Prema Pandem part 24
రాంబాబుకి క్రితం రోజు సరోజని ఇందిరాపార్కులో కలిసిన దగ్గర్నుండీ కాస్త హుషారుగా ఉంది ఆమె సలహా విన్న తర్వాత అతని మనసు తేలికపడింది. ఆమెకి తట్టిన ఆలోచన తనకి తట్టనందుకు అనవసరంగా బుర్ర పాడు చేసుకున్నందుకూ తనని తానూ చాలా తిట్టుకున్నాడు. ఆ రోజు ఆఫీసుకు రాగానే అతను స్టెన్నో సర్వోత్తమరావుని అడిగాడు ఆఫీసులో ఎలాంటి లోన్స్ వున్నాయి అని. ఆఫీసు లో అప్పుల గురించీ, ఎల్వేన్సుల గురించీ, డి.యే పెరుగుదల గురించీ, ఓవర టైం ద్వారా ఎంతోస్తుందో ఆ వివరాల గురించీ, ఎక్కడికైనా ఆఫీసు పనిమీద వెళితే కన్వేయన్స్ వోచర్ ఎంతకీ పెట్టాలన్న విషయం గురించీ, టి యే బిల్స్ గురించి ఎవరికీ ఎలాంటి సందేహం వున్నా అందరూ సర్వోత్తమరావునే అడుగుతారు. ఎందుకంటే ఇలాంటి విషయాల్లో అతను రెడి రేకనర్ లాంటి వాడు క్షణాల మీద ఆలోచించకుండా సమాధానం ఠకీమనీ చెప్పేస్తాడు అతను పని సరిగా చెయ్యడు... ఎప్పుడూ జీతాలు పెరుగుతాయ్... ఎంత పెరుగుతాయ్, డి యే ఎంత పెరిగింది, ఇలాంటి విషయాల గురించే ఆలోచిస్తూ, లెక్కలు కడుతూ తన చుట్టూ ఉన్న వారికి చెప్తుంటాడు.
ప్రయివేట్ కంపెనీలో పని చెయ్యకుండా నెగ్గుకురాగాలుగుతున్నాదంటే. అందుకు కారణం వుంది. ఆ కంపెనీ యం.డి.కి దూరపు చుట్టం ద్వారా రికమెండేషన్ తో ఉద్యోగంలో చేరాడు అందుకే అతని జోలికి ఎవరూ పోరు. అతనికి దయ కలిగితే, బుద్ధి పుడితే, ఓపిక ఉంటే పని చేస్తాడు... లేకపోతే లేదు. అందుకే రాంబాబు తనకు కావలసిన ఇన్ఫర్మేషన్ అతని ద్వారా లభిస్తుందని సర్వోత్తమరావుని అడిగాడు అతనికి ఎన్నడూ లోన్ పెట్టె అవసరం కలగలేదు. అందుకే ఆఫీసులో ఈ లోన్స్ పెట్టవచ్చో తెలుసుకునే అవకాశం కలగలేదు ఇన్నాళ్ళూ. రాంబాబు అడిగిన వెంటనే సర్వోత్తమరావు చెప్పాడు. ఆఫీసులో స్టాఫ్ కి ఇచ్చే లోన్స్ రెండు రకాలు ఉన్నాయని ఒకటి మ్యారేజ్ లోన్ అది స్వయంగా పెళ్లి చేసుకోడానికైనా తీసుకోవచ్చు లేదా తమ మీద ఆధారపడిన అక్కా చెల్లెళ్ళ పెళ్లి చేయడానికైనా తీసుకోవచ్చు.
రెండోది కన్ స్యూమార్ లోన్! ఫ్రిజ్, కాలర్ టీవీ మొదలైనవి కొనుక్కోడానికి ఇచ్చే లోన్. "కానీ నాకు మామూలుగా కావాలంటే ఇవ్వరా? అంటే వేరే ఇంకేదైనా కొనుక్కోడానికి?" అడిగాడు రాంబాబు. "వేరే ఏవేవో కొనుక్కోడానికి ఇవ్వరు కానీ మ్యారేజ్ లోన్ పెట్టి నీ ఇష్టం వచ్చింది కొనుక్కోవచ్చు" చిద్విలాసంగా అన్నాడు ఆయన. "అదెలా... వాళ్లకి తెలిస్తే ఏమీ అనరా?" అమాయకంగా అడిగాడు రాంబాబు. అతని అమాయకత్వానికి ఫకాలుమని నవ్వాడు ఆయన. "నీకు తెలుసా? ఇప్పటికీ నా సర్వీసులో నాలుగు సార్లు డిఫెండెంట్ సిస్టర్స్ మ్యారేజ్ చెయ్యడానికి లోన్ పెట్టాను. మరో మూడు సార్లు కాలర్ టీవీ కొనడానికి లోన్ పెట్టాను. నాకున్నది ఒక్కటే చెల్లెలు... మా ఇంట్లో వున్నది ఒకటే కలర్ టీవీ." "అలా చెయ్యొచ్చా?" తెల్ల ముఖం వేస్తూ అడిగాడు రాంబాబు.
"నిరభ్యంతరంగా చెయ్యొచ్చు... ఒకప్పుడు మ్యారేజ్ లోన్ పెడ్తే పెళ్లి శుభలేఖ లోన్ అప్లికేషన్ తో బాటు ప్రొడ్యూస్ చెయ్యాలని మేనేజ్మెంట్ ఇన్ సిస్ట్ చేసేది. అలాగే కలర్ టీవీ కోసం లోన్ పెడ్తే మన ఏ షాపు నుండి కొనదలిచామో ఆ షాపు నుండి ఇన్ వాయిస్, బిల్స్ ప్రొడ్యూస్ చెయ్యాల్సి వచ్చేది ఆ రకంగా చూస్తే ఎవరూ లోన్స్ పెట్టలేరు అందుకని యూనియన్ ఈ మాటర్ ని టేకప్ చేసి లోన్ అమౌంట్ తో స్టాఫ్ ఏమైనా చేస్కుంటారు మీరు ఆ విషయంలో కల్పించుకో కూడదు నెలనెలా జీతంలో కట్ అవుతుంది. కదా.. మీకేమిటి అభ్యంతరం అంటూ మేనేజ్ మెంట్ తో చర్చలకు దిగి చివరికి వాళ్ళు అభ్యంతరం పెట్టకుండా చేసింది." "మంచి పని చేసింది" మెచ్చుకుంటూ అన్నాడు రాంబాబు. "ఇంతకీ నీకు ఎంత డబ్బు అవసరం?" అడిగాడు సర్వోత్తమరావు. "ఐదు లక్షలు !" చల్లగా చెప్పాడు రాంబాబు. "మా నాయనే! నీకు యాభై వేలు ఏ లోన్ పెట్టినా రాదు. ఒక పని చెయ్ డిపెండెంట్ సిస్టర్ మ్యారేజ్ లోన్, కలర్ టీవీ, వాషింగ్ మిషన్ కొనడానికి కన్ స్యూమార్ లోన్ పెట్టు నీకు రెండు లక్షల దాకా వస్తుంది . ఇంకో మూడు లక్షలు ఎక్కడైనా సంపాదించుకో" సలహా ఇచ్చాడు సర్వోత్తమరావు.