Publish Date:Feb 13, 2014
Publish Date:Feb 12, 2014
Publish Date:Feb 8, 2014
Publish Date:Feb 6, 2014
Publish Date:Feb 4, 2014
Publish Date:Jan 21, 2014
Publish Date:Jan 20, 2014
Publish Date:Dec 2, 2013
Publish Date:Nov 23, 2013
Publish Date:Nov 20, 2013

EDITORIAL SPECIAL
  ఏపీలో ఎన్నికల వేళ వైసీపీ అధినేత వైస్ జగన్ బాబాయ్ వైఎస్‌ వివేకానందరెడ్డి మృతి సంచలనం రేపుతోంది. ఆయన మరణం పలు అనుమానాలకు దారి తీస్తుంది. మొదట ఆయన తెల్లవారు జామున బాత్ రూమ్ కి వెళ్లి గుండె పోటుతో అక్కడే కుప్పకూలిపోయి చనిపోయారని వార్తలొచ్చాయి. కాసేపటికి ఆయన మృతదేహం రక్తం మడుగులో పడి ఉందని.. ఆయన తలకి, చేతులకి గాయాలు ఉన్నాయని.. ఆయన పీఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన మృతిపై అనుమానాలు మొదలయ్యాయి. ఆ అనుమానాలను నిజం చేస్తూ పోలీసులు కూడా వివేకాది హత్యే అని ప్రాధమికంగా నిర్దారించారు. వివేకానంద రెడ్డిది సహజ మరణం కాదని, ఆయన హత్యకు గురైనట్టు పోస్టుమార్టం నివేదికలో ప్రాథమికంగా నిర్థారణ అయిందని పోలీసులు వెల్లడించారు. ఆయన శరీరంపై ఏడు కత్తి గాయాలు ఉన్నట్లు, పదునైన ఆయుధంతో వివేకా తల, శరీరంపై దాడి చేసినట్లు వైద్యులు గుర్తించారు. పోస్టుమార్టం నివేదికను బట్టి చూస్తే వివేకా హత్యకు గురయ్యారని అర్ధమవుతోంది. అయితే ఆయన మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన రక్తపు మడుగులో పడి ఉంటే.. ఆయనది సహజం మరణమని, ఆయన గుండెపోటుతో మరణించారని ఎందుకు ప్రచారం చేశారు?. అసలు తొలుత అలా ఎవరు ప్రచారం చేశారు? అలా చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది?. వివేకా సౌమ్యుడని, వివాదాలకు దూరంగా ఉంటారని పేరుంది. మరి అలాంటి వ్యక్తిని చంపాల్సిన అవసరం ఎవరికుంది?. ఆయన హత్య వెనుక రాజకీయ కోణాలు, రాజకీయ ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా? ఇలా పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఎన్నికల వేళ ఓ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధినేతకి స్వయానా బాబాయ్ అయిన వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందడంతో.. ఆయన మృతి రాజకీయ కోణం సంతరించుకుంది. ఇప్పటికే వివేకా మృతిపై కొందరు వైసీపీ, టీడీపీ నేతలు ఒకరిమీద ఒకరు అనుమానం వ్యక్తం చేస్తూ ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నారు. మరోవైపు వివేకా మృతిపై విచారణకు ఇప్పటికే ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఆ సిట్ నివేదిక వస్తే కానీ వివేకా మృతి వెనుక రాజకీయ కుట్ర ఉందో, మరేదైనా కక్ష ఉందో తెలీదు.
  2019-20 సంవత్సరానికి రూ.1,82,017 కోట్లతో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌‌ను సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన కారణంగా ఎన్ని నిధులు వస్తాయో స్పష్టంగా తెలియదన్నారు. అందుకే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు. కేంద్రం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్రంలోనూ పూర్తి బడ్జెట్ ప్రవేశపెడతామని వెల్లడించారు. ఇది తెలంగాణ రాష్ట్రానికి ఆరవ బడ్జెట్‌ అని చెప్పారు. తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రజలు సహకారం అందిస్తున్నారని తెలిపారు. తెలంగాణ ఆవిర్భావానికి ముందు గుజరాత్‌, కేరళ అభివృద్ధి గురించే దేశవ్యాప్తంగా చర్చ జరిగేదని, ప్రస్తుతం తెలంగాణ అభివృద్ధిపై చర్చ జరుగుతోందని అన్నారు. తెలంగాణ అనుసరిస్తున్న ప్రణాళిక దేశంలో చర్చకు కేంద్ర బిందువైందని చెప్పారు. తెలంగాణ ఆవిర్భవించినప్పుడు ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. తక్కువ సమయంలో ఎక్కువ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాం. అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్‌ అందిస్తున్నామన్నారు. రైతుల్లో నిరాశను తొలగించామని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు. తెలంగాణ రైతులకు కేసీఆర్‌ శుభవార్త చెప్పారు. 2018 డిసెంబరు 11వ తేదీలోగా తీసుకున్న రైతు రుణాలు రూ.లక్ష వరకూ మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ బడ్జెట్‌లో వ్యవసాయాభివృద్ధి కోసం రూ.20,107కోట్లు కేటాయించారు. రైతు బంధు సాయం కింద ఎకరానికి రూ.10వేలు అందిస్తుండగా, ఇందుకోసం రూ.12వేల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. రైతు బీమా కోసం రూ.650కోట్లు కేటాయించిన కేసీఆర్‌ ప్రభుత్వం.. నీటిపారుదల శాఖకు రూ.22,500కోట్లు కేటాయించింది. తెలంగాణ బడ్జెట్‌ ముఖ్యాంశాలు: వ్యవసాయ శాఖకు రూ.20,107 కోట్లు రైతు రుణమాఫీకి రూ.6వేల కోట్లు రైతు బంధుకు రూ.12 వేల కోట్లు రైతు బీమా రూ.650 కోట్లు నీటిపారుదలశాఖకు రూ.22,500కోట్లు నిరుద్యోగ భృతికి రూ.1,810 కోట్లు ఎస్సీల అభివృద్ధికి రూ.16,581 కోట్లు ఎస్టీల అభివృద్ధికి రూ.9,827 కోట్లు మైనార్టీల సంక్షేమానికి రూ.2004 కోట్లు ఈఎన్‌టీ, దంత పరీక్షలకు రూ.5,536 కోట్లు ఆసరా పెన్షన్లకు రూ.12,067 కోట్లు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌కు రూ.1450 కోట్లు రూపాయికి కిలో బియ్యం పథకానికి రూ.2,744 కోట్లు దివ్యాంగుల పెన్షన్లకు రూ.12వేల కోట్లు ఎంబీసీ కార్పోరేషన్‌కు రూ.1000 కోట్లు
  ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో టీడీపీ నేతల జంపింగులే హాట్ టాపిక్ అని చెప్పాలి. ఎందుకంటే నేతలు వరుసపెట్టి టీడీపీకి గుడ్ బై చెప్తున్నారు. నేతల జంపింగులపై తాజాగా మంత్రి నారా లోకేష్ స్పందించారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ రాదని తెలిసిన వారే పార్టీలు మారుతున్నారని ఆరోపించారు. గెలుపు గుర్రాలకే పార్టీ టిక్కెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. ఎవరి పనితీరు ఏంటో చంద్రబాబుకు తెలుసునని చెప్పుకొచ్చారు. పార్టీలో, చంద్రబాబుతో విభేదాలు ఉంటే ఎప్పుడో వెళ్లి ఉండేవారని, ఎన్నికలకు రెండు నెలల ముందు కాదని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లకు గాను 150 సీట్లలో గెలిచి చంద్రబాబు సీఎం అవుతారని లోకేష్ ధీమా వ్యక్తం చేసారు. నాలుగేళ్ల 10 నెలలు ప్రయాణం చేసి, ఇప్పుడు బాబు మీద విమర్శలు చేయడంలో పరమార్ధాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. నిన్న మొన్నటిదాకా జగన్ ను తిట్టి, ఇప్పుడు ఆయన దగ్గరకే