సంపూర్ణ గోలాయణం 76

 

ఆ మర్నాడు మోహన్ ఆఫీస్ కి శెలవుపెట్టి అన్ని ఏర్పాట్లు చూసు కున్నాడు. శ్యామ్ ఆఫీస్ కి వెళ్ళి చిట్టిబాబు గార్ని కలిసి "రేపొద్దున మోహన్ పెళ్ళి చేసుకోబోతున్నాడు. మీకిచ్చిన గడువుకు ఇంకా రెండురోజుల ముందే పెళ్ళయిపోతుంది!” అన్నాడు.

నోటమాట రానంత ఆశ్చర్యపోయాడు చిట్టిబాబు "నిజం?” అన్నాడు.

“అక్షరాలా నిజం! చెప్పడం మర్చేపోయాను. రేపు మేము ఇద్దరం శెలవు పెడతాం. ఇకపోతే అతనెలాగు పందెం గెలుస్తున్నాడు కాబట్టి మీరు కూడా మీ ఏర్పాట్లు చేసుకోండి. పెళ్ళి వేంకటేశ్వరాలయంలో జరుగుతుంది. మీరు తప్పకుండా రండి! ఈ పూట నాకు పనుంది. నేను వెళ్తాను" అనేసి వెళ్ళిపోయాడు.

గాలి దుమారంగా వార్తలందించి వెళ్ళిపోయిన శ్యామ్ వంక ఒక్కక్షణం చూసి ఫోన్ అందుకున్నాడు చిట్టిబాబు, నెంబర్ డయల్ చేశాడు. “ఆ! నేనే చిట్టిబాబుని. నీకు బజాజ్ స్కూటర్! ఎలాట్ అయిందిట కదూ! అమ్ముదాం అనుకుంటున్నావట కదూ! ఎవరికీ మాటివ్వకు నాకు కావాలి" అని చెప్పాడు. మిగిలిన ఏర్పాట్లు చెయ్యడం మొదలుపెట్టాడు.
చిట్టిబాబు దగ్గర్నుంచి బయలుదేరిన శ్యామ్ తిన్నగా డాక్టర్ చలపతిరావు దగ్గరకు వెళ్ళాడు. ఆ చలపతిరావు చాదస్తం మనిషి. ఆయన దగ్గరికి వచ్చే పేషెంట్లు కూడా అంతంత మాత్రమే. ఆ వున్న కాసింత మందిలో ఇద్దరు నారాయణమూర్తులూ వున్నారు. వాళ్ళిద్దరికీ ఫామిలీ డాక్టరాయన. తన దగ్గరికి వచ్చిన శ్యామ్ ని చూసి ఆనందపడిపోయి అతను నోరిప్పేలోపలే నోట్లో ధర్మామీటర్ పెట్టేసి నాడి చూసేశాడు. “నాడి నార్మలే టెంపరేచరూ నార్మలే నీకొచ్చిన ట్రబుల్ ఏమిటి?” అని అడిగాడు.

“నాకే ట్రాబులూ లేదు. మీతో పనుండి వచ్చాను" అన్నాడు శ్యామ్.

“ఏమిటది? విజిట్ కి రావాలా? పద" అంటూ కుర్చీ మీదున్న కోటు వేసుకుని మెడికల్ కిట్టు పుచ్చుకుని రెడీ అయిపోయాడు.

“మీ హడావిడి మండిపోనూ, చెప్పేది వినిపించుకోరేమండీ, అలా కూర్చోండి" అంటూ బలవంతాన కూలేశాడు శ్యామ్.

ఏమనుకున్నాడో ఏమో కూర్చున్నాడాయన "ఏమిటి?” అన్నాడు

“మీకు సత్యనారాయణమూర్తిగారు, సూర్యనారాయణమూర్తిగారూ తెలుసా?” అడిగాడు.

“ఏడిసినట్లుంది. వాళ్ళు తెలీకపోవడం ఏమిటి? పందొమ్మిదేళ్ళుగా ఆ రెండు కుటుంబాలకీ నేనే ఫామిలీ డాక్టర్ని. సత్యంగారికి హైబి.పి. సూర్యంగారికి లో బి.పి. ఇద్దర్కి నేనే ట్రీట్ చేస్తున్నాను"

“అందుకే మరి మీ దగ్గరి కొచ్చాను. మీరు రేపు ప్రొద్దున ఎంత పనివున్నా సరే అవన్నీ మానేసి పదకొండు కొట్టేసరికి సత్యంగారింటికి రావాలి. వచ్చేటప్పుడు ఆయన బిపి పెరిగితే మీరేం మందులిస్తారో అన్నీ తెచ్చుకోండి. సూర్యంగారికి బి.పి. పడిపోతే ఇచ్చే మందులు కూడా తెచ్చుకోండి" అన్నాడు.

అయోమయంగా చూశాడాయన "ఏమిటీ వాళ్ళిద్దరికీ ఒంట్లో బాగాలేదా? బాగా లేకపోతే రేప్రొద్దుటి దాకా ఆగడం ఎందుకు? ఇప్పుడే పోతే సరిపోలా" అడిగాడు.

“ఇప్పుడు ఇద్దరూ గుండ్రాళ్ళలాగా బాగానే వున్నారు. కానీ రేప్రొద్దున పదకొండు పన్నెండు గంటల మధ్య సత్యంగారు బి.పి.రెండొందలు పైగా రైజయిపోతుంది. సూర్యంగారి బి.పి. అరవైకి పడిపోతుంది" అన్నాడు శ్యామ్.

విసుగ్గా చూశాడాయన "ఏమిటయ్యా ఇదంతానీ బులెటిన్ చెప్పినట్లు టైములతో సహా చెపుతున్నావు. ఏమిటిదంతా అసలు ఎవరు నువ్వు" అని అడిగాడు సీరియస్ గా.

“అదంతా మీకు అనవసరం నేను చెప్పింది మాత్రం అక్షరాలా నిజం. నా మాట విని బుద్దిగా వెళ్ళారా సరే. లేదూ చూసుకోండి. వాళ్ళు వేరే డాక్టర్లని పిల్చుకుంటారు ఇక నే వెళ్తున్నా. రేపు అక్కడికి వెళ్ళాక నేనిలా వచ్చానని గానీ చెప్పారా నేనసలే మంచివాడిని కాను. జాగ్రత్త మరి. బుద్ధిగా వెళ్ళి మాట్లాడకుండా కూర్చోండి.మీ అవసరం రాగానే మీ పని మీరు చెయ్యండి" అని చెప్పేసి వెళ్ళిపోయాడు.

నోరావలించి వుండిపోయారు చలపతిరావుగారు. అంతా గందరగోళంలా వుంది ఆయనకి. అంతా సిల్లీగా వుంది కానీ అలాగని మానేద్దామా అంటే ఆ కేసులు వదలడం ఎంత మాత్రం ఇష్టం లేదు.