బేడి హనుమాన్ ఆలయం.. హనుమంతుడు బంధింపబడిన ఈ ఆలయం గురించి తెలుసా!

 

బేడి హనుమాన్ ఆలయం.. హనుమంతుడు బంధింపబడిన ఈ ఆలయం గురించి తెలుసా!

భారతదేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. ప్రతి ఆలయం వెనుక ఒక ఆసక్తి  కథనం, ప్రత్యేకత ఉంటాయి.  మరీ ముఖ్యంగా భారతీయులు పూజించే దేవతలలో హనుమంతుడు ప్రముఖమైనవాడు.   హనుమంతుడికి సంబంధించి చాలా ప్రముఖమైన ఆలయాలు కూడా ఉన్నాయి.  ప్రతి ఆలయంలో హనుమంతుని పరాక్రమం, హనుమంతుడు శక్తి, హనుమంతుడి బుద్ధిబలం మొదలైనవి కథలుగా చెప్పబడుతుంటాయి.  అయితే పూరీ క్షేత్రంలో ఉండే ఒక హనుమంతుని ఆలయం మాత్రం వీటన్నింటికి కాస్త ప్రత్యేకం.  ఇక్కడ హనుమండుడిని బంధించారని చెబుతారు.  పురాణ కథనాలు, స్థానిక కథనాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అసలు పూరీ క్షేత్రంలో హనుమంతుడిని ఎందుకు బంధించారు? హనుమంతుడిని బంధించడం వెనుక ఉన్న కథనం ఏంటి? తెలుసుకుంటే..

ఒడిశాలోని పూరిలోని శ్రీ జగన్నాథ ఆలయం చాలా పురాతనమైనది.  ఇక్కడ మహా విష్ణువు స్వరూపమైన  జగన్నాథుడు వెలిశాడు. ఇది రథయాత్రకు కూడా ప్రసిద్ధి చెందింది. అయితే ఈ ఆలయానికి సమీపంలో ఉన్న బేడి హనుమాన్ ఆలయం,  జగన్నాథ ఆలయంతో ముడిపడి ఉంది.  వీటికి సంబంధించిన కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

బేడి హనుమాన్ పురాణం..

ప్రసిద్ధ పురాణం ప్రకారం జగన్నాథ ఆలయం సముద్రతీరానికి చాలా దగ్గరలో ఉంటుంది.  ఈ కారణంగా సముద్రపు అలలు పూరీ జగన్నాథ ఆలయం మీద ఎగసి పడుతూ ఉండేవి.  దేవతలు,  గంధర్వులు అందరూ పూరీ జగన్నాథుడిని దర్శించడానికి వచ్చినప్పుడు సముద్రపు అలలు ఎగసి పడుతుండటంతో దేవతలు జగన్నాథుడిని మొరపెట్టుకున్నారట. అప్పుడు జగన్నాథుడు హనుమంతుడిని సముద్రతీరం వద్ద ఉండమని,   అలలు జగన్నాథ ఆలయం మీదకు ఎగసి పడకుండా రక్షణ కల్పించమని కోరాడట.  హనుమంతులు కూడా అలాగే రక్షణగా ఉండేవారు.

కానీ హనుమంతుడు రాముడి బంటు. ఆయనకు రాముడి నామం వినబడితే చాలు.. ఆయన అక్కడికి వెళ్లకుండా ఉండలేడు. దీంతో రామనామం ఎక్కడ వినబడినా ఆయనకు ఆ తీరం నుండి వెళ్లిపోయేవాడట.  హనుమంతుడు అలా వెలుతూ ఉండటంతో సముద్రపు అలలు తిరిగి జగన్నాథ ఆలయం మీదకు ఎగిసి పడేవట.  అందుకని జగన్నాథుడు హనుమంతుడిని సముద్రతీరంలో ప్రతిష్టించి అక్కడే ఉండమని,  అక్కడి నుండి ఎక్కడికి వెళ్లకుండా సంకెళ్లు వేసి మరీ బంధించాడని చెబుతారు.  


ఈ కథనంకు తగ్గట్టే ఈ సముద్ర తీరంలో ఉండే హనుమంతుడి ఆలయంలో హనుమంతుడి ప్రతిమ కాళ్ళకు సంకెళ్లు వేసి ఉంటాయి. ఇలా సంకెళ్లు వేయడం అంటే హనుమంతుడు తన మాటకు, తనకు అప్పజెప్పిన కర్తవ్యానికి కట్టుబడి ఉండటం అని, దీన్ని హనుమంతుడిని బంధించినట్టుగా చూడకూడదని చెబుతారు. ఈ హనుమంతుడే పూరీ క్షేత్రాన్ని రక్షిస్తున్న దేవతలలో ఒకరని కూడా చెబుతారు. ఈ హనుమంతుడి ఆలయాన్ని దరియా మహావీర్ ఆలయం అని కూడా పిలుస్తారు. పూరీలో జగన్నాథ క్షేత్రాన్ని దర్శించే ప్రతి భక్తుడు తప్పకుండా ఈ హనుమంతుడి ఆలయాన్ని దర్శిస్తారని,  వారికి   హనుమంతుని రక్షణ తప్పకుండా ఉంటుందని చెబుతారు.

                        *రూపశ్రీ.