సుబ్రతో రాయ్ అరెస్ట్ ... సహారా సంస్థ అధినేత సుబ్రతో రాయ్ ను నిబంధనలకు విరుద్ధంగా ఇన్వెస్టర్ల నుంచి సహారా సంస్థ సేకరించిన డబ్బుల విషయంలో కోర్టు సుబ్రతో రాయ్ కు గతంలో పలుమార్లు నోటీసులు ఇచ్చింది. సహారా నుంచి స్పందన లేకపోవడంతో నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కోర్టు ధిక్కార కేసులో ఇంతకుముందు వాదనలు విన్న అనంతరం సుప్రీం కోర్టు తమ ముందు హాజారు కావాలని సుబ్రతా రాయ్‌ని ఆదేశించింది. అయితే సుబ్రతా రాయ్ కోర్టు ఎదుట హాజరుకాకపోవడంతో ఆయనకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసింది. సుబ్రతా రాయ్‌ని అరెస్ట్ చేసి తమ ముందు మార్చి 4లోగా హాజరుపర్చాలని సుప్రీం కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కాగా, తన తల్లి (95)కి ఆరోగ్యం బాగోలేదని, అందువల్ల తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని ఇంతకుముందు సుబ్రతా రాయ్ కోర్టును కోరారు. అయితే కోర్టు అతని వినతిని తిరస్కరించింది. సుబ్రతో రాయ్ ను శుక్రవారం లక్నోలో అరెస్ట్ చేశారని సుబ్రతో రాయ్ సీనియర్ అడ్వకేట్ రామ్ జట్మలాని సుప్రీం కోర్టుకు తెలిపారు.
  విఫలమైన 'టి' కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా పట్టుబట్టి మరీ విభజనను సాధించింది. అయితే ఈ విజయాన్ని తెలంగాణా కాంగ్రెస్ నేతలు తమ నియోజకవర్గాలలో విస్తృత ప్రచారం చేసుకోవడంలో విఫలమయ్యారు. అయితే అటు ప్రెస్ మీట్ లు ఇటు రోడ్ షోలు నిర్వహిస్తూ సోనియా వల్లే తెలంగాణా రాష్ట్రం ఏర్పడిందని చెప్పారు తప్ప తమ తమ నియోజకవర్గాలలో పర్యటించలేదు. అలాగే జంపింగ్ జపాంగ్ లు కూడా ఎక్కువ అవుతుండటం కూడా కాంగ్రెస్ ను కలవరపెడుతోంది. కాంగ్రెస్ అధిష్ఠానం సీమాంధ్రలో ఎలాగూ గెలిచే అవకాశాలు లేకపోవడంతో తెలంగాణాలోనైనా కొన్ని సీట్లు రాబట్టుకోవాలని చూసింది. టి.ఆర్.ఎస్. అధ్యక్షుడు కెసిఆర్ మీద ఆశలు పెట్టుకుని విలీనానికి పట్టుబట్టింది. కానీ ఇప్పటికీ కెసిఆర్ ఎటూ తేల్చకుండా ఇంకా నాన్చుడుధోరణిలో ఉన్నారు. ఎలెక్షన్లు దగ్గరపడుతుండటంతో తాము అధికారంలోకి రావాలో, రాహుల్ గాంధీని పిఎం సీట్లో ఎలా కూర్చోపెట్టాలో తెలియక తలపట్టుకుంటుంది.
      తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు. నిన్న పార్లమెంటు సభ్యుడు వివేక్ ఇంట్లో జరిగిన సమావేశంలో తెలంగాణ ఎం.పి.లు ఈ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.  స్పీకర్ ఫార్మట్‌లో ఈ రాజీనామాలను పార్టీ అధిష్ఠానానికి పంపించనున్నట్టు కోమటిరెడ్డి చెప్పారు. పదవులు తమకు ముఖ్యమం కాదని వారు ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు. తెలంగాణకోసం తాము ఎటువంటి త్యాగాలకైనా సిద్ధం అని వారు పేర్కొన్నారు. పదవులు చిత్తుకాగితంతో సమానమని ఎం.పి. మధుయాష్కి పేర్కొన్నారు.
  తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది. ఇంట గెలవలేని జయప్రద, సమాజ్ వాది పార్టీ తరపున పోటీ చేసి తనకు బొత్తిగా పరిచయమేలేని ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంటు సభ్యురాలుగా ఎన్నికయి రచ్చ గెలిచింది. అయితే, అక్కడ ఈ మద్యనే పరిస్థితులు వికటించడంతో, మళ్ళీ మూటా ముల్లె సర్దుకొని రాష్ట్రానికి వచ్చేయడానికి నిర్నయించుకొన్నట్లు గత కొంత కాలంగా ప్రకటిస్తూన్నాకూడా, మన రాజకీయ పార్టీల నుండి ఆమెకు కనీస స్పందన కరువయింది. ఇక ఇలాగయితే లాభం లేదనుకొన్నఆమె తానే స్వయంగా ఏదో ఒక పార్టీని ఎంచుకొని తన రాజకీయ జీవితంలో ‘మరో ప్రస్తానం’ మొదలుపెట్టాలని నిర్ణయించుకొంది.   తెలుగుదేశం పార్టీకి ఎన్ని సిగ్నల్స్ పంపినా స్పందించకపోవడంతో, ఇటీవలే పత్రికలవారితో మాట్లాడుతూ ఇక్కడా అక్కడ సైకిలు పార్టీలు తనవంటి సినిమా తారలను పులిహోరలో కరివేపాకులా వాడుకొని వదిలేసాయని అటువంటి పార్టీలకు తానూ దూరంగా ఉండాలనుకొంటున్నట్లు ప్రకటించేసి తెలుగుదేశం పార్టీతో డిల్లీ నుండే తెగతెంపులు చేసేసుకొంది.   అయితే, ఇక మిగిలినవి తల్లీ పిల్ల కాంగ్రెస్ పార్టీలు. తెలంగాణా సమస్యతో పుట్టెడు కష్టాల్లో ఉన్న తల్లి కాంగ్రెస్ ను నమ్ముకొంటే తనకీ అదేగతి పడుతుందని భావించిన ఆమె, రాష్ట్రంలో ప్రజాదారణ ఉన్న పార్టీలోనే తానూ జేరాలనుకొంటునట్లు ప్రకటించేసింది. అంటే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు సంకేతం అందించినట్లే భావించవచ్చును. అక్కడ అయితే వయ్యారి గడుసు రోజమ్మ తనకు తోడుగా ఉంటుందని ఆమె భావించినా, ఒకే ఒరలో రెండు కత్తులు ఇముడుతాయలేదా అనేది ఆమె ఆలోచించినట్లు లేదు. ఆమె కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేస్తే ఇక అప్పుడు 'నారీ నారీ నడుమ జగన్మోహనుడు' అని టైటిల్ వేసేసుకోవచ్చును. త్వరలో ఆమె చంచల్ గూడా జైలు నుండి తన రాజకీయ జీవితంలో మరో ప్రస్థానం జయప్రదంగా మొదలుపెట్టవచ్చునని సమాచారం.
      జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు. చీము , నెత్తురు ఉన్న తెలంగాణ మంత్రులు , ఎమ్.పిలు , కిందిస్థాయి వరకు ఉన్న కాంగ్రెస్ వారంతా పార్టీని వదలాలని ” అని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ విమర్శించారు. తెలంగాణ ఏర్పాటుకు మరిన్ని సంప్రతింపులు జరపాల్సి ఉందని  కేంద్ర మంత్రులు ఆజాద్, షిండేలు ప్రకటన చేయడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణపై చర్చలు ఒక నాటకం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేస్తున్నామనడం ఒక బూటకం అని అన్నారు. తెలంగాణపై మరిన్ని సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రులు ఆజాద్, షిండేలు ప్రకటించినా కేంద్రం అనుకుంటే తెలంగాణ ఇవ్వవచ్చని అన్నారు.
    వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది. సాధారణంగా విమర్శలు ఎదుర్కొన్న ఏ రాజకీయపార్టీ అయినా తనను తానూ రక్షించుకొనే ప్రయత్నంలో వెంటనే ఆ విమర్శలను ఖండించడమో లేక తనను సమర్దించుకోవడమో లేక దానికి ప్రతి విమర్శలు చేసి ఎదుర్కోవడమో చేస్తుంది. అయితే, వైయస్సార్ కాంగ్రెస్ ఇదివరకు ఒకసారి కోటి సంతకాల సేకరణపై వచ్చిన విమర్శలకు స్పందించినప్పటికీ ఈ రోజు సాక్షి పత్రికలో వచ్చినట్లు సమర్ధంగా లేదు. పార్టీకి సరయిన దశ దిశానిర్దేశం చేసే నాయకుడు లేక పోవడం వల్లనే ఈ జాప్యం అని చెప్పక తప్పదు. ఎట్టకేలకు, ఆ పార్టీకి చెందిన లీగల్ సెల్ కన్వీనర్ ఈ విధంగా స్పందించారు.   “సీబీఐను అడ్డంపెట్టుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై చేస్తున్న కక్షసాధింపు చర్యలకు నిరసనగా చేపట్టిన సంతకాల సేకరణ రాజ్యాంగ విరుద్ధం కాదు. ఈ విషయంపై టీడీపీ, కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలు పూర్తిగా అర్థరహితమని ఆయన కొట్టిపారేశారు. తనకు జరిగే అన్యాయాన్ని, అక్రమాలను రాజ్యాంగ పదవిలో ఉన్న వారికి చెప్పుకునే హక్కు, అర్హత దేశంలోని ప్రతీ పౌరుడికి ఉన్నాయని.. ఈ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.”
  నిన్నటి మొన్నటివరకు తెలుగుదేశం పార్టీని, నందమూరి కుటుంబాన్ని భుజానెత్తుకొని తిరిగిన కొడాలి నాని, జిల్లా నేతలతో పొసగక తెదేపా కాడి దింపేసి, జగన్ పార్టీ కాడి ఎత్తుకోగానే, అయన కొత్త పల్లవి అందుకొని స్వరం కూడా మార్చారు. చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు. బహుశః జిల్లాలో అయన చేస్తున్న పాదయాత్రవల్ల తన అనుచరులు మళ్ళీ తనను వీడి ఎక్కడ తెలుగుదేశం పార్టీలోకి జంపు చేస్తారననే భయంవల్లనో లేక, జిల్లాలో తన ఉనికిని ప్రదర్శించడం అవసరమని భావించడం వల్లనో కొడాలి నాని చంద్రబాబు పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు.   చంద్రబాబుపై ఎదురు దాడి చేస్తూ “మా నాయకుడి గురించి, మా పార్టీ గురించి అడ్డమయిన మాటలాడితే నీ అవినీతి బాగోతాలన్ని నేను బయట పెడతాను. ఇప్పటికయినా నీ దుష్ప్రచారం ఆపకపోతే నేను కూడా రాష్ట్ర పర్యటన చేసి నువ్వు చేసిన తెరవెనుక కుట్రలన్నిటినీ ప్రజల ముందు పెడతాను. కబ్డదార్ చంద్రబాబు!” అంటూ చాల తీవ్ర స్వరంతో హెచ్చరించారు.   అయితే, కొడాలి నాని ఇంత తీవ్రంగా స్పందించదానికి మరో కారణం కూడా ఉండవచ్చును. చంద్రబాబును కూడా ఎదిరించగల నాయకుడిగా తనను తానూ ప్రదర్శించుకొని, తద్వారా జగన్ పార్టీకి కృష్ణ జిల్లాలో తనే ప్రముఖ నాయకుడిగా నిలవాలనే తాపత్రయంతోనే అయన చంద్రబాబుని లక్ష్యం చేసుకొని మాట్లాడి ఉండవచ్చును. నిజంగా ఆయనకి తన నాయకుడిని, పార్టీని చంద్రబాబు విమర్శించడం కష్టమనిపించిఉంటే, ఆయన ఇదివరకే స్పందించి ఉండేవారు. కానీ, అప్పుడు మౌనంగా ఊరుకొని చంద్రబాబు తన జిల్లాలో అడుగుపెట్టాకనే స్పందించడం చూస్తుంటే, తన పార్టీపై ప్రేమ కన్నా తన రాజకీయ భవిష్యత్ ఎక్కడ దెబ్బతింటుందో అనే బెంగే ఆయనలో ఎక్కువగా కనబడుతోంది.
  రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను దిక్కరిస్తూ ముందుకు సాగాలని నిర్ణయించడంతో జంట నగరాలలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అసెంబ్లీ ప్రాంగణంలో ప్రవేసించబోయిన తెలంగాణా జేయేసీ నేత స్వామీ గౌడ్ ను, తెరాస నేత కే.తారక రామారావును, రాజ్ భవన్ వైపు ర్యాలీగా బయలుదేరిన ఉస్మానియా విద్యార్దులను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. వారి అరెస్టులకు నిరసనగా తెలంగాణా జేయేసీ చైర్ మ్యాన్ ప్రొఫెసర్ కోదండరాం తదితరులు తమ కార్యాలయం బయటనే ధర్నాకు కూర్చొని, మిగిలిన నేతలు మరికొందరు రాగానే ఇందిరా పార్క్ కు ర్యాలీగా బయలుదేరుతామని ప్రకటించడంతో హోం శాఖ అప్రమత్తమయింది. కొద్ది సేపటి క్రితం హోం మంత్రి సబితా ఇంద్ర రెడ్డి స్వయంగా విధాన సభ్యుడు చుక్కా రామయ్యకు ఫోన్ చేసి ఒక అర్ధ గంటలో ప్రభుత్వ నిర్ణయం తెలుపుతామని చెపుతూ అంతవరకు వారిని ఇందిరా పార్క్ వైపు వెళ్ళకుండా ఆపమని సూచించారు.
  నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు. అయితే, ఇప్పటికే కాలి నొప్పులతో ఇబ్బందులు పడుతున్న ఆయన, ఈ రోజు కాలి చిటికన వ్రేలు మరింత వాచిపోవడంతో వైద్యుల సలహా మేరకు రేపు అనగా ఆదివారం తన పాదయాత్రకు బ్రేక్ ఇచ్చి ఒక రోజు పూర్తీ విశ్రాంతి తీసుకొనేందుకు అంగీకరించారు.   అయితే, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొంటూ రేపు జిల్లా నాయకులూ, కార్యకర్తలతో సమావేశం అయ్యి, నేతల మద్య నెలకొన్న విబేధాలు తొలగించే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. ఎన్నికలు ముంచు కోస్తున్న తరుణంలో పార్టీకి కంచుకోట వంటి కృష్ణా జిల్లాలో నేతల మద్య తలెత్తుతున్న తీవ్ర విబేధాల వల్ల పార్టీ తీవ్రంగా నష్టపోవడమే గాకుండా, ఇతర పార్టీలకు తమ కంచుకోటలోకి ప్రవేశం కల్పించినట్లవుతుంది అని భావిస్తున్న చంద్రబాబు రేపు జిల్లా నేతలతో సమావేశం అయి పరిస్థితులను చక్క దిద్దే ప్రయత్నం చేయవచ్చును.
  తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్దంగా, శాంతియుతంగా తాము దీక్షలు చేసుకొంటామంటే నిరాకరించడం తమ హక్కులను కాలరాయడమేనని అన్నారు. ఒకవైపు సమైక్యాంద్రావాదుల సభలకు ఎటువంటి అభ్యంతరమూ తెలుపని ప్రభుత్వం తమ సభలు సమావేశాలకు మాత్రం అభ్యంతరం తెలపడాన్ని వారు ఆక్షేపించారు. ప్రభుత్వం పక్షపాత వైఖరితో ప్రవర్తిస్తూ తమ తెలంగాణా గడ్డపై తమకు స్వేచ్చ లేకుండా చేస్తోందని ఆరోపించారు.   అయితే, గతంలో ప్రొఫెసర్ కోదండరాం వంటి నేతలు, తెలంగాణా కు చెందిన కాంగ్రెస్ నేతలతో, మంత్రులతో ప్రభుత్వంపై తీవ్రమయిన ఒత్తిడితెచ్చి సాగించిన ‘మిలియన్ మార్చ్’ సందర్భంగా ఎదురయిన చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకొనే అనుమతికి నిరాకరించి ఉండవచ్చును. మరో రెండు రోజుల్లో అంటే జనవరి 28వ తేదిన కేంద్రప్రభుత్వం ఎటువంటి సానుకూల ప్రకటన చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని ప్రభుత్వాన్ని బెదిరిస్తున్న తెలంగాణా నేతల హెచ్చరికలను దృష్టిలో ఉంచుకొని, ఇటువంటి కీలక తరుణంలో సమరదీక్షలకు అనుమతినీయడం ఆత్మహత్యా సదృశ్యమే అవుతుందని ప్రభుత్వం భావించినందువల్ల కూడా వారికి అనుమతి నిరాకరించి ఉండవచ్చును. నిన్న రాజమండ్రీలో ఉండవల్లి అద్వర్యంలో సమైక్యాంద్రా వాదుల సభకు ప్రభుత్వం అనుమతినీయడం, తమకు అనుమతి నిరాకరించడం కూడా తెలంగాణా నాయకులకు ఒక ఆయుధంగా మారిందని భావించవచ్చును. అయితే, రాజధానిలో శాంతి భద్రతలే ముఖ్యం గనుక ప్రభుత్వం అనుమతి నిరాకరించాడానికే మొగ్గు చూపిందని భావించవచ్చును.
        "వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి సిఎల్‌పి నాయకుడిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను గురించి 41మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌ హైకమాండ్‌ వద్దకు పంపినప్పుడు ఉండవల్లి ఎందుకు వ్యతిరేకించలేదు. టిఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకుని తెలంగాణపై హామీ ఇచ్చినప్పుడు… కరీంనగర్‌ సభలో సోనియాగాంధీ ప్రసంగాన్ని అనువాదం చేసినప్పుడు, రాష్ట్రపతి పార్లమెంట్‌లో ప్రస్తావించినప్పుడు ఉండవెల్లికి సమైక్యాంధ్ర గుర్తుకు రాలేదా” అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఉండవెల్లి అరుణ్ కుమార్ ను విమర్శించారు. ఆయన ఉండవల్లి కాదు, ఒక ఊసరవెల్లి అని ఎద్దేవా చేశారు. ఆయన జై ఆంధ్ర ఉద్యమంలో పాల్గొని, 2009 డిసెంబర్‌ 9వ తేదీ తర్వాత తెలుగు వారికి రెండు రాష్ట్రాలు ఉంటే తప్పేమిటని అభిప్రాయపడి, ఇప్పుడేమో సమైక్యాంధ్ర సభ పెట్టడం విడ్డూరం అని అన్నారు. ఈ సభలో పిసిసి అధ్యక్షులు బొత్స సత్యనారాయణ పాల్గొనడ మేమిటని, ఆయన ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీకి అధ్యక్షులా, ఆంధ్ర ప్రాంతానికి మాత్రమేనా అని హరీష్‌ రావు ప్రశ్నించారు. రాజమండ్రి సభలో వైఎస్సార్‌సిపి, దాని అధ్యక్షులు జగన్‌ గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం, ఆయన ఎందుకు జైళ్లో ఉండాల్సి వచ్చిందో ప్రజలకు వివరించకపోవడం పలు అను మానాలకు దారితీస్తుందని అన్నారు.
