Read more!

కార్తీక పురాణం చదివితే కలిగే ప్రయోజనం!!

 

కార్తీక పురాణం చదివితే కలిగే ప్రయోజనం!!

 

కార్తీకమాస వైశిష్ట్యం, దాని ప్రాముఖ్యత అందరికి తెలిసినదే. అయితే కార్తీక మాసంలో కార్తీక పురాణం చదివితే ఎంతో పుణ్యమని పెద్దలు మరియు పురాణ పండితులు కాక, స్వయానా ఆ కార్తీక పురాణమే దాని పుణ్యఫలాన్ని వివరిస్తుంది. 

అసలు ఏమిటీ కార్తీకపురాణం??

ముప్పై రోజులు ఉండే కార్తీకమాసంలో ప్రతిరోజు ఆ పరమేశ్వరుడిని పూజిస్తూ, ద్యానిస్తూ, భక్తి పారవశ్యంలో మమేకమవుతూ పురాణాలలో తెలుపబడిన కార్తీకపురాణాన్ని ప్రతిరోజు ఒకో అధ్యాయంగా పఠిస్తారు. అయితే ఈ కార్తీకపురాణం ఏమిటి అంటే ఆ పరమేశ్వరుడి లీలలు, ఆ పరమేశ్వరుడిని పూజించడ్సమ్, ధ్యానించడం, కార్తీక సోమవారం వ్రతం పాటించడం. తద్వారా కలిగే మార్పులు, చేకూరే ప్రయోజనాలు, తొలగే కష్టాలు ఇలాంటి ఎన్నో చిత్ర విచిత్రమైన నాటి కాల ప్రజల అనుభావాల సమాహారమే కార్తీక పురాణం. ఈ కార్తీక పురాణాన్ని శివుడు పార్వతీ దేవికి,  బ్రహ్మ నారధుడికి, మహావిష్ణువు లక్ష్మీ దేవికి చెప్పారని, తరువాత వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్పగా ఆయన కార్తీక పురాణం విని కార్తీక మాసం మొత్తం ఆ విధంగా అనుసరించి దాన్ని భూలోక ప్రజలకు విస్తృతంగా తెలియపరిచాడని ప్రతీతి.

ఫలితం ఏమిటి??

మనం వెళ్లాల్సిన ఊరికి తప్పనిసరిగా బస్ లేదా ఇతర వాహనాలు ఏవో ఒకటి ఎక్కాలి, వాటికి డబ్బు వినియోగించాలి. మన ప్రయాణం సౌకర్యంగా ఉండాలంటే సీట్ దొరకాలి ఇలా ఉంటే ఎంచక్కా ఎలాంటి సమస్య లేకుండా వెళ్లిపోతాం. అట్లాగే హిందూ సంప్రదాయంలో ఉన్న నమ్మకాలను ప్రామాణికంగా తీసుకుంటే ఆ పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన ఈ కార్తీక మాసంలో, ఆ పరమేశ్వరుడు స్వయంగా పార్వతీ దేవికి చెప్పిన ఈ కార్తీక మాస విశిష్టతను, దాని నియమాలకు అనుగుణంగా పాటించడం వల్ల ఆ కైలాసవాసుని కరుణా కటాక్షాలు లభించి మోక్షాన్ని పొందుతారని, మరణానంతరం కైలాస ప్రాప్తి కలుగుతుందని పురాణం కథనాలు మరియు ఎన్నో కథనాల ఉదాహరణలు ఉన్నాయి. అలాంటి కథల సమాహారమే కార్తీక పురాణం.

కార్తీక పురాణం ఎలా చదవాలి??

ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి పూజ చేసుకుని, ఉపవాసం ఉండే వారు నియమాలు ప్రకారం ఉపవాసం ఉండి తరువాత సాయంత్రం శుభ్రంగా కాళ్ళు, చేతులు, ముఖము కడుక్కుని దగ్గరలో ఉన్న శివాలయం, లేదా ఏదైనా విష్ణు స్వరూప ఆలయానికి వెళ్లి దేవుడి దర్శనం చేసుకుని అటు తరువాత ఇంట్లో తులసి కోట వద్ద దీపం వెలిగించి మాస ప్రారంభం నుండి కార్తీక పురాణం లో పేర్కొన్నట్టు రోజుకొక ఆఫహ్యయం చెప్పున చదవాలి. చదవగానే అయిపోయిందని కాదు, అందులో ఉన్న నిఘాడార్థం, దాని తాలూకూ విషయం, దాన్ని జీవితంలో ఎలా పాటించాలి వంటివి అవగాహన చేసుకోవాలి. మరొక ముఖ్య విషయం ఏమిటంటే ఈ కార్తీక పురాణం ప్రతీ కథలో ఏదో ఒక నీతి ఉండనే ఉంటుంది. దాన్ని అర్థం చేసుకుని నిజ జీవితంలో పాటిస్తే ఎంతో గొప్ప మార్పు జీవితంలో చోటుచేసుకుంటుంది.

కాబట్టి కార్తీకమాసంలో కార్తీక పురాణాన్ని పఠించడం మరవకండి. సాధారణ రోజులకంటే ఎంతో గొప్ప పలితాన్ని ఈ మాసంలో పొందవచ్చు.

◆ వెంకటేష్ పువ్వాడ