ఔరంగజేబ్‌కు చెమటలు పట్టించిన కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయం!

 

ఔరంగజేబ్‌కు చెమటలు పట్టించిన కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయం!


తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ అనగానే హైదారబాద్ గుర్తుకు వస్తుంది.  హైదరాబాద్ అనగానే చార్మినార్, గోల్కొండ, బిర్లామందిర్, చౌమహుల్లా ప్యాలెస్, కుతుబ్ షాహీ సమాధులు,  హుస్సేన్ సాగర్ వంటివి గుర్తుకు వస్తాయి. హైదరాబాద్ కు ఎవరు వచ్చినా వీటిని చూడాలని ఎంతో ఉత్సాహం చూపిస్తారు.  కానీ హైదరాబాద్ అంటే కేవలం ఇవి మాత్రమే కాదు.. చారిత్రక హిందూ దేవాలయాలు కూడా హైదరాబాద్ లో ఉన్నాయి.  వీటిలో కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం కూడా ఒకటి.  భారతదేశం మొత్తం మీద వేలాది ప్రతిష్టాత్మక దేవాలయాలను కూల్చివేసిన ఔరంగజేబ్.. కర్మన్ ఘాట్ ఆలయాన్ని కనీసం తాకలేకపోయాడు.  దీన్ని బట్టి ఈ ఆలయం ఎంత శక్తివంతమైనదో అర్థం చేసుకోవచ్చు.  అసలు కర్మన్ ఘాట్ ఆలయం ఎక్కడుంది?  ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటి? ఔరంగజేబ్ ఈ ఆలయాన్ని కనీసం తాకలేక పోయాడు ఎందుకు?   ఈ విషయాల గురించి పూర్తీగా తెలుసుకుంటే..

కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయం..

850 సంవత్సరాలకు పైగా పురాతనమైన కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయం హైదరాబాద్‌లోని అతి పురాతన ఆలయం. ఇక్కడ హనుమంతుడు పూజలు అందుకుంటాడు.  హనుమంతుడు ధ్యాన భంగిమలో ఉంటాడు.  ఈ కారణంగా  ఈ ఆలయాన్ని ధ్యాన ఆంజనేయ స్వామి ఆలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో రాముడు, శివుడు, సరస్వతి దేవి, దుర్గాదేవి, సంతోషిమాత, వేణుగోపాల స్వామి, జగన్నాథుడు,  నవగ్రహాల విగ్రహాలు కూడా ఉన్నాయి.


హనుమంతుడి ఆశీర్వాదాలను పొందడానికి భక్తులు గుంపులు గుంపులుగా కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయాన్ని సందర్శిస్తారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు తన భూభాగాన్ని విస్తరించడానికి హిందూ దేవాలయాలను నాశనం చేయడానికి బయలుదేరిన విషయం అందరికీ తెలిసిందే.. అయితే ఎన్నో ప్రతిష్టాత్మక దేవాలయాలను ధ్వంసం చేసిన ఔరంగజేబు కర్మన్ ఘాట్ లోని హనుమాన్ ఆలయాన్ని మాత్రం ఏమీ చేయలేకపోయాడు.  ఇదే విధంగా తమ జీవితాలలో చెడు కూడా కర్మన్ ఘాట్ హనుమాన్ ఆశీర్వాదంతో తమను తాకకూడదని,  చెడు అనేది తమకు దూరంగా ఉంటుందనే నమ్మకంతో ప్రజలు కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయాన్ని దర్శిస్తుంటారు.

పురాణ కథ..

కర్మన్ ఘాట్ లో ఆలయం నిర్మించబడిన దాదాపు 400 సంవత్సరాల తర్వాత, ఔరంగజేబు దేశవ్యాప్తంగా పంపిన దళాలు పలు హిందూ దేవాలయాలను ధ్వంసం చేశాయి. ఇందులో భాగంగా కర్మన్ ఘాట్ ఆలయాన్ని ధ్వంసం చేయడానికి కూడా ఔరంగజేబు దళాలు  హైదరాబాద్ చేరుకున్నాయి. కర్మన్ ఘాట్ లో హనుమాన్ ఆలయాన్ని కూల్చివేయాలని ఎంత ప్రయత్నం చేసినా వారి ప్రయత్నం విఫలమవుతూనే ఉందట.  ఏదో ఒక శక్తి వారిని అడ్డుకుంటూనే ఉందని,  ఈ కారణంగా ఔరంగజేబు దళాలు తోక ముడిచి వెనక్కు వెళ్ళిపోయాయట.

