మహిళలు గైనిక్ సమస్యలతో ఇబ్బందిపడటానికి పెద్ద కారణం ఇదే!

 

మహిళలు గైనిక్ సమస్యలతో ఇబ్బందిపడటానికి పెద్ద కారణం ఇదే!

మహిళలు ఒక దశను దాటిన తరువాత వారికి శారీరకంగా ఎన్నో మార్పులు కలుగుతాయి. హార్మోనల్ సమస్యల వల్ల లావు కావడం, చాలా సన్నగా ఉండటం, గర్భసంచి సమస్యలు ఇలాంటివన్నీ ఉంటాయి. ముఖ్యంగా పెళ్లి వరకు అమ్మాయిలు ఎంత బాగుంటారో పెళ్ళయ్యి అమ్మలయ్యాక వారిలో మార్పు కొట్టొచ్చినట్టు కనబడుతుంది. తల్లులయ్యి యంగ్ గా ఉంటూ ఫిట్నెస్  మెయింటైన్ చేసేవారున్నా మహిళా జనాభాతో పోలిస్తే అలా ఉన్నవారు కొద్దిమందే.

పెళ్ళైన తరువాత మహిళలు గర్భవతులైతే నెలనెలా చెకప్ లు చేయించుకుంటూ, డాక్టర్ల సలహాలు పాటిస్తూ ఆరోగ్యాన్ని బానే చూసుకుంటారు. కానీ డెలివరీ తరువాత వారి ఆలోచన అంతా పిల్లల మీదనే. పిల్లలకు ఏమైనా అయితే భరించలేక ఆసుపత్రికి పరిగెత్తే ఓ తల్లి తనకు ఎదురయ్యే గర్భసంచి, హార్మోనల్ సమస్యలను మాత్రం చాలా తేలికగా తీసుకుంటుంది. ఇలాంటి అమ్మలు ఎంతమందున్నారో మాటల్లో చెప్పలేం. 

అన్నిటికంటే ముఖ్యంగా నలభై సంవత్సరాల వయసు దాటిన తరువాత మహిళలు డాక్టర్లను అప్పుడప్పుడు కలసి చెకప్ చేయించుకోవడం ఎంతైనా అవసరం ఉంటుంది. అదే వారి మెనోపాజ్ దశను ఎలాంటి గందరగోళం లేకుండా దాటేందుకు దోహదపడుతుంది.  కానీ చాలామంది అలాంటి చెకప్ లకు అయ్యే ఖర్చును చూసి వెనకడుగు వేస్తారు. వయసు పెరిగేకొద్దీ తీసుకోవలసిన ఆహారంలో నాణ్యత  తగ్గిపోవడం మాత్రమే కాకుండా ఇలా చెకప్ లు కూడా చేయించుకోకపోవడం వల్ల ఆడవాళ్లు గైనిక్ సమస్యలతో ఇబ్బంది పడతారు.

ఇదంతా కుటుంబ, వ్యక్తిగత సమస్య అయితే సమాజం నుండి ఎదురయ్యే సమస్యలు చాలానే ఉంటున్నాయి. దేశం అభివృద్ధి చెందుతుందని ఎంతో గొప్పగా చెబుతారు కానీ ఆడదాని విషయంలో ఆ అభివృద్ధి చాలా వెనకబడి ఉంది. ఆరోగ్యం మీద అవగాహన ఉన్నవాళ్లు ఆసుపత్రులకు వెళ్లినా చాలా వరకు మనసు నొచ్చుకునే విషయాలు జరుగుతూ ఉంటాయి. 

మరీ ముఖ్యంగా ఆడవాళ్లను అనుమానించేలా మాట్లాడటం ఆసుపత్రులలో చాలామంది గమనించే ఉంటారు. గైనిక్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు వివాహితలు అయినా కూడా ఎన్నో ఇబ్బందికరమైన సమస్యలను ఎదుర్కొనాలి.

భర్త వెంట లేకుండా ఆడవాళ్లు గైనిక్ సమస్యల చెకప్ కి వెళితే కొన్ని ఆస్పత్రులలో చెకప్ చేయడానికి అభ్యంతరం వ్యక్తం చేసారు. ఆడవారి గైనిక్ సమస్యలకు కూడా మగవాడి సంతకం, మగవాడి తోడు కావాలని చెప్పే వారిని ఏ భాషలో తిట్టాలో కూడా అర్థం కాదు. కొందరు ఆసుపత్రి యాజమాన్యం మాత్రం పెళ్లి అయినా, కాకపోయినా కొన్నిరకాల పరీక్షలను  మగవారు లేకుండా, తోడు ఎవరినీ తీసుకురానపుడు చేస్తే వారిని అనుమానించాల్సి వస్తుందని చెప్పడం అందరినీ నివ్వెరపరిచే నిజం. వారి అనుమానంలోనూ  నిజం లేకపోలేదు. కొందరు స్కానింగ్ లు, టెస్ట్ ల తరువాత గర్భవతులని తేలితే తొందరపాటు నిర్ణయాల వల్ల తప్పులు జరిగిపోయే అవకాశాలు ఉంటాయి.

మరొక సమస్య ఏమిటంటే గైనిక్ విభాగంలో మగవారు కూడా ఉండటం. మగవారి సమక్షంలో ఆడవారికి సాధారణంగానే కంఫర్ట్ తక్కువగా ఉంటుంది. అయినా సరే అక్కడున్నది డాక్టర్ మాత్రమే అనే విషయాన్ని మనసుకు నచ్చచెప్పుకున్నా ఒకోసారి మగవారి ప్రవర్తన కూడా ఆడవారిని మానసికంగా చాలా ఆందోళనలోకి నెట్టేస్తుంది. 

ఆర్థిక స్థితి అంతంతమాత్రమే ఉన్నవారు ఇలాంటి చెకప్ ల విషయంలో వెనకడుగు వేస్తారు. పిల్లల చదువులకో, ఏ పండుగ నాడు బట్టలకో పనికొస్తాయి ఈ డబ్బు అనే మూర్ఖపు ఆలోచనలో ఆడవారు సమస్యను నెత్తిమీదకు తెచ్చుకుంటారు.

ఫలితంగా ఆడవారు ఎంతోమంది అత్యధికంగా గైనిక్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆడవారిలో ఈ తీరు మారాలి అంటే వారు ఆరోగ్యం కోసం కాస్త ఖర్చుపెడుతూ,మంచి పోషకాహారం తినాలి మరి.

                                    ◆నిశ్శబ్ద.