సర్కార్లను, రాయలసీమను బ్రిటిష్ వాళ్ళకు అమ్మిన సొమ్ముతో  హైదరాబాద్ కు నిజాం సోకులు! -డా. ఎబికె ప్రసాద్ [సీనియర్ సంపాదకులు]         మైసూర్, మహారాష్ట్ర యుద్ధాలలో మొలబంటిగా కూరుకుపోయిన నిజాం ప్రభువులు, ఈ రెండు ప్రాంతాలపైన ఆధిపత్యం కోసం ఒక వైపునుంచి ఫ్రెంచివాళ్ళు, ఇంకొక వైపునుంచి బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ పాలకులు పెనుగులాడుతూండగా అంతిమంగా బ్రిటిష్ సామ్రాజ్యవాదుల వైపు కొమ్ముకాసిన వాళ్ళూ, కృష్ణానదికి దక్షిణంగా ఉన్న దేశాన్నంతా (హదుర్, తిరుచునాపల్లి జిల్లాలు సహా)నిజాం సలాబత్ జంగ్ ఒక దశలో ఫ్రెంచివాళ్ళకు ధారాదత్తం చేశాడు. కృష్ణాలోని నిజాంపట్నం, ఆలమ్మనార్ ప్రాంతాలు, గోదావరిలోని కొండవీడు, నర్సాపురంలను కూడా మొదట్లో నిజాం ప్రభువులు ఫ్రెంచివాళ్ళకు అమ్మి సోమ్ముచేసుకున్నారు!   క్రమంగా బ్రిటిష్ వాళ్ళు ఈస్టిండియా కంపెనీ గొడుగు కింద తమ రాజ్యవిస్తరణకు భారతదేశంలో బలమైన ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో ఒక్క దక్షిణ భారతంలోనే కాదు, యావద్భారతంలోనే పెక్కు హైందవ రాచరిక ప్రభువులంతా బ్రిటిష్ వాడికి సలాములు కొట్టుకుంటూ దేశద్రోహానికి గజ్జెకట్టిన సమయంలో అదే బ్రిటిష్ వాళ్ళు పరాయి చొరబాటును, వారి పాలనా విస్తరణను ఎదురొడ్డి నిలిచిన దేశభక్తులు, మొనగాళ్ళూ - మైసూర్ అధినేతపైన హైదరాలీ అతని కొడుకు టిప్పుసుల్తాన్ అని మరిచిపోరాదు! ఆ ఘడియలలో కూడా నిజాం ప్రభువులు ఈ ముస్లీం వీరులకు వ్యతిరేకంగా బ్రిటిష్ వాళ్ళతో కుట్రలు పన్నినవాళ్ళు నిజాం ప్రభువులనీ మనం మరవలేము!   "శత్రువుకు శత్రువు మిత్రుడన్న"  సామెతకు తగినట్టుగా నిజాం పాలకులు కర్నాటక, మహారాష్ట్ర పాలకులపైన కత్తిఎత్తిన బ్రిటిష్ వాళ్ళతో కుమ్ముక్కు అయినందుకు బ్రిటిష్ పాలకులకు ఉత్తర సర్కారులను, మధ్య సర్కారులలో కొన్ని ప్రాంతాలనూ, పూర్తిగా రాయలసీమనూ టోకుగానూ, చిల్లరగానూ అపారమైన పరిహారం తీసుకొని ధారాదత్తం చేసేశారు! ఇదంతా బ్రిటిష్ వాడితో నిజాం ప్రభువులు కుదుర్చుకున్న సైన్యసహకార సంధి ఫలితంగా జరిగింది. దాంతో హైదరాబాద్ పైన బ్రిటిష్ వాడి పెత్తనానికి దగ్గర 'తొవ్వ' ఏర్పడింది. మొగలాయీల నుంచి దండయాత్రల ద్వారా అప్పనంగా పొందిన హైదరాబాద్ నగరం అలా బ్రిటిష్ వాడి "సైన్య సహకారం''తో నిజాం ప్రభువుల 'రక్షిత సంస్థానం'గా రూపొందింది! తమకు ప్రక్కలో బల్లెంగా ఉన్న మహారాష్ట్ర పాలకుల బెడదను ఎదుర్కోవడానికి, బ్రిటిష్ వారికి కూడా దక్కన్ లో తమ సామ్రాజ్య విస్తరణ కోసం మహారాష్ట్ర పేష్వాలతో తలపట్లు తప్పలేదు కనుక ప్రభువులను ఉపయోగించుకుని అటు మహారాష్ట్ర ప్రజల్ని, ఇటు సర్కారు, రాయలసీమ, హైదరాబాద్ సంస్థాన ప్రజలనూ అందరూ కలిసి విరగతొక్కేశారు! అందుకే హైదరాబాద్ తెలుగుభాషా ప్రజలు నివశించే తెలంగాణలో అంతర్భాగంగా కాకుండా ప్రత్యేక సంస్థానంగా ఉంటూ వచ్చింది. ఆ సంస్థానాన్ని నిరంకుశ పాలనకోసం కేంద్రంగా చేసుకోడానికి తెలంగాణాలోని ఆంధ్రుల (తెలుగువారిని), మరాఠీల, కన్నడిగుల సంపదనూ, శ్రమనూ నిజాం ప్రభువులు దోచుకు తిన్నారు. ఇది చారిత్రిక సత్యం. అందుకే హైదరాబాద్ నగరంగాని, సికిందరాబాదు గానీ, నేటి రంగారెడ్డి జిల్లాగానీ నిజాం ఆధీన "సుబాలు''(ప్రాంతాలు)గా ప్రకటించుకున్న తొల్లింటి 16 జిల్లాలలో ఎన్నడూ లేవు! ఇది చాలా ఆసక్తికరమైన వెల్లడి! నిజాం పాలకుల హయాములో 1901లో ఒకసారి, 1905లో మరొకసారి జిల్లాలను విభజించారు. హైదరాబాదు సంస్థానాన్ని నాలుగు ప్రాంతాలు (సుబాలు)గా విభజించారు. ఈ సుబాలను 17 జిల్లాలుగా, 104 తాలూకాలుగా మళ్ళీ విభజించారు. ఈ సుబాలలో చేరని జిలాలను నల్గొండ జిల్లాకు చెందిన ప్రసిద్ధ రచయిత చరిత్ర పరిశోధకుడు, సాహిత్యవేత్త అయిన కుర్రా జితేంద్రబాబు గుర్తించారు. అవి అత్రాఫ్ బల్దా జిల్లా, ఇందులోని తాలుకాలు 4 : మలక్ పేట, అంబరుపేట, థారూరు, మేడ్చల్; కాని నిజాం సుబాలలో చేర్చనిదీ, చేరనిదీ హైదరాబాద్ జిల్లా. ఇందులోనివే హైదరాబాదు, సికిందరాబాద్ లు. చరిత్ర తెలియకుండా ఆందోళన చేసే రాజకీయ నిరుద్యోగులకు (కొందరు సి.పి.ఐ. నాయకులు సహా) ఏయే ప్రాంతాల పెట్టుబడిదారులు హైదరాబాదును సాకుతూ వచ్చారో, వీరిలో ఏయే విదేశీ కంపెనీలకు చెందినవాళ్ళున్నారో కూడా తెలియదు!   రెండు ప్రపంచయుద్ధాలలోనూ  బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు అండదండలు అందించి సాయపడినవాళ్ళు నిజాం ప్రభువులే. దక్కన్ సహా మొత్తం దక్షిణభారతంపై బ్రిటిష్ వాళ్ళు ఆధిపత్యానికి మార్గం సుగుమం చేసినవాళ్ళు నిజాములు. ఈ పరిణామానికి దోహదం చేసిన ప్రముఖులలలో నవాబ్ అఫ్జలుద్దౌలా, అతని మంత్రి మొదటి సాలార్ జంగ్ ఉన్నారు.   18-19 శతాబ్దాలలో బ్రిటిష్ వాళ్ళ ప్రవేశంతోనే హైదరాబాదు సంస్థానంలో (హైదరాబాద్ లోనే) తిష్టవేసిన బ్రిటిష్ వ్యాపార కంపెనీ "పామర్ అండ్ కో'' కంపెనీ. ఆ కంపెనీ అధినేత విలియమ్ పామర్ 1800లోనే నిజాం సైన్యంలో జీవితం ప్రారంభించాడు. ఇతను నిజాం సైన్యంలో చేరి పనిచేసిన తొలి బ్రిటిష్ పౌరుడని ప్రతీతి. 1814 నాటికి బ్రిటన్ తరపున ఒక సాధికార ప్రతినిధిగానే వ్యవహరిస్తూ నిజాం పాలకుల విధానాలను శాసించే స్థితికి ఎదిగిపోయిన వ్యాపారి పామర్. 18వ శతాబ్దం ఆఖరిదశలో నిజాం సైన్యానికి నిజాం జీతాలు చెల్లించడానికి బొక్కసం ఖాళీ అయి దివాళా ఎత్తిన స్థితిలు, గతంలో ఫ్రెంచి వాళ్ళు ఆదుకున్నట్టుగానే బ్రిటిష్ వాళ్ళు ఈ పామర్ కంపెనీ ద్వారానే జీతాలు చెల్లించే ఏర్పాట్లు చేశారని మరిచిపోరాదు! చందులాల్ అనే వ్యాపారి ద్వారా పామర్ కంపెనీలో నిజాంకు ఒప్పందం కుదిర్చిన వాడు రసలె అనే బ్రిటిష్ అధికారి. ఆనాడు హైదరాబాద్ సంస్థాన ప్రజలు ఈ కంపెనీని ఓ వ్యాపారసంస్థగా కాకుండా బ్రిటిష్ ప్రభుత్వమే హైదరాబాద్ లో ఉన్నట్టు భావించేవారు! హైదరాబాద్ సంస్థాన రాజకీయ వ్యవస్థలో ఈ "పామర్ అండ్ కో'' చాలా దుష్టమైన ప్రభావం కల్గించిందని సుప్రసిద్ధ నగర చరిత్రకారిణి సరోజినీ రేగాని "నిజాం-బ్రిటిష్ సంబంధాలు'' అన్న విశిష్ట రచనలో పేర్కొన్నారు ! ఈ  "పామర్ అండ్ కో'' కంపెనీని ఈస్టిండియా కంపెనీ సర్కారులను, రాయలసీమ ప్రాంతాలను దోచుకోగా వొనగూడిన ఆదాయం ఏడాదికి రూ.30 లక్షలని [ఈనాటి అంచనా ప్రకారం అది లక్షలకోట్లు] తేలింది! అంటే పామర్ అండ్ కంపెనీకి నిజాం ఇచ్చిన దానికన్నా ఆరులక్షలు అదనంగా వచ్చేది. అందుకే చరిత్రకారిణి రేగాని యిలా వ్యాఖ్యానించింది "హైదరాబాద్ లో ఈ వ్యాపార (పామర్) సంస్థను తెరవడమే హైదరాబాద్ రాజ్య దోపిడీకి శ్రీకారం చుట్టింది. ఈ సంస్థ జిల్లాలను కొల్లగొట్టింది''! అల నిజాం ప్రతిపత్తిని గౌరవిస్తున్నట్టు ఫ్రెంచివాళ్ళు ఒక దశవరకూ నటిస్తూ నిజామే సైన్యానికి జీతాలు అందజేసే ఏర్పాటును లోపాయికారిగా చేయగా, ఆ తరువాత బ్రిటిష్ వాళ్ళూ అదే పద్ధతిలో నిజాం సైన్యం జీతాలు కూడా చెల్లించుతూ వచ్చారు! ఇలా ఫ్రెంచి, బ్రిటిష్ సామ్రాజ్య సేనలతో పాటు తమ సిపాయీలకు కూడా జీతాలు చెల్లించలేని పరిస్థితిలో ఫ్రెంచి, నిజాం సిపాయిలు నిజాంపై తిరుగుబాటు ప్రయత్నాలు చేశారు. ఆ సమయంలోనే సర్కారు ప్రాంతాలనూ, రాయలసీమనేగాక, హైదరాబాద్ ను కూడా బ్రిటిష్ వాళ్ళకి నిజాం అమ్మేశాడు! తరువాత నిజాముల్ ముల్క్ దక్కను సుబేదారయిన తర్వాత తన ఆక్రమణలో వున్నా రాజ్యాన్ని 24 పరగణాలుగా విభజించాడు. వీటిలో రాజమండ్రి, మొగల్తూరు ప్రాంతాలు కూడా ఉన్నాయి. అంతేగాదు, మహారాష్ట్ర ప్రాంతాల్ని జయించాలంటే దక్కన్ లో నిజాం అండదండలతోనే సాధ్యం కాబట్టి బ్రిటిష్ వాళ్ళు వ్యూహం పన్నిన ఫలితంగా కూడా మహారాష్ట్రులు చెలరేగిపోయి దక్కన్ లోని శ్రీకాకుళం దాకా పాకిపోయారు! నిజాం పాలకుల హయాములోనే యానాం కూడా తెలుగువారికి దక్కకుండా పోయింది! నిజాం పాలకుల ఈ బలహీనత వల్లనే, భీమునిపట్నంనుంచి మచిలీపట్నం (బందరు)దాకా తెలుగుప్రజలపైన, తెలుగుప్రాంతాలపైన తమ ఆధిపత్యాన్ని ఫ్రెంచి, బ్రిటిష్ వాళ్ళకు వివిధ దశల్లో బదిలీ చేసి భారీ పరిహారం పొందారు. హైదరాబాద్ లో ఆనాటికి ఉన్న బ్యాంకులను కొల్లగొట్టి ఫ్రెంచి సైనికులకు జీతాలను నిజాంద్వారా చెల్లింపజేసినా వాడు బుస్సీ! 1803 మరాఠీ యుద్ధం చివరిదశలో నిజాం సైనికదళాల అసమర్థత, నిర్వీర్యత బట్టబయలయింది. ఆ సమయంలో నిజాం సైన్యాన్ని శక్తివంతమైన దళంగా పునర్వ్యవస్థీకరించడం కోసం బ్రిటిష్ జనరల్ వెలస్లీ హైదరాబాద్ లోని తమ రెసిడెంట్ కు ఆదేశాలిచ్చాడు. నిజాం ఆధీనంలో ఉన్న బీరార్ ఆదాయమంతా ఆశ్వికుల నిర్వహణకోసం ఖర్చుపెట్టాలని బ్రిటిష్ వాళ్ళు షరతు పెట్టారు. ఎందుకు? ఆ డబ్బుని నిరుద్యోగులుగా ఉన్న యూరోపియన్ ఆఫీసర్లు చాలామందిని నిజాం సైన్యాలకు దళాధిపతులుగా నియమించి, జీతాల కింద జమచేశారు!   ఆ మాటకొస్తే, మొత్తం నిజాం దళాలను, బ్రిటిష్ దళాల జీతవేతనాలను ఆదుకున్నది హైదరాబాద్ లో తిష్టవేసిన బ్రిటిష్ కంపెనీ "పామర్ అండ్ కంపెనీ''యే. దక్కన్ లో నిరంకుశ రాచరికాలకు, తమ సామ్రాజ్య విస్తరణకు వ్యతిరేకంగా దక్కన్ లో తలెత్తే తిరుగుబాట్లను అణచివేయడం నిజాంకు, బ్రిటిష్ వారికీ యిష్టం. నిజాం రాజ్యంలో వ్యాపార లావాదేవీల ద్వారా విలియమ్ పామర్ బ్యాంకింగ్ సంస్థను నెలకొల్పడమేగాక, బ్యాంకింగ్ వ్యవస్థలో పామర్ సంస్థలతో పాటు బ్రిటిష్ రెసిడెంట్ అయిన హెన్రీ రసెల్ మిత్రుడయిన శామ్యూల్ రసెల్ సంస్థలు కూడా పెట్టుబడులు గుప్పించాయి. ఇలా హైదరాబాద్ నిర్మాణంలో గతంలో ఫ్రెంచి, బ్రిటిష్ వ్యాపారసంస్థలు పెట్టుబడులు గుప్పించగా, సర్కారుల్ని, రాయలసీమను, తెలంగాణా గ్రామసీమల్ని కొల్లగొట్టడం ద్వారా నిజాం పాలకులు హైదరాబాద్ ను నిర్మించగా, హైదరాబాద్ ఆధునిక నిర్మాణంలో ఒక్క కోస్తాంధ్ర, రాయలసీమ పెట్టుబడిదారులే గాక తెలంగాణాలోని మోతుబరులయిన పెట్టుబడిదారుల (అటూ, యిటూ కూడా ఎన్.ఆర్.ఐ.లు) పెట్టుబడులతో పాటు భారతదేశం నలుమూలలనుంచి వివిధ రాష్ట్రాల పెట్టుబడిదారులు పెట్టుబడులు కూడా ఉన్నాయి; అందుకే హైదరాబాద్ నగరం దక్కన్ లోని ఈ భాగంలో ఉన్నప్పటికీ వివిధ రాష్ట్రాల ప్రజలకు, సంస్కృతులకు సాంస్కృతిక కేంద్రంగా కూడా ఉందని మరచిపోరాదు. బహశా అందుకే మంత్రులు నాగేందర్, ముఖేష్ గౌడ్ లు విభిన్న ప్రాంతాల, ప్రజల భాషా సంస్కృతులకు నిలయమైన హైదరాబాద్ ను ప్రత్యేక రాష్ట్రంగా ఉంచడం శ్రేయస్కరమని ప్రతిపాదించి ఉంటారు!  
  మనం ఏరంగు కళ్ళద్దాలు పెట్టుకొంటే లోకం కూడా ఆ రంగులోనే కనబడుతుంది. జగన్ మోహన్ రెడ్డి కేసు విషయంలో సిబిఐ మరియు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి నాటకమాడుతూ బెయిలు దొరకనీయకుండా చేస్తూన్నాయని జగన్ తరపువారు ఆరోపిస్తుంటే, అతనిని కాపాడేందుకే రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకు అడిగిన సమాచారం ఇవ్వకుండా తాత్సారం చేస్తోందని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ జగన్ వాదన సరయినదనుకొంటే, కోర్టులు ఈ విషయంలో రాష్ట్రప్రభుత్వానికి ఈ పాటికే సమన్లు జారీచేసి ప్రభుత్వ సంజాయిషీ కోరుండాలి. గానీ కోరలేదు, అంటే జగన్ నిర్దోషని కోర్టులు కూడా నమ్మకపోవడమేకారణం అనుకోవచ్చును. ఒకవేళ చంద్రబాబు వాదన సరయినదయితే, రాష్ట్రంలో ప్రధానప్రతిపక్షపార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీయే స్వయంగా ఆ పనికి పూనుకొని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేఖంగా కోర్టులో కేసువేసి సిబిఐకి సమాచారం అందివ్వకుండా జాప్యం చేస్తూ జగన్నిఎందుకు కాపాడుతున్నారని నిలదీయవచ్చును. గానీ తెలుగుదేశం ఆపని ఇంతవరకు చేయలేదు. అంటే చంద్రబాబు చేస్తున్న ఆరోపణలలోనూ పస లేదనుకోవాలి. ప్రజలకి ఆసక్తి ఉన్న అటువంటి విషయాలను ప్రస్తావిస్తూ రాజకీయంగా తన ప్రత్యర్దులను విమర్శించడానికే ఉపయోగించుకొంటున్నారని భావించాల్సి ఉంటుంది. అయితే, ఇంతకీ జగన్ కేసు విషయంలో ఎవరి వాదన సరయినది అని తెలుసుకోవాలంటే ప్రజలే తమకు నచ్చిన రంగుటద్దాలు పెట్టుకొని చూసి తెలుసుకోవాలి.
        కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పేర్ని నాని షాకిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.   చంచల్‌గూడ జైలులో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని  ములాఖత్ సమయంలో నాని కలిశారు.  తాను కష్టకాలంలో వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి అండగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తనను ఎన్నుకున్న ప్రజల కోసం ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని అనుకున్నానని.. కానీ జగన్ ను ఇబ్బంది పెడుతుంటే తట్టుకోలేక పార్టీ వీడానని చెప్పారు. నియోజకవర్గ ప్రజల అభిప్రాయం మేరకే తాను జగన్ పార్టీలో చేరాలనే నిర్ణయానికి వచ్చానన్నారు.  తాను త్వరలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతానని చెప్పారు.
        వైఎస్ఆర్ కాంగ్రెస్ కి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. జగన్‌కు బెయిల్ రాకపోవటంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నిరుత్సాహంలో మునిగిపోయింది. సుప్రీం కోర్టు ఆదేశాలు, కేసు విచారణలో ఉన్న కారణంగా జగన్‌కు బెయిల్ ఇవ్వలేమని కోర్టు ఈ రోజు తేల్చి చెప్పింది. ఆస్తుల కేసు దర్యాఫ్తు చేస్తున్న సిబిఐ తుది ఛార్జీషీటు దాఖలు చేసిన తర్వాతే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. తుది ఛార్జీషీటు వరకు పిటిషన్ దాఖలు చేయవద్దని సుప్రీం కోర్టు సూచించిందని, కేసు విచారణ కొనసాగుతోందని, ప్రభుత్వం సహకరించడం లేదని చెప్పిన సిబిఐ వాదనలతో హైకోర్టు ఏకీభవించి జగన్ బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చింది.

