Previous Page Next Page 

గెస్ట్ హౌస్ పేజి 2

ఎంతకి సరిగ్గా గుర్తు రావడంలేదు. స్పష్టాస్పష్టంగా గుర్తొస్తోంది. అతని చేతి వేళ్ళు కదులుతున్నాయి.
కిటికీ...కిటికీకి అవతల అడవి...
యస్...అ...డ...వే...
చెట్లు...దట్టంగా ఉన్న చెట్లు...ఆ చెట్ల మధ్య నుంచే తను పరుగెత్తాడు.
ఆ అడవిలో తను గెస్ట్ హౌస్ లాంటి భవనాన్ని చూశాడు...
సీలింగ్ ఫ్యాన్ తిరుగుతోంది గిరగిరా...
అయినా నచికేత నుదుట స్వేదం అలుముకుంది. అతని చేతి వ్రేళ్లు కాన్వాసు మీద కదలడం ఆగిపోయాయి. ఒక్కక్షణం ఆ కాన్వాసు వంక చూసాడు.
అడవి...తన కలలో చూసిన అడవి...
చెట్లు...తన కలలో చూసిన దట్టమైన చెట్లు...
ఆ అడవి మధ్యలో...గె...స్ట్...హౌ...స్..
ఒక్కక్షణం ఆగిపోయాడు...
గెస్ట్ హౌస్ ఆకారం గుర్తు రావడంలేదు. కాన్వాసుమీద గెస్ట్ హౌస్ రూపం ముద్రించబడలేదు.
షిట్...బ్రష్ ని గట్టిగా విదిలించాడు. రంగులో ముంచిన ఆ బ్రష్ చివరల నుంచి, రంగు చెదిరి కాన్వాసు మీద పడి... అదోలా మె...రి...సి...పో...తోం..ది.
కాన్వాసు మీద చిందిన ఆ రంగులు...
గ్రాఫిక్స్ లా చెదిరిపోవడం...నచికేత గమనించలేదు.
మంచంమీద పడుకుని బలవంతంగా కళ్ళు మూసుకున్నాడు.
అదే సమయంలో హాలులో పడుకున్న రామయ్య కళ్ళు తెరిచాడు..

