పీరియడ్స్ గురించి పిల్లలకూ అవగాహన కావాలి.. ఎందుకంటే!

మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలో 14 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది.  ఈకాలంలో చిన్న పిల్లలు కూడా ఆత్మహత్య చేసుకోవడం కామన్ అయిపోయింది. తల్లిదండ్రులు మందలించారనో, మొబైల్ ఫోన్ ఇవ్వలేదనో, పరీక్షలు తప్పారనో ఇలా చాలా కారణాలు వింటూనే ఉన్నాం. కానీ మొదటిసారి పీరియడ్స్ సమయంలో రక్తస్రావాన్ని చూసి,  పీరియడ్స్ సమయంలో నొప్పి భరించలేక  14 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకున్న సంఘటన తాజాగా అందరినీ ఉలిక్కిపడేలా చేస్తోంది.


పీరియడ్స్ ప్రతి ఆడపిల్ల జీవితంలో ముఖ్యమైన దశ. సాధారణంగా అమ్మాయిలు పీరియడ్స్ ను, పీరియడ్స్ సమయంలో నొప్పిని, ఆ సమయంలో కలిగే ఇతర ఇబ్బందులను ఎదుర్కోవడం సజహమే.  కానీ మొదటిసారి నెలసరికి లోనయ్యే బాలికలకు దీని గురించి చాలా గందరగోళం ఉంటుంది. ఇప్పటి జనరేషన్ కు తగినట్టు ఆడపిల్లలతో పాటూ మగపిల్లలకు కూడా పీరియడ్స్ అనే విషయం గురించి అవగాహన ఉండనే ఉంటుంది. కానీ వీటిని స్వయంగా అనుభవించడంలోనే ఇబ్బంది దాగుంటుంది.  దీని గురించి బాలికలకు  అవగాహన కల్పించడం చాలా ముఖ్యం.  తద్వారా బాలికలలో నెలసరి సమయాల్లో ఎదురయ్యే మానసిక, శారీరక సమస్యలను ఎదుర్కోవడం వీలవుతుంది.

ముంబైలో జరిగిన ఉదంతం గురించి ప్రస్తావనలోకి వెళితే ఆత్మహత్య చేసుకున్న బాలికకు అదే మొదటిసారి పీరియడ్స్ రావడం. అంతకు ముందెప్పుడూ ఆమె తల్లి ఆమెకు పీరియడ్స్ గురించి చెప్పలేదు. పైపెచ్చు వారికి ఆర్థిక స్థోమత లేని కుటుంబం కావడంతో బాలికను పాఠశాలకు కూడా పంపలేదు. దీంతో బాలికకు తల్లి నుండి కానీ, సమాజం నుండి కానీ పీరియడ్స్ అనే విషయం గురించి అవగాహన లేదు.  14ఏళ్ళ బాలికకు మొదటిసారి రక్తస్రావం చూసి భయపడింది.  ఆమె తల్లి ఆ పాపకు అది అందరికీ సాధారణం అని వివరించి చెప్పింది. కానీ ఆ పాప  అప్పటికే రక్తస్రావం గురించి ఆందోళనలో ఉంది. పైగా తన శరీరంపై తనకు అసహ్యం కలుగుతోందని తల్లికి చెప్పింది.  కానీ కూతురు అర్థం చేసుకుంటుందని ఆ పాప తల్లి అనుకుంది. కానీ ఆ పాపకు పీరియడ్స్ వచ్చిన రెండవరోజున దారుణమైన  వార్త వినాల్సి వచ్చింది. ఆ పాప ఒత్తిడి, ఆందోళన,  తన శరీరం మీద తనకు  పుట్టిన అసహ్యం కారణంగా  ఆత్మహత్య చేసుకుంది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్త కారణంగా పీరియడ్స్ గురించి ఆడపిల్లలో అవగాహన పెరగాలని అంటున్నారు. కొందరు పీరియడ్స్ గురించి బయటకు చెప్పడానికి కూడా ఇష్టపడరని, అది బాలికల జీవితానికి చాలా చేటు చేస్తుందని అంటున్నారు. కాబట్టి బాలికలకు చిన్నవయసులోనే ఈ విషయాల గురించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ద్వారా అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

                                              *నిశ్శబ్ద.