జగన్ సర్కార్ కి కొడాలి గండం.. త్వరలో ఏపీలో ప్రభుత్వం మారనుందా?

రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు. తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చిన పార్టీ.. సొంత పార్టీ నేతల కుమ్ములాట వల్లనో, ప్రత్యర్థి పార్టీల ఎత్తుల వల్లనే అనూహ్యంగా అధికారం కోల్పోవచ్చు. లేదా ఇక ఈ పార్టీ పని పనైపోయింది అనుకున్న పార్టీ.. అనూహ్యంగా పుంజుకుని అధికారంలోకి రావొచ్చు. ఇలా రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు. ఇలాంటి ఊహించని పరిణామం త్వరలో ఏపీలో చోటుచేసుకోనుందా అంటే.. ఒక సెంటిమెంట్ బట్టి చూస్తే అవుననే అనిపిస్తుంది.   గుడివాడ నుండి గెలిచి మినిస్ట్రీ లో ఎవరున్నా ఆ గవర్నమెంట్ పూర్తి కాలం ఎప్పుడూ లేదు. మద్రాస్ ప్రెసిడెన్సీ నుండి అదే సెంటిమెంట్ కొనసాగుతూ వస్తుంది. ఆ సెంటిమెంట్ నుండి ఎన్టీఆర్ కూడా తప్పించుకోలేకపోయారు. 1955 లో గుడివాడ నుండి గెలిచిన దళిత ఎమ్మెల్యే వేముల కూర్మయ్యకి ప్రకాశం పంతులు కేబినెట్ లో స్థానం కల్పించారు. కానీ, ఆ గవర్నమెంట్ పూర్తి కాలం లేదు. ఎన్టీఆర్ కూడా 1983 లో గెలిచి ముఖ్యమంత్రి అయినా 1984 లో నాదెండ్ల భాస్కరరావు కారణంగా ముఖ్యమంత్రి పీఠానికి దూరమయ్యారు. ఇక, 1985 లో హిందూపురం, గుడివాడ నుండి పోటీ చేసి రెండు చోట్లా గెలిచిన ఎన్టీఆర్.. సెంటిమెట్ తో గుడివాడని వదిలేసుకున్నారు. 1989 లో గుడివాడ నుండి గెలిచిన కటారి ఈశ్వర్ కుమార్ ని చెన్నారెడ్డి కేబినెట్ లోకి తీసుకున్నారు. అయితే ఆయన ప్రభుత్వం కూడా పూర్తికాలం లేదు. ఇలా గుడివాడ నుండి గెలిచి మినిస్ట్రీ లో ఎవరున్నా ఆ గవర్నమెంట్ పూర్తి కాలం లేదు. ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.   గుడివాడ నుండి ప్రస్తుతం కొడాలి నాని ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన జగన్ మంత్రివర్గంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. అయితే, 151 ఎమ్మెల్యేలతో మాకు తిరుగులేదు అనుకుంటున్న అధికార పార్టీని ఇప్పుడు గుడివాడ సెంటిమెంట్ వెంటాడుతోంది. ముఖ్యంగా ఇటీవల జరుగుతున్న పరిణామాలు ఆ సెంటిమెంట్ ని మరింత బలపరుస్తున్నాయి. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి హిందూ దేవాలయంపై దాడులు, హిందూ దేవాలయాల్లో అన్యమత ప్రచారాలు పెరిగిపోయాయి. దీంతో హిందువుల్లో అసంతృప్తి మొదలైంది. దీనికి తోడు అగ్నికి ఆజ్యం పోసినట్టు.. తిరుమలలో అన్యమతస్తులకు డిక్లరేషన్ అవసరం లేదని అధికార పార్టీ చెప్పటం హిందువుల ఆగ్రహానికి కారణమైంది. ఇది చాలదు అన్నట్టు కొడాలి నాని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి హిందువుల ఆగ్రహాన్ని పదింతలు పెంచారు. ఎక్కడా లేని రూల్ తిరుమలలో ఎందుకు?, దేవుడి బొమ్మ చెయ్యి విరిగితే ఏమన్నా నష్టమా?, రథం కాలిపోతే ఏమైంది ఇంకొకటి చేపిస్తున్నాంగా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏపీలో దుమారాన్ని రేపాయి. ఆయనను వెంటనే బర్తరఫ్ చేయాలని హిందూ సంఘాల నుండి పెద్ద ఎత్తున డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఈ నిరసన సెగలు కొడాలి నాని మంత్రి సీటుకే కాదు, అసలు పార్టీ అధికారానికే ఎసరు పెట్టినా ఆశ్చర్యంలేదు. ఎందుకంటే కొడాలి నాని వ్యాఖ్యల మూలంగా ఆ స్థాయిలో ఆగ్రహావేశాలు భగ్గుమన్నాయి.   తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చినప్పటికీ వైసీపీని కొన్ని విషయాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అసలే సీఎం జగన్ మెడకి కేసులు కత్తి వేలాడుతూ ఉంటుంది. ఇప్పటికే అవినీతి ఆరోపణల కేసులో 16 నెలలు జైలులో ఉన్న ఆయన.. మరోసారి జైలుకి పోయే అవకాశం లేకపోలేదు. మరోవైపు, ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకున్న బీజేపీ.. తెలుగు రాష్ట్రాలలో అధికారంపై కన్నేసింది. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ కీలక నేత జ్యోతిరాదిత్య సింధియాని ఆకర్షించి అధికారం చేపట్టిన బీజేపీ.. ఏపీలోనూ అలాంటి ఎత్తులు వేసే అవకాశం లేకపోలేదు. దానికితోడు బీజేపీపై హిందూ పార్టీగా ముద్ర ఉంది. ఇప్పుడు వైసీపీ హయాంలో హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులు బీజేపీకి ఎంతోకొంత కలిసొచ్చే అవకాశముంది. ఇప్పటికిప్పుడు బీజేపీ ఏపీలో ఏదైనా ఎత్తు వేసినా.. జగన్ ఎదిరించి నిలబడే సాహసం చేయకపోవొచ్చు. ఎందుకంటే ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తలచుకుంటే ఆయనను మళ్ళీ  కృష్ణ జన్మ స్థానానికి పంపడం చిటికెలో పని. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు, వైసీపీని వెంటాడుతున్న కేసులు, బీజేపీకి ఉన్న అవకాశాలు.. వీటిని బట్టి చూస్తుంటే ఏపీలో అధికారం మారడం సాధ్యమే అనిపిస్తోంది. మరి ఈ గుడివాడ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి ఏపీలో అనూహ్య పరిణామాలు ఏమన్నా జరుగుతాయేమో చూడాలి. హిందూ దేవాలయాలపై దాడులు, హిందూ దేవుళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలతో అధికార పార్టీపైనా, కొడాలి నానిపైనా తీవ్ర ఆగ్రహంతో ఉన్న భక్తులు, హిందూ సంఘాలు మాత్రం.. గుడివాడ సెంటిమెంట్ వెంటనే వర్కౌట్ అయితే బాగుండు దేవుడా అని కోరుకుంటున్నారు.

బెంజ్ కారు ఎంతపని చేసింది?.. ఇప్పుడు జగన్ సర్కారు ఏం చేస్తుందో మరి!!

గత ప్రభుత్వ హయాంలో వేలు, లక్షల కోట్లు అవినీతి జరిగిందని ఆరోపించిన వైసీపీ సర్కార్.. చివరికి ఈఎస్ఐ స్కామ్ ను తెరమీదకు తీసుకొచ్చి టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేసింది. మొదట 150 కోట్ల అవినీతి జరిగింది అన్నారు. తరువాత మూడు కోట్లు అన్నారు. చివరికి అసలు అచ్చెన్నకు డబ్బు అందినట్టు ఎలాంటి ఆధారాలు లేవు అన్నారు. అంటే ఆధారాలు లేకుండానే అరెస్ట్ చేశారు. కేవలం ఆయన ఒక కంపెనీని పరిశీలించండని ఇచ్చిన లేఖ ఆధారంగా.. అర్థరాత్రి గోడలు దూకి మరీ అరెస్ట్ చేశారు. శస్త్రచికిత్స జరిగిందని చెప్పినా వినకుండా వందల కిలోమీటర్లు కారులో తిప్పారు. దీంతో అచ్చెన్నకు రెండోసారి శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆయన కరోనా బారిన కూడా పడ్డారు. దాదాపు 80 రోజుల తరువాత అచ్చెన్న బెయిల్ పై విడుదల అయ్యారు. ప్రతిపక్షంలోని బలమైన గొంతుని నొక్కాలన్న ఉద్దేశంతోనే అచ్చెన్నను అక్రమంగా అరెస్ట్ చేసి కక్ష సాధింపులకు దిగుతున్నారని టీడీపీ ఆరోపించింది. ఇదిలా ఉంటే.. అసలు ఆధారాలు లేకుండానే ఈఎస్ఐ స్కామ్ పేరుతో అచ్చెన్నను 80 రోజులు నిర్బంధించిన జగన్ సర్కార్.. ఇప్పుడు సాక్షాత్తు కార్మిక శాఖా మంత్రి మీదే ఆరోపణలు వస్తున్నాయి. మరి ఇప్పుడేం చేస్తుంది జగన్ సర్కార్?.   ఏపీ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం కుమారుడు ఈశ్వర్‌కు.. పుట్టినరోజు సందర్భంగా ఈఎస్ఐ స్కాములో అరెస్ట్ అయిన ఏ-14 కార్తీక్ ఖరీదైన బెంజ్ కారు గిఫ్ట్ గా ఇచ్చారు. అయితే, ఇది గిఫ్ట్ కాదని మంత్రికి ఇచ్చిన లంచం అని టీడీపీ ఆరోపిస్తోంది. మంత్రి మాత్రం అబ్బే తన కుమారుడు కారుతో ఫోటో మాత్రమే దిగాడని, తన కుమారుడు చేతుల మీదుగా వాళ్ళు కారు తీసుకున్నారని, ఆ కారు తనదని రుజువు చేస్తే రాజీనామా చేస్తానని సవాల్ చేశారు.    అయితే మంత్రి ఆ కారు తమ పేరు మీద లేదని చెప్తున్నప్పటికీ.. దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ కారు మంత్రి కుమారుడిది కాకపోతే ఆయన ఆ కారులో ఎందుకు తిరుగుతున్నట్టు?. మంత్రి కుమారుడు ఈశ్వర్ ఆ కారులో తిరుగుతున్న ఫోటోలు, వీడియోలు చాలా సోషల్ మీడియాలో ఉన్నాయి. ఎవరైనా ఒకటి రెండు సార్లు ఫొటోస్ దిగుతారు. అంతేకాని, ఏడాది పొడవునా తమ దగ్గరే కారు ఉంచుకొని ఫొటోస్, వీడియో తీస్తూ తిరుగుతుంటారా. అంటే ఆ కారు ఎవరు పేరు మీదున్నా.. ఆ కారు మాత్రం మంత్రి కుమారుడిదే అని అర్థమవుతుంది.   అసలు ఈఎస్ఐ స్కాములో ఏ-14 ఉన్న కార్తీక్ మంత్రి కుమారుడుకి అంత ఖరీదైన కారు ఎందుకు ఇచ్చాడు. కోట్ల విలువైన గిఫ్ట్ లు ఇచ్చే అంత రిలేషన్ ఏంటి వాళ్ళకి?. అతను ఏ లబ్ది పొందకుండానే అంత ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చాడా?. ఒకసారి మంత్రి ఈ కార్తీక్ ని దత్త పుత్రుడిగా ప్రకటించారట. అంతేకాదు, ఈఎస్ఐ స్కాములో అరెస్ట్ అయిన అచ్చెన్నకు బెయిల్ రావడానికి 80 రోజులు పట్టింది. కానీ, ఏ-14 కార్తీక్ కి మాత్రం వెంటనే బెయిల్ వచ్చింది. అదెలా సాద్యమైంది? మంత్రి అండదండలు లేకుండానే ఇదంతా జరుగుతుందా?.   ఇంకో విషయం ఏంటనే..మంత్రి కుమారుడు వీడియోస్ లో మరి కొన్ని ఖరీదైన కార్లు కూడా కనిపిస్తున్నాయి. అంతంత ఖరీదైన కార్లు ఎక్కడి నుండి వచ్చాయి?. అంతేకాదు మంత్రి కుమారుడి వివాహ వేడుక సినీస్టార్స్ వెడ్డింగ్ అంత రిచ్ గా జరిగింది. ఇన్నిన్ని డబ్బులు ఎక్కడివి?. గత ఎన్నికల అఫిడవిట్ లో మంత్రి ఇచ్చిన ఆస్తుల విలువ ఎంతో తెలుసా?. చరాస్తులు స్థిరాస్తులు మొత్తం కలిపి 80 లక్షలు. కేవలం 80 లక్షల ఆస్తి కలిగిన కుటుంబం అంత ఖర్చు ఎలా పెడుతుంది? కోట్ల ఖరీదైన కార్లు ఎలా వాడుతుంది. అయితే కొని ఉండాలి లేదా ఎవరైనా ఇచ్చి ఉండాలి. ఒకవేళ కొని ఉంటే.. మంత్రి అఫిడవిట్ లో తప్పుడు వివరాలు ఇచ్చినట్టు లెక్క. అంటే అసలు ఆయన ఎన్నికే చెల్లదు. పోనీ గిఫ్ట్ ఇచ్చారనుకుందాం. ఏ లబ్ది పొందకుండా ఎవరైనా ఎందుకు గిఫ్ట్ ఇస్తారు. అది కూడా ఈఎస్ఐ స్కాములో ఏ-14 ఉన్న వ్యక్తి గిఫ్ట్ ఇవ్వడం వెనక ఉద్దేశం ఏంటి?. దీని వెనుకున్న నిజాలు బయటపడాలి. సీఎం అయిన దగ్గర నుండి అవినీతి రహిత పాలన అందించడమే లక్ష్యం అని చెప్తున్న జగన్.. మంత్రిపై చర్యలు తీసుకుంటారా? లేక మా పార్టీలో ఉన్నోళ్లు అంతా కడిగిన ముత్యాలు అంటూ అవినీతి మరకలతోనే ముందుకు సాగుతారో చూడాలి.   మంత్రి జయరాం మీద ఆరోపణలు కొత్తకాదు. ఈ ఏడాది కాలంలోనే ఆయనపైనా, ఆయన సన్నిహితులపైనా ఎన్నో ఆరోపణలు వచ్చాయి. ఆయన సమీప బంధువు పేకాట స్థావరాలు నిర్వహిస్తూ పట్టుబడ్డారు. ఆయన అనుచరులు అక్రమంగా ఇసుక, మద్యం రవాణా చేస్తారన్న ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు ఆయనపై భూకబ్జా ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా బెంజ్ కార్ల లంచం ఆరోపణలు. అసలు ఒక మంత్రి పై ఇన్ని ఆరోపణలా. కారు తమ పేరు మీద ఉంటే రాజీనామా చేస్తానంటున్న మంత్రి.. తనపై వచ్చిన ఈ ఆరోపణలన్నీ అబద్దమని నిరూపిస్తారా?. నిరూపించలేకపోతే రాజీనామా చేస్తారా?.

అధ్య‌క్షా.. నాకు సెల‌వు కావాలి!

పార్ల‌మెంటు మొద‌లై ప‌ట్టుమ‌ని మూడు రోజులు కూడా కాలేదు. ఆదిలోనే హంస‌పాదు ఎదుర‌వుతున్న‌ది. ఎంపీల్లో చాలామంది పార్ల‌మెంటుకి హాజ‌ర‌య్యేందుకు బొత్తిగా ఇష్ట‌ప‌డ‌టం లేదు. క‌రోనా వైర‌స్ ఏమాత్రం జాలి లేకుండా త‌న మానాన తాను దూకుడుగా ఎగిరి గంతేస్తున్న ఈ త‌రుణంలో ఎవ‌రికి వారు మేక‌పోతు గాంభీర్యం ప్ర‌ద‌ర్శిస్తూ పార్ల‌మెంటుకి వ‌స్తున్న‌ట్టు అనిపిస్తున్న‌ది. బుధ‌వారం మాజీ ప్ర‌ధాన‌మంత్రి మ‌న్మోహ‌న్ సింగ్, మాజీ ఆర్ధిక మంత్రి చిదంబ‌రంతో స‌హా డ‌జ‌నుకు పైగా ఎంపీలు సెల‌వు చీటీలు స‌మ‌ర్పించారు. వ‌యోభారం వ‌ల్ల స‌మావేశాల‌కు రాలేక‌పోతున్నారా అంటే అదేమీ కాదు. క‌రోనా కార‌ణంగా ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల‌తోనే వారీ నిర్ణ‌యానికొచ్చారు. మ‌న్మోహ‌న్ సింగ్ వ‌య‌స్సు 87 ఏళ్లు. అందువ‌ల్ల ఆయ‌న అవ‌స్ధ‌ని అర్ధం చేసుకోవ‌చ్చు. ఎక్కువ వ‌య‌స్సున్న వాళ్ల‌ని క‌రోనా అతి సునాయాసంగా ఆక‌ర్షిస్తున్న‌ద‌న్న వైద్యుల అప్ర‌మ‌త్త‌త నేప‌థ్యంలో మ‌న్మోహ‌న్ సింగ్ సెల‌వు పెట్ట‌డాన్ని పెద్ద‌గా అభ్యంత‌ర‌పెట్ట‌లేము. ఇక చిదంబ‌రం. ఆయ‌నకు 75 ఏళ్లు. కాబ‌ట్టి చిదంబ‌రానికీ మిన‌హాయింపు ఇవ్వొచ్చు. ఇలాంటి పెద్ద‌లు ఈ స‌మావేశాల చివ‌రి దాకా సెల‌వు అడిగారు. వీళ్లే కాదు. వైకాపా త‌ర‌పున రాజ్య‌స‌భ‌కు ఎన్నికైన పిర‌మ‌ల్ న‌త్వానీ కూడా సెల‌వు పెట్టారు. ఇలా మొత్తంమీద ప‌ద‌మూడు మంది దాకా సెల‌వు బాట‌లో ఉన్నారు. రాజ్య‌స‌భ చైర్మ‌న్ వెంక‌య్య నాయుడు వీరంద‌రికీ సెల‌వు మంజూరు చేశారు. మ‌రి రేప‌ట్నుంచి ఇంకా ఎంత‌మంది ఇదే బాట‌లో ప‌య‌నిస్తారో తెలీదు.    ఇటు రాజ్య‌స‌భ‌, అటు లోక్‌స‌భ ఇలా సెల‌వుల ప‌ర్వంలో ఉంటే స‌మావేశాలు స‌జావుగా సాగుతాయా అన్న సందేహాలున్నాయి. అయితే ప్ర‌స్తుతం ఉభ‌య స‌భ‌లు అటు సంఖ్యాప‌రంగానే కుదించుకున్నాయి. పూర్తి స్ధాయిలో స‌భ్యులు హాజ‌రు కావ‌డం లేదు. అలాగే ప్ర‌శ్నోత్త‌రాలు ఎత్తేశారు. ఇలా కీల‌క‌మైన స‌భా కార్య‌క్ర‌మాల‌నే కుదించాల్సి వ‌చ్చింది. మ‌రి రాజ్యాంగ నియ‌మాల ప్ర‌కారం పార్ల‌మెంటు జ‌ర‌పాలి. పెండింగ్ బిల్లులు ఉంటాయి. వాటిని ఆమోదించి చ‌ట్ట‌రూపం తేవాలి. అవి నిజానికి చాలా ముఖ్యమైన‌విగా ఉంటాయి. కాని అవ‌త‌ల క‌రోనా ప‌రిస్థితి అలా ఉన్న‌ప్పుడు ప్ర‌భుత్వం కూడా మ‌మ అనే ప‌ద్ద‌తిలోనే స‌భ‌ను సాగిస్తున్న‌ది. అందువ‌ల్ల ఎంత‌మంది స‌భ్యులు సెల‌వులు పెట్టినా స‌భ‌లో పూర్తి చేయాల్సిన ప్ర‌భుత్వ‌ప‌ర‌మైన కార్య‌క్ర‌మాలు పూర్తి చేయ‌డానికి పెద్ద‌గా అడ్డంకులు ఏవీ ఉండ‌క‌పోవ‌చ్చు. ఎటొచ్చీ స‌మావేశాల చివ‌రిదాకా ఎంత‌మంది స‌భ‌లో నిలుస్తార‌న్న‌దే ప్ర‌శ్న‌. తామెవ్వ‌రం లేకుండా బిల్లులు ఆమోదించ‌డానికి వీల్లేద‌ని ఎంత‌మంది అడ‌గ‌గ‌ల‌రు? అడిగితే ప్ర‌భుత్వం మిన్న‌కుంటుందా? అవ్వా కావాలి..బువ్వా కావాలి అంటే కుద‌ర‌దు..అవ‌త‌ల క‌రోనాకి లీవూ మీరే అడుగుతారు..మ‌ళ్లీ బిల్లుల మీద చ‌ర్చ‌లో మీరే ఉండాల‌ని అడుగుతారా అంటూ ఎదురుదాడి చెయ్య‌దా? -రాజా రామ్మోహ‌న్ రాయ్‌

ఐశ్వ‌ర్యా రాయ్‌తో కంపారిజ‌న్‌.. స్నేహ‌ యాంగ్రీ రియాక్ష‌న్‌!

  టాలీవుడ్‌లో 'ఉల్లాసంగా ఉత్సాహంగా' వంటి హిట్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి, త‌ర్వాత కొన్ని సినిమాల్లో క‌నిపించిన స్నేహా ఉల్లాల్ గుర్తుంది క‌దా. ఐశ్వ‌ర్యా రాయ్‌తో తెగ‌తెంపుల‌య్యాక ల‌క్కీ సినిమాతో ఆమెను హీరోయిన్‌గా ప‌రిచ‌యం చేశాడు స‌ల్మాన్ ఖాన్‌. దాంతో ఐశ్వ‌ర్య మీద కోపంతోటే ఆమెలా ఉన్న స్నేహ‌ను స‌ల్మాన్ ఇండ‌స్ట్రీకి తీసుకొచ్చాడ‌నే కామెంట్స్ అప్ప‌ట్లో బాగా వినిపించాయి. ఆ త‌ర్వాత ఇంట‌ర్వ్యూల‌లో స్నేహ సైతం ఐశ్వ‌ర్య‌తో పోలిక గురించి ఏమంటారు? అనే ప్ర‌శ్న‌ను ఎదుర్కొంది. ఒకసారి అలాంటి ప్ర‌శ్నే ఎదుర‌వ‌డంతో స్నేహ కాస్త గ‌ట్టిగానే రియాక్ట్ అయ్యింది. ఐశ్వ‌ర్య‌తో పోలికకు తాను ఏమాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వ‌న‌ని ఆమె తేల్చి చెప్పేసింది. ఆ సంద‌ర్భంలో ఆమెలో ఆవేశం దాచాల‌న్నా దాగ‌లేదు. "మొద‌ట్నుంచీ నేనిలాగే ఉంటాను. ఐశ్వ‌ర్యా రాయ్ ఇంట‌ర్నేష‌న‌ల్ సూప‌ర్ స్టార్‌. నాకెలాంటి బ్యాగ్రౌండూ లేదు. ముంబైలో స్కూల్ చ‌దివి అయిపోయాక‌, కాలేజీలో చేరి, అట్నుంచి అటే సినిమాల్లోకి వ‌చ్చాను. అప్ప‌ట్నుంచీ న‌న్ను ఐశ్వ‌ర్య‌తో కంపేర్ చేస్తూ రావ‌డం నాపై ప్రెష‌ర్ పెంచింది. "నువ్వు చూడ్డానికి ఐశ్వ‌ర్య‌లా ఉన్నావ్ కాబ‌ట్టే ఆమెతో నిన్ను కంపేర్ చేస్తున్నారు. దాని కోసం నువ్వు స్ట్రెస్ ఫీల‌వ‌న‌వ‌స‌రం లేదు. అందంగా ఉండే మ‌రొక‌రిలా నువ్వు ఉన్నావంటే, నువ్వూ అందంగా ఉన్న‌ట్లే క‌దా. దాన్ని యాక్సెప్ట్ చెయ్యి." అని స‌ల్మాన్ చెప్పారు. నిజాయితీ చెప్పాలంటే అందం గురించి నేనెక్కువ‌గా ఆలోచించ‌ను. అస‌ర‌మైతే త‌ప్ప మేక‌ప్ వేసుకోను. నేను అందంగా ఉండే మ‌రొక‌రిలా ఉన్నాన‌ని అంటే దాన్ని నేనేమీ ప‌ట్టించుకోను. స్కూలు, కాలేజీలో చ‌దువుకునేట‌ప్పుడు కూడా 'ఆమె చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది', 'ఆమె ఐశ్వ‌ర్య‌లా ఉంటుంది' అనే కామెంట్స్ విన్నాను. అయితే నేనెప్పుడూ అందంపై శ్ర‌ద్ధ పెట్ట‌లేదు. నాకు టామ్‌బాయ్‌లా ఉండ‌టం ఇష్టం. లూజ్ జీన్స్ ప్యాంట్ వేసుకొని తిరిగేదాన్ని. కాబ‌ట్టి ఐశ్వ‌ర్య‌లా క‌నిపిస్తాన‌నే దానికి నేను ప్రాధాన్యం ఇవ్వ‌ను" అని కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు చెప్పింది స్నేహ‌.

