మాతృభాషకు ఎందుకంత ప్రాముఖ్యత!

 

ప్రపంచీకరణ పుణ్యమా అని ఇప్పుడు ఇంగ్లీషుదే ఆధిపత్యంగా మారింది. చదువుకోవాలంటే ఇంగ్లీషు, ఉద్యోగం చేయాలంటే ఇంగ్లీషు, ఆఖరికి బయటకు వెళ్లి వ్యవహారాలు నడపాలంటే ఇంగ్లీషు... ఇలా ఎక్కడ చూసినా ఇంగ్లీషుదే పెత్తనం అయిపోయింది. ఈ పరిస్థితికి ఎదురొడ్డి మనం మనుగడ సాగించడం కష్టమే! అలాగని మన మాతృభాష అయిన తెలుగుని పూర్తిగా మర్చిపోయే పరిస్థితి రావడమే దురదృష్టకరం. ఇంట్లో తండ్రీకొడుకులు ఎదురుపడినా కూడా ఆంగ్లంలోనే మాట్లాడుకోవడం, తెలుగులో మాట్లాడటాన్ని అనాగరికతగా భావించడం బాధాకరం. నాలుగు రాళ్లు వెనకేయని మాతృభాషని మర్చిపోతే ఏం అని ప్రశ్నించేవారికి సమాధానాలు ఇవిగో...

 

భావవ్యక్తీకరణ!

ఇంగ్లీషులో ఎంత దుమ్మురేపేవాడైనా కాలికి ముల్లు గుచ్చుకుంటే ‘అమ్మా!’ అని అరవాల్సిందే! ఈ ఉదాహరణ కాస్త అతిగా తోచినా, మన మనసులోని భావాలను స్పష్టంగా బయటపెట్టేందుకు మాతృభాషే అత్యుత్తమమైన సాధనం అంటున్నారు నిపుణులు. అవసరం లేని చోట కూడా, కావాలని ఆంగ్లంలో మాట్లాడేవారిని గమనించండి. ఆ మాటలు వారి గుండె లోతుల్లోంచి రావడం లేదనీ, అసలు విషయాన్ని చెప్పడానికి కూడా ఇబ్బంది పడుతున్నారనీ ఇట్టే తెలిసిపోతుంది.

 

చదువు సులభంగా!

పిల్లవాడికి తెలిసిన భాషలో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడం సులువా? లేకపోతే ఇంకా పూర్తిగా అవగాహన లేని భాషలోనే విజ్ఞానం పొందడం సులువా? అన్న ప్రశ్నకు జవాబు ఏమంత కష్టం కాదు. ఆంగ్లంలో చదువుని నేర్చుకోవడం అంటే, ముందుగా ఒకో పదానికీ అర్థం వెతుక్కోవడంతోనే సరిపోతుంది. పైగా చదువుకున్న విషయాన్ని వ్యక్తీకరించడానికీ, దాని మీద ఏదన్నా సందేహాలు అడగడానికీ కూడా... మాతృభాషలోనే తగిన స్వేచ్ఛ ఉంటుంది కదా! అందుకనే, ఉన్నతవిద్య సంగతి ఎలా ఉన్నా ప్రాథమిక విద్య మాత్రం మాతృభాషలోనే సాగాలంటూ ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి. అంతేకాదు! మాతృభాషలో ప్రాథమిక విద్యను నేర్చుకునేవారు, జ్ఞాన సముపార్జనలో ఇతరుకంటే ముందుంటున్నారనే పరిశోధనలూ వెలువడుతున్నాయి.

 

ఆంగ్లం మరింత సులభంగా!

తమ మాతృభాష మీద పట్టు సాధించినవారే, రెండో భాషను చాలా సులభంగా నేర్చుకుంటారనే పరిశీలనలు వెలువడుతున్నాయి. ఎందుకంటే భాషకి సంబంధించి మనలో ఒక బలమైన పునాది ఏర్పడినప్పుడు, మరో భాషని నేర్చుకోవడం పెద్ద కష్టంగా తోచదు. అలా కాకుండా మాతృభాషే పూర్తిగా నేర్వని సమయంలో, మరో భాష వైపు అడుగులు వేస్తే... రెంటికీ చెడ్డ రేవడిగా మారడం ఖాయం. అందుకనే ఇప్పటి తరం పిల్లలు ఇటు తెలుగూ, అటు ఆంగ్లంలో కూడా నైపుణ్యం సాధించలేకపోతున్నారన్నది ఒక అభియోగం. తెలిసిన విషయం నుంచి తెలియని విషయం వైపుగా సాగడం, నైపుణ్యాన్ని సాధించేందుకు కావల్సిన అర్హత. అలా కాకుండా తెలియని భాష మీదే మొదట మన సామర్థ్యాన్ని వినియోగిస్తే, ఫలితం తారుమారు కాక తప్పదు కదా!

 

భాష మన శ్వాస!

భాషంటే కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య సాగే భావవ్యక్తీకరణ మాత్రమే కాదు. అది మన జీవనాడి. వేల సంవత్సరాల చరిత్రకు, సంస్కృతికి సజీవ సాక్ష్యం. మన సాహిత్యం, మన సంప్రదాయాలు, మన జానపదం... అన్నీ భాషలోనే ఇమిడి ఉంటాయి. అలాంటి భాషను దూరం చేసుకోవడం అంటే, మన పునాదులని మనం కూల్చివేసుకోవడమే కదా! అలాంటప్పుడు మనిషికి తనది అని చెప్పుకొనేందుకు ప్రత్యేకంగా ఏవీ మిగలవు. తను ఫలానా జాతివాడు అని చెప్పుకొనేందుకు ఆధారమూ ఉండదు. మాతృభాషకు దూరమైనవాడు.. గాలికి కొట్టుకుపోయే ఎండుటాకుతో సమానం. అందుకనే! మాతృభాష వినిపించనివారిలో క్రుంగుబాటు ధోరణులు ఎక్కువగా ఉంటాయనీ, అవి ఒకానొక సందర్భంలో ఆత్మహత్యకు సైతం దారితీస్తున్నాయనీ... కెనడాలో తేల్చిచెప్పిన ఒక పరిశోధనా ఫలితాలు ప్రపంచాన్నే విస్తుబోయేలా చేశాయి.

 

మాతృభాషలోనే ప్రతిమాటా పలకాలి, ప్రపంచానికి ఎదురొడ్డాలి అని ఎవ్వరూ సూచించడం లేదు. అలాంటి సూచనలు బహుశా అంత ఆచరణసాధ్యం కూడా కాకపోవచ్చు. కానీ అమ్మభాషను ఆదరంగా చూసుకోవాలి, పిల్లల్లో మాతృభాష పట్ల తగినంత అభినివేశాన్ని కలిగించాలి, వారితో కనీసం ఇంట్లో అయినా స్పష్టమైన తెలుగులో మాట్లాడాలి... అని కోరుకోవడం తప్పేమీ కాదుగా!

(నేడు తెలుగుభాషా దినోత్సవం సందర్భంగా)

 

- నిర్జర.