వెళ్లడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. నేతలు పార్టీలు మారినా ఏమీ కాదని.. సంక్షేమం, అభివృద్ధే టీడీపీకి అండగా నిలుస్తాయని లోకేష్ స్పష్టం చేసారు. అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటుందని తేల్చి చెప్పారు. ఎన్నికలకు 30 రోజుల ముందు పొత్తులపై చంద్రబాబు ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటారని లోకేష్ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటుందని లోకేష్ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీస్తున్నాయి. ఏపీ ఎన్నికల బరిలో ప్రధానంగా టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ మరియు కాంగ్రెస్ దిగనున్నాయి. టీడీపీ, వైసీపీల పొత్తు అసలు ఆప్షనే లేదు. ఇక టీడీపీ, బీజేపీలు గత ఎన్నికల్లో కలిసి పనిచేసినా.. ఇప్పుడు ఆ రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. కాబట్టి బీజేపీతో పొత్తు ఉండే అవకాశం లేదు. జనసేన విషయానికొస్తే.. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీకి దూరంగా ఉండి టీడీపీకి మద్దతిచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం తాము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోమని, కేవలం వామపక్షాలతో కలిసి నడుస్తామని స్పష్టం చేసారు. ఇప్పటికైతే జనసేనతో పొత్తు కూడా కష్టమే. మరి ఎన్నికల ముందు ఏదైనా అద్భుతం జరిగితే చెప్పలేం. ఇక మిగిలింది కాంగ్రెస్. మిగతా పార్టీలతో పోల్చుకుంటే ప్రస్తుతం టీడీపీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే అవకాశాలు ఎక్కువనే చెప్పాలి. ఇప్పటికే టీడీపీ, కాంగ్రెస్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీచేశాయి.. అదేవిధంగా కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా కలిసి పనిచేస్తున్నాయి. అయితే తెలంగాణలో వచ్చిన చేదు ఫలితాల నేపథ్యంలో టీడీపీ, కాంగ్రెస్ లు ఏపీలో ఎంతవరకు కలిసి పనిచేస్తాయో కూడా ఆలోచించాలి. కొందరు టీడీపీ నేతలు కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేస్తున్నారు. జాతీయస్థాయిలో కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తాం కానీ రాష్ట్రంలో మాత్రం విడిగా పోటీ చేస్తేనే టీడీపీకి లాభమని అభిప్రాయపడుతున్నారు. మరి ఇప్పుడు లోకేష్ ఏమో టీడీపీ, ఇతర పార్టీలతో పొత్తు అంటున్నారు. దీంతో అసలు టీడీపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటుంది అంటూ చర్చలు మొదలయ్యాయి. చూద్దాం మరి ఎన్నికల ముందు టీడీపీ పొత్తుల విషయంలో ఎలాంటి ట్విస్ట్ లు ఇస్తుందో.
ALSO ON TELUGUONE N E W S
  'ఆర్.ఆర్.ఆర్'లో ఎన్టీఆర్ సరసన నటించేది ఎవరు? బ్రిటన్ బ్యూటీ డైసీ ఎడ్గార్ జోన్స్ తప్పుకున్న తర్వాత పలువురి పేర్లు వినిపించాయి. హిందీ హీరోయిన్లు శ్రద్ధా కపూర్, పరిణితి చోప్రా, కృతిసనన్... దక్షిణాది భామ నిత్యా మీనన్ తదితరుల్లో ఎవరో ఒకరిని ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. వీటిపై దర్శకుడు రాజమౌళి గాని... 'ఆర్.ఆర్.ఆర్' యూనిట్ సభ్యులు గాని స్పందించలేదు. పుకార్లు షికార్లు చేశాయి. అయితే... రాజమౌళి దృష్టిలో వీరెవరూ లేరట! విదేశీ భామ కోసమే ఆయన అన్వేషణ సాగిస్తున్నారట. కథ ప్రకారం విదేశీ భామకు, ఎన్టీఆర్ కు మధ్య లవ్ ట్రాక్ ఉందట. అందువల్లనే, డైసీ ఎడ్గార్ జోన్స్ ను తీసుకున్నారు. ఆమె తప్పుకోవడంతో ఆ స్థానంలో మరో విదేశీ భామను ఎంపిక చేయాలని ఆలోచిస్తున్నారట. ఈ తరుణంలో రాజమౌళికి బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఓ సలహా ఇచ్చారట. శ్రీలంక సుందరి జాక్వలిన్ ఫెర్నాండేజ్ ని కథానాయికగా తీసుకోమని కోరారట. ఇవ్వడానికి జాక్వలిన్ శ్రీలంక దేశస్థురాలు అయినా... ఆమెలో బ్రిటిష్ పోలికలు ఉంటాయి. సో... ఎన్టీఆర్ కు జోడీగా ఆమెను ఎంపిక చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే 'ఆర్.ఆర్.ఆర్'లో ఇద్దరు బాలీవుడ్ యాక్టర్స్ ఉన్నారు. సినిమాలో మరో హీరో రామ్ చరణ్ కి జోడీగా అలియా భట్ నటిస్తుండగా... ఓ కీలక పాత్రలో అజయ్ దేవగణ్ నటిస్తున్నారు. జాక్వలిన్ కూడా ఎంపికైతే హిందీలో సినిమాకు మరింత క్రేజ్ వస్తుంది.
  పాపం... యువ హీరో నిఖిల్ అదృష్టం అసలు ఏమాత్రం బాగోలేదు. ఇప్పటికే విడుదల కావాల్సిన అతని తాజా చిత్రం 'అర్జున్ సురవరం' మరోసారి వాయిదా పడింది. ఇంతకు ముందు సినిమా యూనిట్ జనాలే సినిమా విడుదలకు అడ్డు పడ్డారు. రషెస్ చూసి మళ్లీ రీషూట్ చేయాలని నిర్ణయించుకోవడంతో విడుదల వాయిదా పడింది. అయితే... అప్పట్లో ఇవేవీ బయటకు చెప్పలేదు. విడుదల వాయిదా పడుతున్న విషయాన్ని మాత్రం ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. 'స్వామి రారా', 'కార్తికేయ' సినిమాల విడుదల కూడా ఇదేవిధంగా వాయిదా పడ్డాయని... విడుదల వాయిదా పడిన తన ప్రతి సినిమా విజయం సాధించిందని నిఖిల్ చెప్పాడు. ఇప్పుడు సినిమా ఫస్ట్ కాపీ రెడీగా ఉంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు విడుదల చేసుకోవచ్చు. కానీ, విడుదల చేయలేని పరిస్థితి. ప్రేక్షకుల్లో భయంకరమైన క్రేజ్ కల హాలీవుడ్ సినిమా 'అవెంజర్స్ ఎండ్ గేమ్'కి రెండు తెలుగు రాష్ట్రాలలో మెజారిటీ థియేటర్లు కేటాయించారు. ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి టాక్ తెచ్చుకున్న 'జెర్సీ', విమర్శకుల సమీక్షలతో సంబంధం లేకుండా వసూళ్లలో దూసుకువెళ్తున్న 'కాంచన 3' కొన్ని థియేటర్లలో ఉన్నాయి. దాంతో నిఖిల్ 'అర్జున్ సురవరం'కి థియేటర్లు దొరకడం లేదు. చేసేదేంలేక సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఈ విషయమై ముందుగా ఏయషిన్ సినిమాస్ ‌స్పష్టత ఇచ్చింది. దాపరికాలు లేకుండా థియేటర్లో దొరకని కారణంగా విడుదల వాయిదా వేస్తున్నట్టు... మహర్షి విడుదల తర్వాత మంచి తేదీ చూసి విడుదల చేస్తామని ఏషియన్ సినిమాస్ పేర్కొంది. తర్వాత నిఖిల్ స్పందించాడు. "సినిమా విడుదలను వాయిదా వేయడం బాధాకరం అయినప్పటికీ...  డిస్ట్రిబ్యూటర్ల నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను. నేను కూడా ప్రేక్షకుల గ్రాండ్ రిలీజ్ డేట్ కోసం ఎదురు చూస్తున్నా. ఈ సమయంలో నాకు ప్రేక్షకులతో పాటు అత్యవసరం. ఇన్ని రోజులు ప్రేక్షకుల్ని వెయిట్ చేయించినందుకు మనస్ఫూర్తిగా క్షమాపణలు తెలుపుతున్నా" అని నిఖిల్ ఓ లేఖ విడుదల చేశాడు. 'మహర్షి' విడుదల తర్వాత కూడా చాలా సినిమాల్లో లైన్ లో ఉన్నాయి. వాటి మధ్య నిఖిల్ ఎప్పుడొస్తాడో?