తెర‌పై క‌నిపించేది క‌మ‌ల్‌.. వినిపించేది బాలు!

  అంద‌రు హీరోల కంటే క‌మ‌ల్ హాస‌న్‌కు బాలు గొంతు బాగా న‌ప్పుతుంద‌నేది అనేక‌మంది అభిమానుల అభిప్రాయం. అందులో త‌ప్పేమీ లేదు. పాట‌ల విష‌యం అలా ఉంచితే.. తెలుగులో క‌మ‌ల్ డ‌బ్బింగ్ సినిమా అంటే ఆయ‌న‌కు గొంతుగా మారేది మాత్రం బాలునే. కె. బాల‌చంద‌ర్ డైరెక్ట్ చేసిన 'మ‌న్మ‌థ లీలై' (1976) మూవీ నుంచి ఇది ప్రారంభ‌మైంది. తెలుగులో 'మ‌న్మ‌థ లీల' పేరుతో విడుద‌లైన డ‌బ్బింగ్ సినిమా కోసం తొలిసారిగా క‌మ‌ల్‌కు తెర‌పై వాయిస్‌ ఇచ్చారు బాలు. అది మొద‌లు.. తెలుగులో రిలీజ‌యిన క‌మ‌ల్ ప్ర‌తి డ‌బ్బింగ్ సినిమాకూ డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌గా మారారు బాలు. ఇక క‌మ‌ల్ ప‌ది క్యారెక్ట‌ర్లు చేసిన 'ద‌శావ‌తారం'లో ఏడు క్యారెక్ట‌ర్ల‌కు బాలు త‌న గొంతునిచ్చారు. వాటిలో ఫిమేల్ క్యారెక్ట‌ర్ కూడా ఉండ‌టం గ‌మ‌నార్హం. తెర బ‌య‌ట బాలు, క‌మ‌ల్ బంధం కూడా ఎంతో ప్ర‌త్యేక‌మైంది. బాలు అంటే క‌మ‌ల్‌కు పూజ్య భావం. ఆయ‌న‌ను సొంత అన్న‌య్య‌లా క‌మ‌ల్ భావిస్తారు. బాలు మృతితో క‌మ‌ల్ బాధ వ‌ర్ణ‌నాతీతం. "ఆయ‌న నా విమ‌ర్శ‌కుడు, స‌ల‌హాదారు. న‌ట‌న‌పై ఆయ‌న పెద్ద‌గా ఆస‌క్తి చూప‌లేదు. తెలుగులో విడుద‌లైన నా సినిమాల‌కు ఆయ‌న డ‌బ్బింగ్ చెప్పారు. వందో అంత‌కంటే ఎక్కువో.. బ‌హుశా 150 సినిమాలు కూడా కావ‌చ్చు. ప్ర‌తి సంద‌ర్భంలోనూ ఎస్పీబీ సాంగ్ ఉంటుంది.. ఆఖ‌రుకి క‌రోనా వారియ‌ర్స్ కోసం కూడా ఆయ‌న పాడారు. అనేక సంద‌ర్భాల్లో నాకు పీఆర్వోగా వ్య‌వ‌హ‌రించారు." అని నివాళి అర్పించారు క‌మ‌ల్‌.

బాలు నా ఆరోప్రాణం.. అంటూ రోదించిన విశ్వ‌నాథ్‌!

  లెజండ‌రీ డైరెక్ట‌ర్ కె. విశ్వ‌నాథ్‌తో ఎస్పీ బాలుకు అవినాభావ సంబంధం. నిజానికి ఇద్ద‌రు బంధువులు కూడా. విశ్వ‌నాథ్‌కు బాలు వ‌రుస‌కు సోద‌రుడు. బాలు ఉత్త‌మ‌గాయ‌కుడిగా తొలి జాతీయ అవార్డును అందుకుంది విశ్వ‌నాథ్ డైరెక్ట్ చేసిన సినిమాతోటే. అది విశ్వ‌విఖ్యాతి గాంచిన 'శంక‌రాభ‌ర‌ణం'. అందులోని ప్ర‌తి పాటా ఒక ర‌స‌గుళిక‌. ఆ త‌ర్వాత విశ్వ‌నాథ్ మ‌రో ఆణిముత్యం 'సాగ‌ర‌సంగ‌మం' సినిమాతోనూ బాలు నేష‌న‌ల్ అవార్డ్ తీసుకున్నారు. బాలు సినీ గాయ‌కుడిగా మారిన రెండేళ్ల త‌ర్వాత విశ్వ‌నాథ్ డైరెక్ట్ చేసిన సినిమాకు తొలిసారిగా పాడాడు. ఆ సినిమా.. 'ఉండ‌మ్మా బొట్టు పెడ‌తా' (1968). అందులో బాలు పాడిన తొలి పాట 'రావ‌మ్మా మ‌హాల‌క్ష్మీ రావ‌మ్మా'.. అప్ప‌ట్నుంచీ విశ్వ‌నాథ్‌తో ఆయ‌న అనుబంధం కొన‌సాగుతూ వ‌చ్చింది. విశ్వ‌నాథ్ సినిమా అంటేనే సంగీతానికి అందులో అత్యంత ప్రాధాన్యం ఉంటుంద‌నే విష‌యం మ‌న‌కు తెలుసు. శాస్త్రీయ సంగీతానికి పెద్ద‌పీట వేసే విశ్వ‌నాథ్ చిత్రాలు పాట‌ల‌కు అమిత ప్ర‌సిద్ధి పొందాయి. బాలు లేర‌నే వార్త తెలియ‌గానే విశ్వ‌నాథ్ దుఃఖానికి అంతులేకుండా పోయింది. స్పందించ‌డానికి కూడా వెంట‌నే ఆయ‌న నోటి వెంట మాట‌లు రాలేదు. "భ‌గ‌వంతుడు ఇంత అన్యాయం చేస్తాడ‌నుకోలేదు. బాలూ.. నువ్వు నా సోద‌రుడివి మాత్ర‌మే కాదు, నా ఆరోప్రాణం. అలాంటిది ఇంత తొంద‌ర‌గా జ‌రుగుతుంద‌నుకోలేదు. ఇలాంట‌ప్పుడు మాట్లాడ్డానికి కూడా మాట‌లు రావు. అత‌ని ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని, అత‌ని కుటుంబ స‌భ్యులంద‌రూ దీన్ని ఓర్చుకొని, మామూలు విష‌యంగా తీసుకోవాల‌ని కోరుతున్నాను." అని చెప్పి క‌న్నీరు మున్నీర‌య్యారు విశ్వ‌నాథ్‌.

హాస్పిట‌ల్‌లో వ్యాయామం చేస్తున్న బాలు చివ‌రి వీడియో వైర‌ల్‌!

  కోకిల ఏ కొమ్మ‌నుంచి పాడినా సుమ‌ధురంగానే ఉంటుంద‌న్న‌ట్లు ఎలాంటి పాట పాడినా వ‌హ్వా అనిపించిన గాన‌గంధ‌ర్వుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఇవాళ అమ‌ర‌గాయ‌కుడిగా మారిపోయారు. శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం 1:04 గంట‌ల‌కు ఆయ‌న స్వ‌ర్గ‌స్తుల‌య్యార‌ని బాలు త‌న‌యుడు చ‌ర‌ణ్ ప్ర‌క‌టించ‌గానే కోట్లాది అభిమానుల గుండెలు ప‌గిలాయి. ఒక గాయ‌కుడి మ‌ర‌ణానికి దేశవ్యాప్తంగా ఈ స్థాయి విషాదం నెల‌కొన‌డం ఇప్పుడే చూస్తున్నాం. ఇప్ప‌టికీ ఆయ‌న మ‌న మ‌ధ్య లేర‌నే వాస్త‌వాన్ని జీర్ణించుకోవ‌డం క‌ష్టంగానే అనిపిస్తోంది. కాగా, హాస్పిట‌ల్‌లో తీసిన చివ‌రి వీడియో అంటూ ఆన్‌లైన్‌లో బాలుకు చెందిన వీడియో వైర‌ల్ అయ్యింది. అందులో ఆరోగ్య స్థితి మెరుగ‌వ‌డానికి బాలు వ్యాయామం చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తుండ‌గా, హాస్పిట‌ల్ సిబ్బంది మ‌రికాస్త చెయ్య‌మ‌ని ఆయ‌న‌ను ప్రోత్స‌హించ‌డాన్ని ఆ వీడియోలో మ‌నం చూడొచ్చు. దానిని చూస్తూ అభిమానులు క‌న్నీటి ప‌ర్యంత‌మ‌వుతున్నారు. అదివ‌ర‌కు ఏ రోజుకారోజు త‌న తండ్రి ఆరోగ్య స్థితి గురించి పంచుకుంటూ వ‌చ్చిన చ‌ర‌ణ్.. ఆయ‌న వ్యాయామం కూడా చేస్తున్నార‌నీ, ఆయ‌న ప‌రిస్థితి మెరుగ‌వుతోంద‌ని చెప్పిన మాట‌లు గుర్తుకు తెచ్చుకుని బాధ‌ప‌డుతున్నారు.

నేడు త‌మిళ‌నాడు ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో బాలు అంత్య‌క్రియ‌లు

  గాన‌గంధ‌ర్వుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం మృతి మొత్తం ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇండ‌స్ట్రీనే కాకుండా దేశం మొత్తాన్నీ దిగ్భ్రాంతికి గురి చేసింది. అశేష అభిమానులు శోక‌సంద్రంలో మునిగిపోయారు. ఆయ‌న భౌతికంగా మ‌న మ‌ధ్య లేక‌పోయినా, ఆయ‌న స‌మ్మోహ‌న‌క‌ర‌మైన న‌వ్వును ఇక మ‌నం చూడ‌లేక‌పోయినా, మ‌న హృద‌యాల్లో ఆయ‌న చిరంజీవిగా ఉంటార‌నేది నిజం. చెన్నైలోని ఎంజీఎం హాస్పిట‌ల్‌లో తుదిశ్వాస విడిచిన బాలు భౌతిక కాయాన్ని ఆయ‌న నివాసం ద‌గ్గ‌ర శ‌నివారం ఉద‌యం వ‌ర‌కు ఉంచ‌నున్నారు. 10.30 గంట‌ల‌కు ఆయ‌న అంత్య‌క్రియ‌ల కార్య‌క్ర‌మం ప్రారంభం కానున్న‌ది. శుక్ర‌వారం రాత్రి త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ఎడ‌ప్పాడి కె. ప‌ళ‌నిస్వామి ముఖ్య‌మైన ప్ర‌క‌ట‌న చేశారు. త‌మిళ‌నాడు ప్ర‌భుత్వ ప్ర‌త్యేక లాంఛ‌నాల‌తో బాలు అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు. బాలు అంత్య‌క్రియ‌లు చెన్నై తామ‌రైపాకంలోని ఫామ్‌హౌస్‌లో జ‌ర‌గ‌నున్నాయి. అంత్య‌క్రియ‌ల‌కు అభిమానులెవ‌రూ రావ‌ద్ద‌ని పోలీసులు కోరారు. క‌రోనా కార‌ణంగా భౌతిక దూరం పాటించే వీల్లేకుండా అభిమానుల తాకిడి అంత‌కంత‌కూ పెరుగుతుండ‌టంతో కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి పోలీసు అధికారులు ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.

రాజకీయాలకు బలౌతున్న ఐఏఎస్ అధికారులు

ఇద్దరు అధికారులు దివంగత వై ఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కీలకమైన శాఖలు నిర్వహించిన వారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ చేతిలో వీరిద్దరూ తీరని అవమానాలకు గురౌతున్నారు. తండ్రి చేతిలో ఎత్తులు చుసిన వారు తనయుడి చేతిలో లోతులు చూస్తున్నారు. వారిద్దరూ సీనియర్ ఐఏఎస్ అధికారులు. ఒకరినైతే మెడపట్టుకుని బయటకు గెంటేశారు. మరొకరిని కులం పేరుతో కుళ్లపొడుస్తున్నారు. విచిత్రం ఏమిటంటే ఈ ఇద్దరు అధికారులూ కూడా చంద్రబాబు అంటే గిట్టనివారే. ఇద్దరు అధికారులు కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిన్న చూపుకు గురి అయిన వారే. ఒకరు బలయ్యారు.. మరొకరు అవుతున్నారు. ఆ ఇద్దరూ ఎవరంటే ఒకరు ఎల్‌వి సుబ్రహ్మణ్యం. రెండో వారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీనియర్ అయినా ఎల్‌వి సుబ్రహ్మణ్యంకు జగన్ కేసుల్లో సహా ముద్దాయిగా ఉన్నారని ప్రాధాన్య పోస్టులు ఇవ్వలేదు. ఒక సందర్భంలో కీలకమైన వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి పోస్టు ఇచ్చినా మళ్ళీ ఆయనను అక్కడ నుంచి తీసి అత్యంత చిన్నదైన యువజన శాఖకు మార్చారు. ఇక రమేష్ కుమార్ పరిష్తితి కూడా దాదాపుగా అంతే. చంద్రబాబు హయాంలో ఆయనకు ఏ కీలక శాఖ లభించలేదు. ఈ ఇద్దరూ వై ఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రతిభకు తగిన గుర్తింపు పొందారు. ఎల్‌వి సుబ్రహ్మణ్యం, రమేష్ కుమార్ ఇద్దరూ ఆర్ధిక శాఖను నిర్వహించిన వారే. ఆర్ధిక శాఖలో ఈ ఇద్దరిదీ ప్రత్యేకమైన శైలి అని వారితో సాన్నిహిత్యం ఉన్న అధికారులు అంటారు. రాష్ట్రంలో ఆర్ధిక క్రమశిక్షణ తీసుకురావడంలో బిల్లుల చెల్లింపు తదితర విషయాలలో ఎలాంటి వివాదాలు రాకుండా చూసిన వారన్న విషయాన్ని మర్చిపోలేం అని చెప్తున్నారు. ఆర్ధిక క్రమశిక్షణ తీసుకురావడం, జవాబుదారీతనం, దుబారా తగ్గించడం వంటి విషయాల్లో ఈ ఇద్దరూ అనేక చర్యలు తీసుకున్నారు.వీరికి ఇంకో పోలిక కూడా ఉంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఎల్‌వి సుబ్రహ్మణ్యం ఇద్దరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు ముఖ్య కార్యనిర్వహణాధికారులుగా పని చేశారు. ఈ ఇద్దరి హయాంలో తిరుమల పవిత్రత రెండింతలు పెరగడమే కాకుండా క్రమ శిక్షణ ఉండేదన్న విషయం మర్చిపోరాదు. భక్తుల సౌకర్యార్ధం ఈ ఇద్దరి హయాంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎంతో సీనియర్ రాజకీయ నాయకులు ట్రస్టు బోర్డు చైర్మన్లుగా ఉన్నా కూడా ఎల్‌వి సుబ్రహ్మణ్యం, రమేష్ కుమార్ ఈవోలుగా ఉన్నప్పుడు వీరు చెప్పినట్లే నడచుకునేవారన్న పేరుండేది. వృత్తి పట్ల అంతటి నిబద్ధతతో ఈ ఇద్దరు అధికారులు పని చేశారు. అత్యంత సీనియర్ అయిన ఎల్‌వి సుబ్రహ్మణ్యం ను పక్కన పెట్టి ఆయన కన్నా జూనియర్లకు చంద్రబాబునాయుడు చీఫ్ సెక్రటరీ పదవిని అప్పగించారు. అయినా ఎల్‌వి సుబ్రహ్మణ్యం ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యని విషయం మనం చూసాం. సార్వత్రిక ఎన్నికల సమయంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పునేటాను పక్కన పెట్టి కేంద్ర ఎన్నికల సంఘం ఎల్‌వి సుబ్రహ్మణ్యంను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఎన్నికల కమీషన్ ప్రధాన కార్యదర్శిగా నియమించాక సహ ముద్దాయిని సిఎస్ గా ఎలా నియమిస్తారని విమర్శించారు కూడా.   ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన జగన్ ఎల్‌వీ ని కొనసాగించగా జగన్ ను అందరూ మెచ్చుకున్నారు కూడా. అయితే ఏమైందో ఏమూ కానీ కొద్ది కాలంలోనే ఎల్‌వి ని అత్యంత అవమానకరంగా పదవి నుంచి జగన్ తొలగించిన విధానం కూడా తెలిసిందే. ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు కూడా దాదాపుగా అలానే జరిగింది. ఆయనను రాష్ట్ర ఎన్నికల అధికారిగా నియమించడం చంద్రబాబుకు అస్సలు ఇష్టం లేదు. చంద్రబాబు దగ్గర పని చేయడం రమేష్ కుమార్ కూ ఇష్టం లేదని అంటారు. అయితే తన కార్యదర్శిగా పని చేసిన రమేష్ కుమార్ కు రాష్ట్ర ఎన్నికల సంఘానికి నియమించాలని అప్పటి గవర్నర్ ఇ ఎస్ ఎల్ నర్సింహన్ చంద్రబాబుపై వత్తిడి తెచ్చారనీ. గత్యంతరం లేని పరిస్థితుల్లో చంద్రబాబు రమేష్ కుమార్ కు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని అప్పగించారనీ అంటున్నారు. రమేష్ కుమార్ పేరు బదులు వేరే అధికారి పేరు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సిఫారసు చేశామని చంద్రబాబు కూడా చెప్పారు. అటువంటి రమేష్ కుమార్ ఇప్పుడు చంద్రబాబు ఏజెంటుగా జగన్ చేతిలో ముద్ర వేయించుకోవడం దురదృష్టం. ఈ ఇద్దరూ ముక్కుసూటిగా మాట్లాడే అధికారులు. ఎలాంటి మొహమాటం లేకుండా విధులు నిర్వర్తించే వారన్న పేరుంది. అలాంటి ఈ ఇద్దరూ కూడా అత్యంత ఘోరమైన అవమానాన్ని పొందారు. ఈ అవమానాలకు వీరు అర్హులు కాదని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చని అధికార వర్గాలు అనుకుంటున్నారు. నాయకులు తమ స్వంత ప్రయోజనాల కోసం అఖిల భారత సర్వీసు అధికారులకు కులాలు, ప్రాంతాలు అంటగట్టడం ఏంటని కొందరు ఆవేదన చెందుతున్నారు.

ఆంధ్ర లో బీజేపీ 'పంచ్' తంత్రం...

