సంపూర్ణ గోలాయణం 75
ఆయనకి మహా హుషారు వచ్చేసింది. ఈ దెబ్బతో ఆ వెధవ తిక్క కుదురుతుంది. తగిన శాస్తి జరుగుతుంది. లేకపోతే తనని చూసి ఒకటే ఏడుపు తనకు లాటరీ వచ్చిన దగ్గరనించి లోలోపల కుళ్ళుతున్నాడు. తనకీ ఐశ్వర్యం లభిస్తుంది. దానితో తనుకూడా మేడా అదీ కట్టేద్దాం అని ఆరాటపడ్డాడు సన్నాసి. దీపిక వాడిని ఎదిరించి పెళ్ళి చేసుకుంటే చెప్పెట్టి కొట్టినట్లు అవుతుంది! అనుకుని ఆనందపడ్డాడు.
“ఒరే మోహన్! వాడి విషయం నేను చూసుకుంటాను, ఆ విషయం నాకొదిలేసి నిశ్చితంగా మిగిలిన ఏర్పాట్లు చేసుకోమను అతన్ని. యింతకీ పెళ్ళి ఎప్పుడు?” అన్నాడు.
“ఎల్లుండి పొద్దున్న పదింటికి"
“సరే ఎల్లుండి తెల్లారిన దగ్గరనించి వాడు బయటికి రాకుండా చూసుకునే బాధ్యత నాదే!” హామీ ఇచ్చేశాడు ఆయన.
“పెళ్ళి కాగానే దంపతులు ఆయన దగ్గరికి వస్తారు. ఆ తరువాత ఆయన యెంత అరిచినా ఏమీ లాభం వుండదు" అన్నాడు.
“అవును పిచ్చికుక్కలాగా అరిచేస్తాడు. గింజుకుంటాడు. బి.పి. రైజైవుతుంది వెధవకి!” ఆ సీన్ ఊహించుకుని మహోత్సాహ పడిపోయారు సూర్యంగారు.
తండ్రి కాళ్ళు నొక్కుతూ కూర్చుంది దీపిక. రాత్రి పది దాటింది అందరూ నిద్రపోతున్నారు. తండ్రీ కూతుళ్ళు మాత్రం మెలకువగానే వున్నారు. లంకె బిందెల గురించి గుసగుసలాడుతున్నారు. “నాన్నా మామయ్యని భారతికోసం వాళ్ళ స్నేహితుడి కొడుకునే సెటిల్ చేశారుట మీకు తెలుసా?” అంది దీపిక.
రుసరుసలాడాడుఆయన "ఆ వెధవ సంగతి ఇప్పుడు ఎందుకమ్మా ఆ ఒళ్ళు పొగరు సన్నాసి పేరెత్తితేనే కారం రాసుకున్నాట్లు వుంటుంది నాకు" అన్నాడు.
“అవుననుకోండి నాన్నా! యిప్పుడో చిన్న సమస్య వచ్చింది.”
“ఏమిటమ్మా?” “భారతికినిశ్చయం చేసిన అబ్బాయి వున్నాడు కదా!”
“ఆ వున్నాడులే! మామగారికి తగిన అల్లుడు. వాడో తిక్కశంకరయ్యా వాడి అల్లుడు అంతకంటే తిక్క శంకరయ్యా. ఇల్లిల్లూ తిరుగుతూ ఏవిటో పిచ్చి ప్రేలాపనలు చేస్తూ వుంటాడు" ఎగతాళిగా అన్నాడు సత్యం.
గతుక్కుమని సర్దుకుంది దీపిక. “ఇప్పుడు సమస్య ఏమిటంటే ఆ అబ్బాయికి ఆ పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదుట. అతను వేరే అమ్మాయిని లవ్ చేశాడు"
చివాల్న లేచి కూర్చున్నాడు సత్యం "ఏమిటి? నిజంగానే?” అన్నాడు సంభ్రమంగా.
“అవును నాన్నా!”
“భేష్ ఆ కుర్రాడు వజ్రం లాంటివాడు. లేకపోతే చూస్తూ చూస్తూ ఆ సన్నాసి వెధవకి అల్లుడు అవడానికి ఎవరు అంగీకరిస్తారమ్మా!” అన్నాడు ఆనందంగా.
“నిజం నాన్నా! ఇప్పటినించే చెపితే మామయ్య ఎలాగూ ఒప్పుకోడని భయపడి రహస్యంగా గుళ్ళో పెళ్ళి చేసుకుందామను కుంటున్నాడుట అతను. ఆ అమ్మాయి నా స్నేహితురాలే. నాతో చెప్పింది"
ఇదంతా వింటుంటే సత్యంగారి ఆనందం అవధులు దాటింది. ఒళ్ళు పొగరు వెధవ ఆ నడమంత్రపు సిరి చూసుకుని ఒకటే మిడిసి పాటు. ఆ కాబోయే అల్లుడిని వెంటేసుకుని కనిపించిన ప్రతివాడికి చెప్పుకుంటూ తిరిగాడు. ఇప్పుడా అల్లుడు కాస్తా వేరే అమ్మాయిని పెళ్ళి చేసుకుంటే వాడి నడుము విరిగినట్లు అవుతుంది. నలుగురిలోనూ నవ్వులపాలు అవుతాడు అనుకున్నారు. మంచి పని చేస్తున్నాడు. మరి అలాంటి వాళ్ళకి అలాగే చెయ్యాలి" అన్నాడు ఆనందంగా.
“అయితే ఓ సమస్య వచ్చింది నాన్నా! రహస్యంగా పెళ్ళికి అన్ని ఏర్పాట్లూ చేసుకున్నారు. కానీ సమయానికి మామయ్య వెళ్ళి ఎక్కడ అభాసు చేస్తాడో అని భయపడుతున్నారు. ఈ విషయంలో కాస్త సాయం కావాలి వాళ్ళకి"
“ఏమిటిది?” హుషారుగా అడిగాడు.
“పెళ్ళి ఎల్లుండి పొద్దున పదింటికి ఆ కాస్తా అయిపోయి వాళ్ళు ఇంటికి వచ్చేదాకా మామయ్య ఇల్లు కదలకుండా జాగ్రత్త పడాలి.”
“ఓస్ అదెంత భాగ్యం. వాకిట్లోనే కుర్చీ వేసుకొని కూర్చుంటా. ఇల్లు కదిలినట్లు కనిపించిందా మెడకాయ పుచ్చుకుని గోడవతలికి విసిరేస్తా వెధవని, వాడి సంగతి నా కొదిలేసి మిగతా ఏర్పాట్లు చూసుకోమను" అన్నాడు మహా ఉత్సాహంతో.