బద్ధకం కూడా ఓ అంటురోగమే!

తెలివి, బద్ధకం, అసహనం ఇవన్నీ వ్యక్తిగతమైన లక్షణాలని మన నమ్మకం. మనిషికీ మనిషికీ ఈ లక్షణాలలో తేడా ఉంటాయని మన అంచనా! ఇటు మనస్తత్వ శాస్త్రమూ, అటు వ్యక్తిత్వ వికాస పుస్తకాలు కూడా ఇదే విషయాన్ని పదే పదే చెబుతూ ఉంటాయి. కానీ వీటిలో కొంతవరకు మాత్రమే నిజం ఉందంటున్నారు పరిశోధకులు. తన చుట్టూ ఉండే వ్యక్తులని బట్టి ఈ లక్షణాలు ప్రభావితం అవుతాయని ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు.   పారిస్ నగరానికి చెందిన కొందరు పరిశోధకులు మన వ్యక్తిగత లక్షణాల మీద ఇతరుల ప్రభావాన్ని తేల్చేందుకు ఓ 56 మంది వ్యక్తులను ఎన్నుకొన్నారు. ఇతరుల ప్రవర్తను గమనించినప్పుడు వీరిలో ఎలాంటి మార్పులు వస్తున్నాయో గమనించారు. అటు సైకాలజీనీ, ఇటు గణితాన్నీ ఉపయోగించి వీరి మనస్తత్వంలో వస్తున్న మార్పులను లెక్క కట్టారు. వీరిలో నిర్ణయాలను తీసుకోవడం, శ్రమించడం, పనులు వాయిదా వేయడం... లాంటి స్వభావాలు అవతలివారి ప్రవర్తని బట్టి మారడాన్ని గమనించారు.   వ్యక్తిగతం అనుకున్న లక్షణాలు ఇంత బలహీనంగా ఉండటం పరిశోధకులను ఆశ్చర్యపరిచింది. కానీ అందుకు స్పష్టమైన కారణమూ కనిపించింది. మన చుట్టూ ఉండేవారు ఏం చేస్తే అదే నిజం కాబోసు అన్న సందేహం మనలో ఎప్పుడూ ఉంటుంది. ఒకవేళ మనం అతిజాగ్రత్త కలిగిన మనస్తత్వం ఉండీ, అవతలివారు కూడా అదే తరహాలో ఉంటే... అదే సురక్షితమైన మార్గం అని మనసుకి తోస్తుంది. అలా కాకుండా మనం దూకుడుగా ఉండి, మన చుట్టూ ఉండేవారంతా అతిజాగ్రత్త పరులై ఉంటే... మనలో ఏదో లోపం ఉందేమో అనిపించి సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాము. ఎలా చూసినా, మనకి తెలియకుండానే పదిమందితోనూ కలిసి నడిచే ప్రయత్నం చేస్తామన్నమాట!   దురదృష్టం ఏమిటంటే మనలో ఈ పక్షపాత ధోరణ ప్రభావితం చేస్తున్నట్లు మనకి కూడా అనుమానం రాదు. అది మన సహజమైన వ్యక్తిత్వమే అన్నంతగా ఇతరుల వల్ల ప్రభావితం అయిపోతాము. అందుకేనేమో పెద్దలు ‘అర్నెళ్లు సావాసం చేస్తే, వారు వీరవుతారు’ అని అంటుంటారు. ఈ విషయాన్ని కాస్త మనసులో ఉంచుకుని పదిమంది దారినీ పక్కన పెట్టి మన విచక్షణకు పదునుపెట్టడం ఎంత అవసరమో కదా! - నిర్జర.  
Publish Date:Apr 21, 2021

డిప్రెషన్‌ వల్ల ఓ ఉపయోగం ఉంది!

పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు... అంటూ మనకి ఓ వేమన పద్యం ఉంది. ఆరంభింపరు నీచ మానవులు... అంటూ భర్తృహరి సుభాషితంలో ఉన్న పద్యాన్నీ వినే ఉంటాము. ఏతావాతా తేలేదేమిటంటే- కార్యసాధకుడనేవాడు ఒక పనిని మొదలుపెట్టాక, దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడనాడడు. ఆరు నూరైనా సరే తన లక్ష్యాన్ని సాధించి తీరతాడు. ఇదంతా వినడానికి చాలా బాగుంది. పైగా భౌతిక విజయాలే కీలకమైన ఈ పోటీ ప్రపంచంలో పట్టుదల కలిగినవారిదే పైచేయి అన్న వాదనా వినిపిస్తోంది. కానీ...   డిప్రెషన్‌తో కూడా లాభం ఉంది జర్మనీలోని ‘University of Jena’కు చెందిన సైకాలజిస్టులు డిప్రెషన్ వల్ల కూడా ఓ ప్రయోజనం ఉందని వాదిస్తున్నారు. కొంతమంది తమకు పొంతన లేని లక్ష్యాలను ఎన్నుకొని, వాటిని సాధించలేక క్రుంగుబాటుకి లోనవుతుంటారనీ... ఆ క్రుంగుబాటులోంచే వారికి తమ పొరపాటు అర్థమవుతుందనీ తేల్చి చెబుతున్నారు. తాము ఎన్నుకొన్న లక్ష్యంలోనే పొరపాటు ఉందని తేలిపోయాక, తమకు సాధ్యమయ్యే లక్ష్యాలనే ఎంచుకుంటారని అంటున్నారు. అంతేకాదు! దేని కోసం ఎంతవరకు ప్రయత్నించాలి? అనే విచక్షణ కూడా వారికి క్రుంగుబాటుతో అలవడుతుందట.    వదులుకునే విచక్షణ తమ వాదనలో ఎంత వరకు నిజం ఉందో తేల్చుకునేందుకు సదరు సైకాలజిస్టులు ఓ పరిశోధనను చేపట్టారు. ఇందుకోసం అటు డిప్రెషన్‌తో బాధపడుతున్నవారినీ, ఇటు ఆరోగ్యంగా ఉన్నవారినీ ఎన్నుకొన్నారు. వారందరికీ కొన్ని గజిబిజి పదాలను (jumbled words) అందించారు. అంతవరకూ బాగానే ఉంది. పనిలో పనిగా కొన్ని అసాధ్యమైన పదాలను కూడా అందించారు. అంటే వాటిని ఎంతగా ప్రయత్నించినా కూడా ఒక అర్థవంతమైన పదం రాదన్నమాట! మానసికంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు జవాబు లేని పదాలను కూడా సరిచేసేందుకు పట్టువిడవకుండా ప్రయత్నిస్తూనే ఉన్నారట. కానీ డిప్రెషన్‌లో ఉన్న వ్యక్తులు కాసేపు ప్రయత్నించిన తరువాత, ఇక తమవల్ల కాదు అన్న అనుమానం వస్తే వాటని పక్కన పెట్టేయడాన్ని గమనించారు. పట్టువిడుపులు ఉండాలి.   పట్టివిడువరాదు అన్న సూక్తి ప్రతి సందర్భానికీ వర్తించదు అన్నది నిపుణుల మాట. మన అవకాశాలకీ, లక్ష్యానికీ మధ్య అంతులేనంత అగాధం ఉన్నప్పుడు ఒక స్థాయిలో దానిని విడిచిపెట్టేయడం మంచిదంటున్నారు. అందుకే ఈసారి ఎవరన్నా క్రుంగుబాటుతో సతమతమవుతూ ఉంటే, ముందు వారి లక్ష్యాలను కూడా విచారించాలని సూచిస్తున్నారు. - నిర్జర.
Publish Date:Apr 20, 2021

మనసులోని మాట దిగమింగుకోవడమే మనం చేసే తప్పా?

ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలసి వుండటానికి ప్రేమ ఎంతో ముఖ్యమని అందరికీ తెలిసిందే. ఏరికోరి పెళ్ళిని ప్రేమతో ముడివేసుకున్న వాళ్ళు కూడా ఒకోసారి పెళ్ళి తర్వాత ఆ ప్రేమ కోసం వెతుకులాడటం చూస్తుంటాం... ఎందుకని? ఇద్దరు వ్యక్తులు కలసి బతకడంలో ఎక్కడో ఆ ప్రేమని జారవిడుచుకుంటారు. అందుకు కారణం నువ్వంటే నువ్వని వాదించుకుంటారు. మార్పు ఎదుటి వ్యక్తిలో రావాలని ప్రగాఢంగా నమ్ముతారు. ఖాళీ మనసులతో, నిర్జీవంగా మారిన బంధంతో, సర్దుకోలేక అసంతృప్తితో నలిగిపోతారు. మరి దీనికి పరిష్కరం లేదా అంటే... సమాధానం ‘ఉందనే’ చెప్పాలి. భార్యాభర్తల మధ్య ‘ప్రేమ’ ఎప్పటికీ తాజాగా నిలవాలంటే అందుకు నిపుణులు చేస్తున్న కొన్ని సూచనలు వినండి..  https://www.youtube.com/watch?v=d9D5pVYSowk&t=2s  
Publish Date:Apr 19, 2021

బలమా! బలహీనతా!

ఒక ప‌న్నెండేళ్ల పిల్ల‌వాడు ఏదో ఘోర‌మైన ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. అత‌ని కుడి చేయి ఎందుకూ ప‌నికిరాకుండా పోయింది. కానీ ఆ పిల్ల‌వాడికి చిన్న‌ప్పటి నుంచీ ఓ కోరిక ఉండేది. ఎలాగైనా తను క‌రాటేలో గొప్ప ప్ర‌తిభావంతుడిని కావాలన్న‌దే ఆ కోరిక‌! కానీ ఇప్పుడేం చేసేది? త‌న కుడి చేయి ఇక క‌రాటేకి స‌హ‌క‌రించ‌దు క‌దా! అయినా ఆశ చావక తన బ‌డిలో ఉంటున్న క‌రాటే మాస్ట‌రు ద‌గ్గ‌ర‌కు వెళ్లాడు.   `నేను ఇంక జీవితంలో క‌రాటేని నేర్చుకోలేమోన‌ని అనిపిస్తోందండీ` అన్నాడు బాధ‌గా. ఆ మాస్ట‌రుగారు ఒక్క‌నిమిషం ఆలోచించి `నీలో క‌నుక నిజంగా ప‌ట్టుద‌ల ఉంటే త‌ప్ప‌కుండా క‌రాటేలో గొప్ప నేర్పును సాధిస్తావు. కానీ నేనేం చెబితే నువ్వు అలాగే చేయ‌వ‌ల‌సి ఉంటుంది. స‌రేనా!` అని అన్నాడు. `నా చిన్న‌ప్ప‌టి కోరిక‌ను నెర‌వేర్చుకునేందుకు నేను ఎలాంటి క‌ష్టాన్నైనా భ‌రించ‌డానికి సిద్ధంగా ఉన్నాను.' అంటూ సంతోషంగా ఒప్పుకున్నాడు పిల్ల‌వాడు. మ‌రుస‌టి రోజు నుంచి పిల్ల‌వాడు రోజూ క‌రాటే మాస్టరుగారి ద‌గ్గ‌ర‌కు వెళ్లసాగాడు. కానీ విచిత్రంగా ఆ కరాటే మాస్ట‌రు రోజూ పిల్ల‌వాడికి ఒక‌టే కదలికని నేర్పేవాడు. ఎన్నిరోజులు చేసినా అదే ప‌ని. అదే కదలిక‌ని అభ్యాసం చేసీ చేసీ పిల్ల‌వాడు అలసిపోయేవాడు. ఎప్పుడూ ఒక‌టే ర‌కం భంగిమ‌తో అత‌నికి చిరాకు వేసేది. కానీ ఏం చెప్పినా చేయాల్సిందే అన్న గురువుగారి మాట‌కి క‌ట్టుబ‌డి ఊర‌కుండిపోయేవాడు. కొన్నాళ్ల‌కు ఇంక ఉండ‌బ‌ట్ట‌లేక `కరాటే అంటే ఇంతే కాదు క‌దా! ఇంకా వేరే ఏమైనా నేర్పుతారా?` అని అడిగాడు. `నువ్వు ఈ ఒక్క కదలిక‌నే సాధ‌న చేస్తూ ఉండు. చాలు!` అంటూ క‌స్సుమ‌న్నారు గురువుగారు. ఇంక మారుమాట్లాడ‌కుండా అదే భంగిమ‌ను సాధ‌న చేస్తూ ఉండిపోయాడు పిల్లవాడు. ఇలా ఉండ‌గా కొన్నాళ్ల‌కి ఆ బ‌డిలో కరాటే పోటీలు మొద‌లుపెట్టారు. `నువ్వు కూడా ఈ పోటీల‌లో పాల్గోవాలి!` అన్నారు గురువుగారు. `ఏదీ ఈ ఒక్క భంగిమ‌న‌తోనా!` అంటూ ఉక్రోషంగా బ‌దులిచ్చాడు పిల్ల‌వాడు.   గురువుగారు ఓ చిరున‌వ్వు న‌వ్వి ఊరుకుండిపోయారు. ఆశ్చర్యంగా పిల్ల‌వాడు త‌న‌కి పోటీలో ఎదుట‌ప‌డిన ఇద్ద‌రు ప్రత్యర్థుల‌నీ చాలా తేలికగా మ‌ట్టి క‌రిపించేశాడు. పోటీలో ముందుకు వెళ్తున్న కొద్దీ మ‌రింత బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థులు ఎదురుపడ‌సాగారు. కానీ ఎలాగొలా చివ‌రిక్ష‌ణంలో అయినా వాళ్ల‌ని ఓడించగ‌లిగాడు. పోటీలో ఒకో అంచె ముందుకు వెళ్తున్న కొద్దీ అత‌నిలో విశ్వాసం పెరిగిపోసాగింది. చివ‌రికి ఎలాగైతేనేం... ఆ పోటీలో అత‌నే విజేత‌గా నెగ్గాడు. `గురువుగారూ! జ‌రిగింది న‌మ్మ‌లేక‌పోత‌న్నాను. నేనీ ఒక్క క‌ద‌లిక‌తోనే విజ‌యాన్ని సాధిస్తాన‌ని మీరు ఎలా అనుకున్నారు?` అని అడిగాడు ఆశ్చ‌ర్యంగా. `మ‌రేం లేదు! నీకు నేర్పిన ఈ క‌ద‌లిక క‌రాటేలోనే చాలా క‌ష్ట‌మైన‌ది. అందుక‌ని చాలామంది దాన్ని నేర్చుకోవ‌డానికి వెనుకాడ‌తారు. ఇక‌పోతే చాలామంది కుడిచేత్తో పోరాడినంత బ‌లంగా ఎడ‌మ‌చేత్తో పోరాడ‌లేరు. అందుక‌నే ఆ ఒక్క పట్టుతోనే నువ్వు విజ‌యాల‌ను సాధించ‌గ‌లిగావు` అన్నారు గురువుగారు. ఎంత‌సేపూ త‌న బ‌ల‌హీన‌త గురించి ఆలోచించే ఆ పిల్ల‌వాడు, ఆ బ‌ల‌హీన‌త‌ని సైతం బ‌లంగా ఎలా మార్చుకోవాలో ఇప్పుడు నేర్చుకున్నాడు. ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక బలహీనత ఉంటుంది. కానీ ఒకోసారి దాన్నే తన బలంగా మార్చుకోవడమో లేక ఇతర మార్గాలను అన్వేషంచడమో చేస్తే విజయం తప్పక దక్కుతుంది.  
Publish Date:Apr 17, 2021

ఆఫీసులో ఉన్నప్పుడు ఇంటి ఫోన్లు వస్తుంటే!

ఆఫీసులో మంచి పనిలో తలమునకలైపోయి ఉంటామా! ఇంటి దగ్గర్నుంచీ ఫోన్ వస్తుంది. అలాగని అదేమీ ఎమర్జన్సీ ఫోన్ కూడా కాదు. ఎలా ఉన్నారో ఓసారి పలకరించేందుకో, సాయంత్రం వచ్చేటప్పుడు కందిపప్పు తెమ్మని గుర్తుచేసేందుకో... చేసిన పోన్. ఇక ఇంట్లో ఫ్యామిలీతో కలిసి హాయిగా భోజనం చేసే సమయంలో సాటి ఉద్యోగుల నుంచి వచ్చే ఫోన్లకీ కొదవ ఉండదు. అది కూడా ఏమంత ఎమర్జన్సీ కాదు. పక్క సీట్లో సుబ్బారావు గురించో, పెరగకుండా మిగిలిపోయిన జీతాల గురించో కావచ్చు.   ఇలా ఇంట్లో ఉన్నప్పుడు ఆఫీసు ఫోన్లు, ఆఫీసులో ఇంటి ఫోన్ల వల్ల... ఇటు కుటుంబ జీవితం, అటు ఉద్యోగ జీవితం ఎంతవరకు ప్రభావితం అవుతున్నాయో చూడాలనుకున్నారు పరిశోధకులు. ఈ విషయాన్ని తేల్చేందుకు ఓ 121 మంది ఉద్యోగులను పదిరోజుల పాటు డైరీ రాయమని అడిగారు. ఆఫీసులో ఏం జరుగుతోంది- దాని వల్ల తన పనితీరు ఎలా ప్రభావితం అయ్యింది, ఇంట్లో ఏం జరుగుతోంది- దాని వల్ల తన కుటుంబ జీవితంలో ఎలాంటి మార్పు వచ్చింది... తదితర వివరాలన్నీ ఈ డైరీలో నమోదు చేయమని అడిగారు.   ఆఫీసులో ఇంటి ఫోన్లు, ఇంట్లో ఆఫీసు ఫోన్ల వల్ల అటు లాభమూ ఇటు నష్టమూ రెండూ ఉన్నట్లు తేలింది. ఆఫీసులో వచ్చే ఫోన్లతో జాబ్ శాటిస్ఫాక్షన్ లేకపోవడం, పని మీద శ్రద్ధ తగ్గడం, చిరాకు... లాంటి పర్యవసానాలు కనిపించాయి. కానీ కాస్త జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే మాత్రం ఇంటి నుంచి వచ్చే ఫోన్లతో పనిఒత్తిడి తగ్గడం, కుటుంబసభ్యుల మధ్య అనుబంధం పెరగడాన్ని గమనించారు. పనికీ పనికీ మధ్య ఖాళీ సమయంలోనో, భోజన విరామంలోనో, ఇంటికి వెళ్లే దారిలోనో ఇంటికి చేసే ఫోన్లతో అటు వారితో మాట్లాడినట్లూ ఉంటుంది, ఇటు ఉద్యోగానికీ ఇబ్బంది ఉండదట.   ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఆఫీసు ఫోన్ల విషయంలో తగినంత జాగ్రత్త ఉండాలంటున్నారు. పక్కన ఎవరూ లేని సమయంలోనో, పిల్లలు పడుకున్న తర్వాతనో సాగే ఆఫీసు ఫోన్లతో పెద్దగా నష్టం ఉండదని సూచిస్తున్నారు. అంతేకాదు! ఆఫీసు అవసరాలకి అనుగుణంగానే తమకు ఫోన్ చేయవలసిందిగా సాటి ఉద్యోగులకి తెలియచేయమంటున్నారు. చిన్న చిన్న విషయాలకి మెయిల్ చేయమనీ, విషయం వెంటనే తెలియాలి అనుకున్నప్పుడు మెసేజ్ చేయమనీ, అత్యవసరం పరిస్థితులలో అయితేనే ఫోన్ చేయమనీ సాటి ఉద్యోగులకు చెప్పి ఉంచమంటున్నారు. - నిర్జర.  
Publish Date:Apr 16, 2021

MANGO TOURISM గురించి విన్నారా!

కొన్ని దేశాలలో ద్రాక్ష తోటల్లో పర్యటకులని అనుమతిస్తుంటారు. ఆ తోటల్లో తిరుగుతూ, ద్రాక్షపళ్లతో ఆడుకుంటూ, ద్రాక్ష సారాయిని తయారుచేస్తూ పర్యటకులు సంబరపడిపోతుంటారు. వీళ్ల సరదా ద్రాక్షతోటల యజమానులకి కాసులను కురిపిస్తుంటుంది. మన రైతులకి కూడా ఇలాంటి అవకాశం ఉంటే బాగుంటుంది కదా! అందుకోసం మన దగ్గర ద్రాక్షతోటలు లేకపోతే ఏం... పళ్లకు రారాజైన మామిడి తోటలు ఉన్నాయి కదా!   మేంగో టూరిజం (mango tourism) ఇప్పుడిప్పుడే మన దేశంలో ప్రచారం పొందుతోంది. మహారాష్ట్రలోని రైతులు ఇప్పటికే ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోగా... ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్, పశ్చిమబెంగాల్, కర్ణాటక వంటి రాష్ట్రాలు ఈ ఏడాది విస్తృతంగా మేంగో టూరిజంని అందిపుచ్చుకునే ఆశతో ఉన్నాయి. ఇంతకీ ఈ మేంగో టూరిజంలో ఏం చేస్తారంటారా! అబ్బో చెప్పుకోవాలంటే బోలెడు విశేషాలే ఉన్నాయి!   - మేంగో టూరిజంలో భాగంగా, విశాలమైన మామిడి తోటలలోకి పర్యటకులను అనుమతిస్తారు. కొన్ని సందర్భాలలో ప్రభుత్వమే కొందరు మామిడి రైతులో ఒప్పందం చేసుకొని, వారి తోటల దగ్గరకు యాత్రికులకు రవాణా సదుపాయాన్ని కల్పిస్తుంది.   - మామిడి తోటల్లోకి ప్రవేశించిన పర్యటకులను రైతులు తమ తోటలన్నీ తిప్పి చూపిస్తారు. మామిడి చెట్లను పెంచడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, పూత కాయగా మారేవరకు ఎంత శ్రద్ధగా చూసుకుంటారు, కాయలను ఎలా మగ్గపెడతారు... లాంటి వివరాలన్నింటినీ ఓపికగా చెబుతారు.   - పర్యటకులకు కావల్సిన అల్పాహారం, టీ కాఫీలు, భోజనం... అన్నీ కూడా రైతులే ఏర్పాటు చేస్తారు. వాటివల్ల అటు రైతులకీ ఆదాయం కలుగుతుంది, ఇటు యాత్రికులకీ స్వచ్ఛమైన పల్లె ఆహారం తిన్నట్లుంటుంది.   - మామిడి తోటల్లో తిరగడమే కాదు... మామిడి కాయలు కోసుకోవడానికి కూడా పర్యటకులకు స్వేచ్ఛ ఉంటుంది. అందుకోసం ఎలాంటి మామిడిపళ్లను ఎంచుకోవాలో రైతులు సలహా కూడా ఇస్తారు. కాకపోతే ఇలా కోసుకున్న పండ్లని చివరికి తూకం వేసి, వాటికి సరిపడా ధరని చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పర్యటకులకు తాజా పళ్లు, రైతులకి తగిన గిట్టుబాటు ధరా లభిస్తాయి.   - కేవలం పళ్లే కాదు! చాలా తోటల్లో మామిడితాండ్ర, జాం, జ్యూస్, పచ్చళ్లు.. ఇలా మామిడితో చేసిన పదార్థాలన్నీ కూడా దొరికే అవకాశం ఉంటుంది.   - తోటల్లో తినడం, తిరగడంతోనే కాలం గడిపేస్తే మజా ఏముంటుంది! అందుకే చాలాచోట్ల ఎడ్లబండి మీద ప్రయాణం, మామిడి పళ్లని తినే పోటీలు పెట్టడం, జానపద నృత్యాలు ప్రదర్శించడం లాంటి కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తుంటారు. ఇవేవీ ఇష్టం లేకపోతే హాయిగా నులకమంచం మీద చెట్టు కింద పడుకుని సేదతీరే అవకాశం ఎలాగూ ఉంటుంది.   - ఒక్క రోజులో హడావుడిగా గడిపేస్తే ఎలా అనుకునేవారికి... తోటల్లోనే ఒకటి రెండు రోజులు సేదతీరే సదుపాయాలూ కొన్ని చోట్ల ఉన్నాయి.   అదీ విషయం! మొత్తానికి ఏదో ప్రయోగాత్మకంగా మొదలుపెట్టిన ఈ మేంగో టూరిజం ఇప్పుడు రైతులకీ, ప్రభుత్వానికీ కాసులు పండిస్తోంది. అటు కొత్తదనం కోరుకునే పర్యటకులకీ సరికొత్త అనుభూతిని అందిస్తోంది. అందుకనే ఈ తోటల్లో విహరించేందుకు విదేశాల నుంచి కూడా యాత్రికులు వస్తున్నారట. మరి మామిడి పంటకు ప్రసిద్ధమైన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి టూరిజం మొదలైతే భలే ఉంటుంది కదా! - నిర్జర.  
Publish Date:Apr 12, 2021

మెదడు వందేళ్లు పనిచేయాలంటే!

వయసు మీదపడుతున్న కొద్దీ మెదుడు చురుగ్గా పనిచేయదన్నది మన ఆలోచన. మెదడులోని న్యూరాన్లు బలహీనపడటమే ఇందుకు కారణమంటారు శాస్త్రవేత్తలు. కేలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన రేచెల్ అనే శాస్త్రవేత్త ఇందుకు పరిష్కారం ఏమన్నా ఉందేమో కనుగొనే ప్రయత్నం చేశారు. దాదాపు 50 ఏళ్లపాటు చేసిన పరిశోధన ఫలితంగా రేచెల్ ఈ సమస్యకి ఒక పరిష్కారం సాధించానని చెబుతున్నారు.   చిన్నప్పుడు మనం ఏదన్నా కొత్త విషయాన్ని నేర్చుకోవాలన్నా, కొత్త నైపుణ్యాన్ని అలవర్చుకోవాలన్నా ఒక పద్ధతి ఉంటుంది. ఈ తరహా విధానానికి ‘Broad learning’ అని పేరు పెట్టారు రేచెల్. ఇక పెద్దయ్యేకొద్దీ మనం నేర్చుకునే తీరు మారిపోతుంది. ఈ విధానానికి ‘specialised learning’ అని పేరు పెట్టారు. వాటి మధ్య తేడాలని ఆరు రకాలుగా వివరించే ప్రయత్నిం చేశారు.   1 - చిన్నప్పుడు ఏదన్నా కొత్త విషయాన్ని నేర్చుకునేందుకు సిద్ధంగా ఉంటాము (open mindedness). కానీ పెద్దవారిలో ఇలాంటి విశాల దృక్పథం ఉండదు. ఏదన్నా కొత్త విషయం నేర్చుకొనేందుకు వారి అభిప్రాయాలు, విచక్షణ, అహంకారం... మాటిమాటికీ అడ్డం వస్తుంటాయి.   2- చిన్నతనంలో అయితే తెలియని విషయాన్ని చెప్పేందుకు టీచర్లు, పెద్దలు ఉంటారు. ఏదన్నా అనుమానం వచ్చినా ఠక్కున వారిదగ్గరకు వెళ్తాము. కానీ పెద్దయ్యాక ఇలా మరొకరి సాయం తీసుకునేందుకు మొహమాటం అడ్డువస్తుంది.   3 – కాస్త కష్టపడితే ఏదన్నా నేర్చుకోవచ్చనే నమ్మకం చిన్నతనంలో ఉంటుంది. కానీ పెద్దయ్యాక నమ్మకం మారిపోతుంది. ప్రతిభ పుట్టుకతో రావాలే కానీ, ఎంత కష్టపడినా ఉపయోగం ఉండదన్న నిర్వేదం పెద్దల్లో కనిపిస్తుంది.   4 – చిన్నతనంలో పొరపాట్లు చేసినా ఎవ్వరూ పెద్దగా పట్టించుకోరు. కాబట్టి పిల్లలు పడుతూలేస్తూ, తప్పులు చేస్తూ నేర్పు సాధించే అవకాశం ఉంటుంది. కానీ పెద్దయ్యాక మనం చేసే పని ఎక్కడ తప్పుగా మారుతుందో, అది ఏ ఫలితానికి దారితీస్తుందో అన్న భయం నిరంతరం వెంటాడుతూ ఉంటుంది.   5 – పిల్లల్లో ఏదన్నా నేర్చుకునేందుకు ఆసక్తి మొదలైతే... అది సాధించేదాకా ఊరుకోరు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా పట్టిన పట్టు విడవరు. కానీ పెద్దలు అలా కాదు కదా! ఏదన్నా హాబీ మొదలుపెట్టారంటే ఓ రెండు నెలల్లోనే దాన్ని చాప చుట్టేస్తారు.   6 – పిల్లలు రకరకాల నైపుణ్యాలని ఒక్కసారిగా నేర్చుకునేందుకు (multiple skills) భయపడరు. ఒక పక్క బొమ్మలు గీస్తూనే మరో పక్క డాన్స్ నేర్చుకునే ప్రయత్నం చేస్తారు. ఇంకో పక్క చదువుకుంటూ ఉంటారు. కానీ పెద్దవాళ్లు అలా కాదు! ఏదన్నా ఒక విషయం మీద శ్రద్ధ పెడితే, మరో విషయాన్ని పట్టించుకుంటే ఎక్కడ తమ ఏకాగ్రత తప్పిపోతుందో అన్న భయంతో ఉంటారు.   ఈ ఆరు విషయాలనీ గమనించి... చిన్నతనంలో మనం ఎలాగైతే నేర్పుని సాధించే ప్రయత్నం చేసేవారమో గుర్తుచేసుకోమంటున్నారు రేచెల్. అవే పద్ధతులని పెద్దయ్యాక కూడా పాటిస్తే వృద్ధాప్యం వయసుకే కానీ మెదడుకి రాదని భరోసా ఇస్తున్నారు. - నిర్జర.  
Publish Date:Apr 10, 2021

కోపం ఒక విషవలయం!

హరి మనసేం బాగోలేదు. పొద్దున లేవగానే భార్యతో గొడవైంది. మాటామాటా పెరిగింది. ఆ గొడవతో అతని భార్య స్వాతి మనసు కూడా చిరాకుగా మారిపోయింది. హరి ఆఫీసుకి వెళ్లేసరికి అక్కడ సురేష్‌ నవ్వుతూ ఎదురుపడ్డాడు. అతను హరి పక్కనే కూర్చుని ఏదో జోక్‌ చేయబోయాడు. కానీ హరి దాన్ని ఆస్వాదించే మూడ్‌లో లేడు. సురేష్‌ మాటలకి చాలా ముభావంగా స్పందించాడు. పైగా ‘నన్ను కాస్త ఒంటరిగా వదిలెయ్!’ లాంటి మాటేదో వాడేసాడు. హరి ముభావంగా ఉండటం, పుల్లవిరుపుగా మాట్లాడటం చూసి సురేష్‌కి కూడా చిరాకు మొదలైంది. ‘వీడి దగ్గరకి వెళ్లి కాలక్షేపం చేయడానికి నాకేంటి పని!’ అనుకున్నాడు. ఆ చిరాకుతోనే తన డెస్క్‌ దగ్గరకి వెళ్లి సిస్టమ్‌ ఆన్‌ చేశాడు. ఆ చిరాకుతోనే అస్తవ్యస్తంగా పనిచేయసాగాడు. చూస్తూ చూస్తుండగానే అతనికి తన పని మీదా, ఆ ఆఫీసు మీదా, ఉదయం క్యారియర్‌ ఇవ్వని తన భార్య మీదా కోపం మొదలయ్యాయి. క్యారేజీ సర్దని తన భార్యతో మనసులోనే వాదించడం మొదలుపెట్టాడు. సురేష్‌ మెదడు మాంచి వేడిగా ఉన్న సమయంలో, తన భార్య నుంచి ఫోన్‌ వచ్చింది- ‘భోజనం చేశారా?’ అంటూ! అంతే, పుండు మీద కారం చల్లినట్లయ్యింది. ఫోన్‌లోనే ఒక్కసారిగా విరుచుకుపడిపోయాడు. ‘నేను పస్తులుండటమేగా నీకు కావాల్సింది!’ అంటూ దెప్పిపొడిచాడు. సురేష్‌ మాటలకి అతని భార్య మీనా కళ్లు చెమర్చాయి. వండుకున్న అన్నం కూడా తినకుండా అలాగే పడుకుండిపోయింది. ఈలోగా మీనా ఇంటి తలుపు ఎవరో తట్టారు. కళ్లు తుడుచుకుని చూస్తే పనిమనిషి. ‘పనికి రావాల్సిన సమయమేనా ఇది! మిట్టమధ్యాహ్నం భోజనాలు చేసి, అంతా పడుకునే సమయానికి వచ్చి ఇబ్బంది పెట్టడానికి కాకపోతే ఇప్పుడెందుకు వచ్చినట్లు!’ అనిపించింది ఆ మనిషిని చూసిన వెంటనే. అసలే భర్త చేతిలో చివాట్లు తిన్న చిరాకులో ఉన్న మీనా... పనిమనిషిని ఎడాపెడా దులిపేయడం మొదలుపెట్టింది. మీనా మాటలన్నీ పనిమనిసి కిక్కురుమనకుండా విన్నది. ఆపై తను ఎందుకంత ఆలస్యంగా వచ్చిందో చెప్పుకొచ్చింది. తన భర్త అనారోగ్యం గురించీ, కుటుంబ పోషణ కోసం తను పడుతున్న కష్టం గురించీ చెప్పుకొచ్చింది. మీనా కాస్త శాంతించిన తర్వాత తన సహజశైలిలో సరదాగా కబుర్లు చెబుతూ పనిచేయడం మొదలుపెట్టింది. ఆ మాటా ఈ మాటా చెబుతూ చకచకా పని సాగించింది. ఓ పదినిమిషాలు గడిచేసరికి మీనా మనసులోని దిగులు కాస్తా తీరిపోయినట్లు తోచింది. తను కూడా మాటలు కలుపుతూ, నవ్వడం మొదలుపెట్టింది. కానీ మనసులో ఏదో ఒక మూల తన భర్త నొచ్చుకున్నాడన్న దిగులు మాత్రం అలాగే ఉండిపోయింది. ఆ దిగులుని పోగొట్టుకునేందుకు మరోసారి భర్తకి ఫోన్‌ చేసింది. ఆపాటికే సురేష్‌ బయట సుష్టుగా భోజనం చేసి తన డెస్కులోకి చేరుకున్నాడు. తన భార్య మీద నోరు పారేసుకున్నందుకు నొచ్చుకుంటున్నాడు. మళ్లీ సాయంత్రం తనతో ఎలా మాటలు కలపాలా అన్న సందిగ్ధంలో ఉన్నాడు. ఆ సమయానికి భార్యే ఫోన్‌ చేయడంతో అతని మనసు కాస్తా తేలికపడిపోయింది. ఫోన్లో ఓ రెండు నిమిషాలు మాట్లాడిన తర్వాత ఉదయం పోయిన హుషారు తిరిగి వచ్చినట్లయ్యింది. సురేష్‌ తన పనిలో ఉండగానే హరి మరోసారి ఎదురుపడ్డాడు. ‘పొద్దున్న పాపం ఏదో చిరాకులో ఉన్నట్లున్నాడు. నేనే అనవసరంగా అతన్ని ఇబ్బంది పెట్టాను!’ అనిపించింది. అందుకనే మళ్లీ సరదాగా హరిని కబుర్లోకి దింపే ప్రయత్నం చేశాడు. ఒకటికి రెండుసార్లు సురేష్‌ తనతో సరదాగా ఉండే ప్రయత్నం చేసి హరి మనసు కూడా తేలికపడింది. తాను కూడా సురేష్‌తో మాట కలిపాడు. తను కూడా నాలుగు సెటైర్లు వేసే ప్రయత్నం చేశాడు. చూస్తూచూస్తుండగానే ఆఫీసు సమయం అయిపోయింది. పెద్దగా పని ఒత్తిడి లేకుండానే ఆ రోజు ఆఫీసు గడిచిపోయింది. కానీ తన భార్యతో పడిన గొడవ తాలూకు ఒత్తిడి మాత్రం అతని మనసు మీద ఇంకా పనిచేస్తూనే ఉంది. ‘ఛా! ఒక్క చిన్న మాటతో మొదలైన గొడవ కాస్తా రాద్ధాంతం అయిపోయింది. నాకు ఈమధ్య  కోసం ఎక్కువైపోతోంది,’ అనుకున్నాడు. తన భార్యకి సారీ చెప్పడం కోసం ఫోన్‌ చేతిలోకి తీసుకున్నాడు. ఈ కథలో అయిదు పాత్రలే ఉన్నాయి. కానీ మన జీవితంలో అంతకు లెక్కకు మించిన మనుషులు ఎదురుపడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరిదీ ఒకో కష్టం, ఒకో సమస్య, ఒకో వ్యక్తిత్వం. ఆ క్షణంలో వారు ఎందుకలా ప్రవర్తిస్తున్నారు అనేదాని వెనుక అనేక కారణాలు. ఈ నిమిషానికి వారితో మనకి ఉన్న సమస్యని అర్థం చేసుకునో, పరిష్కరించుకునో... రెండూ కుదరకపోతే కాసేపు పక్కకు తప్పుకునో ఉంటే మన జీవితం సాఫీగా సాగిపోతుంది. లేకపోతే ఎక్కడికక్కడ కొత్త వివాదం మొదలవుతూనే ఉంటుంది. ప్రతి బంధమూ బరువైపోతుంది. అంతేకాదు! ఆ కోపాన్ని, దుఃఖాన్నీ మనసులో నింపుకుని ముందు సాగితే... మన చిరాకుని చుట్టుపక్కల వారితో కూడా పంచుకున్నాట్లు అవుతుంది. వారి జీవితాలని కూడా ప్రభావితం చేస్తుంది. వీలైతే మన కోపానికి పరిష్కారాన్ని వెతుక్కోవాలి. లేదా కనీసం దాన్ని ఇతరులకి బదలాయించుకోకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ మన దగ్గరకే ఎవరన్నా చిరాకుతో వస్తే ఆ విషవలయాన్ని అక్కడితో ఛేదించాలి. - నిర్జర.
Publish Date:Apr 9, 2021

బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేస్తే..?

బ్రహ్మ ముహూర్తానికి మించిన ముహూర్తం లేదు. బ్రహ్మ ముహూర్తంలో ఏ పని ప్రారంభించినా శుభమే. సూర్యోదయానికి నలభై ఎనిమిది నిమిషాల ముందు... రాత్రి భాగంలో ఆఖరి నలభై ఎనిమిది నిమిషాల ముందు సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారం. ఇది ఎంతో విశిష్టమైన సమయం. పూజలు చేయడానికి, వ్రతాలు జపాలు చేయడానికి అనువైన సమయం. అందుకే ఈ ముహూర్తానికి అంత విశిష్టత.   అయితే కేవలం ఆధ్యాత్మిక పరంగాగానే కాదు... మన జీవనపరంగా కూడా ఈ ముహూర్తం ఎంతో మేలు చేకూరుస్తుంది. ఏ మంచి పని చేసినా బ్రహ్మ ముహూర్తంలో కనుక మొదలు పెడితే విజయం లభించి తీరుతుంది. పిల్లలను ఉదయమే లేచి చదువుకోమని చెప్పేది అందుకే. ఆ సమయంలో చదివితే చదివింది బాగా ఎక్కడమే కాకుండా ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అందుకే వైద్యులు, నిపుణులు కూడా ఆ సమయంలోనే చదుకొమ్మని సూచిస్తుంటారు.    ఉదయాన్నే వాకింగ్ కి వెళ్లే సమయం కూడా అదే. లేలేత భానుడి కిరణాల నుంచి విటమిన్ డి లభిస్తుంది. తద్వారా ఎముకలు గట్టిపడతాయి. ఎన్నో రకాల వ్యాధులు నయమవుతాయి. కొన్ని రకాల వ్యాధులు దగ్గరికి రాకుండా ఉంటాయి. అసలు బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం వల్ల మానసిక ఒత్తిడి కూడా ఉండదట. మనసు, మెదడు ప్రశాంతంగా ఉండి ఆరోగ్యం ఇనుమడిస్తుందట.    అందుకే బ్రహ్మ ముహూర్తాన్ని మించిన ముహూర్తం లేదని అంటారు. ఆ ముహూర్తాన్ని చేజార్చుకోకూడదని పెద్దలు సూచిస్తుంటారు.     -Sameera  
Publish Date:Apr 8, 2021

ఓర్పు జీవితాన్ని శాసిస్తుందా?

‘Patience pays’ అని ఆంగ్లంలో ఒక సూక్తి ఉంది. ఓర్పుగా ఉండాల్సిన అవసరం గురించీ, అసహనం వల్ల కలిగే నష్టాల గురించీ మన ఇతిహాసాలలో లెక్కలేనన్ని కథలు ఉన్నాయి. కానీ ఉరుకులుపరుగులతో సాగే ఈనాటి జీవితంలో ఓర్పు అవసరమేనా? అన్న సందేహం కలుగక మానదు. అవసరమే అని నిరూపిస్తోంది ఓ పరిశోధన. 50 ఏళ్లుగా ఈ ప్రపంచానికి ఓర్పుగా ఉండమని హెచ్చరిస్తోంది. అదే...   Marshmallow experiment   మార్ష్‌మలో అనేది పాశ్చత్య దేశాలలో విరివిగా దొరికే ఒక తీపి పదార్థం. అక్కడి పిల్లలకు ప్రాణం. ముఖ్యంగా, రకరకాల చిరుతిళ్లు అందుబాటులో లేని 1960వ దశకంలో మార్ష్‌మలో కోసం పిల్లలు తెగ పేచీ పెట్టేవారు. పిల్లల్లో ఉండే ఈ బలహీనత ఆధారంగా వారిలో ఏ మేరకు సహనం ఉందో పరీక్షించాలనుకున్నాడు... స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ‘వాల్టర్‌ మిషెల్‌’ అనే మనస్తత్వ శాస్త్రవేత్త. అందుకోసం తన విశ్వవిద్యాలయం ఆవరణలో ఉన్న ఒక బడిని ఎంచుకున్నాడు.   సహనంతో ఉంటే బహుమతి     వాల్టర్‌ మిషెల్‌ తన పరిశోధన కోసం 4-6 సంవత్సరాల మధ్య వయసు ఉన్న కొందరు పిల్లలను ఎంచుకొన్నాడు. వారిని ఒంటరిగా ఒక గదిలో ఉంచి, వారి ముందర ఒక మార్ష్‌మలోని ఉంచారు. ‘నువ్వు కనుక ఈ మార్షమలోని కాసేపు తినకుండా ఉండగలిగితే, నేను తిరిగి వచ్చి ఇంకో మార్షమలోని బహుమతిగా ఇస్తాను’ అని ఆ పిల్ల/పిల్లవాడికి చెప్పారు. ఇక అప్పటి నుంచి చూడాలి ఆ పిల్లల తిప్పలు. కళ్ల ముందు ఊరిస్తున్న మార్ష్‌మలోని తినకుండా ఉండేందుకు వారు రకరకాల విన్యాసాలు చేశారు. కొందరు తలతిప్పుకున్నారు. కొందరు దాన్ని నాకి తిరిగి పెట్టేశారు. కొందరు పాటలు పాడుతూ కూర్చున్నారు. ఇంకొందరు ఇవేవీ చేయకుండా..... గబుక్కున ఆ మార్ష్‌మలోని తీసుకుని నోట్లో వేసేసుకున్నారు. వెధవ బహుమతి పోతే పోయింది అనుకున్నారు.   పిల్లలాట కాదు!     మొత్తానికి ఒక మూడోవంతు మంది పిల్లలు మాత్రమే రెండో మార్ష్‌మలోతో పరిశోధకులు వచ్చేదాకా, ఓపికగా ఎదురుచూసినట్లు తేలింది. అయితే ఇదేదో సరదా కోసం చేసిన పరిశోధన కాదు! చిన్నతనంలోనే ఓర్పుని అలవర్చుకున్న పిల్లల జీవితం పెద్దయ్యాక ఎలా ఉంటుంది అని తెలుసుకునేందుకు సాగిన ఒక ప్రయత్నం. ఒక పదేళ్ల తరువాత, ఇరవై ఏళ్ల తరువాత... ఆఖరికి ఈ మధ్యకాలంలో కూడా వీరందరి జీవితాలను గమనించినప్పుడు, అసాధారణమైన వ్యత్యాసం కనిపించింది. అప్పట్లో ఓర్పుగా ఉన్న పిల్లలు తరువాత రోజుల్లో మంచి మార్కులను సాధించడం కనిపించింది. వ్యసనాలకు లోనవడం, ఒత్తిడికి గురవడం, ఊబకాయం బారిన పడటం.... వీరిలో తక్కువగా బయటపడ్డాయి. అప్పట్లో ఓర్పు లేని పిల్లలతో పోలిస్తే, వీరిలో సామాజిక నైపుణ్యాలు కూడా చాలా మెరుగ్గా ఉన్నట్లు తేలింది. ఆఖరికి ఓర్పు ఉన్నవారు, లేనివారి మధ్య మెదడు పనితీరులో కూడా మార్పులు ఉండటాన్ని గమనించారు.   మార్ష్‌మలో పరిశోధన పిల్లలకే కాదు, పెద్దలకు కూడా ఒక గుణపాఠమే! ఎందుకంటే ఓర్పుని అలవర్చుకోవడం ఎవరికీ అసాధ్యం కాదు. నాలుగేళ్ల పిల్లలే సహనంతో ఉండగలిగితే... 40 ఏళ్ల పెద్దలకు అదేమంత భారం కాబోదు. పైగా ఓర్పుని సాధించేందుకు మన భారతీయుల దగ్గర ధ్యానం, యోగ, గీతాబోధ వంటి సాధనాలు ఉండనే ఉన్నాయి. మరెందుకాలస్యం! మనమూ ఆ ఓర్పుగా ఉన్న పిల్లలని అనుసరిద్దాం! జీవితంలో అమృతఫలాలను బహుమతిగా సాధిద్దాం.   - నిర్జర.
Publish Date:Apr 7, 2021

నరకమంటే ఏమిటి?

చివరికి ఓ రోజు ‘గురువుగారూ! మీరు ఇవాళ నాకు స్వర్గ నరకాల గురించి చెప్పి తీరాల్సిందే!’ అంటూ పట్టుపట్టాడు శిష్యుడు. దానికి గురువుగారు ‘సరే! నీకు ఓ అనుభూతిని కలిగిస్తాను. దాన్ని బట్టి నీకు స్వర్గం అంటే ఏమిటో, నరకం అంటే ఏమిటో తేలిపోతుంది’ అన్నారు. శిష్యుడు ఆ అనుభూతిని స్వీకరించేందుకు సిద్ధంగా తన కళ్లని మూసుకున్నాడు. శిష్యుడు కళ్లు మూసుకోగానే ఒక వింత దృశ్యం అతనికి కనిపించింది. ఆ దృశ్యంలో ఒక పెద్ద గది, ఆ గది మధ్యలో ఒక పెద్ద బల్ల ఉంది. ఆ బల్ల మీద రకరకాల ఆహార పదార్థాలు కనిపిస్తున్నాయి. తాజా పండ్లు, ఘుమఘుమలాడే కూరలు... ఇలా ఒకటీ రెండూ కాదు... మనిషి జిహ్వను రెచ్చగొట్టే సర్వపదార్థాలూ ఆ బల్ల మీద ఉన్నాయి. కానీ ఏం లాభం! ఆ బల్ల చుట్టూ ఉన్న జనాలకీ, బల్లకీ మధ్య అయిదేసి అడుగుల దూరం ఉంది. మనుషులు ఎంత గింజుకుంటున్నా ఆ బల్లని సమీపించలేకపోతున్నారు. అలాగని ఆ ఆహారపదార్థాలను అందుకునేందుకు ఏ ఉపాయమూ లేదా అంటే లేకనేం! ఒక అయిదు అడుగుల గరిటె వారికి అందుబాటులో ఉంది. కాకపోతే ఉన్న ఒకే ఒక్క గరిటె కోసం గదిలోని జనాలంతా కొట్టుకోవడమే సరిపోతోంది. ఒకవేళ ఎవరన్నా బలవంతుడు ఆ గరిటెను చేజిక్కించుకున్నా, దాంతో ఆహారాన్ని నోటి దాకా తెచ్చుకునేసరికి అందులోని పదార్థాలు నేలపాలై పోతున్నాయి. శిష్యుడు ఆశ్చర్యంగా ఆ దృశ్యాన్ని చూస్తున్నంతలో అది మాయమైపోయి మరో దృశ్యం కనిపించింది. అందులోనూ ఇదే పరిస్థితి. గది మధ్యలో పెద్ద బల్ల. ఆ బల్ల చుట్టూ అయిదేసి అడుగుల దూరంలో జనం. ఆ జనాలందరికీ ఒకటే గరిటె. కానీ వాళ్లంతా ప్రశాంతంగా కనిపిస్తున్నారు. వారి ఆకలి తీరినట్లే ఉంది. గదిలో ఎలాంటి కొట్లాటలూ లేవు. ఎలాంటి హడావుడీ లేదు. అదెలా సాధ్యమా అని ఆశ్చర్యంగా చూసిన శిష్యుడికి, ఆ ప్రశాంతత వెనుక ఉన్న విషయం బోధపడింది. గదిలో ఉన్న ఒకే ఒక్క గరిటెనీ ఒకరి తరువాత ఒకరు అందుకుంటున్నారు. దాంతో ఆహారాన్ని నింపుకుని అవతలివారికి పెడుతున్నారు. గరిటె తమదాకా వచ్చేదాకా, తమ ఆకలి తీరేదాకా అంతా సహనంతో ఉన్నారు.   ఒక శిష్యుడికి ఏది స్వర్గం? ఏది నరకం? అన్న విషయమై ఎప్పుడూ సందేహంగానే ఉండేది. తన సందేహం గురించి గురువుగారిని ఎప్పుడు అడిగినా కూడా ఆయన ఓ చిరునవ్వు నవ్వేసి ఊరుకునేవారు. చివరికి ఓ రోజు ‘గురువుగారూ! మీరు ఇవాళ నాకు స్వర్గ నరకాల గురించి చెప్పి తీరాల్సిందే!’ అంటూ పట్టుపట్టాడు శిష్యుడు. దానికి గురువుగారు ‘సరే! నీకు ఓ అనుభూతిని కలిగిస్తాను. దాన్ని బట్టి నీకు స్వర్గం అంటే ఏమిటో, నరకం అంటే ఏమిటో తేలిపోతుంది’ అన్నారు. శిష్యుడు ఆ అనుభూతిని స్వీకరించేందుకు సిద్ధంగా తన కళ్లని మూసుకున్నాడు. శిష్యుడు కళ్లు మూసుకోగానే ఒక వింత దృశ్యం అతనికి కనిపించింది. ఆ దృశ్యంలో ఒక పెద్ద గది, ఆ గది మధ్యలో ఒక పెద్ద బల్ల ఉంది. ఆ బల్ల మీద రకరకాల ఆహార పదార్థాలు కనిపిస్తున్నాయి. తాజా పండ్లు, ఘుమఘుమలాడే కూరలు... ఇలా ఒకటీ రెండూ కాదు... మనిషి జిహ్వను రెచ్చగొట్టే సర్వపదార్థాలూ ఆ బల్ల మీద ఉన్నాయి. కానీ ఏం లాభం! ఆ బల్ల చుట్టూ ఉన్న జనాలకీ, బల్లకీ మధ్య అయిదేసి అడుగుల దూరం ఉంది. మనుషులు ఎంత గింజుకుంటున్నా ఆ బల్లని సమీపించలేకపోతున్నారు. అలాగని ఆ ఆహారపదార్థాలను అందుకునేందుకు ఏ ఉపాయమూ లేదా అంటే లేకనేం! ఒక అయిదు అడుగుల గరిటె వారికి అందుబాటులో ఉంది. కాకపోతే ఉన్న ఒకే ఒక్క గరిటె కోసం గదిలోని జనాలంతా కొట్టుకోవడమే సరిపోతోంది. ఒకవేళ ఎవరన్నా బలవంతుడు ఆ గరిటెను చేజిక్కించుకున్నా, దాంతో ఆహారాన్ని నోటి దాకా తెచ్చుకునేసరికి అందులోని పదార్థాలు నేలపాలై పోతున్నాయి. శిష్యుడు ఆశ్చర్యంగా ఆ దృశ్యాన్ని చూస్తున్నంతలో అది మాయమైపోయి మరో దృశ్యం కనిపించింది. అందులోనూ ఇదే పరిస్థితి. గది మధ్యలో పెద్ద బల్ల. ఆ బల్ల చుట్టూ అయిదేసి అడుగుల దూరంలో జనం. ఆ జనాలందరికీ ఒకటే గరిటె. కానీ వాళ్లంతా ప్రశాంతంగా కనిపిస్తున్నారు. వారి ఆకలి తీరినట్లే ఉంది. గదిలో ఎలాంటి కొట్లాటలూ లేవు. ఎలాంటి హడావుడీ లేదు. అదెలా సాధ్యమా అని ఆశ్చర్యంగా చూసిన శిష్యుడికి, ఆ ప్రశాంతత వెనుక ఉన్న విషయం బోధపడింది. గదిలో ఉన్న ఒకే ఒక్క గరిటెనీ ఒకరి తరువాత ఒకరు అందుకుంటున్నారు. దాంతో ఆహారాన్ని నింపుకుని అవతలివారికి పెడుతున్నారు. గరిటె తమదాకా వచ్చేదాకా, తమ ఆకలి తీరేదాకా అంతా సహనంతో ఉన్నారు. తనకు కనిపించిన రెండు దృశ్యాలనూ తల్చుకుంటూ శిష్యుడు తన కళ్లని తెరిచాడు. కంటి ఎదురుగా గురువుగారు ఎప్పటిలాగే చిరునవ్వులు చిందిస్తూ ఉన్నారు. ‘ఇప్పుడు అర్థం అయ్యిందా స్వర్గానికీ, నరకానికీ ఉన్న తేడా ఏమిటో!’ అన్నారు గురువుగారు. శిష్యుడు తలవంచుకున్నాడు. ‘నీకు కనిపించిన రెండు దృశ్యాలలోనూ పరిస్థితి ఒక్కటే! కానీ ఒకదానిలో మనిషి తాను సుఖపడటం లేదు, ఎదుటివాడికీ అవకాశాన్ని ఇవ్వడం లేదు. ఎంతసేపూ తన కడుపే నిండాలనే ఆలోచన ఉన్నప్పుడు ఇలాంటి నరకమే ఏర్పడుతుంది. మనిషి సంఘజీవి అని తెలుసుకుని, ఒకరికొకరు సాయపడినప్పుడు.... ఎదుటివాడి ఆకలీ తీరుతుంది, మన కడుపూ నిండుతుంది. స్వర్గం, నరకం ఎక్కడో కాదు... మన దృక్పథాలలోనే ఉన్నాయని ఇప్పటికైనా బోధపడిందా!’ అన్నారు గురువుగారు.  
Publish Date:Apr 6, 2021

జీవితాన్ని తట్టుకొని నిలబడాలంటే!

అది ఒక చిన్న ఊరు. ఆ ఊళ్లో రెండు అందమైన ఇళ్లు పక్కపక్కనే ఉండేవి. వాటి యజమానులు ఇద్దరూ స్నేహితులే. ఆ ఇద్దరు స్నేహితులూ కలిసి ఓ రోజు బజారుకి వెళ్లారు. వస్తూ వస్తూ ఓ రెండు మొక్కలు తెచ్చుకొన్నారు. తీరా ఇంటికి వచ్చాక మొదటి ఇంటి యాజమాని- ‘మనం సరదాగా ఒక పందెం వేసుకుందామా! ఇద్దరం ఒకేరకం మొక్కను తెచ్చుకొన్నాం కదా! వీటిలో ఏది బాగా పెరుగుతుందో చూద్దామా!’ అన్నాడు. ‘ఓ అదెంత భాగ్యం!’ అంటూ సవాలుకి సిద్ధమయ్యాడు రెండో యజమాని. మొదటి ఇంటి యజమాని పందేన్ని సీరియస్‌గా తీసుకున్నాడు. తను తెచ్చిన మొక్కని జాగ్రత్తగా నాటాడు. దాని కోసం ఎక్కడెక్కడి నుంచో ఎరువులు తీసుకువచ్చాడు. మూడుపూటలా మర్చిపోకుండా దానికి నీళ్లు పోసేవాడు. మొక్కలు బాగా పెరగడానికి ఇంటర్నెట్‌లో కనిపించే చిట్కాలన్నీ పాటించేవాడు. రెండో ఇంటి యజమాని మాత్రం తన మొక్క విషయంలో చాలా నిర్లిప్తంగా ఉన్నాడు. రోజూ ఉదయం కాస్త నీళ్లు పోయడం మాత్రమే చేసేవాడు. రోజులు గడిచేకొద్దీ మొదటి ఇంట్లో మొక్క ఏపుగా పెరగసాగింది. దాని ఆకులు నవనవలాడుతున్నాయి. పండ్లు, పూలతో ఆ చెట్టు చూడముచ్చటగా ఉంది. రెండో చెట్టు కూడా బాగానే ఉంది. కానీ మొదటి చెట్టుతో పోలిస్తే అది కాస్త కాంతివిహీనంగా కనిపిస్తోంది. ‘చూశావా! ఒక్క ఆర్నెళ్లలోనే నా చెట్టు ఎలా తయారైందో. ఇక నువ్వు ఓడిపోక తప్పదు,’ అంటూ రెండో ఇంటి యజమానిని రెచ్చగొట్టాడు మొదటి ఇంటి యజమాని. దానికి రెండో యజమాని ఓ చిరునవ్వు నవ్వి ఊరుకుండిపోయాడు. ఈ సంభాషణ జరిగిన రోజు రాత్రి పెద్ద గాలివాన వచ్చింది. ఉదయం లేచి చూసేసరికి ఏముంది? ముందురోజు వరకూ నవనవలాడుతూ కనిపించిన మొదటి ఇంటి చెట్టు కాస్తా వేళ్లతో సహా పక్కకి పడిపోయింది. రెండో చెట్టు మాత్రం ఏం జరగనట్లు నిబ్బరంగా కనిపించింది. ‘అదేంటి! ఇంత జాగ్రత్తగా పెంచిన చెట్టు ఇలా ఒరిగిపోయింది,’ అంటూ ఏడుపుమొహం పెట్టుకున్నాడు ఆ ఇంటి యజమాని. దానికి రెండో యజమాని చిరునవ్వుతో- ‘నువ్వు చెట్టుని అందంగా, ఎత్తుగా పెంచాలని చూశావు. దానికి పళ్లు, పూలు కాయాలని మాత్రమే చూశావు. అందుకే దాని అవసరానికి మించిన నీళ్లు అందించావు. ఎప్పటికప్పుడు కావల్సిన నీరు అందడంతో దాని వేళ్లు భూమి లోపలకి వెళ్లాల్సిన అవసరమే లేకుండా పోయింది. కానీ నేను నాటిని మొక్క ఎలాంటి పరిస్థితినైనా తట్టుకుని సహజంగా ఎదగాలని కోరుకున్నాను. అందుకే దానికి తగినంత సాయం మాత్రమే చేశాను. ఫలితం! నేను నాటిన మొక్క వేళ్లు భూమి లోతుకి వెళ్లాయి. ఎండకి ఎండి, వానకి తడిసి దాని కాండం బలపడింది. గాలివానని సైతం తట్టుకొని నిలబడింది,’ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ కథ కేవలం మొక్కలకి సంబంధించింది మాత్రమే కాదు! పిల్లలు కూడా ఇంతే! వారికి ఏ కష్టమూ, లోకజ్ఞానమూ తెలియకుండా అవసరానికి మించిన సౌకర్యాలు అందిస్తుంటే... జీవితంలో అలజడి రేగినప్పుడు తట్టుకోలేరు. అలా కాకుండా వారు స్వతంత్రంగా ఎదిగే అవకాశం ఇస్తూ, ఒక కంట వారి అవసరాలను కనిపెడుతూ ఉంటే... ఎలాంటి తుఫానునైనా తట్టుకొని నిలబడతారు.                                   (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.
Publish Date:Apr 5, 2021

డబ్బు విలువ

అతను ఓ పెద్ద వ్యాపారి. తన కష్టానికి అదృష్టం కూడా కలిసిరావడంతో పట్టిందల్లా బంగారం అయ్యింది. దాంతో తన జీవితంలో ఎలాంటి లోటూ లేకుండా పోయింది. అంతా బాగానే ఉంది. కానీ తన తర్వాత వ్యాపారం పరిస్థితి ఏమిటా అన్న బెంగ మొదలైంది వ్యాపారస్తునికి. ఎందుకంటే తన కొడుకు ఎలాంటి కష్టమూ తెలియకుండా పెరిగాడు. అతనికి వ్యాపార సూత్రాలు కానీ, డబ్బు విలువ కానీ ఏమాత్రం తెలియవు. కష్టపడే తత్వం ఇసుమంతైనా లేదు. అలాంటి కొడుక్కి బుద్ధి చెప్పడం ఎలా? అని తెగ ఆలోచించాడు వ్యాపారస్తుడు. ఆలోచించగా... ఆలోచించగా... అతనికి ఓ ఉపాయం తట్టింది. మర్నాడు వ్యాపారస్తుడు తన కొడుకుని పిలిచాడు. ‘చూడు! నువ్వు ఎందుకూ పనికిరాకుండా పోతున్నావు. డబ్బు తగలెయ్యడం తప్ప సంపాదించడం చేతకావడం లేదు. అందుకని నీకో పరీక్ష పెడుతున్నాను. ఇవాళ నువ్వు ఏదో ఒక పని చేసి డబ్బు సంపాదించుకుని వస్తేనే రాత్రికి భోజనం పెడతాను. లేకపోతే ఖాళీ కడుపుతో పడుకోవాల్సిందే!’ అని తేల్చి చెప్పాడు. తండ్రి మాట విన్న కొడుకుకి ఏం చేయాలో పాలుపోలేదు. ఇన్నాళ్లూ తనకి కష్టం అంటే ఏమిటో తెలియదు. అసలు కష్టపడాల్సిన అవసరం తనకేముందని? అందుకని బిక్కమొహం వేసుకుని తల్లి దగ్గరకి వెళ్లి నిల్చొన్నాడు. కొడుకు సమస్య విని తల్లి తల్లడిల్లిపోయింది. తన భర్త ఇంక కర్కశంగా ప్రవర్తిచాడేమిటా అనుకుంది. వెంటనే తన పెట్టెలోంచి ఒక బంగారు నాణెం తీసి కొడుకు చేతిలో పెట్టింది. ‘ఇది తీసుకువెళ్లి మీ నాన్నగారికి ఇవ్వు. దాన్ని నువ్వే సంపాదించానని చెప్పు!’ అంది. తల్లి ఇచ్చిన బంగారు నాణెం తీసుకుని కొడుకు సంతోషంగా తండ్రి దగ్గరకి వెళ్లాడు. ఆయన చేతిలో బంగారు నాణేన్ని ఉంచి, తనే ఆ నాణాన్ని సంపాదించానని చెప్పాడు. తండ్రి మహా తెలివైనవాడు. అందుకే ఆ నాణెం ఎక్కడి నుంచి వచ్చిందో చటుక్కున గ్రహించేశాడు. ‘దానిని తీసుకుపోయి బావిలో పడెయ్యి, రేపు సాయంత్రం ఇలాగే నువ్వు సంపాదించుకుని రావాలి. అప్పుడే నీకు రేపు రాత్రి భోజనం దక్కుతుంది,’ అని చెప్పాడు. తండ్రి చెప్పినట్లుగానే ఆ బంగారు నాణేన్ని బావిలో పడేశాడు కొడుకు. మర్నాడు కొడుకు నిద్రలేచేలోగా, భార్యని ఏదో పని మీద ఊళ్లోకి పంపేశాడు వ్యాపారస్తుడు. దాంతో కొడుక్కి ఆ రోజు సంపాదన ఎక్కడి నుంచి తేవాలో అర్థం కాలేదు. వెంటనే తన అక్క దగ్గరకి వెళ్లాడు. తమ్ముడి కష్టం విన్న అక్క తెగ బాధపడిపోయింది. తండ్రి ఎందుకిలా తయారయ్యాడా అని తెగ మధనపడిపోయింది. వెంటనే తన పెట్టెలోంచి ఒక వెండి నాణెం తీసి తమ్ముడి చేతిలో పెట్టింది. ‘ఇది తీసుకువెళ్లి నాన్నగారికి ఇవ్వు. దాన్ని నువ్వే సంపాదించానని చెప్పు!’ అంది. అక్క ఇచ్చిన వెండి నాణేన్ని తీసుకుని తమ్ముడు సంతోసంగా తండ్రి సముఖానికి చేరుకున్నాడు. ఆయన చేతిలో నాణేన్ని పెట్టి తానే దానిని సంపాదించానని చెప్పాడు. తండ్రి తక్కువవాడా! ఆ నాణెం ఎక్కడిదో ఊహించేశాడు. ‘దానిని తీసుకుపోయి బావిలో పడెయ్యి, రేపు సాయంత్రం ఇలాగే సంపాదించుకుని రా! అప్పుడే నీకు రేపు రాత్రి తిండి పెట్టేది,’ అని చెప్పాడు. తండ్రి చెప్పినట్లుగానే ఆ వెండి నాణేన్ని బావిలో పడేశాడు కొడుకు. మర్నాడు కొడుకు నిద్రలేచేసరికి భార్యనీ, కూతురినీ చుట్టాలింటికి పంపేశాడు వ్యాపారస్తుడు. దాంతో ఇక కొడుక్క అసలు సమస్య మొదలైంది. బంధువులని డబ్బు అడిగితే తండ్రికి తెలిసిపోతుంది. తెలిసినవారిని అడగాలంటే మొహమాటం అడ్డు వచ్చింది. దాంతో ఎలాగొలా ఆ ఒక్కరోజూ కష్టపడదామని నిర్ణయించుకున్నాడు. ఆ కొట్టూ ఈ కొట్టూ తిరుగుతూ పనికోసం ప్రాథేయపడ్డాడు. కొంతమంది లేదన్నారు. కొంతమంది ఛీత్కరించారు. కొంతమంది తరిమికొట్టారు. పాపం ఇలాంటి అనుభవాలన్నీ అతనికి కొత్త. మరోవైపు కడుపు నకనకలాడిపోతోంది. చివరికి మధ్యాహ్నం ఎప్పటికో ఓ పుణ్యాత్ముడు అతనికి పని ఇచ్చాడు. కొట్టు బయట ఉన్న కట్టెలన్నీ తీసి లోపల పడేస్తే ఓ పదిరూపాయలు ఇస్తానన్నాడు. ఆ మాట వినగానే కొడుకు మొహం వెలిగిపోయింది. కానీ ఒకో కట్టెముక్కా తీసుకుని లోపలకి వేస్తుంటే అతని ఒళ్లు హూనమైపోయింది. వీపు దోక్కుపోయింది. చేతులు పుళ్లుపడిపోయాయి. చివరికి ఎలాగోలా తనకి అప్పచెప్పిన పనిని పూర్తిచేశాడు. పదిరూపాయల నాణెం తీసుకుని తండ్రి దగ్గరకి వెళ్లి నిల్చొన్నాడు. కొడుకు వాలకం చూడగానే తండ్రికి విషయం అర్థమైపోయింది. అయినా అతను చెప్పాలనుకున్న పాఠం ఇంకా పూర్తికాలేదు. అందుకనే- ‘దానిని తీసుకుపోయి బావిలో పడెయ్యి,’ అని చెప్పాడు. ఆ మాట వినగానే కొడుకు మనసు తరుక్కుపోయింది. ‘ఇంతా కష్టపడి సంపాదించిన డబ్బుని బావిలో పడెయ్యాలా! వద్దు నాన్నా!’ అని వేడుకున్నాడు. ఆ మాటలకి తండ్రి చిరునవ్వుతో- ‘చూశావా! ఎవరో ఇచ్చిన సంపద- అది బంగారమైనా, వెండైనా సరే... దాని విలువ మనకి తెలియదు. అందుకే బావిలో పారేసినట్లుగానే ఖర్చు చేసి పారేస్తాం. అదే రక్తం ధారపోసి సంపాదించినది రూపాయి అయినా సరే... దానిని జాగ్రత్తగా ఖర్చుపెట్టుకుంటాం. ఈ రోజుతో నీకు డబ్బు విలువ తెలిసొచ్చింది. ఇక మీదట నువ్వు నా వ్యాపారంలో చేదోడువాదోడుగా ఉండు,’ అని చెప్పాడు. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.
Publish Date:Apr 3, 2021

జీవితం బోర్ కొట్టేస్తోందా!