  * దిగుమతి నాయకులు, బిజినెస్ లీడర్లు, లాబీయిస్టులు కలిసి బీ జె పి ని ఎటు నడిపిస్తారో....  * ఇంతకీ స్థానిక సమరం లో సత్తా చూపించే ట్యాలెంట్ ఆ పార్టీకి ఉన్నట్టా, లేనట్టా....  * జి వి ఎల్ ఋతుపవనాల్లాంటి వారు... ఇలావచ్చి అలా పలకరించి, అటు నుంచి ఆటే మాయమైపోతారు  * సి ఎం రమేష్ లాబీ మాస్టర్ గా ఢిల్లీ లో ప్రసిద్ధులు.. నోకియా మాదిరి ఈయన కూడా కనెక్టింగ్ పీపుల్ నినాదాన్ని బలంగా నమ్మిన వారు  * సుజనా చౌదరి... గత్యంతరం లేని పరిస్థితుల్లో అమరావతి నినాదాన్ని భుజాన వేసుకుని చందమామ కథలో విక్రమార్కుడి మాదిరి ... వై ఎస్ ఆర్ సి పి లోని బేతాళుడి తో జగడమాడుతుంటారు  * టీ జీ వెంకటేష్.. అవసరార్ధ రాజకీయాల కు కేరాఫ్ అడ్రెస్ .... రాయలసీమ అనేది ఈయనకు ట్యాగ్ లైన్ ...దురదపుట్టినప్పుడు గోక్కోవటానికి ఉపయోగపడే ఆరో వేలుగా ఆయన ఆ నినాదాన్ని బాగా వాడేస్తారు..  * అంగ వంగ కళింగ రాజ్యాలను అవలీలగా గెలిచిన చక్రవర్తి, చివరకు ఆముదాలవలస లో ఓడిపోయినట్టు, రాష్ట్ర బీ జె పి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ , చివరకు పవన్ కళ్యాణ్ తో కలిసి స్థానిక సమరం లో బీజేపీకి కాస్తో కూస్తో ఉన్న ఇమేజ్ ని పణం గాపెట్టే సాహసానికి ఒడిగట్టారు  ఆ ఐదుగురూ ఇంతకీ ఏమి చేస్తున్నట్టు..భారతీయ జనతా పార్టీ దిగుమతుల విభాగం నుంచి డంప్ అయిన జి వి ఎల్ నరసింహారావు , అలాగే తెలుగు దేశం నుంచి బీ జె పి లోకి దిగుమతి అయిన సుజనా చౌదరి, సి ఎం రమేష్, టీ జీ వెంకటేష్ , కాంగ్రెస్ లో నుంచి బీ జె పి లోకి షిఫ్ట్ అయిన  బీ జె పి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ  నారాయణ కలిసి ఈ స్థానిక సమరం లో రాష్ట్రం మొత్తం మీద కనీసం ఒక్కొక్కరికి 50 చొప్పున 250 మంది ఎం పి టి సి లు, జెడ్ పీ టి సి లను  గెలిపించుకురాగలరా అనేది చాలా పెద్ద సందేహం గా కనిపిస్తోంది. ఎందుకంటే, నిన్ననే విజన్ డాక్యుమెంట్ ని కలిసి ఆవిష్కరించిన బీ జె పి , జన సేన కంబైన్ నేతలు , చాలా పెద్ద  దృశ్యాన్నే జనం ముందు ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. వై ఎస్ ఆర్ సి పి, తెలుగుదేశం పార్టీ లకు తామే ప్రత్యామ్నాయమన్నట్టు గా ప్రకటించుకున్న ఈ ఐదుగురిదీ  వాస్తవానికి తలో దారీ.. ఎవరు , ఎప్పుడు, ఎందుకు, ఎలా మాట్లాడతారో తెలీని గందర గోళం ....  జి వి ఎల్ నరసింహ రావు ది అయితే సొంత రాజ్యాంగం, పూర్తిగా పార్టీ రాష్ట్ర శాఖ తో  గానీ, లేదా బీ జె పి లో ఉన్నతెలుగుదేశం మాజీ లతో  కానీ ఈయనకు ఎలాంటి సంబంధాలు ఉండవు.  రాష్ట్రాన్ని ఎప్పుడైనా పలకరించడానికి రుతు పవనాల మాదిరి అలా చుట్టపు చూపు గా వచ్చేసి ,  ఇలా మాయమైపోయే  జి వి ఎల్ వ్యవస్థ ల గురించి రాష్ట్ర బీ జె పి లో ఎవరికీ ఎలాంటి క్లూలు ఉండవు. ఈయన దారి రహదారి. ఈయన వ్యవస్థ ఇలాఉంటే, బీ జె పి లో ఉంటూ కూడా ఇంకాతెలుగు దేశం ఎజెండా , జెండా రెండూ మోస్తున్నట్టు కనిపించే సుజనా చౌదరి ఒక్క అమరావతి అంశం మీద తప్పించి, ఇతరత్రా ఏదీ మాట్లాడటానికి ఎక్కువగాఇష్టపడరు. జీ వీ ఎల్ కు, సుజనా కూ క్షణం పడదు. ఆయన ఎడ్డెం అంటే ఈయన తెడ్డెం అనే రకం.. ఏ మాత్రం పొసగని,పొంతన లేని పరస్పర భిన్నమైన అభిప్రాయాలు గల వీరిద్దరూ ఉత్తర ధృవం, దక్షిణ ధృవం మాదిరి ఒకే పార్టీ లో ఉంటూ కూడా కామన్  ఎజెండా తో పని చేసిన దాఖలాలు ఇప్పటివరకూ అయితే లేవు.   ఇహ, సి ఎం రమేష్ గురించి వేరే చెప్పనక్కర్లేదు. ఆయన తన బిజినెస్ వ్యవహారాలను బీ జె పి తో ముడి కట్టేసి, ఏ పార్టీ లో ప్రయాణిస్తున్నాడో కూడా మర్చే పోయి, మొన్నటికి మొన్న పరిమళ్ నత్వాని ని జగన్ మోహన్ రెడ్డి దగ్గర ప్రవేశ పెట్టడం లో కీలక పాత్ర పోషించిన  ఘనుడు. గుర్తు చేస్తే కానీ తానూ బీ జె పి లో ఉన్నాననే విషయం గుర్తుండని ఈయన కు  బీ జె పి, జన సేన కలిసి పోటీ  చేస్తున్న విషయం తెలుసో లేదో అని కూడాపార్టీ శ్రేణులు గుసగుస లాడుకుంటున్నాయి.  ఇహ వీరందరినీ సమన్వయము చేసుకుని  ముందుకెళ్తున్నట్టు భావిస్తూ , బాహ్య ప్రపంచం ముందు ఆవిష్కృతమయ్యే  వ్యక్తి మరెవరో కాదు... సాక్షాత్తూ  రాష్ట్ర బీ జె పి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ. ఈయన, పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రయాణించటానికి అంతగాసుముఖం గా లేదు...కారణమేమిటంటే, చంద్రబాబు నాయుడు లాంటి యోధులతో పోరాడిన తన రాజకీయం , చివరకు ఇలా ఏ పూట ఎక్కడ ఉంటారో కూడా తెలీని పవన్ కళ్యాణ్ పార్టీతో కలిసి పని చేయాల్సిన దుస్థితికి దిగజారటమేమిటని  తరచూ తనలో తానె కుమిలి పోతున్నట్టు సమాచారం.  ఇహ, టీ జీ వెంకటేష్ అయితే మరీను..... రాయలసీమ నినాదాన్ని తన ట్యాగ్ లైన్ గాచేసుకుని కాలక్షేపం చేసేస్తూ... ప్రస్తుతానికి బీ జె పి లో నివసిస్తూ ....ఈ స్థానిక ఎన్నికల సమరం లో తన పాత్ర ఏమిటో కూడాతెలీకుండా జీవనం వెళ్లదీస్తున్నారు. మొత్తానికి ఈ పంచ పాండవులు స్థానిక సమరం లో తమ 'పంచ్ ' పవర్ ఏమిటో ఈ నెలాఖరు లోగా చుపిస్తారేమోననే బోలెడు , ఇంకా గంపెడాశతో బీ జె పి అభిమానులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.

ఏపీలో వంద కోట్ల దందా.. రియల్ క్రైమ్ స్టోరీ

సినిమాలలో ఎన్నో క్రైమ్ స్టోరీలు, ఎన్నో కిడ్నాప్ సీన్లు చూసుంటారు. అయితే.. కాకినాడలో జరిగిన ఈ రియల్ స్టోరీ ముందు ఆ రీల్ స్టోరీలన్నీ చిన్నబోతాయి. పేరున్న రాజకీయ నాయకులు, పలుకుబడి ఉన్న అధికారులు.. ఇలా భారీ తారాగణం నటించిన.. ఆ రియల్ స్టోరీ టైటిల్ వచ్చేసి.. "ఓ కిడ్నాప్, వంద కోట్ల స్కాం". 'నేనే రాజు నేనే మంత్రి' మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది. మీరు ఏ పార్టీకి ఓటేసినా మేమే అధికారంలో ఉంటామని. అవును.. కొందరు రాజకీయ నాయకులు.. ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీని గెలిపిస్తే.. ఆ పార్టీలోకి జంప్ చేస్తారు. అలాగే అధికారులు కూడా.. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నేతలని కాకాపడుతూ వారి ఆటలు సాగిస్తుంటారు. ఈ రియల్ స్టోరీ వింటే అది నిజమని మీకే అర్ధమవుతుంది. కాకినాడలోని సర్పవరంకి చెందిన ఆకుల గోవిందరాజు అనే వ్యక్తికి భోగాపురంలో వంద కోట్ల విలువైన 18 ఎకరాల ల్యాండ్ ఉంది. ఈ ఒక్క విషయం చాలదా.. మాఫియా కన్ను ఆయన మీద పడటానికి. ఎక్కడో ఆకాశంలో ఎగురుతున్న గద్దకి కింద ఉన్న కోడిపిల్ల కనిపించినట్టు.. మాఫియా వాళ్ళకి ఎక్కడున్నా విలువైన ల్యాండ్స్ కనిపిస్తాయి కదా. అలాగే, బలగ ప్రకాష్ అనే మాఫియా లీడర్ కి.. ఆకుల గోవిందరాజుకి చెందిన ల్యాండ్ పై కన్నుపడింది. ఇంకేముంది ఏకంగా పోలీసులనే రంగంలోకి దింపాడు. ఇక పోలీసులైతే ఓ అడుగు ముందుకేసి ఏకంగా కిడ్నాప్ కే తెరలేపారు. 2017.. సెప్టెంబర్ 19 .... శూన్యమాసం.. అమావాస్య.. మంగళవారం.. మధ్యాహ్నానికి- సాయంత్రానికి నడుమ సూర్యుడు మండిపోతున్న సమయం... అబ్బా ఏమన్నా ముహూర్తమా... శూన్యమాసం.. అమావాస్య.. మంగళవారం.. ఇదే కిడ్నాప్ కి సరైన ముహూర్తం అనుకున్నారేమో పోలీసులు... AP 30 AB 6655 నెంబర్ గల ఇన్నోవా కార్ లో.. పోలీసులు ఆకుల గోవిందరాజు ఇంటికి వచ్చారు. కారు నెంబర్ ఫ్యాన్సీగా ఉన్నా, ఆ ఖాకీలు చేసే పని మాత్రం ఏ మాత్రం పద్దతిగా లేదు. వాళ్ళు చేసే పనేంటో ఆ చుట్టుపక్కల ఉన్నవారికి తెలియదు. కొత్త మొహాలు కావడంతో.. చుట్టుపక్కల వారు కొందరు ఆశ్చర్యంతో, కొందరు అనుమానంతో చూస్తున్నారు. వాళ్ళు అలా చూస్తుండగానే.. దొంగల రూపంలో వచ్చిన పోలీసులు.. గోవిందరాజుని ఇన్నోవాలో పడేసి.. జెట్ స్పీడ్ లో హైవే ఎక్కారు. పోలీసుల భాషలో చెప్పాలంటే దీనినే కిడ్నాప్ అంటారు. కారు హైవే మీద దూసుకెళ్తుంది. ఆ స్పీడ్ చూస్తే.. అంబులెన్స్ డ్రైవర్ కావాల్సిన వ్యక్తి ఇన్నోవా డ్రైవ్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. డ్రైవర్ స్టీరింగ్ పట్టుకుంటే.. మనం ఖాళీగా ఉండి ఏం చేస్తాం అనుకున్నారేమో.. మిగతా పోలీసులు గోవిందరాజు పనిపెట్టారు. కారు.. కాకినాడ నుంచి భోగాపురం చేరేవరకు.. అంటే దాదాపు నాలుగు గంటల పాటు... గోవిందరాజుని భయపెట్టారు.. బెదిరించారు.. చిత్రహింసలు పెట్టారు. ఒక్కమాటలో చెప్పాలంటే నరకం చూపించారు. కారు సాయంత్రం 6 గంటలకు భోగాపురం సబ్ రిజిస్టార్ ఆఫీస్ కి చేరుకుంది. ఖాకీలకు భయపడ్డాడో, కాసులకు కక్కుర్తి పడ్డాడో తెలియదు కానీ.. సబ్ రిజిస్టార్ పందిళ్లపల్లి రామకృష్ణ.. సాయంత్రం 4:30 కే రిజిస్ట్రేషన్ కాగితాలు సిద్ధం చేసి.. పదేళ్ల తర్వాత ఫారెన్ నుంచి రిటర్న్ వస్తున్న ఫ్రెండ్ కోసం ఎదురుచూస్తున్నట్టు.. గుమ్మం వైపు చూస్తూ పోలీసుల కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంతలో పోలీసులు గోవిందరాజుని తీసుకొని గుమ్మంలోకి అడుగు పెట్టనే పెట్టారు. గుమ్మంలో వాళ్ళ అడుగు పడిందో లేదో.. సబ్ రిజిస్టార్ మోహంలో వెలుగు వచ్చింది. గోవిందరాజు మోహంలో భయం పెరిగింది. భయంతో చూస్తుండగా ఎదురుగా కుర్చీలో కూర్చొని ఉన్న మాఫియా లీడర్ బలగ ప్రకాష్ కనిపించాడు. జర్నీలో పోలీసుల చిత్రహింసలతో భయపడిపోయిన గోవిందరాజు.. బలగ ప్రకాష్ ని చూసి మరింత భయపడ్డాడు. బలగ ప్రకాష్.. పోలీసుల మాదిరి సాగదియ్యలేదు.. కమర్షియల్ సినిమాల్లో విలన్ లాగా ఒక్కటే డైలాగ్ కొట్టాడు.. "సంతకం పెడతావా? సమాధిలో పడుకుంటావా?".... ఆ ఒక్క డైలాగ్ తో గోవిందరాజు భయం చావుభయంగా మారిపోయింది. ఎదురుగా మాఫియా లీడర్.. చుట్టూ భోగాపురం సీఐ నర్సింహారావు, ఎస్సైలు తారక్, మహేష్.. హెడ్ కానిస్టేబుల్ గోవిందరావు.. ఉన్నారు. ఎస్సైల పేర్లు తారక్, మహేష్ అని హీరోల పేర్లు ఉన్నాయి కానీ.. వాళ్ళ బిహేవియర్ మాత్రం పెద్ద విలన్ల పక్కన ఉండే చెంచా విలన్లు లాగా ఉంది. అన్యాయాన్ని అడ్డుకోవాల్సిన పోలీసులే.. మాఫియా లీడర్ తో కలిసిపోయి.. చిత్రహింసలు చేసి బెదిరిస్తుంటే.. తప్పనిసరి పరిస్థితుల్లో, వంద కోట్లు కంటే విలువైన ప్రాణం కోసం, అన్యాయం ముందు తలవంచి గోవిందరాజు సంతకం పెట్టాడు. ఆ ఒక్క సంతకంతో.. గోవిందరాజు మొహంలో తప్ప.. అక్కడున్న అందరి మొహాల్లో లక్ష్మీకళ ఉట్టిపడింది. అన్నట్టు ఇంత జరుగుతున్నా అక్కడ ఇతరులు ఎవరూ లేరా? అని మీకు అనుమానం రావొచ్చు. అక్కడ నిజంగానే ఎవరూ లేరు.. ఎందుకంటే వాళ్ళు పెట్టిన ముహూర్తం అలాంటిది మరి. శూన్యమాసం-అమావాస్య.. బుద్ధి ఉన్నోడు ఎవడైనా రిజిస్ట్రేషన్ పెట్టుకుంటాడా? వీళ్లంటే.. వంద కోట్ల కబ్జా ల్యాండ్ కాబట్టి.. బుద్ధిని పక్కనపెట్టి.. బెదిరించి.. రిజిస్ట్రేషన్ చేపించుకున్నారు. ఇప్పుడు అర్థమైందా వాళ్ళ శూన్యమాసం-అమావాస్య కాన్సెప్ట్ ఏంటో?!!.. ఈ కిడ్నాప్- కబ్జా వ్యవహారంపై.. సర్పవరం పోలీస్ స్టేషన్ లో 330/217 నెంబర్ తో కేస్ రిజిస్టర్ అయింది. అదేంటో.. FIR కూడా అయిన తరువాత.. చార్జిషీట్ దాఖలు చేయడానికి.. రాజమౌళి RRR చేయడానికి తీసుకునే టైం కన్నా ఎక్కువ తీసుకుంటున్నారు సర్పవరం పోలీసులు. రెండున్నరేళ్లుగా నాన్చుతూనే ఉన్నారు. ఈ విషయం గురించి.. ఏపీ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి కాకినాడ పోలీసులు రిపోర్ట్ కూడా పంపారు. కానీ చార్జిషీట్ దాఖలు చేసే విషయంలో సర్పవరం సీఐ డిలే చేస్తూనే ఉన్నాడు. ఏంటి ఆ సీఐ ధైర్యం?.. భయపడితే భయపడటానికి ఆయన పోస్ట్ మ్యాన్ కాదు.. పోలీసోడు.. దానికితోడు పొలిటిషీయన్స్ సపోర్ట్ ఉన్నోడు. అవును.. ఈ వ్యవహారంలో.. బడా పొలిటిషీయన్స్ సపోర్ట్ కూడా ఉంది. అదే పోలీసుల ధైర్యం... శ్రీకాకుళం జిల్లాకి చెందిన మాజీ మంత్రి, ప్రస్తుత టీడీపీ నేత.. అలాగే గత ప్రభుత్వ హయాంలో విప్ గా పనిచేసిన నేత.. వీరిద్దరి సాయంతో సర్పవరం పోలీస్ స్టేషన్ ని ఫుల్ గా influence చేసే ప్రయత్నం బలంగా నడుస్తుంది. అందుకే చార్జిషీట్ కి మోక్షం కలగట్లేదు. ఇంత పెద్ద కిడ్నాప్- కబ్జా జరిగితే అస్సలు చర్యలే తీసుకోకుండా ఎలా ఉన్నారని అనుకుంటున్నారేమో... అబ్బో చాలా పెద్ద చర్య తీసుకున్నారు. భోగాపురం ఇన్స్పెక్టర్ ని బదిలీ చేసారు. అదేంటి!!.. అంత జరిగితే కేవలం బదిలీనా అనుకోవద్దు.. రాజకీయ ఒత్తిళ్లు అలాంటివి మరి.. అర్థంచేసుకోవాలి... ఇంకో విషయం ఏంటంటే.. ఈ వ్యవహారం డీజీపీ ఆఫీస్ కి కూడా చేరింది. మరి ఇంకేంటి.. వెంటనే అందరి మీద చర్యలు తీసుకొని ఉంటారుగా అంటారా? అబ్బో.. మీరు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ సినిమాలు చూసి బాగా మోసపోయారు... అలాంటి పప్పులు ఇక్కడ ఉడకవు. వాస్తవానికైతే... CRPC 41A కింద డీజీపీ నియమించే ఓ సీనియర్ అధికారి.. విచారణ జరిపి.. తదుపరి చర్యల వరకు.. ఆ సీఐని సస్పెండ్ చేసే అవకాశముంది. కానీ ఇక్కడ అలాంటిదేం జరగలేదు. ఏదో ఫార్మాలిటీకి బదిలీతో సరిపెట్టారు. గోవిందరాజు ని బెదిరించి వంద కోట్ల విలువైన ల్యాండ్ అన్యాయంగా లాక్కున్నారు. అయినా తప్పు చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు. పైగా గోవిందరాజునే ఇంకా టార్చర్ చేస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లలో భాగంగా.. ప్రస్తుత సర్పవరం సీఐ మరియు అర్బన్ డీఎస్పీ.. గోవిందరాజుని పదేపదే తిప్పించుకుంటున్నారు. ఇక కాకినాడలో ఉద్యోగం వెలగపెడుతున్న.. ఇప్పటి ఓ మంత్రిగారి బావమరిది.. రంగంలోకి దిగడంతో ఈ కేసు మరింత డైల్యూట్ అయింది. అసలే భోగాపురంలో ఎయిర్ పోర్ట్ అంటున్నారు. రెక్కలున్న విమానాలు వస్తున్నాయి అంటే.. ఆటోమేటిక్ గా భూముల ధరలకు రెక్కలొస్తాయి కదా.. అందుకే పోలీసులు- పొలిటీషియన్స్ అండతో మాఫియా ఇంతలా రెచ్చిపోతుంది. అంతేకాదు.. ఈ వ్యవహారం వెనుక.. 2017 ప్రాంతంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో పనిచేసిన ఓ కలెక్టర్ మరియు ఎస్పీ పాత్ర ఉన్నట్టు.. సెక్రటేరియట్ వర్గాల వద్ద స్పష్టమైన సమాచారం ఉంది. టీడీపీ పెద్దతలకాయలకు సన్నిహితులైన ఈ ఐఏఎస్, ఐపీఎస్ లు.. వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా తమ హవా కొనసాగించడం... అందరినీ ముక్కు, మూతి ఇలా అన్నింటి మీదా వేలేసుకునేలా చేస్తుంది. ఇంతకీ ఆ ఐఏఎస్ & ఐపీఎస్ ఎవరు? * ఒకరు.. పరుల అవినీతి మీద కాంతివంతంగా దండెత్తే ఐఏఎస్... * ఇంకొకరు.. పొద్దునలేస్తే సుభాషితాలు చెప్పే పాలమీగడ లాంటి ఐపీఎస్.. ఈయనకి టెక్నాలజీ మీద గ్రిప్ బాగా ఎక్కువ. ఈ వ్యవహారంలో వీరిద్దరి పాత్ర కూడా ప్రముఖంగా ఉంది. 'వంద గొడ్లను తిన్న రాబందు కూడా ఒక్క గాలివానకు కూలిపోతుంది' అన్నట్టు.. ఈ అవినీతి రాబందులను భయపెట్టే గాలివాన ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. మాఫియా లీడర్ బలగ ప్రకాష్ కనుసన్నల్లో.. ఐఏఎస్, ఐపీఎస్లు, పోలీసులు, పొలిటీషియన్స్ అండతో జరిగిన ఈ అన్యాయంపై.. గోవిందరాజు కొద్ది నెలలుగా పోరాడుతూనే ఉన్నాడు. న్యాయం కోసం ఆయన ఎక్కని గుమ్మం దిగని గుమ్మం లేదు. సన్నిహితుల సాయంతో న్యాయం కోసం పోరాడుతున్నాడు. ఆ పోరాడంతో కొన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. వాస్తవానికి అప్పుడు జరిగింది తప్పుడు రిజిస్ట్రేషన్ అని పేర్కొంటూ... భోగాపురం రిజిస్టార్ డాక్యుమెంట్ రైటర్.. 2019 అక్టోబర్ 19 తేదీన.. 164 CRPC స్టేట్మెంట్ ని.. కాకినాడ ఫస్ట్ అడిషనల్ జ్యూడిషల్ సివిల్ జడ్జ్.. ముందట ఇచ్చాడు. అంతేకాదు.. సీసీ కెమెరాలతో దొంగలని పట్టుకునే పోలీసులు.. ఆ సీసీ కెమెరాల పుణ్యమా అని అడ్డంగా బుక్ అయ్యారు. సర్పవరం లో కిడ్నాప్ చేసి.. భోగాపురం తీసుకెళ్లిన.. నాలుగు గంటల తతంగమంతా.. పలు చోట్ల సీసీ కెమెరాలలో రికార్డు అయింది. క్షవరం అయితే కానీ ఇవరం రాదని.. సీసీ కెమెరాలు చూసి దోషులని పట్టుకునే పోలీసులు.. ఆ సీసీ కెమెరాల సంగతి మర్చిపోయి ఇలా దొరికిపోవడం కామెడీగా ఉంది. మొత్తానికి కొద్దికొద్దిగా కదులుతున్న తీగతో.. దందా చేసి ఇన్నాళ్లు డొంకలో దాక్కున్నవారు.. ఇప్పుడిప్పుడే భయంతో వణుకుతున్నారు. ముఖ్యంగా డీజీపీకి కంప్లైంట్ వెళ్లడంతో ఐఏఎస్, ఐపీఎస్ ఒణికిపోతున్నారట. మరి ముఖ్యంగా ఆ ఐపీఎస్ అయితే.. డైపర్ వేసుకొని తిరుగుతున్నాడని టాక్... ఇప్పటికే ఆ ఐపీఎస్ గడిచిన రెండు నెలల్లో.. బలగ ప్రకాష్ టీం తో.. ఒకే హోటల్ లో 17 సార్లు సిట్టింగ్ వేశాడు. దీన్నిబట్టే అర్థంచేసుకోవచ్చు ఆ ఐపీఎస్ ఎంతలా వణికిపోతున్నాడో!! తప్పుని సరిదిద్దాల్సిన పోలీసులే.. ఇంత పెద్ద తప్పు చేశారు. ఈ విషయం డీజీపీ దృష్టికి కూడా వెళ్ళింది. మరి ఆయన ఈ కిడ్నాప్-కబ్జా వ్యవహారంలో ఇన్వాల్వ్ అయినవారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు?.. బాధితుడికి ఎప్పుడు న్యాయం చేస్తారు? ఆయన ఇలాగే మౌనంగా ఉంటే ప్రజలకు పోలీసు వ్యవస్థ మీదే నమ్మకం పోతుంది. ఇక ఈ విషయంలో సర్కార్ కూడా అడుగు ముందుకేసి బాధితుడికి న్యాయం చేయాల్సిన అవసరముంది. అవినీతి రహిత పాలనే అందించడమే తమ లక్ష్యమని చెప్పుకునే అధికారపార్టీ.. అవినీతి-అన్యాయం చేసిన వారికి.. పరోక్షంగా అండగా ఉండటం ఎంత వరకు కరెక్ట్? గత ప్రభుత్వం మీద, అప్పుడు వారికి సన్నిహితంగా ఉన్న కొందరు అధికారులపైనా.. ఇప్పటి అధికారపార్టీ నేతలు పదేపదే అవినీతి ఆరోపణలు చేస్తుంటారు. మరి ఈ వ్యవహారం మీద ఎందుకు నోరు మెదపడం లేదు? ఇందులో తమ పార్టీ నేతలు కూడా ఉన్నారా? లేక పార్టీ సీనియర్ నేతైన మంత్రి గారి బావమరిది ఇన్వాల్వ్ అయ్యాడని వెనకడుగు వేస్తున్నారా? ప్రభుత్వం దీనిపై స్పందించాలి. ఈ భోగాపురం భాగోతం వెనుకున్న వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి.. బాధితుడికి న్యాయం చేయాలి. లేదంటే ప్రభుత్వం మీద కూడా నమ్మకం పోతుంది.  

