విగ్రహం లేని విశిష్ట దేవాలయం.. ఇక్కడ దుర్యోధనుడి పేరుతో పన్నులు వసూలుచేస్తారట!
విగ్రహం లేని విశిష్ట దేవాలయం.. ఇక్కడ దుర్యోధనుడి పేరుతో పన్నులు వసూలుచేస్తారట!
భారతీయులు గర్వంగా చెప్పుకునే ఇతిహాసం మహాభారతం. మహాభారతంలో కౌరవులు ప్రతినాయకులుగా కనిపిస్తారు. కౌరవులలో పెద్దవాడు దుర్యోధనుడు. దుర్యోధనుడు చిన్నప్పటి నుంచే పాండవుల పట్ల ద్వేషం, అసూయ పెంచుకుని, వారిపై ఎన్నో దారుణాలకు పాల్పడ్డాడు. అసూయ, కోపం, రాజు కావాలనే కోరికతో తన వదిన అయిన ద్రౌపదిని కూడా హింసించాడు, సంధి చేసుకోవడానికి బదులుగా యుద్ధాన్నే ఎంచుకున్నాడు. ఇన్ని ఘోరాలు చేసినప్పటికీ దుర్యోధనుడి కోసం కేరళలో ఒక ఆలయాన్ని నిర్మించారు. దుర్యోధనుడి పేరుతో ఇక్కడ పన్నులు కూడా వసూలు చేస్తారు. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే..
దుర్యోధనుడు..
మహాభారతంలో దుర్యోధనుడి అసలు పేరు సుయోధనుడు అని చెబుతారు. దుర్యోధనుడు చేసిన దారుణమైన పనుల కారణంగా అతన్ని ప్రతినాయకుడిగా పరిగణిస్తారు. ఈ కౌరవ రాజులో అనేక మంచి గుణాలు కూడా ఉన్నాయి. కుల వ్యవస్థ పట్ల దుర్యోధనుడి వ్యతిరేకత, కర్ణుడితో అతని చెక్కుచెదరని స్నేహం, నియమాలను కఠినంగా పాటించడం, అణగారిన వారి పట్ల అతని కరుణ.. ఇవన్నీ ఎంతో మంచి విషయాలు.
కేరళలో దుర్యోధనుడి ఆలయం..
కేరళలోని పొరువాళి పెరువిరుత్తి మల్నాడు ఆలయం దుర్యోధనుడికి అంకితం చేయబడింది. స్థానిక గాథ ప్రకారం, పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు, దుర్యోధనుడు వారిని వెతుకుతూ కేరళ దక్షిణ అడవులలోని కొండలకు చేరుకున్నాడట. అలసిపోయి, నీరసించిపోయిన అతను. ఆ ప్రాంతపు పాలకుడు , పురోహితుడైన మలనాడ్ అప్పోప్పన్ నివాసంలో నీటి కోసం వెతికాడు. అతని అభ్యర్థన విన్న ఒక వృద్ధురాలు గౌరవ సూచకంగా అతనికి కల్లు ఇచ్చింది. దుర్యోధనుడు ఆ కల్లు తాగి తన దాహాన్ని తీర్చుకున్నాడట.
దుర్యోధనుడి వైభవోపేతమైన వస్త్రాలు, ఆభరణాలు చూసిన ఆ ముసలమ్మ, అతను కురువ కులానికి చెందిన ఒక రాజు అని గ్రహించింది. అంటరాని ముసలిదాన్నైన నేను ఇచ్చిన కల్లు అంతటి రాజు తాగుతున్నాడని ఆమె ఎంతో ఆశ్చర్యపోయిందట. కుల వ్యవస్థను నమ్మని దుర్యోధనుడు, ఆ మహిళ చేసిన పనికి ఎంతగానో చలించిపోయి, కృతజ్ఞతగా దగ్గరలోని కొండపై కూర్చుని గ్రామస్థుల సంక్షేమం కోసం శివుడిని ప్రార్థించాడట. దుర్యోధనుడు గ్రామస్థులకు వ్యవసాయం కోసం విశాలమైన భూములను కూడా దానం చేశాడట.
కేరళలోని పొరువళి పెరువిరుత్తి ఆలయం, దుర్యోధనుడు తపస్సు చేసిన ప్రదేశంలోనే నిర్మించబడిందట. అంతేకాకుండా ఆలయ ఆస్తి పన్నులను కూడా దుర్యోధనుడి పేరు మీదే చెల్లిస్తారు. ఇది ఆయన పట్ల స్థానిక ప్రజలకు ఉన్న గౌరవానికి, ప్రేమకు నిదర్శనం. నేటికీ ఈ ఆలయ పూజారులు కురువ సామాజిక వర్గానికి చెందినవారే ఉండటం విశేషం.
ఆలయ ప్రత్యేకతలు..
కేరళలోని ఈ ఆలయం ప్రత్యేకమైనది, ఎందుకంటే దీని ప్రవేశ ద్వారం వద్ద విగ్రహాలు గానీ, గోపురం గానీ ఉండవు. దీనికి కేవలం మండపం అని పిలువబడే ఒక ఎత్తైన వేదిక మాత్రమే ఉంటుంది. దీనిని స్థానిక భాషలో అలతార అంటారు. పొరువళి పెరువిరుత్తి మలదానంద ఆలయం కేవలం ఒక బహిరంగ వేదిక. భక్తులు మండపంలో నిలబడి తమ ప్రార్థనలు చేస్తారు.
*రూపశ్రీ.