కేసీఆర్ కూతురంటే నిజాం కూతురా?

 

కేసీఆర్ కూతురంటే నిజాం కూతురా అని తెలంగాణ తెలుగుదేశం నాయకుడు ఎర్రబెల్లి దయాకరరావు ఆగ్రహంగా ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఎంపీ కవిత సమగ్ర సర్వేలో రెండుసార్లు పేరు నమోదు చేసుకున్న విషయాన్ని ప్రశ్నిస్తే నా కూతుర్ని ప్రశ్నిస్తారా అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, అలాగే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా మా సీఎం కూతుర్ని ప్రశ్నిస్తావా అని ఆగ్రహిస్తున్నారని అన్నారు. కేసీఆర్ కూతురంటే నిజాం కూతురా.. ఆమెని ప్రశ్నిస్తే తప్పా అని ఆయన అడిగారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హిట్లర్ కన్నా దారుణంగా వ్యవహరిస్తున్నారని, తన 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఇలాంటి ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదని ఎర్రబెల్లి అన్నారు. సీఎం కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవిత రెండు చోట్ల తన వ్యక్తిగత సమాచారాన్ని నమోదు చేసుకున్న విషయం వాస్తవమా కాదా అన్న విషయం సభలో వెల్లడించాల్సిన బాధ్యత టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉందని ఎర్రబెల్లి అన్నారు. ఈ అంశంపై ప్రభుత్వం సమాధానం ఇవ్వకుండా రెండురోజులగా అసెంబ్లీ సమావేశాలు జరగకుండా గందరగోళం సృష్టిస్తుందని విమర్శించారు.