అంటే, ఎవరు ఏ విధంగా చెప్పాలనుకుంటే, ఆ రూపంలోకి ఒదిగిపోతాయి. ఒకరి చేతిలో "విషవృక్షం" అయింది. మరొకరి చేతిలో "కల్పవృక్షం" అయింది. ఇలాంటివే జానపద రామాయణ గేయాలు, విచిత్ర రామాయణం మొదలయినవి- మన దూరదర్శన్ సీరియల్ గా వస్తోన్న "జానకి రామాయణం" లో రామకథ ఎలా మార్పులు చెందుతుందో చూస్తున్నాం కదా!"
ఎవరూ మాట్లాడలేదు. వాదించటానికి, ఖండించటానికి ఏమీ లేదు.
సౌందర్య కల్పించుకుంది.
"సీత భూగర్భం నుండి ఆవిర్భవించింది' అనటానికి ఏదైనా అంతరార్థముందని అనుకుంటే, అదేమిటో పరిశీలించాలి. ఆ కోణం లోంచే మిగిలిన అన్ని విషయాలు ఏ దృష్టితో ఆవిష్కృతమయ్యాయో అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలి. శ్రీ భాష్యం అప్పలాచార్యులుగారు, ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారు, కొందరు విజ్ఞులైన ప్రవచనకారులు, రామాయణంలోని పాత్రలన్నీ ప్రతీకాత్మకాలని వ్యాఖ్యానించి నిరూపించే ప్రయత్నాలు చేశారు. ఆయా పాత్రల పేర్లకు ఉన్న వ్యుత్పత్త్యర్థాలే ఆపాత్రాల ప్రతీకాత్మకతను గుర్తించటానికి ఆధారాలని అన్నారు.
"శ్రీరాముడు సూర్య వంశపు రాజు. మనమంతా సూర్యవంశజులమే' అంటారు ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారు. సూర్యుని నుండే ప్రాణశక్తి వస్తుంది. ఆ ప్రాణశక్తి లేక సృష్టిలేదు. అయితే కేవలం ప్రాణశక్తి దేహ ధారణ చేసుకోవటం లేదు. అది భూ గర్భంలోకి ప్రవేశించి అక్కడి నుండి ఆకృతిని పొందుతుంది.
అలా సీత సకల జీవ ప్రకృతికి ప్రతీక. సీత అంటే నాగేటి చాలు (భూమి నుండి ప్రభవించిన మొట్టమొదటి ప్రాణి వృక్షం.)
'రామయతీతి రామః' అని రామ శబ్దానికి వ్యుత్పత్తి- ఏది అన్నింటి కంటే అత్యధికంగా ఆకర్షిస్తోందో ఏది అన్నింటికంటే ఆనందప్రదమో, అది 'రామమ్'. తెలిసో, తెలియకో జీవకోటి సమస్తము ఆనందానుభూతి కొరకే పరుగులు తీస్తుంది. దారి తెలియాలి కద! సీత జీవ కోటికి ప్రతీక- రాముడు ప్రాణ చైతన్యానికి అపూర్వ ఆనందానికి ప్రతీక. సీతారాముల కలయికే సృష్టి. భౌతికమయిన దేహధారణ, ఆంతరికమయిన ప్రాణ చైతన్య శక్తి..."
"హియర్! హియర్!..."
ఎవరో ఎగతాళిగా చప్పట్లు కొట్టారు.
సౌందర్య ఆగలేదు. "రామాయణంలో ఉన్న గొప్పతనం ఏమిటో గాని దానిని మళ్ళీ మళ్ళీ ఎందరు వ్రాశారో ఆ పేర్లను ఉపయోగించుకుని కథని మాత్రం ఎవరికి తోచినట్లు వాళ్లు వ్రాసుకున్నారు. సుధ అన్నట్లు ఇది 'వైర భక్తి' కావచ్చునేమో! ముఖ్యంగా జానపద రామాయణాలు. సీతమ్మ అత్తలకు సేవలు చేసి, ఇంటి పనులు చూసుకుని వచ్చేసరికి ఆలస్యమయిందట. రాముడికి కోపం వచ్చి తలుపు గడియపెట్టుకున్నాడుట! పాపం సీతమ్మ తలుపు బయట నిలబడి "అందరూ నవ్వుతారు, తలుపు తియ్యండి" అని బ్రతిమాలిందట..."
శ్రోతలంతా నవ్వారు. తప్పేముంది? జానపదుల దృష్టిలో ఏది ఆదర్శమో ఆ స్థాయిలో సీతమ్మని నిలిపి ఆనందించారు.
"సీత- ఇంటి పనులు...అత్తగారి సేవలు.." మళ్లీ మళ్లీ అంటూ నవ్వుకున్నారు అందరు.
ఇంచుమించు అలాంటివే అన్ని పాటలు..
"ఒక మహానుభావుడు- సీతా దేవి సిగరెట్టు" అని కథ రాశాడుట. రామ రావణుల మధ్య సంఘర్షణ సీతకి విసుగు తెప్పిస్తే సిగరెట్ వెలిగించుకుందిట..."
"ఛ! ఛ!"
"ఛ! ఆ మహానుభావుడి దృష్టిలో అది గొప్ప ఆదర్శం కావచ్చు."
రామాయణాన్ని కొందరు మార్క్సిస్ట్ దృక్పథంలో సహితం వ్యాఖ్యానించారు.
దక్షిణాపథంలో రావణుడు నియంతగా చిన్న రాజ్యాలన్నింటిని అణచి వేస్తే రామలక్ష్మణులనే ఇద్దరు వీరుల అక్కడి చిన్న చిన్న రాజులందరినీ వానర భల్లూకాది గిరిజన జాతులను ఏకం చేసి వారిలో భయం పోగొట్టి మూకుమ్మడిగా రావణుని ఎదుర్కొనేలా చేసి దక్షిణాపథాన నియంతృత్వాన్ని నాశనం చేశారు. ఇంచుమించు ఇలాంటిదే పరాశరుడు రాసిన విష్ణు పురాణాలలోని రామకథ.
వింటున్నవారిలో ఎక్కువ భాగం ఛీత్కారాలు చేశారు.
అంతలో పెద్ద చప్పుడయింది. లోపలి గదిలో ఎవరో దూకినట్లు చప్పుడు.
అందరూ ఒక్కసారిగా అదిరిపడ్డారు. డబ్బాల రేకులు ఇంకా గలగలా కదులుతున్నాయి. ఆ చప్పుడు పరమ వికృతంగా ఉంది.
"సీతా రాములు సాత్వికులైన పుణ్యమూర్తులు. కానీ, ఆంజనేయస్వామి అలా కాదు. తల్లి సీతమ్మని కాని రామయ్యని కాని విమర్శించినవాళ్ళని స్వామి క్షమించడు. ఆ స్వామి కోపమే ఇది..." పాలిపోయిన ముఖంతో లెంపలు వేసుకుంటూ అంది ఒకావిడ. అంతే కాదు "మీరేమయినా అనుకోండి. నేను వెళ్లిపోతున్నాను" అని లేచి గుమ్మం వైపు నడిచింది.
"నేను వెళ్తున్నాను. నాకు పనుంది. కథల్లో ఎన్ని విప్లవాలు చూపించినా ఇంట్లో చచ్చినట్లు పతివ్రతలం కావలసిందే. నేనింకా ఉంటే మా ఆయన మొత్తుకుంటాడు" అని మరొకావిడ లేచింది. మరొకరు..మరొకరు...మరొకరు... చాలావరకు హాలు ఖాళీ అయింది.
హేతువాదినని చెప్పుకుంటున్న ఒకామె లేచి "లోపలకు వెళ్ళి చూద్దాం రండి" అంది.
మరొకామె వెంట బయలుదేరింది. గది తలుపు తెరవగానే ఏదో చల్లటి గాలి సోకినట్లయింది. చిమ్మ చీకటి...ఆవిడ వెంటనే అడుగు వెనక్కు వేసి "నేను దేవుళ్ళను నమ్మను. కానీ, చీకటి అంటే భయం..." అంది.
రెండో ఆవిడ "అవును, పురుగు పుట్రా ఉండొచ్చు" అంది.
కామేశ్వరీదేవి ఇంట్లో పురుగు- పుట్ర....ఎంత అశుభం..చీకటి దేనినీ ఆలోచించనియ్యదు.
ఇద్దరూ బయటకు వచ్చేశారు. "అక్కడ మాకు ఏమీ కనిపించలేదు" అన్నారు.
"స్వామి అందరికీ కనిపించరు" అంది నుదుటి మీద రెండు బొట్లు పెట్టుకున్న భక్తురాలు.
మొత్తం మీద అందరూ వెళ్ళిపోయారు. సుధ, సౌందర్య, కామేశ్వరీ దేవి, విక్రమ్ మాత్రం మిగిలారు.
"ఈ రోజు ఉదయం లేచి ఎవరి ముఖం చూశానో, ఇలా జరిగింది. ఏం చెయ్యను?" ముఖానికి పట్టిన చెమట తుడుచుకుంటూ దిగాలుగా అంది కామేశ్వరీదేవి.
"దిగులుపడకండి. ఆంజనేయస్వామికి వడమాల వేయిస్తానని మొక్కుకోండి" అంది సౌందర్య.
"థాంక్యూ సౌందర్యా! మంచి ఆలోచన. సుధా! ఆ ఏర్పాటు చూడు. నేనిప్పుడే కాస్త ఫ్రెష్ అయి వస్తాను" అంటు లేచింది. ఆవిడ గంటకొకసారి ఫ్రెష్ అవుతూ ఉంటుంది.
"సుధా! ఆ చప్పుడేమిటి?" అడిగాడు విక్రమ్.
"అది స్టోర్ రూమ్. అక్కడ లైట్ లేదు. పిల్లి పిల్లల్ని పెట్టింది. ఆ పిల్లి డబ్బాల మీది నుంచి దూకి ఉండవచ్చు!"
సోఫాలో వెనక్కు ఒరిగి పకపక నవ్వాడు విక్రమ్. ఆ నవ్వు చూస్తూ ఉండిపోయింది సౌందర్య.
విక్రమ్ ని బలహీనుడిని చేసి ఏడిపించాలని చూసింది సమాజం. సమాజంలోని మూర్ఖత్వాన్ని చూసి విరగబడి నవ్వుతున్నాడు విక్రమ్.
సమాజం విక్రమ్ ని అణిచేస్తుందా? లేక విక్రమ్ తానే సమాజాన్ని ధిక్కరించి సాటిలేని ధీరుడయి నిలబడతాడా?
19
డాక్టర్ విక్రమ్ ఎంత ప్రయత్నించినా మరో ఉద్యోగం దొరకలేదు. ఆ ఊరు వదిలి మరో ఊరు వెళితే దొరికేదేమో! కానీ ఈ లాబ్...తన రీసెర్చ్... రీసెర్చ్ కి మెటీరియల్ కొనటానికి డబ్బు లేదు. తన తల్లి వసుంధర ఇల్లు ఎలా గడుపుతుందో అతనికి తెలియటం లేదు. కుట్టుమిషన్ మీద తల్లి పని చెయ్యటం చూశాడు. లోలోపల చాలా బాధపడ్డాడు. అలాంటి సమయంలో డాక్టర్ కిరణ్ కుమార్ వచ్చాడు.
"విక్రమ్! డాక్టర్ చంద్రమోహన్ దగ్గర అసిస్టెంట్ గా ఉంటావా?" అన్నారు.
ఎలాంటి ఆఫర్ అయినా ఒప్పుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు విక్రం.
"తప్పకుండా ఉంటాను సార్! థాంక్యూ వెరీమచ్!"
"అతనికి మంచి పేరు, రన్నింగ్ ప్రాక్టీస్ ఉన్నాయి. అతని పేషెంట్స్ చాలా గొప్పవాళ్లు."