                                       * * *
పగలబడి నవ్వాడు సూర్యనారాయణ.
విరగబడి నవ్వాడు విల్సన్.
నవ్వాపుకోలేకపోతున్నాడు సూరజ్.
వాళ్లవైపు కోపంగా చూసాడు నచికేత.
ప్రభు మాత్రం సీరియస్ గా ఉన్నాడు.
"మీకు నవ్వులాటగా ఉందా?" కోపంగా అన్నాడు తన ఫ్రెండ్స్ వంక చూసి...
"లేకపోతే, కిటికీలో నుంచి చూస్తే గెస్ట్ హౌస్ కనపించడమేంటి? ఇంటి బయటకు వస్తే అడివా? అందులో గెస్ట్ హౌసా?" మళ్ళీ నవ్వుతూ అన్నాడు సూర్యనారాయణ.
"హే...జీసస్...నా ఫ్రెండ్ కు ఎలాంటి కల వచ్చిందో చూడు..." నాటకీయంగా అన్నాడు విల్సన్...
"నచీ...మన ఆలోచనలు...ఊహలు కలలుగా వస్తాయి. బహుశా నువ్వు రాత్రిపూట ఏదో హర్రర్ నవల చదివి వుంటావు...అందులో ఇలాంటి సన్నివేశం వుండి వుంటుంది. అలా ఆలోచిస్తూ పడుకుని వుంటావు. అదే కలలోకి వచ్చి వుంటుంది" సూరజ్ అన్నాడు.
"అయ్యిందా...నేను సీరియస్ గా నాకు వచ్చిన కల గురించి చెబితే మీరు చెప్పే రీజనింగ్ ఇదా?" కాసింత కోపంగా అన్నాడు నచికేత.
నచికేత భుజంమీద చేయి వేసాడు. భూతద్దాలాంటి తన కళ్లజోడు సవరించుకున్నాడు.
"నచీ...నువ్వన్నది కరెక్ట్...నీ కొచ్చిన కల గురించి మనం అంత తేలిగ్గా కొట్టి పారేయకూడదు...నాకు తెలిసిన ప్రొఫెసర్ వున్నాడు. నువ్వు సరేనంటే ఆయన దగ్గరికి వెళ్దాం" అన్నాడు ప్రభు.
"హేయ్ ప్రభూ...నీకేమైనా పిచ్చా? వాడేదో కల వచ్చిందని చెబితే, ఈజీగా తీసుకోమని దైర్యం చెప్పాల్సిందిపోయి ఇదేదో సీరియస్ విషయమైనట్టు, ప్రొఫెసర్ దగ్గరికి కూడా వెళ్లాలా?" సూర్యనారాయణ కోపంగా అన్నాడు.
"అవును నచీ...నువ్వు ప్రభు మాటలు పట్టించుకోకు. వాడు మొదట్నుంచీ అంతే...ప్రతి దానిని సీరియస్ గా తీసుకుంటాడు" నచికేతతో అన్నాడు విల్సన్.
సూరజ్ మౌనంగా ఉండిపోయాడు.
ఆ అయిదుగురూ మంచి ఫ్రెండ్స్.
కష్టాలు, సుఖాలు పంచుకుందామనుకునే రకం, వాళ్ల మధ్య ఎలాంటి భేషజాలు లేవు.
"నాకెందుకో ప్రభు చెప్పిందే కరెక్టు అనిపిస్తుంది...ఓసారి మనం ఆ ప్రొఫెసర్ దగ్గరికి వెళ్లితే తప్పేమిటి? నచికేత ఎదురు ప్రశ్న వేసాడు.
"అది కాదు నచీ...ఇంత చిన్న విషయానికి,,," విల్సన్ ఏదో అనబోయాడు...
"ఇది చిన్న విషయమా? మాకు తెలిసి కలలు మూడు రకాలు...సబ్జెక్టివు, ఫిజికల్, స్పిరుట్యువల్. భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాలను ప్రతిబింబించే ఈ కలలు గురించి మనం తేలిగ్గా కొట్టిపారేయకూడదు.
జాన్ ఆఫ్ ఆర్క్ తన మరణం గురించి కలలోనే తెలుసుకుందిట.
పురాణాల్లో కూడా కలలు ప్రస్తావన వుంది. త్రిజట అనే రాక్షసి రావణాసురుడి అంతిమదశలో కలలో కనిపించిందట. అరిస్టాటిల్ కలల్లో కనిపించే కొన్ని వస్తువులు భవిష్యత్తులో సంభవించ బోయే సంఘటనలకు "సిగ్నల్స్" అనేవాడు.
ఇంకా ప్రభు ఏదో చెప్పబోతుంటే, సూరజ్ వచ్చి ప్రభు పెదవుల మీద చేయేసి...
"మహా ప్రభో...ప్రభూ...ఇక ఆపేయ్...కలల గురించి నీ పరిజ్ఞానాన్ని విప్పి చెప్పి మమ్మల్ని చంపకు..." నాటకీయంగా అన్నాడు.
నచికేత మాత్రం ఆలోచిస్తూ ఉండిపోయాడు. విల్సన్ వచ్చి నచికేత భుజం మీద చేయేసి...
"నచి...ఇంత చిన్న విషయానికి ఇంతలా అప్ సెట్ అవుతావెందుకు? టేకిటీజీ యార్..." అన్నాడు.
"లేదు విల్సన్...కలలు రావడం సాధారణమే కావచ్చు...కానీ రాత్రి నాకు వచ్చిన కల...
వాహ్...ఎంత హారిబుల్ గా అంటే...బాగా భయమేసింది. నిజంగా ఆ అడవిలో నేను ఒంటరినైనట్టు...ఆ అడవి మధ్యలో చిక్కుకుపోయినట్టు...ఆ...ఆ...గెస్ట్ హౌస్...ఎంత ఆలోచించినా...ఎందుకో ఆ గెస్ట్ హౌస్...నమూనా మాత్రం గుర్తుకురావడంలేదు...
అది...అది మామూలు గెస్ట్ హౌస్ లా అనిపించలేదు. సమ్ థింగ్ స్పెషల్..." ఒక విధమైన ట్రాన్స్ లో ఉండిపోయాడు నచికేత...
"నువ్వింకా దాని గురించే సీరియస్ గా ఆలోచిస్తున్నావా? లీవిట్ ఫ్రెండ్..అయినా మంచి పెయింటర్ వి. శ్రీదేవి పాతికేళ్ల తర్వాత ఎలా వుంటుంది...పాతికేళ్ల క్రిందట ఎలా వుందీ ఊహించి పెయింట్ చేసావు...అలాంటిది నీకు కలలో కనిపించిన గెస్ట్ హౌస్ బొమ్మని వేయలేవా? సూర్యనారాయణ అన్నాడు.
"ట్రై చేసాను...కలలో కనిపించిన అడవిని కాన్వాసు మీద వేయగలిగాను కానీ...ఆ గెస్ట్ హౌస్ బొమ్మ వేయడానికీ కుదర్లేదు..." నచికేత చెప్పాడు.
"ఒక్కోసారి అంతే...కొన్ని మనకు గుర్తుండి పోతాయి...మరికొన్ని ఎంత గుర్తు చేసుకుందామన్నా గుర్తుకు రావు..." ప్రభు చెప్పాడు.
"అయితే మనం కనీసం నచికేత గీసిన ఆ అడవినైనా దర్శిద్దాం..." సూరజ్ అన్నాడు.
"ముందు ప్రొఫెసర్ దగ్గరకు వెళ్దాం" నచికేత అన్నాడు.
"నువ్వా విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటున్నావా?" అడిగాడు సూర్యనారాయణ.
"అవును...డామ్ సీరియస్..."
ఆ ఐదుగురు ఓ ఇరానీ హోటల్ లో కూర్చుని చాయ్ లు తాగి ప్రొఫెసర్ దగ్గరకు బయల్దేరారు.

