హనుమంతుడు నివసిస్తున్న రహస్య ప్రదేశం..!

 

హనుమంతుడు నివసిస్తున్న రహస్య ప్రదేశం..!

సప్త చిరంజీవులలో హనుమంతుడు కూడా ఒకరు. ఎన్ని యుగాలు గడిచినా.. హనుమంతుడు మాత్రం భూమిపై నివసిస్తూనే ఉంటాడు.  మరీ ముఖ్యంగా కలియుగంలో హనుమ ఆరాధన చాలా ముఖ్యమైనదని చెబుతారు. ఎందుకంటే కలియుగంలో హనుమ ఆరాధన చాలా తొందరగా ఫలితాలు ఇస్తుంది. తనను పూజిస్తూ.. తన సహాయం కోసం ఎదురుచూసే వారికోసం హనుమంతుడు ఎప్పుడూ ముందుంటాడని, కష్టాలన్నీ తొలగిస్తాడని నమ్ముతారు. కలియుగంలో భూమిపై హనుమంతుడు కొలువై ఉన్న రహస్య ప్రదేశం ఉంది. ఆ ప్రదేశం ఎక్కడుందో.. పురాణాలు ఈ ప్రదేశం గురించి ఏం చెబుతున్నాయో తెలుసుకుంటే..

గంధమాదన పర్వతం..

పురాణాల ప్రకారం, కలియుగంలో సకల కష్టాలను నాశనం చేసే హనుమంతుడు గంధమాదన పర్వతంపై కొలువై ఉంటాడు. ఈ ప్రదేశం కైలాస పర్వతానికి ఉత్తరాన, సుమేరు పర్వతానికి సమీపంలో ఉంది. గంధమాదన పర్వతం కైలాస, మానస సరోవరం, బద్రీనాథ్ పర్వతాల మధ్య ఉందని నమ్ముతారు.  పండితుల నమ్మకం ప్రకారం ఈ దివ్య పర్వతం సిద్ధ ఋషులు,  సాధువుల నివాస స్థలం, దీనిని సామాన్యులు చేరుకోవడం కష్టం. గంధమాదన పర్వతం అత్యంత పవిత్రమైన, దైవికమైన ప్రదేశం. హిందూ గ్రంథాలతో పాటు, బౌద్ధ సాహిత్యంలో కూడా గంధమాదన పర్వతం ప్రస్తావించబడింది.

అంతేకాకుండా శాస్త్రాల ప్రకారం, గంధమాదన పర్వతం యక్షులు, యక్షిణులు, కిన్నరులు,  అప్సరలకు కూడా నిలయం. తైత్తిరేయ అరణ్యకంలో కుబేరుడు ఉత్తర దిక్కుకు అధిపతిగా పరిగణించబడ్డాడు, అతని నివాసం గంధమాదన పర్వతంపై ఉందని పేర్కొనబడింది.

భాగవత పురాణం ప్రకారం రాముడు తన అవతారం చాలించి, వైకుంఠలోకానికి వెళుతున్నప్పుడు, హనుమంతుడిని పిలిచి భూమిపైనే నివసించమని కోరాడు. మహాభారతంలో కూడా గంధమాదన పర్వతం ప్రస్తావించబడింది.

ఇతిహాసం ప్రకారం గంధమాదన పర్వతంపైనే హనుమంతుడు భీముడి అహంకారాన్ని అణచివేశాడు. ద్రౌపది ఆజ్ఞ మేరకు భీముడు వేయి రేకుల పద్మం కోసం గంధమాదన పర్వతానికి చేరుకున్నప్పుడు, ఒక ముసలి వానరం తోక దారికి అడ్డంగా ఉంచి కూర్చుంది. అప్పుడు భీముడు ఆ వానరంతో  తోకను అడ్డు తీయమని కోరాడు. దానికి ఆ వానరం.. "నేను ముసలివాడను, దయచేసి మీరే నా తోకను తీసివేసి ముందుకు వెళ్ళండి" అని బదులిచ్చింది. భీముడు ఎంత ప్రయత్నించినా ఆ వానరం తోకను కనీసం ఎత్తలేకపోయాడు. భీముడు  తన పొరపాటును గ్రహించాడు. అప్పుడు భీముడు, "ఓ వానర దేవా, దయచేసి మీ ప్రత్యక్ష రూపంలో దర్శనమీయండి" అని ప్రార్థించాడు. హనుమంతుడు  భీముడి ముందు ప్రత్యక్షమై భీముడి శక్తి అహంకారాన్ని పోగొట్టాడు.

పై కథనాల ప్రకారం చూస్తే.. హనుమంతుడు ఇప్పటికీ గంధమాదన పర్వతం మీద నివశిస్తున్నాడు. అయితే ఆయన యోగ స్వరూపంలో ఉంటారని,  ఆయన అందరి కళ్లకు కనిపించరని చెబుతారు. ఆయనను భవిష్యత్ బ్రహ్మ అని పిలుస్తారు కాబట్టి, ఆయన కలియుగం ముగిసిన తర్వాత కూడా ఉంటాడని కొందరు పండితులు చెబుతారు. అందుకే ఈ కలియుగంలో ధర్మబద్దంగా జీవిస్తూ హనుమను ఆరాధిస్తే.. ఏ కష్టాలు ఏమీ చేయలేవు.

                                     *రూపశ్రీ.