క‌విత‌, ష‌ర్మిలా రాజ్య‌స‌భ‌కు వెళ్తారా?

తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ సీట్ల కోసం అధికార టీఆర్ఎస్‌లో పోటాపోటీ నెలకొంది. షెడ్యూల్‌ ప్రకారం రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల నోటిఫికేషన్‌ మార్చి 6న జారీ కానుంది. 13వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంది.  సామాజిక కోణంలో తమకు అవకాశం దక్కుతుందని పలువురు సీనియర్లు భావిస్తుండగా, ఇప్పటివరకు పార్టీ తరఫున రాజ్యసభ పదవులు దక్కని వర్గాల వారూ ఆశగా ఎదురుచూస్తున్నారు. పార్టీ అధినేత కేసీఆర్‌ నిర్ణయం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.  నిజామాబాద్‌ మాజీ ఎంపీ కవితను ఈసారి పార్టీ తరఫున రాజ్యసభకు పంపిస్తార‌నే ప్ర‌చారం విస్తృతంగా జరుగుతోంది. అయితే సి.ఎం. కేసీఆర్ ఆలోచ‌నే ఎలా వుందో ఎవ‌రూ అంచ‌నా వేయ‌లేక‌పోతున్నారు. కెటిఆర్ సి.ఎం. అవుతారా? క‌వితా రాజ్య‌స‌భ‌కు వెళ్తారా?  అయితే హ‌రిష్‌రావు ఈ ప‌రిణామాల‌పై ఎలా స్పందిస్తారు? అనే అంశంపై టిఆర్ ఎస్ కార్య‌క‌ర్త‌ల్లో విస్తృతంగా చ‌ర్చ జ‌రుగుతోంది. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటున్న సీఎం కేసీఆర్‌ తన తరఫున ఢిల్లీ, ఇతర రాష్ట్రాల్లో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు ప్రయత్నాలకు నమ్మకమైన వారి కోసం అన్వేషిస్తున్నారు.  రాజ్యసభ సీటు భర్తీ సామాజిక కోణంలోనే ఉంటుందని టీఆర్‌ఎస్‌ ముఖ్యులు భావిస్తున్నారు. ఏపీ కోటాలో పదవీ విరమణ చేస్తున్న టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావుకు వయసు రీత్యా ఈసారి అవకాశం ఉండకపోవచ్చన్న అంచనాలున్నాయి. రెడ్లకు అవకాశం లభిస్తే, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, మాజీీ స్పీకర్‌ కె.ఆర్‌.సురే్‌షరెడ్డి, ఎమ్మెల్సీ నాయిని నర్సింహారెడ్డి మధ్య పోటీ ఉంటుందని చెబుతున్నారు. కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వాలనుకుంటే మండవ వెంకటేశ్వరావు, తుమ్మల నాగేశ్వరరావు పేర్లు పరిశీలించవచ్చని అంటున్నారు. బీసీలకు అవకాశం ఇస్తే సిరికొండ మధుసూదనాచారి, బస్వరాజు సారయ్య పేర్లు పరిశీలిస్తారని చెబుతున్నారు. ఎస్సీ కోటాలో భర్తీ చేయాలని భావిస్తే కడియం శ్రీహరి, మాజీ ఎంపీ మంద జగన్నాథం పేర్లు పరిశీలిస్తారని అంటున్నారు. ఎస్సీల్లోనే మాలలకు అవకాశం ఇవ్వాలని అనుకుంటే, టీఎ్‌సఐఐసీ చైర్మన్‌ గాదరి బాలమల్లు, ఎస్టీ అయితే సీతారాంనాయక్‌ పేరు ఉండొచ్చని అంటున్నారు. అనూహ్యంగా ఒక పారిశ్రామికవేత్తను టీఆర్‌ఎస్‌ తరఫున రాజ్యసభకు పంపాలని అనుకుంటే హెటిరో అధినేత పార్థసారథిరెడ్డి పేరు పరిశీలించవచ్చని చెబుతున్నారు.  ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాజ్యసభ స్థానాలు ఎవరికీ కేటాయించాలని ఇన్నాళ్లు చర్చించిన అధికార పార్టీ ఓ నిర్ణయానికి వచ్చిందని తెలుస్తోంది. ఈ మేరకు ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించే వారి జాబితా సిద్ధమైనట్టు సమాచారం.  కీలకమైన పదవులు కావడంతో పార్టీ నమ్ముకున్నోళ్లు.. తమకు అండగా నిలబడిన వ్యక్తులను ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాల్లో వార్త వినిపిస్తోంది.  మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి - సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మాజీమంత్రి - ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రఘువీరారెడ్డి కాకుంటే సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ జాస్తి చలమేశ్వర్ కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ జాబితా ఫైనలైనట్టు తెలుస్తోంది.  షర్మిల ఆపద సమయంలో జ‌గ‌న్‌కు తోడుగా నిలిచారు. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ పాదయాత్ర చేశారు. కష్టకాలంలో పార్టీకి షర్మిల పెద్ద దిక్కుగా నిలిచారు. తన సొంత మీడియా సాక్షి ప్రారంభించినప్పటి నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ తో ఉన్నారు. సాక్షి పత్రిక ఎడిటోరియల్ డైరెక్టర్ గా కొనసాగుతూనే జగన్ కు రాజకీయాలపై సలహాలు సూచనలు ఇచ్చారు. ఆ తర్వాత సజ్జలను పార్టీలోకి ఆహ్వానించి పెద్ద పదవే ఇచ్చారు. విజయ సాయిరెడ్డి తర్వాత జగన్ కు అత్యంత నమ్మకస్తుడు సజ్జలనే. ఆయన పార్టీలో జగన్ రాజకీయ సలహాదారుడిగా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీలో పని చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుడిగా కొనసాగుతున్నారు. కడప జిల్లాకు చెందిన వ్యక్తి. ఎప్పుడూ తన తోడు ఉండడంతో ఆయనను రాజ్యసభకు జగన్ పంపించనున్నట్టు తెలుస్తోంది. ప్రకాశం జిల్లాకు చెందిన వైవీ సుబ్బారెడ్డి జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నారు. గతంలో ప్రకాశం ఎంపీగా సుబ్బారెడ్డి పని చేశారు. ఈసారి జరిగిన ఎన్నికల్లో సుబ్బారెడ్డి పోటీ చేయలేదు. అప్పుడు ఆయన పదవులు ఆశించకపోవడంతో ఇప్పుడు రాజ్యసభకు పంపించాలని నిర్ణయానికి వచ్చారు. పార్టీలో కీలక నాయకుడిగా గుర్తింపు పొందిన సుబ్బారెడ్డిని రాజ్యసభకు పంపితే న్యాయం జరుగుతుందనే భావనలో జగన్ ఉన్నారంట. అనూహ్యంగా రాజ్యసభకు పంపే జాబితాలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రఘువీరారెడ్డి ఉండడం గమనార్హం. అనంతపురము జిల్లాకు చెందిన రఘువీరారెడ్డికి పిలిచి మరి రాజ్యసభ సీటు ఇస్తామంటున్నారు. యాదవ సామాజికి వర్గానికి చెందిన రఘువీరారెడ్డి జగన్ తండ్రి వైఎస్సార్ తో మంచి అనుబంధం ఉంది. అయితే రఘువీరారెడ్డి కాకుంటే మరొకరిని కూడా దృష్టిలో పెట్టుకున్నారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జడ్జిగా పని చేసిన జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ను రాజ్యసభకు పంపించాలని భావిస్తున్నారంట.  కృష్ణాజిల్లా యాదవ సామాజిక వర్గానికి చెందిన చలమేశ్వర్ సేవలను వినియోగించుకునేలా పార్టీ ఒక నిర్ణయానికి వచ్చిందంట. ఎందుకంటే తరచూ జగన్ న్యాయస్థానాల్లో చిక్కులు ఎదుర్కొంటున్నారు. చలమేశ్వర్ సేవలు వినియోగించుకుంటే జగన్ సేఫ్ గా ఉండడంతో పాటు న్యాయ కోవిదుడికి గౌరవంగా రాజ్యసభను ఇద్దామనే ఆలోచనలో ఉన్నారంట.

అధికారంలో ఉంటే ఒకలా... ప్రతిపక్షంలో ఉంటే మరోలా... వైజాగ్ ఎపిసోడ్ నీతి ఏంటి?

రాజకీయాల్లో ఓడలు బళ్లు అవుతాయి. బళ్లు ఓడలవుతాయి. ప్రజాస్వామ్యంలో ఇది సాధారణమే. ప్రస్తుతం దేశంలోనూ, అనేక రాష్ట్రాల్లోనూ ఇదే జరుగుతోంది. నిన్నమొన్నటివరకు దేశంలోనూ, ఆయా రాష్ట్రాల్లో చక్రం తిప్పినవారంతా, అనామకులుగా మారిపోయారు. దశాబ్దాల తరబడి రాజ్యాన్ని ఏలినవారు, ఇప్పుడు సైడైపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లో పలువురు ఉద్దండుల పరిస్థితి ఇప్పుడలాగే కనిపిస్తోంది. ఎంతోమంది ముఖ్యనేతలు తీవ్ర గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటున్నారు. మళ్లీ వాళ్లకు మంచి రోజులు వస్తాయని మాత్రం కచ్చితంగా చెప్పలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండింటిలోనూ ఊహించని రాజకీయ మార్పులు జరగడంతో ఓడలు బళ్లు... బళ్లు ఓడలయ్యాయి.  అయితే, అధికారంలో ఉండగా ఒకలా, ప్రతిపక్షంలా ఉంటే మరోలా వ్యవహరించడం సర్వసాధారణంగా కనిపిస్తుంది. విపక్ష నేతగా ఉన్న సందర్భాల్లో నేతలు వ్యవహరించే తీరు ఒక్కోసారి సాధారణ ప్రజాస్వామిక సూత్రాలకు విరుద్ధంగా ఉంటుంది. నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడేళ్ళ క్రితం విపక్ష నేతగా ఉన్నారు. అప్పట్లో ఆయన ప్రత్యేక హోదా కోసం పట్టుదలతో ఉన్నారు. క్యాండిల్ ర్యాలీ నిర్వహించేందుకు వైజాగ్ పర్యటనకు వెళ్లారు. అప్పటికే అక్కడ సీఐఐ పార్ట్ నర్ షిప్ సమ్మిట్ జరుగుతోంది. ఆ నేపథ్యంలో క్యాండిల్ ర్యాలీకి అనుమతిని ప్రభుత్వం నిరాకరించింది. అయినా కూడా జగన్ వైజాగ్ చేరుకున్నారు. అక్కడి నుంచి నగరంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పట్లో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. తనను అడ్డుకోవడంపై అప్పట్లో విపక్ష నేతగా ఉన్న జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇక, ఇప్పడు ఏపీలో రాజధాని రగడ కొనసాగుతోంది. అందులో భాగంగా చంద్రబాబు చేపట్టిన వైజాగ్ యాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇందులో పోలీసులను తప్పు పట్టాల్సింది ఏమీ లేదు. అయితే, ఇలాంటి సమయంలో విపక్ష నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఎలాగైనా పోలీసు వలయాన్ని ఛేదించుకోవాలని తాము అనుకున్నది చేయాలని చూస్తుంటారు. పొలిటికల్ మైలేజ్ పొందాలని ప్రయత్నిస్తుంటారు. చంద్రబాబు వైజాగ్ టూర్లోనూ అదే జరిగిందనే మాట వినిపిస్తోంది. నాయకులు విపక్షంలో ఉన్నప్పుడు పొలిటికల్ మైలేజ్ కోసం ప్రయత్నించడంలో తప్పు లేదు. కాకపోతే...ఆ ప్రయత్నాలు సమాజంలో ఉద్రిక్తతలు పెంచేవిగా మాత్రం ఉండకూడదంటున్నారు. అదే సమయంలో అధికారంలో ఉన్న నాయకులు ప్రజాస్వామ్యంలో విపక్షాలకు ఉండే ప్రాధాన్యాన్ని గుర్తించాలని సూచిస్తున్నారు. అధికారపక్షం, విపక్షం....రెండూ ప్రజాస్వామ్యానికి రెండు చక్రాల్లాంటివని, ఏ ఒక్కటి సరిగా లేకున్నా ప్రజాస్వామ్యం కుంటుపడుతుందని గుర్తుచేస్తున్నారు.

రాజీవ్ గాంధీ మరణించాక ఆ సీక్రెట్ బయటపెట్టిన వాజపేయి!!

అమావాస్య రోజు చందమామని చూడాలనుకోవడం, రాజకీయాలలో విలువలు గురించి మాట్లాడాలనుకోవడం ఒకటే అంటుంటారు. అవును ఈ తరం రాజకీయాలను చూస్తే నిజమే అనిపిస్తుంది. ఒకరిపై ఒకరు హద్దు మీరి విమర్శలు చేసుకోవడమే తప్ప.. విలువైన రాజకీయాలు చేసేవారు ఎంతమంది ఉన్నారు ఈరోజుల్లో. ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రతిపక్ష నేతల మీద కక్ష తీచుకోవాలన్న ధోరణే తప్ప.. ప్రజల కోసం ఒకరి సూచనలను ఒకరు గౌరవించుకుంటూ విలువైన రాజకీయాలు చేసేవారు ఎక్కడున్నారు?. ఈతరం రాజకీయ నాయకులు ముందుతరం వారిని చూసి ఎంతో నేర్చుకోవాలి. మాజీ ప్రధానులు రాజీవ్ గాంధీ- వాజపేయి మధ్య జరిగిన ఓ సంఘటన తెలిస్తే.. ఈ తరం రాజకీయ నాయకులు సిగ్గుతో తలదించుకుంటారు. అది రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయం. అప్పుడు వాజపేయి ప్రతిపక్ష నేతగా ఉన్నారు. వారి మధ్య జరిగిన ఓ అపురూప సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం.  " సార్..ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు లైన్ లో వున్నారు..మీతో మాట్లాడుతారుట ".. ఫోన్ పట్టుకుని వాజపేయి దగ్గరికి వచ్చి చెప్పాడు ఆయన వ్యక్తిగత కార్యదర్శి.." ఫోన్ అందుకున్న వాజపేయి ప్రధానమంత్రి తో రెండు నిమిషాలు మాట్లాడారు. ఫోన్ పెట్టేసి వాజపేయి కార్యదర్శి వంక చూసి "మనం ప్రధానమంత్రి తో పాటు ఐక్యరాజ్యసమితి సమావేశంలో పాల్గొనటానికి అమెరికా వెళ్తున్నాం.. ఏర్పాట్లు చూడండి" అనడంతో తను విన్నది నిజమేనా అని ఆశర్యంతో మరోమారు అటల్జీ ని అడిగి కన్ఫర్మ్ చేసుకున్నాడు కార్యదర్శి. " సార్..పత్రికలకు ప్రెస్ నోట్ పంపమంటారా?" నసిగాడు కార్యదర్శి వాజపేయి ఒక్క క్షణం అతనివంక చూసి నవ్వుతూ "నిక్షేపంగా" అన్నారు. ఈ వార్త అప్పట్లో ఇటు కాంగ్రెస్ పార్టీలోనూ, అటు బీజేపీ లోనూ పెద్ద దుమారం సృష్టించింది. రాజీవ్ గాంధీ నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు సైతం ముక్కున వేలేసుకున్నారు. "సాక్షాత్తు ప్రధానమంత్రి హోదాలో ఐక్యరాజ్యసమితి ప్రతినిధుల సమావేశానికి అటెండ్ అవుతూ ప్రతిపక్షపార్టీ నేతను వెంటపెట్టుకెళ్లటం ఏంటి?" అంటూ పార్టీలో సన్నాయి నొక్కులు నొక్కారు. కానీ రాజీవ్ గాంధీ మాత్రం వాజపేయి ని తీసుకెళ్లడం వెనుక అసలు కారణాన్ని ఎవరికీ చెప్పలేదు. కానీ ఆయన మరణానంతరం వాజపేయే అసలు విషయాన్ని ప్రపంచానికి చెప్పారు.. ఆన్ టోల్డ్ వాజపేయి అనే పుస్తకం ద్వారా.. అదీ ఆయన మాటల్లోనే.. "1985 లోనే నాకు ఒక కిడ్నీ దెబ్బ తిని వైద్యం తీసుకుంటున్నా.1988 నాటికి రెండో కిడ్నీ కూడా దెబ్బతింది. డాక్టర్లు తక్షణం వైద్య చికిత్స అవసరం అన్నారు. ఇక్కడ కన్నా అమెరికాలో మెరుగైన వైద్యం అందుబాటులో ఉన్నందున అక్కడికి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. ఈ విషయం తెలుసుకున్న రాజీవ్ గాంధీ ఐక్యరాజ్యసమితి ప్రతినిధుల సమావేశానికి నన్ను కూడా రమ్మని ఫోన్ లో కోరారు. కానీ చివరగా ఆయన ఒక మాట చెపుతూ.. 'అటల్ జీ.. ఈ పర్యటనను పూర్తిగా మీ వైద్యానికి ఉపయోగించుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఇండియా కి రండి' అని చెప్పారు. ఈ రోజు నేను ప్రాణాలతో ఉన్నానంటే అది రాజీవ్ గాంధీ నాకు చేసిన ఉపకారం వల్లనే. నా కన్నా ఇరవై ఏళ్ళ చిన్నవాడు అయిన రాజీవ్ నాకు తమ్ముడిలాంటి వాడే" అని వాజపేయి అన్నారు. అది విలువలతో కూడిన రాజకీయమంటే. రాజీవ్ గాంధీ, వాజపేయి రాజకీయంగా ప్రత్యర్థులు కావచ్చు కానీ ఒకరినొకరు గౌరవించుకుంటూ విలువైన రాజకీయాలు చేశారు. వారిని చూసి ఈ తరం రాజకీయ నాయకులు ఎంతో నేర్చుకోవాలి. పొద్దున్న లేస్తే ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకునే అధికార-ప్రతిపక్ష పార్టీల నాయకులు.. రాజకీయాలు పక్కన పెట్టి అప్పుడప్పుడన్నా నైతిక విలువలు పాటించాలన్న సూత్రం.. ఇలాంటి విషయాలు తెలుసుకుని అయినా పాటిస్తే బాగుండు..!

