సంపూర్ణ గోలాయణం 67

 

గుమ్మంలో ఎదురైంది వర్ధనమ్మ "అబ్బ చూడమ్మా ఈ రాధ. ఎలా భేతాళ ప్రశ్నలు వేస్తోంది! కాసేపు వినేసరికి తల పగిలిపోతుంది. దినమంతా ఎలా భరిస్తున్నావో నువ్వు?” అన్నాడు విసుగ్గా.

వింతగా చూసింది ఆవిడ. “నాకేమీ కష్టంగా అనిపించడం లేదురా. రాధతో మాట్లాడుతుంటే అచ్చంగా నీతో మాట్లడుతున్నట్లే వుంటుంది నాకు!” అంది.

తెల్లబోయాడు కృష్ణ "ఏమిటమ్మా నువ్వనేది, నేను కూడా అలాగే అడ్డదిడ్డం ప్రశ్నలు వేస్తానా?” అన్నాడు.

“అవున్రా... అదింకా నయం.... అచ్చ తెలుగులోనే వాదిస్తుంది. నువ్వు మధ్యలో ఇంగ్లీషులో కూడా అరుస్తూ వుంటావ్!” అనేసి వంట యింట్లోకి వెళ్ళిపోయింది ఆవిడ.

అయోంయంగా నిలబడిపోయాడు కృష్ణ. హఠాత్తుగా అతనిలో ఏదో మార్పు వచ్చింది.తలొంచుకుని వెళ్ళిపోయాడు. ఆ రాత్రి అంతా మౌనంగా ఏదో ఆలోచిస్తున్నట్లు వుండిపోయాడు. మర్నాడు పొద్దున్నే లేచి అలవాటు ప్రకారం ఓ పుస్తకం మొహాన వేసుకుని కూర్చోకుండా ఇల్లంతా తిరుగుతూ అందరితో సౌమ్యంగా మాట్లాడాడు. ఒక్కసారి కూడా ప్లాన్ వేసుకుని పని చెయ్యండి అని ఎవరితోనూ దెబ్బలాడలేదు. అతనిలోని మార్పుని గమనించి ఆనందపడ్డారు తల్లిదండ్రులు. వారం రోజులు చకచక గడిచిపోయాయి.

వీలు చూసుకుని రాధను, తల్లినీ ఊళ్ళో ఎక్కడికైనా తీసుకువెళ్ళేవాడు కృష్ణ. రాధ వర్ధనమ్మకి మహా నచ్చింది. ఏదైనా యిక ఆలస్యం అనవసరం. చెల్లాయికి కూడా సంబంధం చూడడం మొదలు పెట్టాలి" అనేసింది.

వెంటనే భర్త దగ్గరకు వెళ్ళి ఆయన పక్కనే కుర్చీ వేసుకుని కూర్చుంది. ఆరోజు ఆదివారం కావడం వల్ల దీపిక రీసెర్చ్ వర్క్ పొద్దునే పూర్తి అయిపొయింది కాబట్టి ఇంట్లోనే వుంది భార్య అమిత ఆదరంగా కొడుకు పెళ్ళి వార్త చెప్పి, వెంటనే కూతురికి కూడా సంబంధం చూడమంది. కుదరగానే ఇద్దరి పెళ్ళిళ్ళు ఒకేసారి చేసేద్దాం అంది.

ఆయన ఎంత మాత్రం సంతోషించలేదు. సరికదా గయ్ మని లేచాడు "ఓ పక్క నేను నా సమస్యలతో సతమతం అవుతుంటే నీకు పిల్లల పెళ్ళిళ్ళ విషయంలో తొందర వచ్చిందా?" అన్నాడు.

“ఇది మరి బావుంది. పిల్లలకి పెళ్ళీడు వచ్చేసింది. అసలు ఇప్పటికే ఆలస్యం అయింది. యికనైనా తొందరపడకపోతే ఎలా?” అంది ఆవిడ.

“మరేం ఫర్వాలేదు. వాళ్ళకేం వయసు మించిపోవడం లేదు. ఇప్పుడప్పుడే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసే ఆలోచనలేదు నాకు. నా దశ తిరిగి నేను అనుకున్నది నాకు దక్కాక నా కూతురికి కోటీశ్వరుడి కొడుకుని వెతికి తెస్తాను. కొడుక్కి మినిష్టరు కూతుర్ని తెస్తాను" అన్నాడు.

“వూరికే గాల్లో మేడలు కట్టండి అంతంత ఆశలు పెట్టుకోడానికి మనం ఏమైనా కోటీశ్వరులమా? మినిష్టర్లమా? కృష్ణ, రాధని చేసుకోడానికి యిష్టపడ్డాడు. దీపికకి ఏదో మనకు తగిన సంబంధం చూసి పెళ్ళిచేద్దాం. ఇక ఆలస్యం చెయ్యొద్దు దీపా, భారతీ ఒక తోటివాళ్ళే. అప్పుడే అన్నయ్యగారు అల్లుడికి వెతికి తెచ్చుకున్నారు. త్వరలోనే ఆ శుభకార్యం కూడా జరిపిస్తారుట" అంది.

అంతే, సత్యంగారి ఆగ్రహం అవధులు దాటింది "ఆ సన్నాసి వెధవ పేరు నా దగ్గర ఎత్తకు. వాడు వాడి కూతురికి పెళ్ళి చేస్తున్నాడని మనం ఏమీ తొందర పడనక్కర్లేదు నా పిల్లలకి ఎప్పుడు పెళ్ళి చెయ్యాలో నాకు తెలుసు. నీ బోడి సలహా అనవసరం!” అని అరిచాడు.

“ఏం మనిషో.... ఆయన చెప్పింది తప్ప ఇతరుల మాట వినిపించుకోరు" అని విసుక్కుని వెళ్ళిపోయింది వర్ధనమ్మ.