హనుమాన్ జయంతి.. అసలు హనుమాన్ జయంతి ఎప్పడంటే..!
హనుమాన్ జయంతి.. అసలు హనుమాన్ జయంతి ఎప్పడంటే..!
భారతీయులకు హనుమంతుడు అంటే ఎనలేని భక్తి, గౌరవం, ప్రేమ ఉంటాయి. భారతదేశంలో ఎక్కువగా ఉన్న దేవాలయాలు హనుమంతుడి దేవాలయాలే.. ప్రతి గ్రామంలో హనుమంతుడి దేవాలయాలు తప్పకుండా ఉండటం చూడవచ్చు.య అయితే హనుమంతుడి ఆరాధనకు హనుమాన్ జయంతి మరింత శ్రేష్టం. హిందూ పంచాంగం గమనిస్తే,.. రెండు హనుమాన్ జయంతులు కనిపిస్తాయి. ఒకటి చైత్ర శుద్ద పౌర్ణమి కాగా.. రెండవది వైశాఖ శుద్ద దశమి.. ఈ రెండింటిలో నిజంగా హనుమంతుడు జన్మించినది ఎప్పుడు? అసలైన హనుమాన్ జయంతి ఎప్పుడు అని చాలా మంది గందరగోళ పడుతూ ఉంటారు. దీనికి పండితులు చక్కని వివరణ ఇచ్చారు. అదేంటో తెలుసుకుంటే..
వైశాఖ శుద్ద దశమి..
పరాశర సంహిత గ్రంథం ప్రకారం హనుమంతుడు జన్మించినది వైశాఖ శుద్ద దశమి రోజు. తెలుగు రాష్ట్రాలలో ప్రధానంగా వైశాఖ శుద్ద దశమి రోజే హనుమాన్ జయంతిని జరుపుకుంటారు.
చైత్ర శుద్ద పౌర్ణమి..
చైత్ర మాసంలో వచ్చే శుక్ల పక్ష పౌర్ణమి రోజున హనుమాన్ జయంతి జరుపుకోవడం చాలా రాష్ట్రాలలో కనిపిస్తుంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో హనుమాన్ జయంతిని చైత్ర శుద్ద పౌర్ణమి రోజే జరుపుకుంటారు. కానీ.. చైత్ర శద్ద పౌర్ణమి రోజు హనుమాన్ జయంతిని జరుపుకోవడం వెనుక వేరే కారణం ఉంది.
హనుమంతుడు తన చిన్నతనంలో సూర్యుడిని చూసి పండు అనుకుని ఆకాశంలోకి ఎగిరి సూర్యుడిని మింగబోతే.. ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని హనుమంతుడి మీద ప్రయోగించడం తెలిసింది. వజ్రాయుధం దెబ్బకు హనుమంతుడు నేలకొరిగాడు. అయితే అప్పుడు దేవతలందరూ హనుమంతుని పరిస్థితి చూసి తరలివచ్చారు. బ్రహ్మదేవుడు హనుమను తన ఒడిలోకి తీసుకుని హనుమను స్పృహ లోకి తీసుకొచ్చారు. అలాగే.. దేవతలందరూ కూడా తమ శక్తులను కొద్ది కొద్దిగా హనుమంతుడికి దారపోశారు. ఈ సంఘటన తర్వాత హనుమంతుడు తిరిగి పునర్దన్మ ఎత్తినట్టు అయ్యిందని, ఆయన మృత్యువు నుండి బయట పడి మాహా బల పరాక్రమవంతుడిగా మారాడని పండితులు చెబుతారు. అందుకే హనుమంతుడు శక్తివంతుడిగా పునర్దన్మ ఎత్తినట్టు.. ఈ సందర్భాన్నే హనుమాన్ జయంతిగా జరుపకుంటున్నారని పండితులు చెబుతున్నారు.
ఏది జరుపుకోవాలి..
హనుమాన్ జయంతిని వైశాఖ శుద్ద దశమి లేదా చైత్ర మాస శుద్ద పౌర్ణమి.. రెండు రోజుల్లోనూ జరుపుకోవచ్చు. ఎప్పుడు చేసుకున్నా అది హనుమాన్ ఆరాధనే అవుతుంది. కాబట్టి చైత్ర శుద్ద పౌర్ణమి రోజు జరుపుకున్నా ఎలాంటి సమస్య ఉండదని పండితులు చెబుతున్నారు. కాబట్టి ఏడాదిలో హనుమాన్ జయంతి రెండుసార్లు జరుపుకోవడం మంచిదే.
*రూపశ్రీ.