సంపూర్ణ గోలాయణం 80

 

మేడమీద కూర్చున్న సూర్యంగారికి నడుం నెప్పెట్టింది. తలపోటుగా వుంది వీడికి కాపలా కాయడం కాదు గానీ నా ప్రాణానికి వచ్చింది అని విసుక్కున్నారు. పోనీ అలా కాస్తా వీధి చివరి దాకా వెళ్ళి ఓ కొబ్బరి బొండాం తాగివస్తేసరి. కాస్త మార్పుగానూ వుంటుంది. ఈ సన్యాసి ఒక వేళ వెళ్ళినా అటే వెళ్ళాలి కాబట్టి తప్పించుకుపోతాడనే భయం లేదు.

ఈ ఐడియా వచ్చేక ఆలస్యం చెయ్యకుండా వెంటనే లేచారు ఆయన. డాక్టరుగారితో మాట్లాడుతూ మామూలుగా అటువైపు చూసిన సత్యంగారు ఉలిక్కిపడ్డాడు ఏడీ వీడు? ఇప్పటిదాకా యిక్కడే వున్నాడుగా యింతలో ఏమైపోయాడు. అనుకుంటూ లేచి కంగారుగా వీధిలోకి వచ్చారు. అప్పుడే రోడ్ మీదికి వచ్చి ఇటే వస్తున్న సూర్యం కనిపించేసరికి ఆయనకీ కోపం వచ్చేసింది. కర్ర చూపించి "ఒరేయ్ యెక్కడికిరా బయలుదేరావు. పో లోపలికి" అన్నాడు.

సూర్యంగారికి చాలా కోపం వచ్చింది. “నువ్వెవడివోయ్ నన్ను పొమ్మనడానికి. “నా యిష్టం" అంటూ నాలుగడుగులు వేశాడు.

“నీ దొంగ ఎత్తులు నాకు తెలుసులే. అడుగులు ముందుకి వేశావో కాళ్ళిరగ్గొడతాను. నేను యిక్కడున్నంత సేపూ నిన్ను అక్కడికి వెళ్ళనివ్వను!” అంటూ మీదికి వచ్చాడు సత్యం.

ఇద్దరూ పెద్దగా అరుచుకుంటూ, హోరాహోరీ మాట్లాడుకున్నారు. నువ్వు కంటిరీ వెద్ధవ్వి అంటే కాదు నువ్వే కొంపలు కూల్చే రకానివి అనుకున్నాడు. క్రమంగా తారాస్థాయికి చేరింది వాళ్ళ పోట్లాట. చుట్టుప్రక్కల ఇళ్ళవాళ్ళు వాకిళ్ళల్లోకి వచ్చేశారు. చేస్తున్న పని ఆపేసి వాకిట్లోకి పరుగున వచ్చేసింది వాళ్ళిద్దర్నీ అలా చూసి ఎన్నాళ్ళ కెన్నాళ్ళకు అని సంబరపడింది, వదినా నువ్వే వుంటే ఎంత ఆనందించేదానివో కదా అని మహాలక్ష్మమ్మను తల్చుకుని బాధపడింది. భారతి, రాధ వచ్చి వరండాలో నిల్చున్నారు. వీళ్ళ పోట్లాట ఇలా సాగుతుండగానే కారు వచ్చి సత్యంగారింటి ముందు ఆగింది.

“అదిగో చూడరా! నీ పొగరు అణిగే సమయం వచ్చింది. నీ కూతురు నీకు మాట మాత్రం చెప్పకుండా పెళ్ళి చేసుకుని వచ్చింది" అన్నాడు సూర్యంగారు.

“నా కూతుర్ని అన్నావంటే చెప్పుపెట్టి కొడతాను నా మాట సరేలే ముందు నీ విషయం చూసుకో నీ గర్వం గంగలో కలిసేలా నీ కాబోయే అల్లుడు వేరే అమ్మాయిని పెళ్ళి చేసుకొచ్చాడు" అన్నాడు సత్యం. కారులోంచి ముందుగా ముందు సీట్లోంచి పద్మ దిగింది. ఆ తర్వాత డ్రైవింగ్ సీట్లోంచి చిట్టిబాబు దిగి వెనుక డోర్ తీశాడు. వెనక సీట్లోంచి దిగాడు శ్యామ్. ఆ తరువాత మెల్లిగా కారులోంచి దిగాడు మోహన్ పసుపు బట్టలతో మెళ్ళో పూలదండలతో పెళ్ళికొడుకు వేషంలో తలొంచుకుని నిలబడిన అతన్ని చూడగానే బిగుసుకుపోయాడు సూర్యం.