Prema Pandem part 23

 

భుజం మీద చెయ్యి పడేసరికి ఉలిక్కిపడింది సరోజ. ప్రక్కకి తిరిగి చూసింది... రాంబాబు! "ఏమిటి నేను రావడం కూడా గమనించనంత దీర్ఘాలోచనలో మునిగిపోయావ్?" అంటూ ఆమె ప్రక్కన కూర్చున్నాడు రాంబాబు. "ఏం లేదు... మన గురించే ఆలోచిస్తున్నాను. అవునుగానీ. ఇంత ఆలస్యం అయ్యిందే౦?" అడిగింది ఆమె. "మా మేనేజర్ పీనుగా కాస్సేపు వుండమని కూర్చోబెట్టాడు... సరే గానీ మన గురించి ఆలోచిస్తున్నానని అన్నావ్ కదా. ఏం ఆలోచిస్తున్నావ్?" "నిన్న జరిగిన సంఘటన గురించి! సారీ రాంబాబూ... మా నాన్న గారు అలాంటి కండిషన్ పెట్టినందుకు బాధ కలిగిందా?" అతని మోకాలి మీద చెయ్యి వేస్తూ ప్రశ్నించింది ఆమె. రాంబాబు సమాధానం ఏమీ చెప్పకుండా మౌనంగా వుండిపోయాడు. "అయినా మా నాన్నగారు మన పెళ్ళికి అభ్యంతరం ఏమీ చెప్పలేదు కదా?" మళ్ళీ సరోజే అంది. "అభ్యంతరం పెట్టి నీ మనసుని బాధించి తను చెడ్డవాడు అనిపించుకోకుండా తెలివిగా ఇలా మెలిక పెట్టాడు మీ నాన్నగారు..." నిష్ఠూరంగా అన్నాడు రాంబాబు.

"మరీ అంత పిచ్చిగా మాట్లాడకు... మా నాన్నగారు మంచివారు కాబట్టి నిన్నేమీ అనకుండా వదిలి పెట్టారు. అదే వేరే వాళ్లయితే నీ అంతస్తెక్కడ, మా అంతస్తెక్కడ అంటూ దులిపెసేవారు" అంది సరోజ సీరియస్ గా. రాంబాబు దెబ్బ తిన్నట్లు ఆమె వంక చూశాడు. అతని మొహంలోని మార్పుని గమనించిన సరోజ తన తప్పును సర్దుకుంది. "సారీ రాంబాబూ! ఇది నా అభిప్రాయం కాదు. పెద్దవాళ్ళు అలానే మాట్లాడతారు కదా.. నేను కవలం నిన్ను మాత్రమే ప్రేమించాను నువ్వు కూడా అంటే అని నాకు తెల్సు... నాకు ఈ ఆస్థి లేకపోయినా నువ్వు నన్ను ప్రేమించి ఉండేవాడివి... అవునా?" అంది రాంబాబు భుజం మీద చేయ్యేస్తూ. అవునన్నట్టు తల ఊపుతూ రాంబాబు తన భుజం మీద సరోజ చేతిని మెల్లగా తీసేశాడు. అతనికి ఇంకా కోపం పోలేదని గ్రహించింది ఆమె. "సారీ చెప్తున్నాగా! ఇంకా మొహం అలా పెట్టకు... నీకో విషయం తెలుసా? నిన్న నువ్వు వెళ్ళిన తర్వాత మా నాన్నగారు అలాంటి కండిషన్ పెట్టునందుకు నేను ఆయనతో చాలా పోట్లాడాను. మా ఇద్దరికీ మధ్య అర్గ్యూమెంట్ జరిగింది...." అంటూ రాత్రి వాళ్ళిద్దరి మధ్యా జరిగిన సంభాషణ గురించి చెప్పింది.

"కాబట్టి నువ్వేమీ జీవితాంతం ఇలాంటివి కొనక్కర్లేదు కదా? ఈ ఒక్క సారికి... అదీ మా నాన్నగారికి నమ్మకం కలగడం కోసం ఆయన చెప్పినట్టు చెయ్యి" అంది సరోజ. "కానీ ఎలా...? అంత డబ్బు ఎక్కడి నుండి తేను? అదీ కేవలం ఒక్క నెలలో... అప్పుడే ఒక రోజు లటుక్కున గడిచిపోయింది కూడా" తల పట్టుకుంటూ అన్నాడు అతను. "అలా అంటే ఎలా రాంబాబూ! నన్ను వదులుకోవడం నీ కిష్టమేనా?" అతను తల అడ్డంగా ఊపాడు. "మరి నేను దక్కాలంటే నువ్వు మా నాన్నగారు చెప్పినట్టు చెయ్యాల్సిందే... ఆ డైమండ్ నెక్లెస్ కొనివ్వందే మా నాన్నగారు మన పెళ్ళికి ఒప్పుకోరు" ఒక్క క్షణం ఆగింది ఆమె మళ్ళీ తనే అంది.

"నేను మా నాన్నగారిని ఎదిరించి నీతో వచ్చేయ్యలేను... ఆయనే చిన్నప్పటి నుండి నాకు తల్లి తండ్రీ అయి ఎంతో ప్రేమగా పెంచారు... ఆయన అంగీకారాన్ని పొందిగానీ నిన్ను చేసుకోను" రాంబాబు ఏం మాట్లాడలేదు. అతను ఏదో చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. "ఏంటి ఆలోచిస్తున్నావ్?" అడిగింది ఆమె అతని భుజం పట్టి చిన్నగా ఊపుతూ. "ఏం లేదు అంత డబ్బు ఎలా సంపాదించాలా అని ఆలోచిస్తున్నాను." " మీ ఆఫీసులో లోన్ పెట్టొచ్చుగా? అలాంటివేమీ ఇవ్వరా?" అడిగింది సరోజ. ఆ మాట వినగానే అతని మొహం వికసించింది. అతను ఆమె వంక సంతోషంగా చూసి చిన్నగా ఈల వేశాడు.