ఎలా స్పందిస్తారో మీ ఇష్టం!

అనగనగా ఓ అమ్మాయి. ఆ అమ్మాయికి చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో తల్లి నిబ్బరంగా సంసారాన్ని నెట్టుకొస్తూ ఉంది. కానీ కూతురు మాత్రం ప్రతి చిన్న కష్టానికీ కంగారుపడిపోయేది. ఏం చేయాలో పాలుపోక తెగ బాధపడిపోయేది. ‘ఇక ఈ కష్టాలను భరించడం నా వల్ల కాదమ్మా!’ అని ఓ రోజు తన తల్లితో తెగేసి చెప్పింది కూతురు. తల్లి, కూతరి వంక ఒక్క నిమిషం చూసింది. ఆ తరువాత మారుమాట్లాడకుండా ఆమెను వంటింట్లోకి తీసుకువెళ్లింది. తల్లి తనకేం చెప్పాలనుకుందో తెలియని అయోమయంలో కూతురు ఆమెను అనుసరించింది.   వంటింట్లోకి వెళ్లిన తల్లి ఒక మూడు పాత్రలు తీసుకుంది. ఒకదానిలో బంగాళదుంప, మరోదానిలో కోడిగుడ్డు, ఇంకోదానిలో కాఫీ గింజలు వేసి వాటిని పొయ్యి మీద పెట్టింది. తల్లి చేస్తున్న పని చాలా అసంబద్ధంగా తోచింది కూతురికి. అయినా మారు మాటాడకుండా చూస్తూ నిల్చొంది. ఒక పది నిమిషాలు అయిన తరువాత... ‘ఒకో గిన్నెలో ఏం జరిగిందో గమనించు’ అంటూ అడిగింది తల్లి. ‘గమనించడానికి ఏముంది! బంగాళదుంప వేడి నీటికి మెత్తబడిపోతుంది. కోడిగుడ్డు గట్టిపడిపోతుంది. కాఫీ గింజలతో కాఫీ తయారవుతుంది’ అంది కూతురు ఎగతాళిగా. ‘కదా! పైకి గట్టిగా కనిపించే బంగాళదుంప కాస్త వేడినీరు తగలగానే ఇట్టే మెత్తబడిపోయింది. చేయి తగిలితే చాలు చితికిపోయే కోడిగుడ్డేమో వేడినీటికి గట్టిపడిపోయింది. ఇక కాఫీ గింజలు మాత్రం తన చుట్టూ ఉన్న నీటిని తన ఉనికితో నింపేశాయి,’ అని చెప్పుకొచ్చింది తల్లి. తల్లి చేసిన వింత చేష్ట వెనుక ఏదో మంచిమాట దాగి ఉంటుందని అప్పటికి అర్థమైంది కూతురికి.   ‘మనం కూడా ఇంతే! అప్పటివరకూ ధైర్యంగా ఉన్నవారు కూడా కష్టాలు రాగానే ఇట్టే డీలా పడిపోతారు.. ఆ బంగాళదుంపలా. మరికొందరేమో కష్టాలు ఎదురయ్యేసరికి మొద్దుబారిపోతారు. అప్పటివరకూ సున్నితంగా ఉన్నవారు కూడా రాయిలా మారిపోతారు- కోడిగుడ్డులా. కానీ చాలా కొద్ది మంది మాత్రమే కష్టాలకు ఎదురీదుతారు. ఆ కష్టాలను సైతం తనకు అనుకూలంగా మార్చుకుంటారు. వాళ్ల స్వభావంతో, వారి చుట్టూ ఉన్న వాతావరణమే పూర్తిగా మారిపోతుంది... కాఫీ గింజల్లాగా! ఇప్పుడు చెప్పు నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు?’ అని అడిగింది తల్లి. కూతురు మారు మాట్లాడకుండా చిరునవ్వుతో కాఫీని ఒక రెండు కప్పుల్లోకి సర్ది, ఒకదాన్ని తన తల్లికి అందించింది. మరోదాన్ని తను ఆస్వాదించేందుకు సిద్ధపడింది... జీవితాంతం!   - నిర్జర.

మంచి పాస్‌వర్డ్‌ కోసం 10 చిట్కాలు

ఇవాళ రేపట్లో కంప్యూటర్లో ఏదో ఒక అకౌంట్‌ లేకుండా పూట గడవడం లేదు. అది ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ కావచ్చు, ఆన్‌లైన్‌ షాపింగ్‌ కావచ్చు... ఏదీ కాకపోయినా కనీసం ఈ-మెయిల్‌ అకౌంటన్నా కావచ్చు. వీటన్నింటికీ మంచి పాస్‌వర్డుని ఎంచుకోవడం ఒక సమస్యే! ఆ మన దగ్గరే ఏముందిలే నష్టపోయేందుకు అనుకోవడానికి కూడా లేదు. మన వ్యక్తిగత సమాచారాన్నీ, ఫైళ్లని తస్కరించడం దగ్గర్నుంచీ... మన కాంటాక్ట్‌ లిస్టులో ఉండేవారి మెయిల్స్‌కు తప్పుడు మెయిల్స్‌ పంపడం వరకూ హ్యాకర్లు దేనికైనా తెగించగలరు. ఎవరిపడితే వారి పాస్‌వర్డులను ఛేదించేందుకు ప్రత్యేకమైన సాఫ్టవేర్లు అందుబాటులో ఉన్నాయంటే నమ్మగలరా! అందుకే అలాంటి ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు ఈ చిట్కాలు-   1- చిన్నపాటి పాస్‌వర్డులకు కాలం చెల్లిపోయింది. మీ పాస్‌వర్డు కనీసం 10 అక్షరాలకు పైనే ఉండాలంటున్నారు నిపుణులు. ఇక మరీ జాగ్రత్తగా ఉండాల్సిన సందర్భాలలో కనీసం 12 నుంచి 14 అక్షరాలు ఉండాలని సూచిస్తున్నారు.   2- పాస్‌వర్డులో కేవలం అక్షరాలే ఉంటే సరిపోదన్నది అందరికీ తెలిసిందే! అంకెలు, అంకెల దిగువున ఉండే సింబల్స్, క్యాపిటల్‌ లెటర్స్‌, స్మాల్‌ లెటర్స్ ఇలా కీబోర్డు మీద టైప్‌ చేయదగిన అన్ని రకాల సంకేతాలనీ వాడాల్సిందే!   3- మీకు సంబంధించిన వ్యక్తిగతమైన వివరాలని (ఉదా॥ పుట్టినరోజు, భార్యపేరు) పాస్‌వర్డులో ఉంచితే పాస్‌వర్డుని ఛేదించడం సులువైపోతుంది. అందుకే మీకు బాగా గుర్తుండి, మీ చుట్టుపక్కల వారికి ఏమాత్రం అవగాహన లేని (ఉదా॥ తల్లి తరఫు ఇంటి పేరు, పిల్లలకి పురుడు పోసిన డాక్టరు పేరు) పాస్‌వర్డులను ఎంచుకోవాలి.       4- నిఘంటువులో కనిపించే పదాలను (ఉదా॥ house, system, daughter) ఎట్టిపరిస్థితుల్లోనూ పాస్‌వర్డుగా ఉంచకూడదు. వీటిని పాస్‌వర్డు తస్కరించే సాఫ్టవేర్లు పసిగట్టేస్తాయి. My wife, happy home వంటి రోజువారీ వాక్యాలను కూడా ఇవి పట్టేస్తాయి.   5- చాలామంది బలమైన పాస్‌వర్డునే ఎంచుకొంటారు. కానీ పాస్‌వర్డు మర్చిపోయినప్పుడు కంప్యూటర్‌ అడిగే ప్రశ్నలకు గాను చాలా తేలికైనవి ఎంచుకొంటారు. ఫలితంగా ఎవరైనా సదరు ప్రశ్నలకు జవాబు చెప్పి మీ అకౌంటులోకి ప్రవేశించే అవకాశం ఇచ్చినట్లు అవుతుంది.       6- మనసులో ఏదో ఒక వాక్యాన్ని అనుకొని అందులోని పదాల తొలి అక్షరాలతో పాస్‌వర్డుని ఏర్పాటు చేసుకోవడం ఒక మంచి పద్ధతి. ఉదా॥ My Son was born on 14th January 2000 అన్న వాక్యాన్ని గుర్తుంచుకోవడం చాలా తేలిక. దీని ఆధారంగా MSWBO1422000 అన్న పాస్‌వర్డుని సృష్టించుకోవచ్చు.   7- వేర్వేరు అకౌంట్లకి ఒకటే పాస్‌వర్డుని ఎట్టిపరిస్థితుల్లోనూ వాడకూడదన్నది నిపుణులు హెచ్చరిక. ఒకవేళ అలా వాడాల్సి వచ్చినా, తప్పనిసరిగా అందులో ఎంతో కొంత మార్పు చేయవలసి ఉంటుంది. ఉదాహరణకు పైన ఎంచుకొన్న MSWBO1422000 పాస్‌వర్డుని AMAZONకి కూడా వాడాలనుకుంటే MSWBO-amaze-1422000 అంటూ పాస్‌వర్డుకి తగిన మార్పు చేయవచ్చు.       8- బ్యాంకింగ్‌ వంటి ఆర్థికపరమైన, గోప్యమైన లావాదేవీలు జరిపే ఖాతాలకి చెందిన పాస్‌వర్డుల విషయంలో మరీ జాగ్రత్తగా ఉండాలి. వీటిని తరచూ మారుస్తూ ఉండటం, మరే ఇతర పాస్‌వర్డులతో సంబంధం లేకుండా ఉంచడం అవసరం. ఇందుకోసం ఎలాంటి అనుమానం రాని పాస్‌వర్డులు కావాలనుకుంటే ఆన్‌లైన్లో http://passwordsgenerator.net/ వంటి సైట్లు ఉచితంగా క్లిష్టమైన పాస్‌వర్డులను అందిస్తాయి.   9- ఎట్టి పరిస్థితులలోనూ పాస్‌వర్డుని బయటవారితో పంచుకోకూడదు. ఇవాళ ఉన్న బంధం రేపు ఉంటుందని చెప్పలేం కదా! ఒకవేళ అలా ఎవరితోనన్నా పాస్‌వర్డుని పంచుకోవల్సిన సందర్భం వచ్చినా, ఎవరికన్నా పాస్‌వర్డు తెలిసిపోయిందన్న అనుమానం కలిగినా... వెంటనే దానిని మార్చివేయడం మంచింది.    10- ఈ రోజుల్లో పది రకాల ఖాతాలకు పది రకాల పాస్‌వర్డులు కావాల్సి వస్తోంది. పైగా అవి క్లిష్టంగా ఉండాలన్న నియమం ఎలాగూ ఉంది. దీంతో తరచూ ఏదో ఒక పాస్‌వర్డుని మర్చిపోవడం అతి సహజం. ఇందుకోసం వీటిని వీటిని ఎక్కడన్నా భద్రమైన చోట రాసి ఉంచుకోవడంలో తప్పులేదు. అయితే అలా రాసి ఉంచుకున్న కాగితాన్ని నిర్లక్ష్యంగా ఉంచితే మాత్రం అసలుకే ఎసరు తప్పదు! - నిర్జర.

అందుకే స్నేహితుడు కావాలి!

అదో పెద్ద అడవి. ఆ అడవిలో రకరకాల జంతువులు. వాటిలో సహజంగానే ఓ సింహమూ, ఓ జింకా ఉన్నాయి. ఒక రోజు ఆ సింహం జింకని చూడనే చూసింది. వెంటనే దాన్ని వేటాడేందుకు వెంటపడింది. సింహం నుంచి తప్పించుకోవడానికి జింక చాలా ప్రయత్నమే చేసింది. దాని నుంచి పరిగెడుతూ పరిగెడుతూ పొరపాటున ఒక చెరువులోకి పడిపోయింది. దాన్ని తరుముతూ సింహం కూడా చెరువులోకి దూకేసింది. ఆ చెరువు నిండా నీళ్లున్నా బాగుండేది. కానీ కరువుతో చెరువు సగానికి ఎండిపోయింది. బురదతో నిండిపోయింది. ఆ బురదలో ఒక పక్క జింక, మరోపక్క సింహం మోకాళ్ల లోతు వరకు కూరుకుపోయాయి. ‘‘హహ్హా! ఇంక నేను నీ వెనుక పరిగెత్తాల్సిన పని లేదు. ఈ బురదలో చిక్కుకున్న నీ ఎముకలు విరిచి, నీ లేత మాంసాన్ని రుచిచూస్తాను,’’ అంటూ నవ్వింది సింహం.   ‘‘నా మాంసపు రుచి తర్వాత. ముందు నువ్వు ఇక్కడి నుంచి ఎలా బయటపడగలవో ఆలోచించు,’’ అంటూ వెక్కిరించింది జింక. జింక మాటలకి కోపంగా సింహం ముందుకు కదలబోయింది. కానీ అది ఎంతగా కదులుతుంటే అంతగా బురదలో దిగబడిపోతోంది. ‘‘నిజమే నేను కదల్లేకపోతున్నాను. ఇప్పుడెలా!’’ అని బిక్కమొగం వేసింది సింహం. ‘‘నీకు ఎవరన్నా స్నేహితులు ఉన్నారా?’’ అని తాపీగా అడిగింది జింక.   ‘‘నేను ఈ అడవికి రాజుని. అంతా నన్ను చూసి భయపడేవాళ్లే కానీ స్నేహితులు ఎక్కడ ఉంటారు. నాకు బానిసలు, శత్రువులే కానీ స్నేహితులు ఉండరు,’’ అని గర్వంగా చెప్పింది సింహం. ‘‘కానీ నాకైతే చాలామంది స్నేహితులు ఉన్నారు. మేమంతా కలిసిమెలిసి ఉంటాం. నేను కనిపించకపోయేసరికి వాళ్లంతా నన్ను వెతుక్కుంటూ వస్తారు. ఎలాగైనా నన్ను రక్షిస్తారు,’’ అని నమ్మకంగా చెప్పింది జింక. ‘‘సరే! అదీ చూద్దాం... ’’ అని ధీమాగా అంది సింహం. ఆ బురద చెరువులో కాలం చాలా భారంగా గడిచింది. ఒకో గంటా గడిచెకొద్దీ సింహంలో అసహనం పెరిగిపోయింది. కానీ జింక మాత్రం నిశ్చింతగానే ఉంది. తన స్నేహితులు వస్తారనే నమ్మకం తనలో ఇసుమంతైనా తగ్గలేదు.   సాయంత్రం అయ్యింది. నిదానంగా చీకటి పడింది. అసలే ఆకలితో ఉన్న సింహం డీలాపడిపోయింది. కానీ తన స్నేహితుల మీద ఉన్న నమ్మకంతో జింక మాత్రం నిబ్బరంగా నిలబడి ఉంది. ఇంతలో.... చెట్ల చాటు నుంచి ఏవో శబ్దాలు వినిపించాయి. ముందు ఓ జింక పిల్ల చెరువువైపు తొంగిచూసింది. ఆ తర్వాత మరో జింక, దాని వెనుక ఇంకో జింక.... వరుస పెట్టి ఓ జింకల మంద చెరువుగట్టుకి చేరింది. వాటికి అక్కడి పరిస్థితి చిటికెలో అర్థమైపోయింది. ఎలాగొలా తన నేస్తాన్ని రక్షించుకోవాలని అనుకున్నాయి. తాళ్లే పడేశాయో, చేతులే చాచాయో... మొత్తానికి ఎలాగొలా బురదలో చిక్కుకున్న జింకని ఒడ్డుకి తెచ్చాయి. దాన్ని తీసుకుని అడుగులో అడుగు వేసుకుంటూ తిరిగి వెళ్లిపోయాయి.   తన కళ్ల ముందే జరుగుతున్నది చూసిన సింహానికి మతిచెడిపోయింది. కచ్చగా తను కూడా బురదలోంచి బయటపడాలని ఒకసారి విదిలించుకుంది. అంతే! అది మరింత లోతుకి జారిపోయింది. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.

కోర్టు చివాట్లు పెట్టినా మారన తీరు.. కరోనాపై బోగస్ లెక్కలు! 

తెలంగాణ రాష్ట్రంలో కరోనా టెస్టులు ,కేసులు, మరణాల లెక్కలపై  మొదటి నుంచి అనుమానాలున్నాయి. ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతుందనే ఆరోపణలున్నాయి. కరోనా కేసుల్లో తప్పుడు లెక్కలపై గతంలో హైకోర్టులోనూ విచారణ జరిగింది. సరైన నివేదికలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. అయినా సర్కార్ తీరు మారలేదని, అవే తప్పులు చేస్తున్నారని, కరోనా టెస్టులు, కేసులు, మరణాల విషయంలో బోగస్ లెక్కలే చూపిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కరోనా అంశంలో కేంద్రానికి ఇచ్చే లెక్కలు వేరేలా, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చె బులిటెన్లలో మరోలా వివరాలు ఉంటున్నాయి. తాజాగా ఆగస్టు  నెలకు సంబంధించి కరోనా కేసులపై కేంద్ర ఆరోగ్య శాఖకు రాష్ట్ర వైద్య శాఖ పంపిన నివేదికలో తప్పుడు లెక్కల బండారం బహిర్గతం అయింది .   తెలంగాణలో ఆగస్టు నెలలో 8 లక్షల 79 వేల 479 మందికి కరోనా టెస్టులు చేసినట్టు కేంద్రానికి రాష్ట్ర హెల్త్​ డిపార్ట్​మెంట్ నివేదిక ఇచ్చింది. రాష్ట్ర పంపిన వివరాల ఆధారంగా కేంద్ర హెల్త్​ మినిస్టర్​ పార్లమెంట్‌‌‌‌లోనే ఈ వివరాలను వెల్లడించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ  బులెటిన్‌‌‌‌లో మాత్రం.. ఆగస్టులో 9 లక్షల 65 వేల 253 టెస్టులు చేసినట్టు చెప్తోంది. కేంద్రానికి ఇచ్చిన లెక్కకు, బులెటిన్‌‌‌‌లో చెప్పిన లెక్కకు 85 వేల 774 టెస్టుల తేడా ఉంది. అంటే తక్కువ టెస్టులు చేసి ఎక్కువగా చూపిస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఇలా అసలు లెక్కలు బయటపడతాయనే ఉద్దేశంతోనే జిల్లాల వారీగా టెస్టులు, డెత్స్​ వివరాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.   తెలంగాణలో ప్రస్తుతం రోజు 2 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. జిల్లాల్లోనూ వైరస్ వేగంగా విస్తరిస్తోంది. వందల కొద్దీ కరోనా కేసులు నమోదవుతున్నా కొన్ని జిల్లాల్లో ఇప్పటికీ అరకొరగానే టెస్టులు చేస్తున్నారు. భూపాలపల్లి జిల్లాలో ఆగస్టులో 4,270 టెస్టులు, వికారాబాద్ జిల్లాలో 5,268 టెస్టులు మాత్రమే చేసినట్లు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికలోనే ఉంది. మొత్తం 33 జిల్లాలకుగాను 27 జిల్లాల్లో రోజూ వెయ్యి కంటే తక్కువే టెస్టులు చేసినట్టు కేంద్రం వెల్లడించిన నివేదికతో వెల్లడైంది. స్టేట్‌‌‌‌ బులెటిన్‌‌‌‌లో రోజూ రాష్ట్రవ్యాప్తంగా 50 వేల నుంచి 60 వేల టెస్టులు చేస్తున్నట్టు చూపిస్తున్నారు. అయితే ఏ జిల్లాలో ఎన్ని చేశారో చెప్పడం లేదు. దీంతో అన్ని టెస్టులు చేస్తున్నారా, చేయకుండానే చేసినట్టుగా చూపిస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.    టెస్టుల సంఖ్యే కాదు.. కరోనా కేసులు, మరణాల్లో కూడా ప్రభుత్వం తప్పుడు లెక్కలే చెబుతుందని క్షేత్రస్థాయిలో పనిచేసే డాక్టర్లు, జిల్లాల మెడికల్ ఆఫీసర్లే చెప్తున్నారు. రోజూ నమోదవుతున్న కేసులు, డెత్స్​లో సగం కూడా బయటపెట్టడం లేదని అంటున్నారు. అసలు లెక్కలు బయటపడకుండా ఉండేందుకే జిల్లాల్లో బులెటిన్లు  ఇవ్వొద్దని ఆదేశించారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.    మరోవైపు కరోనా టెస్టుల విషయంలో ఐసీఎంఆర్ సూచనలను రాష్ట్ర సర్కారు‌‌‌‌ పాటించడం లేదు. కరోనా లక్షణాలున్నవాళ్లకు యాంటీ జెన్ టెస్టులో నెగెటివ్ వస్తే.. ఆర్టీపీసీఆర్ టెస్ట్‌‌‌‌ చేయడం లేదు. యాంటీ జెన్‌‌‌‌ టెస్టులో ఫాల్స్‌‌‌‌ నెగెటివ్‌‌‌‌ వచ్చే అవకాశాలు 40 శాతం దాకా ఉందని ఐసీఎంఆర్ మొదట్నుంచీ చెప్తూనే ఉంది. లక్షణాలుండి యాంటీజెన్​లో నెగెటివ్ వస్తే.. ఆర్టీపీసీఆర్ చేయించాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలో యాంటీ జెన్ టెస్టులు చేసి వదిలేస్తున్నారు. ఆర్టీపీసీఆర్ చేయాలని కోరినా పట్టించుకోవడం లేదని బాధితులు చెప్తున్నారు. రాష్ట్రంలో రోజూ 6 వేలదాకా ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసే కెపాసిటీ ఉన్నా.. అందులో సగం కూడా చేయడం లేదని హెల్త్​ డిపార్ట్​మెంట్​ వర్గాలు చెప్తున్నాయి.   కరోనా టెస్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై గతంలో చాలా సార్లు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా అంశంలో ప్రభుత్వం తప్పుడు లెక్కలు సమర్పిస్తోందని అభిప్రాయపడింది. కేసులు, మరణాలు చాలా తక్కువగా రిపోర్టు చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేసింది. కరోనా వైరస్ కట్టడిలో ప్రభుత్వం నిర్లిప్తత, ప్రైవేట్ ఆస్పత్రులు కట్టడి విషయంలో ప్రభుత్వ ఉదాసీన వైఖరి వంటి అంశాలపై దాఖలైన పిటిషన్లపై విచారించిన హైకోర్టు.. ప్రభుత్వంపై ఘాటైన కామెంట్లు చేసింది, కరోనా కేసులు, మరణాలను తక్కువగా చూపుతున్నారని అభిప్రాయపడింది. సమగ్ర నివేదిక అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రజారోగ్య రంగాన్ని అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం ఎంత ఖర్చుపెట్టిందో కూడా సమగ్ర నివేదిక ఇవ్వాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనాకి ముందు ఎంత నిధులు కేటాయించారు, కరోనా తర్వాత ఎంత కేటాయించారనే అంశాలను తెలియజేయాలని కోరింది.