నిమిషం ఖాళీ లేని జీవితం.... ఇంటినిండా కావల్సినన్ని వస్తువులు. అయినా ఏదో వెలితి. ఆ వెలితి ఒకోసారి హద్దులు దాటి జీవితం అంటేనే బోర్ కొట్టేస్తూ ఉంటుంది. అలాగని ఉన్న ఉద్యోగాన్నీ వదులుకోలేము, సమాజానికి దూరంగానూ పారిపోలేము. కాకపోతే చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే ఆ నిస్సత్తువ నుంచి కాస్త బయటపడవచ్చని అంటున్నారు నిపుణులు... కదిలి చూడండి ఒక రెండు రోజులు సెలవు పెట్టి ఏ ఊరికో వెళ్లి చూడండి. అదీ కాదంటారా! దగ్గరలోనే ఉన్న చూడదగ్గ ప్రదేశాలన్నీ ఓ చూపు చూసి రండి. కాదూ, కూడదంటారా! ఊళ్లోనే ఉన్న స్నేహితుల ఇళ్లకు వెళ్లి పలకరించి రండి. మొత్తానికి మీరున్న చోట నుంచి కదిలే ప్రయత్నం చేయండి. రోజూ కళ్ల ముందు కనిపించే వాతావరణం నుంచి కాస్త దూరం జరగండి. సృజనకు పదునుపెట్టండి లోలోపల గూడు కట్టుకుపోయి ఉన్న చిరాకులను వెలికితీయాలన్నా, మనసు కాస్త సేదతీరాలన్నా సృజనలో తప్పకుండా సాంత్వన లభిస్తుంది. బొమ్మలు వేయడమో, పాత వస్తువులని కొత్తగా తీర్చిదిద్దడమో... ఆఖరికి ఏ సుడోకుని ఆడటమో చేసే ప్రయత్నం చేస్తే మనసుకి కాస్త ఊరటగా ఉంటుంది. రొటీన్కు భిన్నంగా చేయాలనుకుంటే మన చుట్టూ చాలా పనులే ఉంటాయి. వాటిపట్ల మనకి అభిరుచి లేకపోవడం వల్ల మనం దూరంగా ఉంటామంతే! వంట చేయడం, మొక్కలు పెంచడం, డైరీ రాయడం... ఇవన్నీ మనసుని కాసేపు పట్టి ఉంచే పనులే. ఎప్పుడన్నా బోర్ కొట్టినప్పుడన్నా వీటివైపు మళ్లే ప్రయత్నం చేయండి. కావల్సినంత కాలక్షేపం దొరుతుంది. మనసుకి కూడా తృప్తిగా ఉంటుంది. నలుగురిలో కలవండి మనసులోని చిరాకుని పంచుకోవాలన్నా, ఒంటరితనం నుంచి తప్పించుకోవాలన్నా... మరో మనిషితో మాట్లాడాల్సిందే! అది ఎదురింటివారైనా కావచ్చు, పాత పరిచయస్తులైనా కావచ్చు. కాసేపు అలా నలుగురి మధ్యలోకీ వెళ్లి వారితో నాలుగు కబుర్లు చెప్పి, కాసేపు నవ్వుకొంటే మనసు తేలికపడుతుంది. శారీరిక శ్రమ ఏ పనీ లేనప్పుడు మనసంతా ఏవో ఒక ఆలోచనలతో క్రుంగిపోతుంటుంది. అందుకే శరీరాన్ని కాస్త కష్టపెడితే మనసు కూడా కుదుటపడుతుంది. వ్యాయామం చేయడమో, కాస్త దూరం నడవడమో, ఇల్లు సర్దుకోవడమో చేస్తే శరీరం అలసిపోతుంది. మనసుకి ఆలోచించుకునే సమయం ఉండదు. కాలక్షేపం చేయండి అప్పటికప్పుడు మనసుని కాస్త ఉల్లాసపరుచుకోవాలంటే... ఏదన్నా కాలక్షేపం చేయాల్సిందే! పుస్తకం చదవడమో, టీవీ చూడటమో, సినిమాకి వెళ్లడమో... ఇలా కాలాన్ని కాసేపు సరదాగా గడిపేయండి. మనసుని లయం చేయండి మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం కష్టమైన పనే. కానీ ప్రయత్నిస్తే తప్పేమీ లేదుగా! సంగీతం వినడమో, ధ్యానంలో మునిగిపోవడమో, గుడికి వెళ్లి కాసేపు సేదతీరడమో చేస్తే... మన సమస్యలన్నీ తాత్కాలికమే అన్న ధైర్యం కలుగుతుంది. ఏతావాతా అప్పుడప్పుడూ బోర్ కలగడం మంచిదే! మన జీవితంలో ఎక్కడో ఏదో పొరపాటు దొర్లుతోందనే సత్యాన్ని అది తెలియచేస్తుంది. ఆ సమయంలో ఒక్క క్షణం ఆగి మన జీవనవిధానాన్ని తరచి చూసుకుంటే... ఒకోసారి మన గమ్యాన్నే మార్చుకునే అవకాశం కలుగుతుంది. - నిర్జర.
Publish Date:Apr 2, 2021

మీరు వాడే సెంటుకీ ఉంటుందో వ్యక్తిత్వం!

  మన వ్యక్తిత్వం ఎలాంటిదో... మనం ఎంచుకునే వస్తువులు కొంతమేరకు ప్రతిబింబిస్తాయి. పెర్‌ఫ్యూమ్‌కి (perfume) కూడా ఈ సూత్రం వర్తిస్తుందంటున్నారు నిపుణులు. మన మనసుకి దగ్గరగా ఉన్న పరిమళాలనే ఎన్నుకొంటామని వాదిస్తున్నారు. Paul Jellinek అనే ఆయన ప్రాచీన గ్రంథాలన్నీ తిరగతోడి పరిమళాలను నాలుగు రకాలుగా విభజించారు.   AIR:-  నిమ్మ, జామాయిల్ వంటి చెట్ల నుంచి తయారుచేసే పరిమళాలు ఈ విభాగానికి వస్తాయట. ఇలాంటి పరిమళాలు మనలోని సృజనకు పదునుపెడతాయంటున్నారు. మానసికంగా దృఢంగా ఉండేవారు, నలుగురిలో కలిసే చొరవ ఉన్నవారు ఇలాంటి పరిమళాలను ఎన్నుకొంటారట. ఇలాంటివారు కొత్తదారులను వెతుకుతారనీ, తమ మనసులో మాటని నిర్భయంగా పంచుకుంటారనీ చెబుతున్నారు. ఇతరులని మందుకు నడిపించడంలోనూ, జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించడంలోనూ వీరు ముందుంటారట. FIRE:- ముక్కుపుటాలు అదిరిపోయేలా ఘాటైన పరిమళాలు ఈ విభాగం కిందకి వస్తాయి. ఈ తరహా పరిమళాలను ఎన్నుకొనేవారు కొత్త కొత్త ఆలోచనలతో ముందకెళ్తుంటారు. కానీ ఒకోసారి తమ సామర్థ్యాన్ని మించిన లక్ష్యాన్ని ఎన్నుకొని భంగపడుతూ ఉంటారు. వీరి వ్యక్తిత్వం ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ... ఇతరులు తన గురించి ఏమనుకుంటున్నారో అనే పట్టింపు కానీ, ఇతరుల దృష్టిని ఆకర్షించాలన్న తపన కానీ వీరిలో కనిపించవు.   WATER:- గులాబీలవంటి సున్నితమైన పరిమళాలను ఇష్టపడేవారు ఈ విభాగానికి చెందుతారు. మానసికంగా ఎప్పుడూ సందిగ్ధావస్థలో ఉండేవారు ఇలాంటి పరిమళాలను ఇష్టపడతారట. వీరి స్వభావం, నిర్ణయాలు ఎప్పుడెలా ఉంటాయో అంచనా వేయడం కష్టం. ప్రవహించే నీటిలాగా వీరు దేనినీ పట్టించుకోనట్లు కనిపించినా... తమ కుటుంబాలు, పిల్లలకు మాత్రం చాలా ప్రాధాన్యతని ఇస్తారట.   EARTH:- తియ్యటి పదార్థాలను పోలిన పరిమళాలు ఈ కోవకి చెందుతాయి. ఇలాంటి పరిమళాలను ఇష్టపడేవారు చాలా ప్రాక్టికల్‌గా ఉంటారట. గాలిలో మేడలు కట్టడం వీరి స్వభావానికి విరుద్ధం. లోకాన్నీ, తన వ్యక్తిత్వాన్నీ ఉన్నది ఉన్నట్లుగా గ్రహించే నైపుణ్యం వీరి సొంతం. జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా తట్టుకుని నిలబడేందుకు వీరు సదా సిద్ధంగా ఉంటారు. ఇవీ Paul Jellinek చేసి తీర్మానాలు. ఆయన చెప్పినంత మాత్రాన మనం వాడే పర్‌ఫ్యూమ్‌ ఖచ్చితంగా మన వ్యక్తిత్వాన్ని ప్రతిబిస్తుందని అనుకోలేం. ముఖ్యంగా మనలాంటి మధ్యతరగతి ప్రజలు 1+1 ఆఫర్‌ ఉందనో, కొత్త పెర్‌ఫ్యూమ్‌ మార్కెట్లోకి వచ్చిందనో, పక్కవాళ్లు కొనుక్కున్నారనో... పెర్‌ఫ్యూమ్స్ వాడేస్తుంటారు. కాకపోతే సరదాగా కాసేపు బేరీజు వేసుకోవడం కోసం పైన పేర్కొన్న లక్షణాలని చదువుకోవచ్చు.           
Publish Date:Apr 1, 2021