                                       * * *
ప్రొఫెసర్ పరమహంస.
ఆ ఇంటి చెక్క గేటు ముందు సేమ్ ప్లేట్ వేలాడుతూ కనిపిస్తోంది. ఆ సేమ్ ప్లేట్ సగం కిందికి వేలాడుతోంది. చెక్క గేటు రంగు వెలిసిపోయింది. చుట్టూ పిట్టగోడ...లోపల రకరకాల చెట్లు...
చెక్కగేటు తీసుకుని లోపలికి అడుగుపెట్టింది మిత్ర బృందం. సడన్ గా సూర్యనారాయణకో డౌట్ వచ్చింది.
వెంటనే ప్రభుని ఆపి.
"ఒరే ప్రభో...నీకి ప్రొఫెసర్ గారెక్కడ తగిలారు? అసలు నీకెలా పరిచయం?" అనుమానంగా అడిగాడు.
"నేను ఈ ప్రొఫెసర్ గారి దగ్గర పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను" తన భూతద్దాలు  సవరించుకుని చెప్పాడు. మిగతా నలుగురూ షాక్ తిన్నారు.
"నిజమా...మాకు చెప్పనేలేదు..." అన్నాడు నచికేత.
తలొంచుకుని చెప్పాడు ప్రభు. "మీరు నవ్వుతారని చెప్పలేదు. ఈ ప్రొఫెసర్ కు భార్య, పిల్లలూ ఎవరూ లేరు. భార్య ఒకప్పుడు ఉండేది. ఈయన పరిశోధనలంటూ ఎప్పుడూ లాబ్ లోనే ఉండడంచూసి విసుగేసి వెళ్లిపోయింది. వెళ్లిపోయేముందు తన భర్త పిచ్చివాడని ప్రచారంచేసి మరీ వెళ్లిపోయింది.
అయినా ఈ ప్రొఫెసర్ చలించలేదు. బ్యాంక్ లో ఫిక్స్ డ్ డిపాజిట్ వుంది. ఆ డిపాజిట్ మీద వచ్చే డబ్బుతో రకరకాల పరిశోధనలు చేస్తాడు.
ఓ రోజు టాంక్ బండ్ దగ్గర కనిపించాడు. అనుకోకుండా పరిచయం అయింది. "నా దగ్గర పనిచేస్తావా?" అని అడిగాడు.
"సరే నన్నాను..." ఆయన రకరకాల పరిశోధనలు చేస్తాడు. ఎప్పుడే అంశంమీద రీసెర్చి చేస్తాడో తెలీదు. ఓసారి 'కలలు' మీద పరిశోధన మొదలెడతాడు. మరోసారి 'సమాధుల' గురించి తెలుసుకోవాలంతాటా. ఇంకోసారి 'టెలీపతి' గురించి...ఇలా...ఒక సబ్జెక్ట్ అని కాదు...చాలా కమాండ్ ఉన్న వ్యక్తి. తన వృత్తిని, ప్రవృత్తిని ప్రేమిస్తున్నాడు దట్సాల్...చెప్పాడు ప్రభు.
"చాలా చిత్రమైన క్యారెక్టర్ మీ ప్రొఫెసర్ ది...ఎనీవే...కంగ్రాట్స్...ఇక్కడ జాబ్ దొరికినందుకు మంచి పార్టీ ఇవ్వాలి..." నచికేత అన్నాడు. ప్రభు నవ్వుతూ ముందుకు కదిలాడు.

                                        * * *
ఆ ఇల్లు కట్టి చాలా సంవత్సరాలైందని తెలుస్తోంది. ఫర్నీచర్ కూడా చాలా పాతకాలం నాటిదే...చెక్క కుర్చీలు...నగిషీ చెక్కిన టీపాయి...కేన్ చెయిర్స్...గది గోడలకు రకరకాల బొమ్మలు వేలాడదీసి వున్నాయి. సైన్స్, జాగ్రఫీ నుంచి తాజ్ మహల్ వరకూ...

                                        * * *
అడుగుల శబ్దం విని నలుగురూ లేచారు. ప్రభు లోపలికి వెళ్లి ప్రొఫెసర్స్ తన ఫ్రెండ్స్ వచ్చిన విషయం చెప్పడంతో ప్రొఫెసర్ వచ్చాడు.


 Previous Page Next Page