దళాలు తోక ముడిచి వెనక్కు రావడం,  అక్కడ జరిగిన విషయాలు ఔరంగజేబుకు చెప్పడంతో ఔరంగజేబు కోపంతో ఊగిపోయాడు.  నేనే ఆ ఆలయాన్నిద్వంసం చేస్తాను అని కంకణం కట్టుకుని, ఆలయాన్ని కూల్చివేయడానికి పరికరాలు, పనిముట్లు తీసుకుని అతనే బయలుదేరాడు.  అయితే ఎన్ని సార్లు ప్రయత్నించినా అతను ఆలయం లోపలికి అడుగు పెట్టలేకపోయాడు. ఈ క్రమంలోనే ఔరంగజేబుకు ఒక స్వరం వినబడిందట.  "ఓ రాజా.. నువ్వు దేవాలయాన్ని ధ్వంసం చేయాలని వచ్చావు, కానీ నీ మనస్సును నువ్వు మరింత ధృడం చేసుకోవాలి" అని ఆ స్వరం వినబడటంతో ఔరంగజేబు నిశ్చేష్టడయ్యాడు.  చేతిలో ఆయుధాలు చేజారిపోయాయి. అప్పుడే అతను సరిగ్గా గమనిస్తే.. ఆలయ ప్రాంతం మొత్తం ఒక దివ్య కాంతి ప్రకాశించడం చూశాడు. ఎన్నో ఆలయాలను కూల్చివేసిన ఔరంగజేబు.. కర్మన్ ఘాట్ ఆలయాన్ని కూల్చివేయడంలో విఫలం అయ్యాడు.

చరిత్ర..

 కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయానికి  ఆసక్తికరమైన చరిత్ర ఉంది.  కాకతీయ రాజవంశం పాలన కాలంలో  రాజా ప్రతాప్ రుద్ర ఒకసారి అడవిలో వేటకు వెళ్ళాడట. అలసిపోయిన రాజు ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు, రామ నామ జపం విన్నాడు. ఆ శబ్దం ఎక్కడి నుండి వస్తోందో  తెలుసుకోవడానికి  అడవి లోపలికి నడవడం మొదలు పెట్టాడు.  హనుమంతుడి రాతి విగ్రహం  నుండి  శ్రీరామ నామం ధ్వని వినిపిస్తుండటంతో ఆశ్చర్యపోయాడు.

 విగ్రహానికి నమస్కరించి ఇంటికి తిరిగి వచ్చిన రాత్రి,  ప్రతాప్ రుద్రుడి కలలో రాముడు హనుమాన్ ఆలయాన్ని నిర్మించమని ఆదేశించాడట.   మరుసటి రోజు ప్రతాప రుద్రుడు ఆలయ నిర్మాణానికి పునాది వేశాడు. ఆ విధంగా, ధ్యాన ఆంజనేయ స్వామి ఆలయం 12వ శతాబ్దంలో (సుమారుగా 1143 AD) నిర్మించబడింది . ఇక్కడ  శ్రీ రాముడిని ధ్యానం చేస్తున్న హనుమంతుడి రాతి విగ్రహాన్ని ప్రతిష్టించారు.

కర్మన్‌ఘాట్ ఆలయం ఎక్కడ ఉంది?

కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయం రంగారెడ్డి జిల్లాలోని సరూర్‌నగర్ మండలంలోని సాగర్ రింగ్ రోడ్ సమీపంలో కర్మన్‌ఘాట్ అనే  గ్రామంలో ఉంది. ఈ ఆలయం మహాత్మా గాంధీ బస్ టెర్మినస్ నుండి 9 కిలోమీటర్లు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి 16 కిలోమీటర్లు,  రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి 21 కి.మీ దూరంలో ఉంది .

ప్రశాంతమైన ప్రదేశంలో  తూర్పు ముఖంగా ఉన్న ఈ ఆలయం 3 ఎకరాల విస్తీర్ణంలో  ఉంది,  ప్రాంగణంలో ఒక చిన్న కోనేరు కూడా ఉంది.  హనుమంతుడిని దర్శించి పూజలు చేయడానికి ముందు ఇక్కడ కోనేరులో స్నానం చేసి తరువాత పూజలు చేయడం జరుగుతోంది.

హనుమాన్ జయంతి,  శ్రీరామ నవమి సహా చాలా భారతీయ పండుగలను ఇక్కడ ఎంతో వైభవంగా జరుపుతారు.

                                       *రూపశ్రీ.