పెరిగే ఆడపిల్లలకు ఈ 5 విషయాలు తప్పక నేర్పించాలి.. వారి జీవితాన్నే మార్చేస్తాయివి..!

 

పిల్లలు పెరిగేకొద్దీ వారి అవసరాలు, ఆలోచనలు,  అవగాహన కూడా మారుతూ ఉంటాయి. దీనికి తగినట్టు  తల్లిదండ్రులు కూడా తమ పెంపకం విధానాన్ని తదనుగుణంగా మార్చుకోవాలి. ఎందుకంటే ప్రతి వయస్సులోనూ తమ పిల్లలకు సరైన విషయాలను నేర్పించడం తల్లిదండ్రుల బాధ్యత. ఇది ఈరోజు మాత్రమే కాకుండా భవిష్యత్తులో కూడా పిల్లలకు ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఆడపిల్లలు  టీనేజ్‌లోకి ప్రవేశించినప్పుడు వారికి కొన్ని ముఖ్యమైన విషయాలను నేర్పించడం చాలా ముఖ్యం. ఇవి వారి జీవితాంతం వారికి ఉపయోగపడే విషయాలు. కాబట్టి పెరుగుతున్న ఆడపిల్లలు ఉంటే  తప్పనిసరిగా తల్లిదండ్రులు 5 విషయాలను నేర్పించాలని అంటున్నారు. అవేంటో తెలుసుకుంటే..

నో చెప్పడం..

తల్లిదండ్రులు 12 నుండి 15 సంవత్సరాల వయస్సు ఆడపిల్లలకు  ఏదైనా తమకు నచ్చని,  తమకు నష్టం కలిగించే  విషయానికి మొహమాటం లేకుండా 'కాదు' అని చెప్పడం నేర్పించాలని పిల్లల పెంపకం నిపుణులు అంటున్నారు.  ఎందుకంటే ప్రతి పరిస్థితిలోనూ 'అవును' అని చెప్పాల్సిన అవసరం లేదు. అది పిల్లలకు ఒక్కోసారి చాలా నష్టం కలిగించే అవకాశం ఉండవచ్చు.  కాబట్టి తల్లిదండ్రులు దీన్ని గుర్తుంచుకోవాలి.

సెల్ఫ్ సపోర్ట్..

ఆడపిల్లలు తమను తాము ఎలా సమర్థించుకోవాలో కూడా వారికి నేర్పించాలి.  ఏ విషయంలో అయినా వారు తమ అభిప్రాయాలను ముందుకు తీసుకురావాలి.  ఏదైనా తప్పు జరిగితే  తప్పుకు వ్యతిరేకంగా తమ స్వరాన్ని పెంచాలి. అలాగే ఎప్పుడైనా తాము చెయ్యని తప్పుకు వారిని దోషులను చేయాలని అనుకున్నప్పుడు తమ తప్పు లేదని చెప్పడంలో వారు తమ స్వరాన్ని వినిపించడాన్ని,  తప్పొప్పులను వివరించే సామర్థ్యాన్ని కూడా వారికి నేర్పించాలి.  అది అమ్మాయిలను ధైర్యంగా ఉంచుతుంది.

నమ్మకం..

ఎదుటివారు నమ్మకం ఉంచితేనే తాము సరైన వారు అనుకునే వారు చాలామంది ఉంటారు.  ఇందులో ముఖ్యంగా ఆడపిల్లలకు ఎక్కువగా ఉంటారు.  ఏ పని చేసినా ఆడపిల్లలను సులువుగా నిందించే వారు ఉంటారు.   ఎవరూ తమను నమ్మకపోయినా, వారు ఎప్పుడూ తమపై తాము నమ్మకాన్ని కోల్పోకూడదని కూతుళ్లకు చెప్పాలి . ఆత్మవిశ్వాసమే ఆడపిల్లలకు  నిజమైన బలం, అదే వారి సూపర్ పవర్. ఆడపిల్లలకు ఎదురయ్యే ప్రతి కష్టాన్ని అధిగమించడంలో వారి ఆత్మవిశ్వాసం ఎంతగానో సహాయపడుతుంది.

సెల్ఫ్ ప్రొటెక్షన్..

 ఆడపిల్లల విషయంలో తల్లిదండ్రులు ఇవ్వాల్సిన   మొదటి ప్రాధాన్యత భద్రత.  ప్రతి ఆడపిల్ల ఇతరులతో సంబంధం లేకుండా మొదటగా తనను తాను రక్షించుకోవడం ఎలాగో నేర్చుకోవాలి.  ప్రతికూల పరిస్థితుల్లో తనను తాను ఎలా సురక్షితంగా ఉంచుకోవచ్చో నేర్పించాలి.  నేటి సమాజానికి ఇది ఎంతో అవసరం.

సెల్ఫ్ లవ్..

ఆడపిల్లలకు సెల్ఫ్ లవ్ గురించి నేర్పించాలి.  ఒక దశ తర్వాత ఆడపిల్లలు తమ శరీరాన్ని కూడా పట్టించుకోకుండా కుటుంబ ఒత్తిడులలో,  కుటుంబ బాధ్యతలలో మునిగిపోతారు.  అలాంటి వారికి జీవితంలో తొందరగా విరక్తి వచ్చే అవకాశం ఎక్కువ. అందుకే తన గురించి తాను కూడా ఆలోచించుకోవాలి.  తనను తాను ప్రేమించుకోవాలి.  తన డ్రెస్సింగ్ స్టైల్,  తన ఆరోగ్యం, తను తీసుకునే ఆహారం, తన ఇష్టాలు, అభిరుచులు.. ఇట్లా అన్ని విషయాలలో ఆడపిల్లలు అవగాహన కలిగి ఉండాలి.  ఇవన్నీ ఆడపిల్లను ఒక శక్తిగా మారుస్తాయి.

                              *రూపశ్రీ.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu