Next Page 

త్రీ- ఇన్- వన్ పేజి 1

                                               త్రీ  - ఇన్  - వన్

 

                                       (హాస్యకథలు+కార్టూన్స్+జోక్స్)
                                     

                                     నేనూ - రాణి..

                                                                         ---మల్లిక్ 

    ప్రస్తుతం నేను అద్దెకుంటున్న యింటాయన ప్రతిరోజూ ఉదయం రాత్రీ సంగీతం సాధన చేయసాగాడు. ఆ సంగీతం గోల నేను భరించలేక ఇల్లు ఖాళీ చేయాలని అనుకున్నాను.

    హైదరాబాద్ లాంటి మహానగరంలో గది అద్దెకు దొరకడం అంత సులభమేమీ కాదు. ఎంతో తిరగాలి. అందుకనే నా స్నేహితుడు చంచల్రావుని నాకూడా రమ్మన్నాను.

    ఆదివారం ఉదయం టిఫిన్ చేసి ఇద్దరం కలిసి గది వేటకు బయలు దేరాం. ఒక అరగంట ఆ వీథీ ఈ వీథీ తిరగ్గా ఒక ఇంటిముందు "టు లెట్" బోర్డు కనిపించింది.

    కాంపౌండు గేటు తెరుచుకుని లోపలికి వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కాం.

    ఆ ఇంటావిడ బయటకి వచ్చింది.

    "టు లెట్ బోర్డు చూసి వచ్చామండీ" అన్నాను.

    "ఇంతకూ మీ కోసమేనా ఇంకెవరికోసమైనానా?" అడిగిందావిడ.

    "వీడికోసమండి. ఒక గది చాలు. పేరు బుచ్చిబాబు" అన్నాడు చంచల్రావు నన్ను చూపిస్తూ.

    పెళ్ళయిందా లేదా"అందావిడ కళ్ళెగరేస్తూ.

    "కాలేదండి"అన్నాను మెలికలు తిరుగుతూ.

    "అయితే నీలాంటి బ్రహ్మచారులకు గది అద్దెకిచ్చేదిలేదు"

    "ఎందుకండీ"

    "ఎందుకేమిటి? పోకిరీ వేషాలు వేస్తారు. అసలే ఈ చుట్టుపక్కల కొంపల్లో పడుచు పిల్లలున్నారు.

    సంతోషం పట్టలేక కెవ్వుమన్నాను నేను.

    "అయితే గది అద్దెకు నాకే ఇవ్వాలండి. అద్దెకు గది నాకే ఇవ్వలండీ. ఇవ్వలండీ గది అద్దెకు నాకే. నాకే గది అద్దెకి ఇవ్వాలండీ" వాక్యం ఎలా చెప్తే కరెక్టో అర్థం కాక తికమక పడ్డాను.

    "అమ్మాయిల సంగతి చెప్పగానే ఆ సంతోషం, తడబాటూ చూశావా? మీలాంటి బ్రహ్మచారులకు అందుకే గది అద్దెకు ఇవ్వనంది"

    "మీఇంట్లో పడుచుపిల్లలెవరూ లేరు కదండీ" చలపతి అడిగాడు.

    "లేరు, ఏం?" ఆమె గుడ్లురిమి చూసింది.

    "మరి మీకెందుకండీ బాధ?"

    "ఎందుకా? మొన్నీమధ్య మీలాగే ఒకబ్బాయి వస్తే గది అద్దెకు ఇచ్చాం. వాడు గదిలోకి దిగిన మర్నాడే లౌ లెటర్ రాసి రాయికి చుట్టి ఆ అమ్మాయి మీదికి విసిరి దాక్కున్నాడు. ఆ సమయంలో గోడకు ఆనుకుని ఉన్న మల్లెపందిరి దగ్గర నాకోసం మల్లెపూలు కోస్తూ ఉన్న మా ఆయన ఆ పిల్ల కంటపడ్డాడు. ఆయనే ఈ పని చేశారనుకుని వాళ్ళన్నయ్యకి చెప్పింది..."

    "ఎవరే ఇందాకట్నుండీ మాట్లాడుతున్నావ్?" అంటూ అప్పుడే లోపలినుండి

 

వచ్చిన అతను ఆవిడ భుజాల మీదినుంచి మావైపు తొంగి చూశాడు. ఆయనకి తలకి కట్టుకట్టి ఉంది. ముఖానికి రెండుమూడు ప్లాస్టర్లు అతికించి ఉన్నాయి. ఒక కన్ను చుట్టూ గుండ్రంగా, నల్లగా చక్రం! చేతిని మడిచి మెడకు కలిపి బ్యాండేజీ కట్టు!

    "గది అద్దెకు కావాలని వచ్చార్లే. ఇంతకీ ఎక్కడిదాకా చెప్పనుబాబూ! ఆ... ఆ పిల్ల వాళ్ళన్నయ్యకి చెప్పింది. ఆ అబ్బాయి కసరత్తూలూ గట్రా బాగా చేస్తాడట!"

 


    "అక్కర్లేదు పిన్నిగారూ... మీరిక చెప్పక్కర్లేదు... మీ వెనుక నించిని ఉన్న మీ ఆయన్ని చూస్తే మొత్తం కథంతా అర్థం అయిపోతుందిలెండి" అన్నాను నేను ఆయన కంటిచుట్టూ ఉన్న నల్లని చక్రాన్ని గమనిస్తూ.

    "అర్థం అయింది కదా? అందుకనే బ్రహ్మచారులకి మేం గది అద్దెకు ఇవ్వం" అంటూ ధబేల్ మని తలుపు మూసిందావిడ.

    "కొందరికి ఓ దురలవాటు ఉంటుందోయ్" చంచల్ర్రావు అన్నాడు.

    "ఏమిటి? గది అద్దెకు ఇవ్వక పోవడమేనా?"

Next Page