Previous Page Next Page 
ముక్తేవి భారతి కథలు పేజి 2


                       మంచు మండింది
    కాలింగ్ బెల్ మోగడంతో పేపరులోంచి తలెత్తి గుమ్మంవైపు చూసింది రాజ్యలక్ష్మి. గుమ్మంలో కునికిపాట్లుపడుతున్న వెంకటమ్మ గబుక్కున లేచి తలుపు తీసింది.
    ఓ పధ్నాలుగేళ్ళ కుర్రాడు, చేతిలో రెండు పుస్తకాలతో, ముఖాన్న పడుతున్న జుట్టు పక్కకు తోసుకుంటూ_
    "నమస్కారమండీ" అన్నాడు. 'వీడూ ఇదేబాపతు' అనుకుని రాజ్యలక్ష్మి కుర్రాడికేసి చూస్తూ.
    "టెన్త్ క్లాసు చదువుతున్నానండి."
    "ఊ"
    "భోజనానికి.........' నసిగాడు కుర్రాడు.
    "ఊ" అంది రాజ్యలక్ష్మి అతనికేసి చూస్తూ.
    సమాధానంలేదు. ఓ క్షణం ఆగి,
    "ఏం చేయమంటావ్- భోజనం పెట్టాలి నీకు- అంతేనా?" రాజ్యలక్ష్మి మాటలకి వంచినతల ఎత్తి "అబ్బే కాదండి- ఈరోజు కాదు- ఈ రోజు ఎదిరింటి మేడవాళ్ళ దగ్గర కుదుర్చుకున్నానండి- కానీ-" కుర్రాడు గొణిగాడు.
    "ఒక్కమాటలో చెప్పేయ్- నీకేం కావాలో." కుర్చీలోంచి లేచి రాజ్యలక్ష్మి కిటికీ దగ్గరకెళ్ళి నిలబడింది.
    కుర్రాడి మనసు బాధగానే వుంది. కానీ, ప్రస్తుత పరిస్థితులలో తప్పదు. ఒక్క నిముషం అలాగే నిలబడ్డాడు మాట్లాడకుండా. రాజ్యలక్ష్మి ఒక్కసారిగా_
    "ఊఁ చెప్పు" కసిరింది కుర్చీలో కూర్చుంటూ.
    "నేను వారాలు చేసుకుని చదువుకుంటున్నాను. నాకు రెండు రోజులకి ఇళ్ళు కుదరలేదు. అ మేడమీద వాళ్ళు మీరెంతో మంచివారని, ఎందరికో ఇలా సహాయం చేస్తుంటారని చెప్పారు. ఈ పదో క్లాసు పాసయి చిన్న నౌకరీ సంపాదించుకుని నా బతుకు నేను బతకాలని...." కుర్రాడు ఆగాడు. తలొంచుకున్నాడు.
    "చూడు బాబూ! నువ్వు చెప్పినట్టుగ నేను చాలా మంచిదాన్నే. నా మనసు ఇంకా చాలా మంచిదే. కానీ, ఎందుకీ మంచితనం? కాల్చనా?" కుర్రాడు బెదిరిపోయి చూస్తున్నాడు రాజ్యలక్ష్మి వైపు.
    "నీకు ఈ రోజు కడుపునిండా అన్నం పెడతాను, తింటావు. అంతేనా?" రాజ్యలక్ష్మి కుర్రాడి కళ్ళలోకి చూసింది.
    "కాదండి, బతుకున్నంతకాలం మీ పేరు చెప్పుకుంటాను."
    రాజ్యలక్ష్మి కళ్ళు ఎర్రపడ్డాయి.
    "అందుక్కాదు నీకు పెట్టేది." రాజ్యలక్ష్మి మాటలు ఆపి కుర్చీలోంచి లేచింది.
    "నీకు ఒక్క రోజు కాదు - రోజూ అన్నం పెట్టగలను. పెద్ద చదువు చెప్పించగలను. నీకు ఉద్యోగం ఇప్పించగలను." కుర్రాడి కళ్ళలో చిన్న వెలుగు, కానీ మరోక్షణంలో_
    "కానీ నేనేమీ చేయను. వెళ్ళు, బయటకెళ్ళు" రాజ్యలక్ష్మి మాటలకి నిర్ఘాంతపోయాడు కుర్రాడు.
    "నేను మీరనుకొనేటటువంటి వాణ్ణి కానండి. మీరు చేసే సాయం మరచిపోయే విశ్వాసఘాతకుణ్ణి కానండి." కుర్రాడు ఏదో అంటున్నాడు.
    అలాగే పదేళ్ళనాడు తన దగ్గరకొచ్చిన ప్రకాష్ కళ్ళముందు కదలాడాడు. తనే చదువు చెప్పించి, బట్టలిచ్చి, తిండిపెట్టి ఆరేళ్ళు పోషించింది. ఆ తర్వాత ఒక ఆఫీసులో చిన్న ఉద్యోగం వేయించింది. అంతే, ఈరోజు తనెలా వుందో, బతికిందో, చచ్చిందో కనుక్కోవాల్సిన అవసరంకూడా లేదు. అతడెక్కడున్నాడో తెలియజేయాల్సిన అవసరం కూడా లేదు. రాస్కెల్స్! మంచితనం!! రాజ్యలక్ష్మి కళ్ళు నిప్పులు కురుస్తుంటే, ఎదురుగా నిలబడ్డ కుర్రాడు పరమ దుర్మార్గుడిలా అనిపించాడు.
    "ఐ సే యు గెట్ అవుట్!" రాజ్యలక్ష్మి గొంతు ఒక్కసారి దద్దరిల్లింది.
    "వెళ్ళు బాబూ, వెళ్ళు." కుర్రాడిని బయటకి పంపి తలుపు వేసింది వెంకటమ్మ.
                                           *    *    *
    రాజ్యలక్ష్మి సహజంగా చాలా మంచిది. ఎవరి కష్టాల్ని చూడలేదు. చాలా చిన్నతనంలో తండ్రి మరణిస్తే ఇద్దరి చెల్లెళ్ళని, తమ్ముణ్ణి ఓ దారికి తెచ్చి, చదువులు చెప్పించి, పెళ్ళిళ్ళు చేసింది. రాజ్యలక్ష్మికి పిల్లలంటే చాలా ఇష్టం. పిల్లలు పరమాత్మ స్వరూపులని, పాపం పుణ్యం తెలియని పసివాళ్ళని గట్టి నమ్మకం రాజ్యలక్ష్మికి.
    రాజ్యలక్ష్మికి ఎందరో అడుగుతుంటారు - "మీరెందుకు పెళ్ళి చేసుకోలేదు? పోనీ, ఇప్పుడెందుకు చేసుకోకూడదూ?" అని. రాజ్యలక్ష్మి నవ్వుతుంది. "ఏం నేను పెళ్ళిచేసుకోకపోతే ఏం? ఎందుకు మళ్ళా కొత్త అనుబంధాలు? నాది అనేవి ఎందుకూ?" అంటుంది నవ్వుతూనే.
    రాజ్యలక్ష్మి ఉద్యోగంలో స్థిరపడిపోయిన తర్వాత ఎందరెందరో తెలిసినవాళ్ళు, తెలియనివాళ్ళు ఆమెకు ఆత్మీయులయ్యారు. తను సంపాదించిన డబ్బు ఎవరిమీద ఎలా ఖర్చుచేసినా అడిగేవాళ్ళు లేరు. అయినా, పైసా పైసా కూడబెట్టి ఏం చెయ్యాలి? అందుకే రాజ్యలక్ష్మి ఎక్కడ ఎవరు ఇబ్బంది పడుతున్నారన్నా డబ్బు సహాయం చేస్తుంది. మనిషి సహాయం కావాల్సివచ్చినప్పుడు తనే స్వయంగా చేస్తుంది. అలాగేకదూ పక్కవాటాలో వున్న ఇందిరతో స్నేహం పెరిగింది!
    ఇందిరకి ముగ్గురాడపిల్లలు, మూడోపిల్ల పురిటికి ఇందిరకి చాలా సుస్తీ చేసింది. రాజ్యలక్ష్మి హాస్పిటలుకు వెళ్ళడం, కారియర్ తనే సిద్ధం చేయడం, పిల్లలకి అన్నాలు పెట్టడం - ఇలాటివెన్నెన్నో చేసింది. అంతే కాదు, ఇందిర చిన్నకూతురు చిట్టితల్లి అంటే మరీ చనువు ఎక్కువయింది. ఆ పిల్ల రాజ్యలక్ష్మిని వదిలేదికాదు. రాజ్యలక్ష్మి ఆఫీసునించి వచ్చి తలుపు తీయటం ఆలస్యం. చిట్టితల్లి గబగబా లోపలకొచ్చేది, తను తెచ్చిన బిస్కట్లు, చాక్లట్లు తింటూ కబుర్లుచెప్తూ కూచునేది చిట్టితల్లి. 
    రాజ్యలక్ష్మి దొడ్లో ఎన్నో పూలమొక్కలున్నాయి. ఎన్నోసార్లు చిట్టితల్లికి పూలజడలు కుట్టింది. ఓరోజు "ఈ పూలు మీ అమ్మకిచ్చి పూలజడ కుట్టించుకో- నాకు ఒంట్లో బాగాలేదు" అంది రాజ్యలక్ష్మి. చిట్టి తల్లి ఇంట్లోకెళ్ళి మళ్ళా వచ్చింది.
    "మా అమ్మకి రాదంట- నిన్నే అల్లమంది."
    "ఏమిటీ- పూలజడ అల్లటంరాదూ?" అంది రాజ్యలక్ష్మి కాస్త విసుగ్గా.
    'వచ్చనుకో- అయినా అమ్మకి ఇలాటి పనులు బోరంట- అమ్మ చెప్పింది.'
    'ఆహా!' రాజ్యలక్ష్మికి ఓపిక లేకపోయినా చిట్టితల్లికి జడకుట్టి పంపింది.
    రాజ్యలక్ష్మికి చిట్టితల్లి బాగా అలవాటయింది. ఆ పిల్ల ఓ పూట కనిపించకపోతే తోచేదికాదు. ఆ పిల్లకోసం పండక్కి గౌన్లు కొనేది. బజారు నుంచి ఎన్నెన్నో తెచ్చి పెట్టేది.
    ఓ రోజు, 'ఆంటీ' అంటూ చిట్టితల్లి గుమ్మంలో కొస్తూ 'అమ్మ వచ్చింది' అంది నెమ్మదిగా. సాధారణంగా ఇందిర లోపలికిరాదు. చాలా ముభావంగా వుంటుంది.
    'మా పాప ఆంటీ ఇంటికి రమ్మని ఒకటే గోల. నాకు ఎవరింటికి రావాలనిపించదు' అంది ఇందిర హాలంతా కలయచూస్తూ. పదినిముషాలు కూచుని ఇందిర వెళ్ళిపోయింది. అ తర్వాత వారం రోజులకి ఇందిర తండ్రి ఊరినించి వచ్చాడు.
    "మా తాతయ్య ఆంటీ" అంది చిట్టితల్లి తాతయ్యని లోపలకి తెస్తూ.
    తాతయ్య ఆ కబుర్లు ఈ కబుర్లు అడుగుతూ, "మా అమ్మాయి రాసింది - చిట్టి తల్లంటే మహా ప్రాణమని మీకు. మీరు చాలా మంచివారని అమ్మాయి చెప్తూ వుంటుంది - లేకపోతే మీరూ ఒక్కరే అయిపోయారు. అదే - ఈ పిల్లదాన్ని మీ దగ్గరే వుంచుకుంటే - ఇంకా ఇద్దరాడపిల్లలు ఉన్నారు కదా దానికి....అని -" తాతయ్య నసుగుతున్నా మాటలు సగం అర్థం అయి, సగం అర్థం కాక నివ్వెరబోయింది రాజ్యలక్ష్మి.
    "అంటే - మీ ఉద్దేశం?"
    "ఆ ఏముంది - ఆ తండ్రి చిన్న సంపాదనలో ముగ్గురాడపిల్లల్ని ఎలాగూ ఓ దారికి తేలేడు. మీకూ ఓ కష్టం సుఖం చెప్పుకుందుకు, కాలికి చేతికి సాయంగా ఉంటుంది కదా అని అమ్మాయి, అల్లుడు అనుకుంటున్నారు" అన్నాడు. అభిప్రాయం అర్ధమయిపోయిన రాజ్యలక్ష్మి మనసు భగ్గుమంది.
    'తను పెళ్ళిచేసుకోదు - తను సంపాదించే ఈ డబ్బు, ఈ ఇల్లు - అన్నీ ఎవరికివ్వాలా అని తన తరపున - వాళ్ళే ఆలోచిస్తున్నారన్నమాట! చిట్టి తల్లిని ముద్దుచేయటం చిన్నపిల్లగానే కానీ - రాజ్యలక్ష్మి తల తిరిగిపోయింది - మనిషికి స్వార్థమో, వంచనో, ద్రోహమో ఏదో ఒకటి ఉండి తీరాలన్న మాట! మొదటిసారిగా తను ఒంటరిది అనే విషయం వీళ్ళు జ్ఞాపకం చేసారే - మతే చిట్టితల్లిని కూడా వాళ్ళే ప్రోత్సహించి పంపుతున్నారన్నమాట!  
                                            *    *    *
    ఆదివారం పొద్దున్నే తాతయ్య ఊరెళ్ళిపోయాడు. చిట్టితల్లి, ఇందిర గదిలోంచి బయటికి రాలేదు.
    "పిల్లను పంపమన్నారు అమ్మగారు - పూలజడ కుడ్తారంట!" వెంకటమ్మ ఇందిర గుమ్మంలో నుంచుంది.
    "జ్వరంగా ఉందని చెప్పు-దిక్కుమాలిన కళ్ళు ఎవరివి పడ్డాయో!" దభీమని తలుపేసింది ఇందిర. ఆ తర్వాత చాలారోజులు చిట్టితల్లి రాజ్యలక్ష్మిని తప్పించుకు తిరిగింది. రాజ్యలక్ష్మి మంచులాంటి మనసు భగభగ మండిపోతూంది. ఆ ఇంట్లో తను ఒంటరిగా అయిపోయినట్లు అనుకొంటూ నీళ్ళు నిండిన కళ్ళు రహస్యంగా తుడుచుకుంది. పిలిచినా వినిపించనట్టు వెళ్ళిపోయిన చిట్టితల్లిని తల్చుకుంటూ.
                         *    *    *
    ఆఫీసు నుంచి ఇంట్లో అడుగు పెడుతూనే గుమ్మంలో వున్న వుత్తరాలు చూసింది రాజ్యలక్ష్మి. ఒకటి తమ్ముడు రాసింది.
    "పసివాడికి ఇప్పుడిప్పుడే మాటలొస్తున్నాయి. ముందు నిన్నే పిలుస్తున్నాడు. నీ మరదలు నిన్ను పండక్కి తప్పక రమ్మని మరీ మరీ చెప్తోంది. రెండురోజులుండేట్టురా. ఇంకో విషయం - నీకు ఇవ్వాల్సిన డబ్బు - ఈమాటు - తప్పక పంపించేస్తాను." రాజ్యలక్ష్మి నవ్వుకుంది.
    "నాకు అప్పు తీర్చడమేమిటి - చిన్నవాడివి, నీ సంసారం చక్కగా చూసుకో. కావలసి వచ్చినప్పుడు నేనే అడుగుతాగా- ఎంత వాడయ్యాడు! నాకు అప్పు తీర్చేంత - " రాజ్యలక్ష్మికి తమ్ముడు రాసిన ఉత్తరం చాలా ముచ్చటేసింది. మళ్ళీ మళ్ళీ చదువుకుంది.
    మరో ఉత్తరం విప్పి చదువుతుంటే రాజ్యలక్ష్మికి చాలా ఆశ్చర్యం కలుగుతోంది.
    "మీ డబ్బు చాలా త్వరలో పంపేస్తాను. మీ చెల్లెలి గొలుసు అమ్మేస్తున్నాను. ఎంతో మంచిగా తియ్యగా మాట్లాడుతూ, మీకు ఆ డబ్బుతో ఇప్పుడేం పనిలేదని, వీలయితే ఎప్పుడో ఇయ్యండని మాకు ఇచ్చారు. ఆ రోజు మీరు డబ్బు ఇస్తానని ముందుకు రాకపోతే, మేము ఏ కాబూలీవాలా దగ్గరో తెచ్చుకుని, అప్పు తీర్చలేక సమస్తమూ అమ్ముకునేవాళ్ళం. కానీ మీరెంతో మంచిగా మాట్లాడినా, కాబూలీవాలా కన్నా...." ఇలా నిష్ఠూరంగా సాగిన ఉత్తరాన్ని చదివి బల్లమీద విసిరి కొట్టింది రాజ్యలక్ష్మి.
    ఓ అవసరానికి చెల్లెలి భర్తకి డబ్బు సర్దింది తను. 'వడ్డీకి తెచ్చుకుని ఇబ్బందులు పడకండి - మీకు వీలున్నప్పుడు ఏ వడ్డీలు లేకుండా నాకిద్దురు గాని' అని తనే వాళ్ళకి డబ్బిచ్చింది. అంతే. తను అడగకుండానే ఏమిటీ పిడుగుపాటు__
    రెపరెపలాడుతున్న కాగితం చివరి వాక్యాలు రాజ్యలక్ష్మిని కదిల్చి వేసాయి.
    'నా డబ్బు నాకిచ్చి నాతో చుట్టరికం తెంపేసుకుంటారట. కాని, ఆ రోజు మంచితనానికి పోయి, జాలిపడికదూ తను వాళ్ళని ఆదుకున్నది. కానీ తప్పు తనదే - మంచితనం దేనికి, బూడిదలో పొయ్యనా!" రాజ్యలక్ష్మి ఆ ఉత్తరాన్ని చించి బుట్టలో పారేసింది.
    వారం రోజుల తర్వాత చెల్లాయి రాస్తుంది ఉత్తరం - "అక్కా! ఇంతవరకు నువ్వెంతో మంచిదానివనుకున్నాను. ఈమధ్య ఇందిరవాళ్ళ నాన్న గారు మా యింటికి వచ్చారు-అన్నీ చెప్పారు. నీకు డబ్బు కావాలంటే వడ్డీతోసహా నీ మొఖాన్న పారేస్తాము. అయినా నువ్వు ఒంటరిదానివి - బంగారు పళ్ళానికి కూడా గోడ చేరువ కావాలంటారు - నీకు చెప్పమంటున్నారు మా ఆయన-" ఇలా సాగింది ఉత్తరం!
    ఇందిర వాళ్ళ నాన్న - అవును ఆయన తనని ఇంటికి చుట్టూ గోడ కట్టుకోవాలి, డబ్బు అప్పు ఇమ్మంటే తన దగ్గరలేదని, ఉన్న డబ్బు చెల్లెలు వాళ్ళకి అవసరమని సర్దానని చెప్పింది కదూ - అదా ఈ గాలి దుమారం? రాజ్యలక్ష్మి మనసు ముక్క ముక్కలయింది. ఆ రాత్రంతా నిద్రపట్టలేదు రాజ్యలక్ష్మికి. ఎవరు తనవాళ్ళో, ఎవరు పరాయివాళ్ళో అర్థం కాలేదు రాజ్యలక్ష్మికి. ప్రతి వ్యక్తి ఇతరుల మంచితనాన్ని కొల్లగొట్టాలని చూసేవాళ్ళే - ఛఛ!
    ఆఫీసుకి సెలవు పెట్టి ఇంట్లో ఉంది రాజ్యలక్ష్మి.
    చిట్టితల్లి తలుపు తోసుకు నెమ్మదిగా అడుగుపెట్టింది. రాజ్యలక్ష్మికి కళ్ళల్లో నీళ్ళొచ్చాయి.
    "రావటం లేదేం?" అంది మంచం మీద చిట్టితల్లిని కూచోపెట్టుకుని.
    "నెమ్మదిగా - అమ్మ వింటుంది." భయం భయంగా తలుపుకేసి చూస్తూంది చిట్టి తల్లి.
    "ఏమిటి కబుర్లు - అన్నం తిన్నావా?" అంది రాజ్యలక్ష్మి చిట్టితల్లి తల నిమురుతూ.
    "రేపు మేము ఇల్లు ఖాళీ చేస్తున్నాము."
    "ఏమిటీ?!"
    "అవును. అమ్మ అప్పుడే చెప్పద్దంది - రేపు అమ్మే చెప్తుందిట."
    రాజ్యలక్ష్మి ఏమీ మాట్లాడలేదు. చిట్టితల్లి కొత్త యింట్లో కూచున్నట్లుగా గోడల్ని చూస్తోంది
    "ఇది తిను." ఫ్రిజ్ లోంచి ఒక యాపిల్ తీసి యిచ్చింది.
    "ఒద్దు."
    "ఏం?"
    "అమ్మ మీ యింట్లో ఏమీ తినద్దంది."
    "అంటే - అదివరకు తినేదానివిగా?"
    "అప్పుడు నువ్వు మంచిదానివిట. ఇప్పుడు ఏమో మరి - తింటే చంపేస్తానంది."
    రాజ్యలక్ష్మి దీర్ఘంగా నిట్టూర్చింది. తన మంచితనం ఇలా బెడసి కొట్టిందా? సరే వీళ్ళు ఖాళీ చేస్తే ఇంకోళ్ళొస్తారు. వాళ్ళతో మాత్రం ఖచ్చితమైన ఇంటిదానిలా నెల మొదటి రోజునే అద్దె వసూలు చేస్తాను. ఒక్కరోజు ఆలస్యం చేసినా గొంతు పిసికి చంపేస్తాను - ఇక నుంచి ఇలాగే ఉంటాను!
    చిట్టితల్లి వెళ్ళగానే రాజ్యలక్ష్మి భళ్ళున తలుపు వేసుకుంది.
    ఎర్రగా, చల్లగా, మంచులా వున్న యాపిల్ పళ్ళెంలో ఎదురుగా కనిపిస్తోంది-రాజ్యలక్ష్మి దానివంకే చూస్తోంది- 'వెంకటమ్మా!' గర్జించింది రాజ్యలక్ష్మి. పనిలోవున్న వెంకటమ్మ పరిగెత్తుకొచ్చింది.
    "ఆ చాకుతే."
    తెచ్చింది వెంకటమ్మ.
    యాపిల్ ముక్కముక్కలుగా కోసింది. పళ్ళెం నిండింది. ఎన్ని ముక్కలో! వెంకటమ్మకి కొన్ని పెడితే? ఆ ఎందుకూ, దానికి ఇవి పనికిరావు. అయినా ఈ యాపిల్ నాకష్టార్జితం. నేనే తినాలి. ఎవరికో ఎందుకు పెట్టాలి? ఎర్రటి, చల్లటి యాపిల్ ముక్కలు రాజ్యలక్ష్మిని చూసి నన్నుతున్నట్టే ఉన్నాయి పళ్ళెంలో ఎదురుగా.
    ఒక్క ముక్క నోట్లో పెట్టుకుంది. రాజ్యలక్ష్మి దుఃఖం గొంతులో నిండి, ముక్క గొంతు దిగలేదు.
    "వెంకటమ్మా!" రాజ్యలక్ష్మి మళ్ళీ గర్జించింది.
    "అమ్మా!" చేతులు తుడుచుకుంటూ వెంకటమ్మ నిలబడింది.
    "ఈ యాపిల్ ముక్కలు ఆ చెత్తబుట్టలో పారేయ్."
    వెంకటమ్మకి అర్థం కాలేదు.
    "అవును. పారేయ్. మొత్తం చెత్తబుట్టలో పారేయ్. మరీ చల్లనివి, మరీ తియ్యనివి పనికిరావు. అంతే!" మనసు భగభగ మండుతుంటే రాజ్యలక్ష్మి చల్లని యాపిల్ ముక్కల్ని చెత్తబుట్టలో పోయించింది. *


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS