నిజమైన ప్రేమ

 

అతనో సైనికుడు. ఆ సైనికుడు తను బాధ్యతలు నిర్వహిస్తున్న ఊరిలో, ఒక అందమైన అమ్మాయిని చూసి మనసు పారేసుకున్నాడు. ఆ అమ్మాయికీ అతనంటే ఇష్టం ఏర్పడింది. కానీ తమ కూతురికి ఒక సైనికుడికి ఇచ్చి వివాహం చేయాలంటే, అమ్మాయి తల్లిదండ్రులకి మనసు ఒప్పలేదు. దాంతో వారి మనసుని కూడా గెలుచుకోవాలని సైనికుడు విశ్వప్రయత్నం చేశాడు. కొన్నాళ్లకి అమ్మాయి తల్లిదండ్రులకి అతని మీద సదభిప్రాయం ఏర్పడింది.
‘ఏ ఉద్యోగంలో ఉండే కష్టనష్టాలు ఆ ఉద్యోగంలో ఉంటాయి. సైనికుడు అయినంత మాత్రాన అల్పాయుష్కుడు అవుతాడా? రాజైనంత మాత్రాన నిండు నూరేళ్లు ఖచ్చితంగా బతుకుతాడా?’ అని తమకి తాము సర్ది చెప్పుకున్నారు అమ్మాయి తల్లిదండ్రులు.

 

అందమైన అమ్మాయికీ, సైనికుడికీ ఘనంగా నిశ్చితార్ధం జరిగింది. ఒక నెల రోజుల్లో పెళ్లి చేసుకుందాం అనుకుంటుండగా యుద్ధం ముంచుకువచ్చింది. ఇక తిరిగివచ్చాకే వివాహం అనుకుంటూ యుద్ధభూమికి బయల్దేరాడు సైనికుడు. రోజులు గడుస్తున్నాయి. యుద్ధం భీకరంగా సాగుతోంది. ఆ యుద్ధభూమి నుంచే వారానికి ఓ ఉత్తరం రాస్తున్నాడు సైనికుడు. కానీ ఒక్క ఉత్తరానికి కూడా అతనికి బదులు రాలేదు. కారణం...

 

యుద్ధం మొదలైన కొన్ని రోజులకి అమ్మాయి ఉండే పల్లెటూరి మీద శత్రువులు నిప్పుల వర్షం కురిపించారు. అందమైన అమ్మాయి కూడా ఆ దాడిలో తీవ్రంగా గాయపడింది. స్పృహ వచ్చిన తరువాత అద్దంలో మొహం చూసుకుంటే ఏముంది! తను కూడా గుర్తుపట్టలేనంతగా ఆమె మొహం మారిపోయింది. ‘ఏ మొహం పెట్టుకొని ఆ సైనికుడిని పెళ్లిచేసుకోను,’ అనుకొంది. అందుకనే అతని ఉత్తరాలకు బదులు ఇవ్వలేదు. పైగా తనకి ఈ పెళ్లి ఇష్టం లేదనీ, మరో పెళ్లి చేసుకోమనీ సందేశం పంపింది. ఒకవేళ యుద్ధం ముగిసి సైనికుడు తన ఇంటికి వచ్చినా ఏదో ఒక కారణం చెప్పి లోపలకి రానివ్వద్దంటూ తల్లిదండ్రులకు తేల్చిచెప్పింది.

 

ఓ ఏడాదికి కాబోలు యుద్ధం ముగిసింది. ఆ తరువాత ఒకరోజు సైనికుడి నుంచి పెళ్లి శుభలేఖ వచ్చింది. ఆ శుభలేఖ చూసిన అమ్మాయి గుండెపగిలిపోయింది. తను వద్దనుకున్న మనిషే! కానీ తనని కాకుండా వేరే అమ్మాయిని చేసుకుంటున్నాడన్న నిజం ఎందుకనో ఆమె భరించలేకపోయింది. బరువెక్కిన మనసుతో ఆ శుభలేఖని తెరిచి చూసింది. ఆశ్చర్యం! అందులో పెళ్లికూతురుగా తన పేరే ఉంది. శుభలేఖతో పాటుగా వచ్చిన ఉత్తరంలో ఇలా ఉంది...

 

‘నీ రూపం మారిపోగానే నా మనసు మారిపోతే, అది నిజమైన ప్రేమ ఎలా అవుతుంది. నా స్నేహితుల ద్వారా నీ గురించి తెలుసుకున్నాక నీ మీద గౌరవం మరింతగా పెరిగిందే కానీ తగ్గలేదు. అందుకే నీకు కూడా తెలియకుండా నీ తల్లిదండ్రులతో మాట్లాడి ఈ పెళ్లికి ఏర్పాట్లు చేయించాను. శత్రువులతో జరిగిన యుద్ధంలో నేను బతికి బయటపడి ఉండవచ్చు. జీవితమనే యుద్ధంలో నువ్వు గాయపడి ఉండవచ్చు. కానీ ఇద్దరమూ సైనికులమే! ఇద్దరం కలిసే ప్రయాణం సాగిద్దాం.’ 
ఆ ఉత్తరం చదివాక అమ్మాయి మొహంలో ఎన్నో రోజుల తరువాత చిరునవ్వు విరిసింది.

(ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)

 

 

- నిర్జర.