ఒక ఆకురౌడీ మంత్రి అయితే మాట్లాడే భాష, పాలన ఇలాగే ఉంటాయి.. జగన్ సర్కార్ పై బీజేపీ నేత ఫైర్

ఏపీ సీఎం జగన్ తిరుమల పర్యటన సందర్భంగా డిక్లరేషన్ పై సంతకం విషయంలో తీవ్ర రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో మంత్రి కొడాలి నాని అటు తిరుమల వెంకటేశ్వర స్వామి పై అలాగే ప్రధాని నరేంద్ర మోడీ పై చేసిన వ్యాఖ్యలు ఇంకా తీవ్ర దుమారం రేపుతూనే ఉన్నాయి. తాజాగా మంత్రి కొడాలి నాని వ్యాఖ్యల పై బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్‌ స్పందిస్తూ ‘‘ఆకురౌడీ.. మంత్రి అయితే కేవలం భాష, బాడీ లాంగ్వేజ్‌ మాత్రమే కాదు పాలన కూడా ఎలా ఉంటుందనే దానికి ఏపీ ప్రత్యక్ష నిదర్శనం’’ అని వైసిపి సర్కార్ పై విరుచుకు పడ్డారు. రాష్ట్రంలో ప్రజల తలసరి ఆదాయం పెంచకుండా రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల ఊబిలోకి నెట్టేస్తూ.. భవిష్యత్తు తరాలకు తీరని ద్రోహం చేస్తున్నారని అయన ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడలోని సిద్ధార్థ కళాశాలలో నిన్న జరిగిన పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ "ఒక మంత్రి సాక్షాత్తు దేవుడి పై చేసిన తీవ్రమైన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీస్తుంటే సీఎం జగన్‌ మాత్రం కనీసం నోరు తెరవడం లేదని.. అసలు ఆయన ఏం చేస్తున్నారని సత్యకుమార్ ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ఆలయాలపై జరుగుతున్న వరుస దాడుల వెనుక కుట్ర కోణం ఉండి ఉంటుందని అయన అన్నారు.   తిరుమలలో డిక్లరేషన్‌ విషయంలో అందరికంటే ముందు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడారని.. అయితే ప్రభుత్వ జీవోను సాక్షాత్తు ముఖ్యమంత్రే పాటించకపోతే ఇక సామాన్యులకు ఏం చెబుతారని అయన నిలదీశారు. ప్రజా సమస్యలతోపాటు పాలన పై స్పష్టతలేని సీఎం జగన్‌, పొరుగు రాష్ట్రాల్లోనేగాక విదేశాల్లో నియమించుకున్న అంతర్జాతీయ సలహాదారులతో చర్చించి అయినా పాలన సజావుగా సాగించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతో చేపడుతున్న కార్యక్రమాలకు సీఎం జగన్‌ తన పేరు, తన తండ్రి పేరు పెడుతున్నారని.. ఏకంగా కొవిడ్‌-19 పాస్‌పై కూడా వైఎస్సార్‌ అని ముద్రించడం దీనికి పరాకాష్ఠ అని ఎద్దేవా చేశారు. ఏకంగా ప్రధాని మోదీపై తన కేబినెట్‌ లోని మంత్రితో విమర్శలు చేయించి, తరువాత తాపీగా అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం అంటే ఆశ్చర్యకరంగా ఉందని సత్యకుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.

కరోనా మరణాలకు కారణాలు వెల్లడించిన శాస్త్రవేత్తలు

ప్రపంచవాప్తంగా మరణమృదంగం మోగిస్తూ రోజూ వేలాదిమంది ప్రాణాలు హరిస్తోంది కరోనా. యమపాశానికి ఎవ్వరైనా ఒక్కటే అన్న కర్కశత్వంతో సామాన్యల నుంచి సెలబ్రేటీల వరకు ఈ మహ్మమారి కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు.   సినీ ప్రముఖులు, రాజకీయనాయకులు, క్రీడాకారులు ఇలా ఒక్కరేమిటీ అన్ని వర్గాల్లో సంభవిస్తున్న మరణాలు కలచివేస్తున్నాయి. లక్షలాది రూపాయలు ఖర్చుచేసి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో రోజుల తరబడి చికిత్స అందించినా ప్రాణాలకు గ్యారెంటీ లేదు. దీంతో ప్రజల్లోనే కాదు  వైద్యసిబ్బందిలోనూ కరోనా  మరణాలకు కారణాలు అంతుచిక్కడం లేదు. ఈ విషయంపై అమెరికాలోని రాక్‌ఫెల్లర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనలో ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగుచూశాయి.   కరోనా మరణాలకు కారణం శరీరంలోకి ప్రవేశించిన కోవిడ్ 19 వైరస్ యాంటీబాడీలు తప్పుదోవ పట్టించి వారి రోగ నిరోధక వ్యవస్థపైనే దాడిచేస్తుందట. మరో కారణం లోప భూయిష్ట జన్యు ఉత్పరివర్తనాలు అన్నది శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది.   కరోనా బారినపడినప్పటికీ కొందరిలో ఎలాంటి వ్యాధి లక్షణాలు లేకపోవడం, మరికొందరు కోలుకున్నప్పటికీ తిరిగి అనారోగ్యం పాలు కావడం వెనుక జీన్స్ మ్యూటేషన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని శాస్త్రవేత్తలు వివరించారు. శరీరంలోని యాంటీబాడీలను కూడా తప్పుదోవపట్టించేలా ఉంటున్నాయన్నారు. దీని కారణంగా సహజసిద్ధంగా మనిషిలో ఉండే రోగనిరోధకశక్తిలో భాగమైన 17 ప్రొటీన్లతో కూడిన ‘టైప్ ఐ ఇంటర్ ఫెరాన్’ లోపిస్తున్నట్టు పరిశోధనల్లో తేలింది. శాస్త్రవేత్తలు తమ పరిశోధన ఫలితాలను వెల్లడిస్తూ  ' వైరస్‌లు దాడిచేసినప్పుడు రోగ నిరోధక వ్యవస్థ స్పందించడానికి ముందే  టైప్ ఐ ఇంటర్ ఫెరాన్లు  రక్షణ వ్యవస్థలను బలోపేతం చేస్తాయి.  అయితే, కొవిడ్ 19 వైరస్  తీవ్రస్థాయికి చేరుకున్నప్పుడు కొందరి శరీరంలోని యాంటీబాడీలు ఈ ఇంటర్‌ ఫెరాన్లను నాశనం చేస్తున్నాయి. మరికొందరిలో జన్యు ఉత్పరివర్తనల వల్ల యాంటీ బాడీస్  సరిపడా ఉత్పత్తి కావడం లేదు. ఈ కారణాలతోనే మరణాలు సంభవిస్తున్నాయి. అయితే ఎవరిలో ఏ విధంగా వైరస్ ప్రభావం ఉంటుందో అంచనా వేయడం కష్టం ' అన్నారు.  

ఆత్మబంధువులా నిలిస్తే ఆత్మహత్యలే వుండవు...

సంవత్సరానికి 1,35,445 మంది... ప్రతిరోజూ సగటున 242 మంది మగవారు, 129 ఆడవారు జీవితాన్ని వద్దనుకుని బలవంతంగా ప్రాణాలు వదులుతున్నారు మన భారతదేశంలో. అందులోనూ 15 నుంచి 29 సంవత్సరాల మధ్య ఉన్నవారే ఎక్కువట. ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్యల నివారణ దినోత్సవంగా పాటిస్తున్న ఈరోజున ఆత్మహత్యలని నివారించడానికి మనంగా ఏం చేయాలని ఆలోచించి తీరాలి. సమాజం, సామాజిక సంస్థలు, ప్రభుత్వం బాధ్యత ఎంతవుందో.. వ్యక్తులుగా, మన బాధ్యత కూడా అంతే వుందన్నది నిజం. అందుకే పెద్ద పెద్ద సిద్ధాంతాలని పక్కనపెట్టి సగటు మనిషిగా ఆలోచిస్తే మనతోపాటు మసలే మన కుటుంబంలోని వ్యక్తి లేదా స్నేహితుడు, బంధువు, సహోద్యోగి లేదా పక్కింటివారు... ఇలా మన పరిధుల్లో మనకి పరిచయం వున్నవారు, నిన్నటిదాకా మనతో వున్నవారు హఠాత్తుగా చడీచప్పుడు లేకుండా బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారంటే అందులో మన పాత్ర ఏం లేదా? మనం చేయగలిగింది ఏం లేదా? వీటిని ఆపడం సాధ్యం కాదా? చిన్న విషయమే.. అందరికీ తెలిసిన విషయమే.. మనందరి అనుభవంలోనిదే. మనసుకి బాధ కలిగితే పంచుకోవడానికి ఒక వ్యక్తి కావలసి వుంటుంది. ఎలాంటి ఆక్షేపణలు లేకుండా కేవలం మనసుపెట్టి వినే ఒక్క వ్యక్తి చాలు ఆ నిమిషానికి దేవుడిలా కనిపిస్తాడు. అందుకే వినటం నేర్చుకుందాం. ఎదుటి వ్యక్తికి మాట్లాడే అవకాశమిద్దాం. మనసులోని బాధనంతా వెళ్ళగక్కేందుకు కొంచెం సమయం ఇద్దాం. సత్సంబంధాలు, సాన్నిహిత్యం మనుషుల్లో భరోసాని, ధైర్యాన్ని, నమ్మకాన్ని కలిగిస్తాయి. ఆపద రాగానే పరిగెట్టుకు రాగలరు. బాధని పంచుకోగలరు. దీనికి చేయాల్సిందల్లా ఒక్కటే.. కొంచెం మానవ సంబంధాలపై దృష్టి పెడదాం. ఉదయం లేచి మనకి ఎదురుపడే ప్రతి ఒక్కరిని చిన్న చిరునవ్వుతో పలకరిద్దాం. ఇంట్లోని పనిమనిషి నుంచి ఆఫీసులోని ప్యూను దాకా అందరినీ కుశలం అడుగుదాం. నాలుగు కబుర్లు చెబుదాం. మన జీవితంలోని విశేషాలని పంచుకుందాం. వాళ్ళ జీవితంలోని విశేషాలని అడుగుదాం. బలమైన మానవ సంబంధాలు ఎప్పుడూ ధైర్యాన్నిస్తాయి. ఆత్మహత్య అనే భూతం ఎప్పుడు ఎవర్ని నిశ్శబ్దంగా కబళిస్తుందో తెలీదు. బతుకు పోరాటంలో ఎత్తుపల్లాలు సహజమని తెలిసీ ఆ క్షణానికి నైరాశ్యానికి లొంగిపోయే వారెందరో! సహాయం చేయగలమా, వారి సమస్యలని తీర్చగలమా అన్నది పక్కన పెడితే, తన బాధలనయితే వినగలం కదా! నాలుగు ధైర్య వచనాలు పలకగలం కదా! ఏదో ఒక దారినైతే చూపించగలం కదా! ఇలా జరగాలంటే ముందు మనం నలుగురికి అందుబాటులో వుండాలి. ఒంటరితనపు కంచుకోటని బద్దలు కొట్టుకుని బయటకి రావాలి. ఈరోజున ఆ నిర్ణయం తీసుకుందాం. ‘‘ఆత్మహత్యల నివారణకి వ్యక్తిగా నేనేం చేయగలను’’ అన్న ఒక చిన్న ఆలోచన చేద్దాం. నలుగురితో ఆ ఆలోచని పంచుకుందాం. నిస్సహాయంగా, నిర్వేదంగా జీవితానికి వీడ్కోలు పలికే దుస్థితి ఎవరికీ రావద్దు అంటే కొంచెం మానవత్వంతో ఆలోచిద్దాం. మానవ సంబంధాలని బలపర్చుకుందాం. -రమ  

ట్రావెలర్స్ డయేరియా గురించి విన్నారా!

కుటుంబసమేతంగా హాయిగా గడిపేందుకు ఏదో పుణ్యక్షేత్రానికని బయల్దేరతాం లేదా పండుగ రోజుల్లో ఓ నాలుగు ఊళ్లు తిరిగిరావాలని గడపదాటతాం. ఊరు దాటాక ఏదో ఒకటి తినక మానదు. జిహ్వచాపల్యం అణచుకోలేకో, ఆకలికి తట్టుకోలేకో ఎక్కడో అక్కడ కాస్త ఆహారం తీసుకుంటాం. అంతే! మన విహారయాత్రలో నిప్పులు పోస్తూ అజీర్ణం మొదలవుతుంది. కడుపులో నొప్పి, గ్యాస్, విరేచనాలతో మన సంబరం కాస్తా సద్దుమణిగిపోతుంది. ఇలాంటి పరిస్థితికి ఓ పేరు ఉంది... అదే ట్రావెలర్స్ డయేరియా! అపరిశుభ్రతే అసలు కారణం నలుగురూ తిరిగే చోట పరిస్థితులు ఏమంత పరిశుభ్రంగా ఉండవు. హోటల్లో వంట చేసేవారి దగ్గర్నుంచీ వడ్డించేవారి వరకూ ఎవరో ఒకరు అపరిశుభ్రమైన చేతులతో ఆహార పదార్థాలను ముట్టుకోవచ్చు. ఇలాంటి సమయంలో వారి చేతికి అంటుకుని ఉన్న E.coli వంటి సూక్ష్మక్రిముల ద్వారా ట్రావెలర్స్ డయేరియా (TD) సోకే ప్రమాదం ఉంది. ఇవీ లక్షణాలు అకస్మాత్తుగా విరేచనాలు మొదలవ్వడం, జ్వరం, వాంతులు వికారం, ఆకలి వేయకపోవడం, కడుపులో పోట్లు, పొట్ట ఉబ్బరం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఈ లక్షణాల నుంచి ఉపశమనం లభించేందుకు మందులు ఎలాగూ అందుబాటులో ఉంటాయి. వాటితో పాటుగా పుష్కలంగా నీరు తాగుతూ ఉండాలి. నీళ్ల విరేచనాలు అవుతుంటే ORS పొడి నీళ్లలో కలుపుకుని తాగాలి. ఒకవేళ విరేచనాలలో రక్తం పోతున్నా, జ్వరం ఉన్నా వెంటనే వైద్యుడిని సంప్రదించడమే మంచిది. పసిపిల్లలు, గర్భవతులలో TD లక్షణాలు కనిపిస్తే అశ్రద్ధ చేయకుండా అందుబాటులోని వైద్యుడిని సంప్రదించాల్సిందే! ఇవీ జాగ్రత్తలు TD వ్యాధి సాధారణంగా 3 నుంచి 7 రోజులల లోపు తగ్గిపోతుంది. చాలా అరుదైన సందర్భాలలో తప్ప ఇది ప్రాణాంతకం కాదు. కాబట్టి అట్టే కంగారుపడాల్సిన పని లేదు. అయితే బయట తిరిగే నాలుగు రోజులూ రోగంతో గడిచిపోతే అంతకు మించిన విషాదం ఏముంటుంది. TD సోకిన తరువాత కంగారుపడి మందులు వాడుతూ తిప్పలు పడేకంటే అసలు అది రాకుండా చూసుకోవడం మేలు కదా! అందుకోసం ఈ జాగ్రత్తలు తీసుకోవాలి... - అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశాలలో ఆహారం తీసుకోకూడదు. దారి పొడుగూతా అలాంటి హోటళ్లే కనిపిస్తుంటే ఓ నాలుగు పళ్లు తిని ఆకలి చల్లార్చుకోవడం మంచిది. - పచ్చి కూరలు, ఉడకని పదార్థాలు ముట్టుకోకపోవడమే మేలు. - అపరిశుభ్రమైన నీటితో తయారయ్యే ఐస్తో చేసే జ్యూస్ల జోలికి పోకూడదు. - బయట తాగే నీటి విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. మినరల్ వాటర్ కానీ, కాచి చల్లార్చిన నీరు కానీ తాగాలి. అలా కుదరకపోతే క్లోరిన్ లేదా అయోడిన్ బిళ్లలు కలుపుకొని తాగాలి. - నీరు అస్సలు బాగోలేదు అని అనుమానం ఉన్న చోట, ఆ నీటిని పుక్కిలించినా కూడా ప్రమాదమే! - ప్రయాణాలలో ఎక్కడపడితే అక్కడ మాంసాహారం ముట్టకూడదు. ఎందుకంటే మాంసంలో ఏమాత్రం అపరిశుభ్రత ఉన్నా, అది ఒకోసారి ప్రాణాంతకంగా మారవచ్చు. ముఖ్యంగా చేపల జోలికి అసలు పోవద్దని హెచ్చరిస్తూ ఉంటారు. ఇన్ని కబుర్లు చెబుతున్నారు. మరి నిత్యం అక్కడే ఉండిపోయే వారి పరిస్థితి ఏమిటి అన్న అనుమానం వచ్చిందా! నిజమే! అపరిశుభ్రమైన ప్రదేశాలలో నిరంతరం నివసించేవారికి కూడా మొదట్లో TD సోకి తీరుతుంది. కాకపోతే ఓ ఏడెనిమిదేళ్ల తరువాత వారి శరీరం ఆ సూక్ష్మక్రిములని తట్టుకునేందుకు అలవాటుపడిపోతుంది. కానీ మనకి అంత సమయం ఉండదు కదా! అందుకనే బయట తిరిగే నాలుగు రోజులు కాస్త జాగ్రత్తగా మెలగాల్సిందే! - నిర్జర.  

విటమిని ఇ ఎక్కువగా ఉండే కొబ్బరిపాలు

శరీరానికి కావల్సిన సూక్ష్మ పోషకాలు ఎక్కువగా లభించే పదార్థాల్లో కొబ్బరి పాలు ఒకటి. ఇందులో సోడియం, క్యాల్షియం, ఫాస్ప‌ర‌స్‌, ప్రోటీన్స్‌, పొటాషియం వంటి పోష‌కాలు స‌మృద్దిగా ఉంటాయి. అంతేకాదు క‌రోనాను అరిక‌ట్టే జింక్‌, బీ12 వంటి న్యూట్రియంట్స్ కూడా పుష్క‌లంగా లభిస్తాయి. ఇప్పుడు కొబ్బరిపాలు మార్కెట్ లో కూడా లభిస్తున్నాయి. అయితే ఇంట్లో తయారుచేసుకోవడం మంచిది. పచ్చి కొబ్బరిని తురిమి లేదా మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. పలుచటి క్లాత్ తీసుకుని అందులో ఈ కొబ్బరి ముద్దను వేసి గట్టిగా పిండాలి. ఈ పాలను సన్నని మంటమీద ఐదు నిమిషాలు వేడి చేయాలి. ఆ తర్వాత చల్లారనివ్వాలి. ఇలా చేయడం వల్ల ఇందులో ఉండే పోషకాలు శరీరానికి అందుతాయి. సహజసిద్ధంగా లభించే కొబ్బరిపాలలో విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యానికే కాదు అందానికి కూడా కొబ్బరిపాలు ఎంతో మేలు చేస్తాయి. చుండ్రు సమస్యతో బాధపడేవారు కొబ్బరిపాలను తలకు పట్టించి బాగా మసాజ్ చేస్తే చుండ్రు సమస్య తొలగిపోతుంది. జుట్టు పట్టులా మెరుస్తుంది.
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.