  ఇటీవ‌ల కాలంలో హీరోల‌కు ఏదో ఒక లోపం పెట్టి సినిమాలు స‌క్సెస్ కొడుతున్నారు ద‌ర్శ‌కులు. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `రంగ‌స్థ‌లం`లో రామ్ చ‌ర‌ణ్ వినికిడి లోపం ఉన్న వాడిగా న‌టించి బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టాడు. న‌టుడుగా త‌న సత్తాను చూపించాడు. ఈ కోవ‌లో మ‌రో మెగా హీరో మూగ వాడిగా నటిస్తున్న‌ట్టు స‌మాచారం అందుతోంది. ఒక‌సారి వివ‌రాల్లోకి వెళితే... మెగా మేన‌ల్లుగు సాయితేజ్ (సాయి ధ‌ర‌మ్ తేజ్) త‌మ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఒక సినిమా లాంచ్ అయిన సంగ‌తి తెలిసిందే. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా మైత్రీ మూవీ మేక‌ర్స్, సుకుమార్ రైటింగ్స్ పై తెర‌కెక్కుతోంది. అయితే ఈ సినిమాలో హీరో మాట‌లు రాని జాల‌రిలా న‌టిస్తున్న‌ట్లు తెలుస్తోంది. తొలి సినిమానే ఒక ఛాలెంజింగ్ రోల్ లో న‌టిస్తున్నాడు వైష్ణవ్ తేజ్.  దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం స‌మ‌కూరుస్తున్న ఈచిత్రంలో కేర‌ళ కుట్టి హీరోయిన్ గా న‌టిస్తోంది. త్వ‌ర‌లో ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివ‌రాలు వెల్ల‌డ‌య్యే అవ‌కాశాలున్నాయి.
  డ్యూయ‌ల్ రోల్ లో మాస్ మ‌హ‌రాజా న‌టిస్తోన్న లేటెస్ట్ సినిమా `డిస్కో రాజా`. సైంటిఫిక్ థ్రిల్ల‌ర్ గా రూపొందుతోన్న ఈ సినిమా  సంక్రాంతికి ఎట్టి ప‌రిస్థితుల్లో తీసుక‌రావ‌డ‌నికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు చిత్ర యూనిట్. వి ఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై ఇప్ప‌టికే క్రేజ్ నెల‌కొంది. ఇటీవ‌లే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున‌ని నెక్ట్స్ షెడ్యూల్ మే మూడో వారంలో జ‌రుపుకోవ‌డానికి సిద్ధ‌మ‌వుతోంది. గ్రాఫిక్ వ‌ర్క్ ఎక్కువ‌గా ఉండ‌టంతో శ‌ర‌వేగంగా షూటింగ్ పూర్తి చేసి దానిపై దృష్టి సారించ‌నున్నాడ‌ట ద‌ర్శ‌కుడు. ఇందులో ర‌వితేజ్ తండ్రీ కొడుకులుగా డ్యూయ‌ల్ రోల్ లో న‌టిస్తున్నాడు. ఇక ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు తేనున్నారు. గ‌తంలో సంక్రాంతి సీజ‌న‌కు వ‌చ్చిన కృష్ణ‌, మిర‌ప‌కాయ్ చిత్రాలు హిట్ చిత్రాలుగా నిలిచాయి. ఈ నేప‌థ్యంలో `డిస్కో రాజా` చిత్రాన్ని కూడ సంక్రాతికి తీసుకరానున్నారు. పాయ‌ల్ రాజ్ పుత్, న‌భా న‌టేష్ హీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ సినిమాను రామ్ తాళ్లూరి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. చూద్దాం మ‌ళ్లీ ఈ సినిమాతో మాస్ రాజా మ‌రోసారి స‌క్సెస్ అందుకుంటాడో లేదో.
  మేనల్లుడు నాగచైతన్యతో కలిసి విక్టరీ వెంకటేష్ నటిస్తున్న సినిమా 'వెంకీ మామ'. మరి, ఈ 'వెంకీ నాన్న' ఎవరు? ఇదేం టైటిల్ అనుకుంటున్నారా!? ఫొటో చూశారా? అందులో ఉన్నది నాన్నే మరి! ఇటీవల వెంకీ పెద్ద కుమార్తె ఆశ్రిత పెళ్లి జరిగింది కదా. ఆ పెళ్లి ఫొటోల్లో ఇదొకటి. సమంత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఫొటోలో కళ్లజోడు పెట్టుకున్న ఆవిడ నీరజ. వెంకటేష్ సతీమణి. ఆమె కాకుండా మిగతా వాళ్ళందరూ వెంకీకి కుమార్తెలే. వెంకీకి నాగచైతన్య మేనల్లుడు కనుక... మేనల్లుడి భార్య ఆయనకు కుమార్తె వరస. ఆ లెక్కన వెంకీకి సమంత కుమార్తె. కళ్ళజోడు సోఫా మీద పెట్టి కూర్చున్న అమ్మాయి (ఫొటోలో లెఫ్ట్) వెంకీ అన్నయ్య సురేష్ బాబు కుమార్తె. వెంకీకి కూడా కూతురే కదా! మిగతా ముగ్గురూ వెంకటేష్ సొంత కుమార్తెలు. పెద్ద కుమార్తె పెళ్ళిలో కుటుంబంలో కుమార్తె వరస అయ్యేవారందరితో వెంకటేష్ దంపతులు ఇలా ఫొటో దిగారన్నమాట.  
  తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్ బోర్డు నిర్వాకంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. దాదాపు 20 మంది ఇంటర్ విద్యార్థులు మార్కులు తక్కువ వచ్చాయనో, ఫెయిల్ అయ్యామనో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అయితే ఇంత జరుగుతున్నా దీనిపై సీఎం కేసీఆర్ స్పందించకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తప్పుకి బాధ్యులైన వారిని శిక్షించి మీకు అండగా ఉంటామని.. విద్యార్థులకు, తల్లిదండ్రులకు భరోసా ఇవ్వలేదు. కనీసం ఆత్మహత్యల పట్ల విచారం వ్యక్తం చేసి.. మిగతా విద్యార్థుల్లో ధైర్యం నింపే ప్రయత్నం కూడా చేయలేదు. కేసీఆర్ కి ఓ ఐదు నిమిషాలు ప్రెస్ మీట్ పెట్టడానికో లేక ఒక ట్వీట్ చేయడానికో కూడా టైం లేదా? అంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అన్నింట్లో తోటి తెలుగు రాష్ట్రమైన ఏపీతో పోటీ పడే కేసీఆర్.. తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించినా.. తన సొంతం రాష్ట్రంలో ఇంత జరుగుతుంటే కేసీఆర్ ఎందుకు స్పందించట్లేదు అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై ట్విట్టర్ వేదికగా చంద్రబాబు స్పందించారు. 'పరీక్షలో ఫెయిల్ అయ్యామని తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ విద్యార్ధులు ఆత్మహత్య చేసుకున్నట్లు వెలువడుతున్న వార్తలు బాధ కలిగించాయి. ఉజ్వల భవిష్యత్తు ఉన్న విద్యార్ధుల మరణం నన్ను కలిచివేసింది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. విద్యార్ధులకు నా విజ్ఞప్తి ఒక్కటే.. కేవలం పరీక్షలు, పాస్ కావడం మాత్రమే జీవితం కాదు. అవి మీ ప్రతిభకు గుర్తింపు మాత్రమే.. కానీ పరీక్షల కంటే మీ జీవితాలు ముఖ్యం. మీ ప్రాణాలు అంతకన్నా అమూల్యమైనవి. పరీక్షల్లో తప్పినంత మాత్రాన మీ జీవితాలను అర్థాంతరంగా ముగించి, మీ కన్నవారు మీపై పెట్టుకున్న ఆశలను కడతేర్చకండి. ఈ వయసులో తల్లిదండ్రులకు కడుపుకోత పెట్టకండి. మీ ముందెంతో సుందరమైన బంగారు భవిష్యత్తు ఉంది. ప్రపంచ చరిత్రలో విజేతలుగా నిలిచిన చాలామంది మొదట పరాజితులే..చదువు అనేది కేవలం విజ్ఞానానికే, అదే జీవితం కాదు. ఓటమి విజయానికి తొలిమెట్టు. మళ్లీ మంచి ఫలితాల కోసం కష్టపడి చదవండి. ఎప్పటికప్పుడు మీ నైపుణ్యాలను పెంచుకోండి. ఎంచుకున్న రంగాలలో ప్రతిభ చూపి రాణించండి. కష్టపడితే విజయం మీదే, బంగారు భవిష్యత్తు మీదే. జీవితంలో మీ ఎదుగుదలే తల్లిదండ్రులకు, దేశానికి  మీరిచ్చే బహుమతి.' అని ట్వీట్ చేశారు. ఈ మాత్రం స్పందన తెలంగాణ సీఎం కేసీఆర్ నుంచి కరువైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
  ఏపీలో ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు మే 23 న వెలువడనున్నాయి. మరి విజయం ఎవరిని వరిస్తుందో తెలీదు కానీ ప్రధాన పార్టీల నేతలు మాత్రం ఎవరికి వారు గెలుపు మాదంటే మాదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఎవరి ధీమా నిజం కానుందో మే 23 న తేలనుంది. అయితే టీడీపీ.. ఒక నియోజకవర్గంలో ఎక్కడ తమ పార్టీ అభ్యర్థి గెలుస్తాడోనని తెగ కలవరపడిపోతుందట. అదేంటి పార్టీ అభ్యర్థి గెలిస్తే సంతోషమేగా అనుకుంటున్నారా? దానికి ఓ సెంటిమెంట్ ఉందిలేండి. ఆ అభ్యర్థి గెలిస్తే టీడీపీ ప్రతిపక్షానికి పరిమితమవుతుందట. ఇంతకీ ఆ అభ్యర్థి ఎవరో కాదు టీడీపీ సీనియర్ నేత ప‌య్యావుల కేశ‌వ్. ప‌య్యావుల కేశ‌వ్‌.. ఈ ఎన్నికల్లో అనంత‌పురం జిల్లా లోని ఉర‌వ‌కొండ నుండి టీడీపీ అభ్య‌ర్దిగా బ‌రిలో ఉన్నారు. ఆయన గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి అంటున్నారు. అయితే టీడీపీ శ్రేణులు మాత్రం.. ఏంటీ ప‌య్యావుల కేశ‌వ్ గెలుస్తున్నారా.. వామ్మో!! అంటూ తెగ టెన్షన్ పడుతున్నారు. పయ్యావుల 2004, 2009 ఎన్నికల్లో గెలుపొందారు. ఈ రెండు సార్లు టీడీపీ ప్రతిపక్షానికి పరిమితమైంది. ఇక‌ 2014 ఎన్నికల్లో పయ్యావుల ఓడిపోయారు. టీడీపీ అధికారంలోకి వ‌చ్చింది. 2014 ఎన్నిక‌ల్లో ప‌య్యావులపై పోటీ చేసిన వైసీపీ అభ్య‌ర్ది విశ్వేశ్వ‌రరెడ్డి 2275 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత టీడీపీ అధినేత చంద్ర‌బాబు కేశ‌వ్‌కు ఎమ్మెల్సీగా అవ‌కాశం క‌ల్పించి.. శాస‌న మండ‌లిలో చీఫ్ విప్‌గా నియ‌మించారు. ఉర‌వ‌కొండ నుండి తాజా ఎన్నిక‌ల్లో మ‌రో సారి టీడీపీ అభ్య‌ర్దిగా ప‌య్యావుల బ‌రిలో దిగారు. 2014లో ఓడిన నాటి నుండే ప‌య్యావుల 2019 ఎన్నిక‌ల్లో విజ‌యం కోసం వ్యూహాలు అమ‌లు చేసారు. ఇక‌, అక్క‌డ వైసీపీ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న విశ్వేశ్వ‌ర రెడ్డిని బ‌రిలో ఉన్నారు. ఇద్ద‌రి మ‌ధ్య హోరాహోరీ పోరు సాగింది. ఈ ఎన్నిక‌ల్లో ఉర‌వ‌కొండ నుండి ఖ‌చ్చితంగా ప‌య్యావుల గెలుస్తార‌నే ధీమాతో స్థానిక నేతలు ఉన్నారు. అయితే రాష్ట్ర నేత‌లు మాత్రం పయ్యావుల గెలిస్తే 2004, 2009 ఎన్నికల సెంటిమెంట్ రిపీట్ అవుతుందేమోనని టెన్షన్ పడుతున్నారు. మరి ప‌య్యావుల ఈసారైనా సెంటిమెంట్ బ్రేక్ చేస్తారో లేక అలానే కంటిన్యూ చేస్తారో చూడాలి.
  కేఏ పాల్.. ఒకప్పుడు మత ప్రభోదకుడిగా, శాంతి దూతగా ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఒక కామెడీ పీస్ లా మిగిలిపోయాడు. అవమానాలు ఎదుర్కొన్న స్థాయి నుంచి ఎవరూ ఊహించని స్థాయికి ఎదిగాడు. అంతలోనే నేలకు జారి హేళనలు ఎదుర్కొంటున్నాడు. అసలు కేఏ పాల్ కి ఏమైంది? ఎందుకిలా తయారయ్యాడు? క్లుప్తంగా తెలుసుకుందాం. కేఏ పాల్ పూర్తి పేరు కిలారి ఆనంద్ పాల్. ఆంధ్రప్రదేశ్ లోని చిట్టివలస అనే చిన్న గ్రామంలో జన్మించాడు. వారిది హిందూ మతం అయినప్పటికీ వారి కుటుంబం క్రిస్టియన్ మతంలోకి మారారు. దీంతో కేఏ పాల్ కి చిన్నతనం నుంచి జీసస్ ని పూజించడం అలవాటైంది. అయితే పాల్ చదువులో చాలా వెనుక ఉండేవాడు. పదో తరగతి రెండుసార్లు ఫెయిల్ అయ్యాడు. అతికష్టం మీద మూడో సారి పాస్ అయ్యాడు. తరువాత మళ్ళీ ఇంటర్ లో కూడా ఫెయిల్. ఆ టైం లో పాల్ చిన్న చిన్న పనులు చేసి కూడా డబ్బులు సంపాదించుకునేవాడు. కానీ ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. ఆ అవమానాలే అతన్ని అందనంత ఎత్తుకి ఎదిగేలా చేశాయి. టెన్త్ కూడా పాస్ కానీ పాల్ పట్టుదలతో ఇంగ్లీష్ బాష మీద పట్టు సాధించాడు. మత ప్రభోదకుడిగా మారిపోయాడు. అనతికాలంలోనే ప్రపంచదేశాల్లో ఉపన్యాసాలు ఇచ్చే స్థాయికి ఎదిగాడు. ఒకానొక టైంలో 20 నిమిషాల ఉపన్యాసానికి 20 కోట్ల రూపాయలు తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి. బోయింగ్ 747 ఎస్పీ విమానం కూడా ఆయన సొంతమైంది. ఆయన ట్రస్ట్ ద్వారా ఎందరో అనాధ పిల్లల్ని ఆదుకొని చదివించాడు, ఎందరో విదువరాళ్లకు ఆర్థికసాయం చేశాడు. అయితే అలా ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చుకున్న కేఏ పాల్ రాజకీయాల పుణ్యమా అని కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. కొందరు స్వార్ధ రాజకీయ నాయకులు చేసిన కుట్రల్లో కేఏ పాల్ బలైపోయారు అంటుంటారు. కొందరు నాయకులు ఆయనను కోట్ల డబ్బులు ఇవ్వమని బెదిరించేవారట, కొందరైతే మత ప్రభోదనలు ఆపివేయాలని ఒత్తిడి తెచ్చేవారట. ఇలా రకరకాల ఒత్తిడులు, బెదిరింపులు.. మరోవైపు 2008 లో కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ స్థాపించాడు. తరువాత ఒత్తిడులు మరింత పెరిగాయి. దీంతో ఆయన ఆ రాజకీయ కుట్రలు, ఒత్తిడులు తట్టుకోలేక 2009 ఎన్నికల్లో పోటీ కూడా చేయలేదు. ఇంతలో సోదరుడిని హత్య చేశారన్న ఆరోపణలతో జైలు. అయితే తనని కుట్ర ప్రకారం జైలుకు పంపించారని కేఏ పాల్ చెప్తుంటారు. ఈ వరుస సంఘటనలతో పాల్ మెంటల్ గా బాగా డిస్ట్రబ్ అయ్యారు. మత ప్రభోదనలకు దూరమయ్యాడు. ఒకప్పుడు విమానాల్లో ప్రపంచ దేశాలు చుట్టొచ్చిన ఆయన.. ఇప్పుడు తన వింత చేష్టలు, వింత మాటలతో 2019 ఎన్నికల్లో ఒక కమెడియన్ గా మిగిలిపోయాడు. ఇప్పుడు ఆయన చేష్టలు చూసి మనం నువ్వుకుంటున్నాం కానీ ఒకప్పుడు ఆయన్ని చూసిన వారు మాత్రం ప్రస్తుత ఆయన పరిస్థితిని చూసి జాలిపడుతున్నారు.
  తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అయితే 2014 ఎన్నికలు, 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే.. ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం బాగా తగ్గింది. 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో 62.25 శాతం పోలింగ్‌ నమోదైనట్టు ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. రాష్ట్రం మొత్తం మీద ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో 75.61 శాతం పోలింగ్‌ నమోదైంది. అతితక్కువగా హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో 39.49 శాతం నమోదైంది. సాధారణంగానే హైదరాబాద్ లో పోలింగ్ శాతం తక్కువగా ఉంటుంది. 2014 ఎన్నికల్లో 53.27 శాతం ఉండగా.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 47.29 శాతం నమోదైంది. ఇక తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కనీసం 40 శాతం కూడా నమోదు కాలేదు. అదేవిధంగా.. మల్కాజిగిరిలో 42.75 శాతం, సికింద్రాబాద్ లో 45 శాతం నమోదైంది. దీంతో ఓటర్లు మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే పోలింగ్ శాతం తగ్గిపోవడానికి ముఖ్యంగా రెండు కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు భారీ సంఖ్యలో హైదరాబాద్ లో నివసిస్తూ ఉంటారు. వీరిలో చాలామంది హైదరాబాద్ తో పాటు, సొంత ఊరిలో ఓటు కలిగి ఉన్నారు. ఏపీలో లోక్ సభతో పాటు అసెంబ్లీ కి కూడా ఎన్నికల జరగడంతో, చాలామంది హైదరాబాద్ నుండి తమ సొంత ఊళ్లకు వెళ్లి అక్కడ ఓటు హక్కు వినియోగించుకున్నారు.హైదరాబాద్ లో ఓటింగ్ శాతం తగ్గడానికి ఇది ఒక కారణంగా కనిపిస్తోంది. ఇక మరో ముఖ్య కారణం.. ఎవరికి ఓటేసి ఏం లాభం అనే అభిప్రాయం ఓటర్లలో ఏర్పడటం. అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లతో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఆ తరువాత ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ కు క్యూ కట్టారు. దీంతో అసెంబ్లీ అంతా దాదాపు గులాబీమయం అయింది. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ హవా కొనసాగేలా ఉంది. ఒకవేళ వేరే పార్టీ అభ్యర్థికి ఓటేస్తే.. వారు గెలిచినా టీఆర్ఎస్ గూటికి చేరే అవకాశముంది. ఈ మాత్రం దానికి ఓటేయడం ఎందుకనే అభిప్రాయం కొందరు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద పలు కారణాల పుణ్యమా అని తెలంగాణలో పోలింగ్ శాతం తగ్గిపోయింది.
  ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ వైసీపీ అధినేత వైఎస్ జగన్.. వరుసపెట్టి పలువురు నేతలకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఈ చేరికలు చూసి వైసీపీ శ్రేణులు ఆనందపడుతున్నారు. అయితే వారి చేరిక వల్ల వైసీపీకి కొత్తగా ఒరిగేది ఏముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే దాదాపు వారంతా గతంలో వైసీపీని వీడి, జగన్ మీద తీవ్ర విమర్శలు చేసిన వారే. గత ఎన్నికల సమయంలో వైసీపీలో చేరి, తర్వాత పార్టీని వీడి.. జగన్‌ మీద విమర్శలు గుప్పించిన వారు వరుసగా ఇప్పుడు వైసీపీలో చేరుతున్నారు. వీరిలో కొందరు ఎన్నికలకు ముందుగానే పార్టీ ఫిరాయించిన వారున్నారు. కొందరు ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత ఫిరాయించిన వారున్నారు. గతంలో వైసీపీని వీడి తనమీద విమర్శలు చేసిన వారిని జగన్ ఏరికోరి మరి పార్టీలో చేర్పించుకుంటున్నారు. రీసెంట్ గా వైసీపీలో చేరిన దేవినేని చంద్రశేఖర్, రఘురామకృష్ణంరాజు, దాడి వీరభద్రరావు లాంటి వారు ఆ కోవలోకే వస్తారు. మంత్రి దేవినేని ఉమా సోదరుడు దేవినేని చంద్రశేఖర్.. 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. జగన్ టికెట్ ఇస్తారేమో అని ఆయన ఆశపడ్డారు. కానీ ఇవ్వలేదు. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో.. అనంతరం మళ్లీ ఆయన సోదరుడు ఉమాకి దగ్గరయ్యారు. ఆ సమయంలో.. ఆయన జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు మళ్లీ జగన్ పంచకు చేరారు. జగన్‌ కూడా హ్యాపీగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇక రఘురామకృష్ణంరాజు అయితే గతంలో జగన్ ని నపుంసకుడు అంటూ హద్దు దాటి విమర్శలు చేశారు. తనని వ్యక్తిగతంగా దూషించిన వ్యక్తిని కూడా జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించేశారు. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కూడా అంతే. ఆయన వైసీపీకి రాజీనామా చేసినప్పుడు.. జగన్‌ వ్యక్తిత్వం పై చేసిన విమర్శలు అన్నీ ఇన్నీ కాదు. జగన్ పై విమర్శల దాడి చేసిన ఆయన చాలా కాలం పాటు ఏ పార్టీలోనూ చేరలేదు. ఈ మధ్య టీడీపీలో చేరడానికి సిద్ధమయ్యారు అంటూ వార్తలొచ్చాయి. కానీ టికెట్ విషయంలో టీడీపీ సానుకూలంగా స్పందించక పోవడంతో వెనకడుగు వేశారు. ఇక ఎన్నికల సమయం వచ్చే సరికి.. మళ్లీ వైసీపీ వైపే చూశారు. ఇలా తనను విమర్శించిన వారిని.. జగన్ పిలిచి మరీ పార్టీలో చేర్చుకోవడంతో.. ఆయనకు ఇంతకు మించిన నేతలు దొరకడం లేదా? వారి చేరికల వల్ల జగన్‌కు లాభం కన్నా నష్టమే ఎక్కువ ఉంటుంది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
  'రాజకీయ నాయకుల మధ్య పార్టీల సిద్ధాంతపరమైన వ్యతిరేకతే తప్ప వ్యక్తిగత వ్యతిరేకత ఉండదు. వ్యక్తిగతంగా ఒకరినొకరు దూషించుకోరు.' ఇది ఒకప్పటి మాట. ఈ తరంలో కొందరు నేతలు హద్దు దాటి వ్యక్తిగతంగా విమర్శలు చేసున్నారు. అందులో ముందువరుసలో ఉంటారు వైసీపీ నేత విజయసాయి రెడ్డి. ట్విట్టర్ వేదికగా విజయసాయి.. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ మీద హద్దు దాటి విమర్శలు చేస్తున్నారు. ఆయన కూడా విమర్శల పాలవుతున్నారు.   కొండవీడులో రైతు కోటయ్య మృతికి టీడీపీ, ఏపీ పోలీసులే కారణమని వైసీపీ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అలాగే రైతు కులాన్ని ప్రస్తావిస్తూ జగన్ ట్వీట్ చేసారు. దీనిపై స్పందించిన లోకేష్.. జగన్ కులరాజకీయాలు చేస్తున్నారని, శవాలపై పేలాలు ఏరుకునే జగన్ మరోసారి శవరాజకీయం మొదలుపెట్టారని విమర్శించారు. అయితే ఈ విమర్శలకు విజయ సాయి ఘాటు రిప్లై ఇచ్చారు. 'లోకేష్.. మేం శవాల మీద పేలాలు ఏరుకుంటున్నాం అని ట్వీట్ పెట్టావ్. ఇంతకీ శవం ఎవరు. నువ్వా? మీ నాన్నా?' అని ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ పై విమర్శలు వెల్లువెత్తాయి. విమర్శలు చేయాలి గానీ.. మరీ ఇలా బ్రతికున్నవాళ్లను శవాలంటూ వారి చావుని కోరుకోవడం ఏంటని పలువురు తప్పుపట్టారు. కొందరైతే గతంలో జగన్ నంద్యాల ఉపఎన్నికల సందర్భంగా సీఎం చంద్రబాబుని నడిరోడ్డు మీద ఉరి తీయాలంటూ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. అధినేత బాటలోనే మిగతా నేతలంతా నడుస్తున్నారు. మీ పార్టీ నేతలు ఎదుటి వ్యక్తుల చావుని కోరుకుంటున్నారు, మీరేం ప్రజా నాయకులు అసలు? అంటూ విమర్శిస్తున్నారు. అయినా విజయ సాయి వ్యక్తిగత విమర్శలు ఆపలేదు. తాజాగా లోకేష్ బాడీ గురించి హద్దు మీరి కామెంట్స్ చేసారు. వైసీపీ, బీజేపీ, టీఆర్ఎస్ కలిసిపోయాయని టీడీపీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్నీ లోకేష్ ట్విట్టర్ లో వ్యంగంగా ట్వీట్ చేసారు. 'ఢిల్లీ మోడీ గారు, తెలంగాణ మోడీ కేసిఆర్ గారు, ఆంధ్రా మోడీ జగన్ గారికి కలలో కూడా చంద్రబాబు గారే గుర్తుకొస్తున్నారు. ఫెడరల్ ఫ్రంట్ అంటూ చక్రం తిప్పి 420 పార్టీతో జత కట్టిన కేసీఆర్ గారు తెలంగాణకే పరిమితమై చతికలపడ్డారు.' అని ట్వీట్ చేసారు. అయితే దీనికి కౌంటర్ గా విజయ సాయి లోకేష్ బాడీ గురించి కామెంట్స్ చేసారు. 'లోకేష్.. నీకు జగన్ గారిలోనూ కేసీఆర్ గారిలోనూ మోడీ గారు కనిపిస్తున్నారా? ఆంధ్ర మోడీ, తెలంగాణ మోడీ అని వ్యగంగా ట్వీట్ చేసావు. మోడీ సంగతి తర్వాత ఆలోచిద్డువులే.. ముందు నీ బాడీ, ముఖ్యంగా మైండ్ సంగతి ఆలోచించు! ఎక్కడన్నా మంచి గ్యారేజ్ లో చూపించుకో.మతిస్థిమితం లేని వాళ్ళు మంత్రిగా అనర్హులు.' అంటూ ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ పై కూడా నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. నేతలు హుందాగా విమర్శలు చేయాలి, తమపై వచ్చిన విమర్శలను హుందాగా తిప్పికొట్టాలి. అంతేకాని ఇలా బాడీ, మైండ్ గ్యారేజ్ లో చూపించుకో, మతిస్థిమితం లేదంటూ హద్దు దాటి వ్యాఖ్యలు చేయడం ఏంటని మండిపడుతున్నారు. మరి విజయ సాయి ఇప్పటికైనా తన తీరు మార్చుకొని హుందాగా విమర్శలు చేస్తారో లేక ఎన్నికలు వస్తున్నాయిగా అని ఇంకాస్త డోస్ పెంచి విమర్శలు పాలవుతారో చూడాలి.
  ఇంటర్ ఫలితాలు అవకతవకలు, ఎమ్మెల్యేల ఫిరాయింపులపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు గవర్నర్ నరసింహన్ ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడే సీఎంకి పాలనపై.. కనీస అవగాహన లేదన్నారు. అవినీతి మూలంగా లక్షల మంది విద్యార్థులు ఇబ్బంది పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్లోబెరినాకి అర్హతే లేదు.. వాళ్లకు ఎందుకు కట్టబెట్టారని మండిపడ్డారు. ఇంటర్మీడియట్ ఫలితాలతో ప్రభుత్వంపై విద్యార్థులు నమ్మకం కోల్పోయారన్న ఉత్తమ్.. విద్యార్థులవి ఆత్మహత్యలా? ప్రభుత్వ హత్యలా? అని ప్రశ్నించారు. అందరు విద్యార్థులకు ఉచితంగా రీ-వాల్యుయేషన్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని గవర్నర్‌కు ఫిర్యాదు చేశామని ఉత్తమ్ వెల్లడించారు. కేసీఆర్‌ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని.. కాంగ్రెస్‌కు చెందిన ఒక్కో ఎమ్మెల్యేనూ కొనేస్తున్నారని ఉత్తమ్‌ ధ్వజమెత్తారు. పార్టీ అనుమతిలేకుండా సీఎల్పీ విలీనం కుదరదని స్పష్టం చేశారు. తెలంగాణ కోసం ఆనాడు సోనియాగాంధీ కాళ్లు పట్టుకున్న కేసీఆర్... ఇప్పుడు ఆ పార్టీని విలీనం చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఎంఐఎంని ప్రతిపక్ష పార్టీగా చేసే కుట్రలో భాగంగానే సీఎల్పీ విలీన కుట్రకు తెరతీశారని ఆరోపించారు.
  గ్లోబరీనా సంస్థ పుణ్యమా అని తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో గందరగోళం ఏర్పడి రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దాదాపు 20 మంది విద్యార్థులు ఆత్మహత్యకు కూడా పాల్పడ్డారు. తాజాగా ఈ వివాదంపై తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం స్పందించారు. ఇంటర్ ఫలితాల్లో గందరగోళానికి, ఇంటర్ బోర్డులో జరిగిన అవకతవకలకు.. ముగ్గురు టీఆర్ఎస్ పెద్దలే కారణమని కోదండరాం ఆరోపించారు. వారిని కాపాడేందుకు ఇంటర్ బోర్డు కార్యాలయాన్ని పోలీస్ స్టేషన్ గా మార్చారని మండిపడ్డారు. గ్లోబరీనా సంస్థకు ఇంటర్ విద్యార్థుల డేటాను ఎంటర్ చేసే సామర్థ్యం లేదని కోదండరాం అన్నారు. గ్లోబరీనా సంస్థ విద్యాసంవత్సరం ఆరంభం నుంచి అన్నీ తప్పిదాలే చేస్తోందని విమర్శించారు. ఫీజ్ డిటేల్స్ సిస్టంలో సరిగా ఎంటర్ చేయకపోవడంతో.. ఫీజు తేదీ ముగిసినా ఎంత మంది ఫీజ్ కట్టారో బోర్డ్ కు సమాచారం అందించలేక పోయిందని ఆరోపించారు. విద్యార్థుల ఆన్సర్ షీట్లు ఇచ్చిన తర్వాత కూడా మార్కులు సరిగా ఎంటర్ చేయలేక ఫలితాల వెల్లడికి పదిహేను రోజులు గడువు కోరారని చెప్పారు. గ్లోబరీనా సంస్థను కాపాడేందుకు ఇంటర్ బోర్డు కార్యదర్శి ప్రయత్నిస్తున్నారని కోదండరాం ఆరోపించారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, గ్లోబరినాపై చర్యలు తీసుకుని.. బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని కోదండరాం డిమాండ్ చేశారు.
  తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో గందరగోళానికి కారణమైన గ్లోబరీనా టెక్నాలజీ సంస్థ వ్యవహారంపై ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ విచారణ కొనసాగుతోంది. గురువారం విచారణ చేపట్టిన అధికారులు గ్లోబరినా టెక్నాలజీ సంస్థ ఉపయోగించిన సాఫ్ట్‌వేర్‌లోనే లోపాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ సాఫ్ట్ వేర్ ను మార్చకపోతే రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ చేసినా ప్రయోజనం ఉండదని, మళ్లీ అదే రీతిలో మార్కులు తప్పులతడకలుగా వస్తాయని త్రిసభ్య కమిటీ సభ్యులు  అభిప్రాయపడ్డారు. రీవెరిఫికేషన్‌, రీకౌంటింగ్‌ ప్రక్రియలో మళ్లీ తప్పులు జరగకుండా ఉండేందుకు కమిటీ పలు సూచనలు చేయనుంది. యుద్ధప్రాతిపదికన చేపట్టాల్సిన చర్యలపై ఈ రోజు సాయంత్రం త్రిసభ్య కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.
  మనం బట్టల ఎన్నుకోవడంలో చూపే శ్రద్ధ పాదరక్షల మీద ఉంచము. ఒకవేళ చెప్పులో, షూలో కొనుక్కోవడానికి వెళ్లినా... అవి చూడటానికి బాగున్నాయా, ఎక్కువకాలం మన్నుతాయా, తక్కువ ధరకి వస్తున్నాయా అని ఆలోచిస్తామే కానీ నడవడానికి సౌకర్యంగా ఉన్నాయా లేదా అని పట్టించుకోం. ఇలాంటి అశ్రద్ధే మన కొంప ముంచుతుందని చెబుతున్నారు నిపుణులు...   వయసు పెరిగేకొద్దీ జాగ్రత్త! కుర్రతనంలో ఎలాంటి చెప్పులు ధరించినా చెల్లిపోతుంది. కానీ వయసు మళ్లేకొద్దీ అలా కాదు! పాదం ఆకృతి మారిపోతుంది. వాటి ఒడ్డూపొడవులో మార్పులు వస్తాయి. నొప్పిని తట్టుకునే శక్తిలో తేడా ఏర్పడుతుంది. పాదం అడుగుభాగంలో ఉండే కొవ్వు, కండరాలలో కూడా పరివర్తన ఉంటుంది. కొన్ని సందర్భాలలో అయితే రెండు పాదాలకీ వేర్వేరు సైజ్ ఉన్న చెప్పులు ధరించాల్సినంతగా మార్పులు జరుగుతాయి. వీటికి తోడు ఊబకాయం, డయాబెటిస్, కీళ్లనొప్పులు వంటి సమస్యలు కూడా మనం నడిచే తీరు మీదా, పాదాల ఆరోగ్యం మీదా ప్రభావం చూపుతాయి.   ఇంత జరుగుతున్నా... పాదరక్షల గురించి మరింత శ్రద్ధ వహించాల్సిన వయసులో కూడా మనం చాలా అశ్రద్ధగా వ్యవహరిస్తాం అంటున్నారు నిపుణులు. దీనికోసం లోపెజ్  (Lopez) అనే పరిశోధకుడు ఓ రెండు సర్వేలను నిర్వహించాడు. మొదటి సర్వేలో 80 ఏళ్లు పైబడినవారు పాదరక్షల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో గమనించారు. దాదాపు 83 శాతం మంది, తమ పాదాలకంటే పెద్దవో చిన్నవో (different size) పాదరక్షలు ధరిస్తున్నట్లు తేలింది.   లోపెజ్ నిర్వహించిన రెండో సర్వేలోనూ దారుణమైన వాస్తవాలే వెలుగుచూశాయి. తగిన పాదరక్షలు ధరించనివారు తమకి తెలియకుండా చాలా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తేలింది. పాదాలలో విపరీతమైన నొప్పి, ఇన్ఫెక్షన్లు, ఎక్కువ దూరం నడవలేకపోవడం, నడిచేటప్పుడు ఆయాసం వంటి సమస్యల దగ్గర నుంచి అదుపుతప్పి పడిపోవడం వరకూ... జీవితాన్ని తలకిందులు చేసే ఎన్నో సమస్యలు అపసవ్యమైన పాదరక్షలతో ముడిపడి ఉన్నాయని గ్రహించారు. దీని వల్ల ఏకంగా వారి జీవితమే ప్రభావితం అవుతోందని తేల్చారు.   జాగ్రత్తపడాల్సిందే! సరైన పాదరక్షలు ధరించకపోవడం వల్ల ఇన్నేసి అనర్థాలు ఉన్నాయని తెలిశాక ఇక జాగ్రత్తపడకపోతే ఎలా! అందుకనే ఏవన్నా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, పాదరక్షల గురించి ఓసారి తమ వైద్యునితో మాట్లాడితీరాలి. పాదానికి మెత్తగా ఉండేలా, నడిచేటప్పుడు పట్టుని ఇచ్చేలా, కీళ్ల మీద ఒత్తిడిని కలిగించకుండా ఉండే పాదరక్షలను ఎన్నుకోమని చెబుతున్నారు. అలాగే పాదం ఆకారానికి తగినట్లుగా సర్దుబాటు చేసుకునే స్ట్రాప్స్ ఉండే పాదరక్షలని ధరించమని సూచిస్తున్నారు. - నిర్జర.  
  నొప్పి లేకుండా బతుకు బండి ముందుకు నడవదు. ఆ నొప్పిని పంటిబిగువున భరిస్తూ ఏదో ఒక మాత్ర వేసుకుంటూ ముందుకు సాగాల్సిందే. కానీ అన్నివేళలలా నొప్పి మాత్రలు పనిచేయవు సరికదా... వాటి వల్ల లేనిపోని సమస్యలు కూడా తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. అందుకు వెన్నునొప్పిని మినహాయింపుగా చూపిస్తున్నారు. వెన్నెలో ఉండే డిస్క్ అరిగిపోవడం దగ్గర నుంచీ కండరం వాపు వరకు వెన్నునొప్పికి కారణం ఏదైనా కావచ్చు. ఇలా నొప్పి చేసినప్పుడు ఆస్పిరిన్‌, బ్రూఫిన్ వంటి నొప్పి మందులు వాడుతూ ఉంటాము. ఈ తరహా మందులను Nonsteroidal anti-inflammatory drugs (NSAID) అంటారు. ఇవి వాపుతో పాటుగా నొప్పిని కూడా తగ్గిస్తాయన్నమాట. ఆస్ట్రేలియాకు చెందిన కొందరు పరిశోధకులు వెన్నునొప్పిలో NSAID ఫలితం ఏమేరకు ఉంటుందో గమనించే ప్రయత్నం చేశారు. ఇందుకోసం వాళ్లు 6000 మంది రోగులని పరిశీలించారు. ప్రతి ఆరుగురు రోగులలో ఒక్కరికి మాత్రమే నొప్పి మాత్రలు పనిచేస్తున్నట్లు తేలింది. మిగతావారిలో ఈ మాత్రలు ప్రభావం చూపకపోగా జీర్ణసంబంధమైన సమస్యలు మొదలవడాన్ని గమనించారు. అల్సర్లు ఏర్పడటం, పేగులలో రక్తస్రావం జరగడం లాంటి తీవ్రమైన ఇబ్బందులు తలెత్తాయట. ఇక నొప్పి మాత్రలతో లివర్, కిడ్నీ వంటి అవయవాలు దెబ్బతినే అవకాశం ఎలాగూ ఉంది. ఇకమీదట వెన్నునొప్పి వచ్చినప్పుడు నొప్పి మాత్రల మీద ఆశలు పెట్టుకోవద్దని సూచిస్తున్నారు. దీనికి బదులుగా కాపడం పెట్టుకోవడం, విశ్రాంతి తీసుకోవడం, చిన్నపాటి వ్యాయామాలు చేయడం, ఫిజియోథెరపీ చేయించుకోవడం వంటి చికిత్సలను అనుసరించి చూడమంటున్నారు.   - నిర్జర.
ఒళ్లు తగ్గాలనీ, ఒంట్లోని కొవ్వు కరగాలని ఎవరికి మాత్రం ఆశగా ఉండదు. చేసే పనికంటే తీసుకునే ఆహారం ఎక్కువగా ఉన్న ఈ రోజులలో ఊబకాయం మన జోలికి రాకూడదని ఎవరికి మాత్రం తోచదు. ఓ పరిశోధనా ఫలితాలు అలాంటివారికి శుభవార్తలా తోచడం ఖాయం.   ఆహారమే ధ్యాస సాధారణంగా మనం ఆహారం తీసుకునే సమయం ఉదయం లేచిన దగ్గర్నుంచీ రాత్రి పడుకునేలోపు ఎప్పుడైనా ఉండవచ్చు. అంటే సుమారుగా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు ఎప్పుడైనా ఆహారం తీసుకుంటూ ఉంటాం. దీనికి విరుద్ధంగా ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటలలోపు ఆహారం తీసుకుంటే ఏమన్నా ఉపయోగం ఉందా లేదా అన్న విషయాన్ని పరిశీలించే ప్రయత్నం చేశారు అలబామా యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు. ఇలా ఆహారాన్ని కాస్త ముందుగానే తీసుకునే విధానాన్ని early time-restricted feeding (eTRF) అంటారు.   అన్నీ సర్దుకున్నాయి eTRF వల్ల ఉపయోగం ఉందో లేదో తెలుసుకునేందుకు పరిశోధకులు, ఊబకాయంతో బాధపడుతున్న ఓ 11 మందిని ఎన్నుకున్నారు. వీరికి ఓ నాలుగు రోజులపాటు ఉదయం ఎనిమిది నుంచి రాత్రి ఎనిమిది లోపు ఆహారాన్ని అందించారు. మరో నాలుగురోజులు ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం రెండుగంటల లోపే ఆహారాన్ని తీసుకునేట్లు నిర్దేశించారు. ఈ రెండు సందర్భాలలోనూ ఒకే మోతాదు ఆహారాన్ని తీసుకున్నా కూడా, అది వారి శరీరం మీద చూపే ప్రభావంలో స్పష్టమైన మార్పులు ఉన్నట్లు గమనించారు. మధ్యాహ్నం రెండింటి లోపే ఆహారాన్ని తీసుకున్నవారిలో జీవక్రియలు చాలా చురుగ్గా ఉండటాన్ని గమనించారు. వీరిలో కొవ్వు కూడా చాలా వేగంగా కరుగుతున్నాయని తేలింది.   ఇదీ కారణం ప్రతి మనషిలోనూ ఒక జీవగడియారం పనిచేస్తుందనీ, అది ప్రకృతికి అనుగుణంగా నడుస్తుందనీ తెలిసిన విషయమే! ఈ జీవగడియారం ప్రకారం ఉదయం వేళల్లో మనలో అనేక జీవక్రియలు (metabolism) జరుగుతుంటాయి. అదే సమయంలో మన శరీరానికి ఆహారం అందటం వల్ల దానిని వీలైనంత సమర్థంగా జీర్ణం చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఎలుకల మీద ఇది వరకే చేసిన ప్రయోగాలలో కూడా eTRf వల్ల వాటిలో కొవ్వు వేగంగా కరగడమే కాకుండా ఆరోగ్య సమస్యలు కూడా దరిచేరలేదని వెల్లడయ్యింది.   eTRF తరహా ఆహార పద్ధతికి సంబంధించి ఇవి ప్రాథమిక పరిశోధనలు మాత్రమే. ఎలాంటివారు ఎంతకాలం ఈ పద్ధతిని ఆచరించవచ్చు అన్న విషయమై ఇంకా స్పష్టత రాలేదు. కాకపోతే భారతీయ వైద్య విధానంలో మాత్రం ఈ తరహా ప్రయోగాలు కొత్తేమీ కాదు. ఎందుకంటే ప్రకృతి వైద్యచికిత్స ప్రకారం ఉపవాసం మొదలుపెట్టిన రోజు నుంచి మర్నాడు ఉదయం వరకు కూడా ఏమీ తీసుకోకపోవడమే సత్ఫలితాన్నిచ్చే ఉపవాసం. ఇలాంటి ఉపవాసాల వల్ల ఎంత ప్రయోజనం ఏర్పడుతుందో eTRF పరిశోధనతో మరోసారి రుజువైపోయింది.             - నిర్జర.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.