రాతి పులుసు

 

మనిషి తల్చుకుంటే సాధించలేనిది ఏదీలేదు. అలాంటిది, కొందరు మనుషులు కలిసికట్టుగా ఏదన్నా సాధించాలని అనుకుంటే... అసాధ్యమనేది ఉండదు కదా! మరి ఆ ఐక్యత గురించీ, ఆ ఐక్యతని సాధించిన ఓ యువకుడి ఉపాయం గురించిన కథే ఇది.

 

అనగనగా ఓ సైనికుడు. ఆ సైనికుడు ఏదో యుద్ధంలో పాల్గొని తన ఇంటికి తిరుగు ప్రయాణం కట్టాడు. దారి పొడవునా, ఎటుచూసినా అతనికి దుర్భరదారిద్ర్యమే కనిపిస్తోంది. అడుగడుగునా కరువు తాండవిస్తోంది. అలాంటి ప్రాంతాలెన్నింటినో దాటుకుంటూ సైనికుడు, రాత్రివేళకి ఓ గ్రామాన్ని చేరుకున్నాడు. మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఆ గ్రామం పరిస్థితి కాస్త బాగానే ఉన్నట్లు కనిపించింది. కానీ కరువు వస్తుందేమో అన్న ముందు జాగ్రత్తతో అక్కడి గ్రామస్తులు తమ ఆహారపదార్థాలను నేలమాళిగల్లో దాచిపెట్టుకుని ఉన్నారు. సాటివారితో పంచుకునేందుకు కానీ, పదార్థాలను మార్పిడి చేసుకునేందుకు కానీ వాళ్లు సిద్ధంగా లేరు. ఆహారాన్ని దాచుకున్నవాడు తలుపులు మూసుకుని సుష్టుగా భోంచేస్తున్నాడు. లేనివాడు ఆకలితో అలమటిస్తున్నాడు.

 

 

పగలంతా నడిచీ నడిచీ ఆ గ్రామాన్ని చేరుకున్న సైనికుడికి కూడా విపరీతమైన ఆకలి వేస్తోంది. కానీ గ్రామంలో పరిస్థితి చూస్తే ఒక్క బియ్యపుగింజ కూడా దక్కేట్లు లేదు. రచ్చబండ దగ్గర మాత్రం ఓ పెద్ద కుండ కనిపించింది. దాన్ని చూసిన సైనికుడికి ఓ ఉపాయం తట్టింది. గబగబా నాలుగు కట్టె పుల్లలని పోగేసి, రాజేసాడు. ఆ మంట మీద ఆ పెద్ద కుండని ఉంచి, అందులో నీరు పోశాడు. చుట్టుపక్కలవారు చూస్తుండగానే అందులో ఒక గులకరాయి వేశాడు. సైనికుడు చేస్తున్న ఈ వింత పని చూసి చుట్టుపక్కలవారంతా విస్తుపోయారు. ‘‘ఏం చేస్తున్నావు నువ్వు! అందులో గులకరాయి ఎందుకు వేశావు?’’ అని అడిగాడు అక్కడే ఉన్న ఊరిపెద్ద.

 

‘‘అది మామూలు గులకరాయి కాదు! పులుసు చేసే రాయి. దాన్ని కనుక నీళ్లలో వేసి కాసేపు కలియతిప్పామంటే నా సామిరంగా.... అద్భుతమైన పులుసు తయారవుతుంది. దాన్ని మీ గ్రామంలోవారందరికీ కూడా పంచుతాను చూడండి,’’ అని ఊరించాడు సైనికుడు. ‘గ్రామంలో అందరికీ పంచుతాను,’ అన్న మాట వినగానే ఊరి జనమంతా రచ్చబండ దగ్గరకు చేరుకున్నారు. సైనికుడు ఓ గరిటెతో కుండలోని నీటిని కలియతిప్పుతూ ‘ఆహా! ఓహో!’ అని అరవడం మొదలుపెట్టాడు. అతని హావభావాలను చూసి జనాలందరికీ నోరూరసాగింది.

 

 

కాసేపు అలా నీటిని కలియతిప్పిన తరువాత సైనికుడు ఆ నీటిని రుచి చూసి ‘‘పులుసు చాలా బాగుంది! కానీ ఇందులో కాస్త బియ్యపుపిండీ, కాసిన క్యాబేజీలు వేస్తేనా... ఇంకా అదిరిపోతుంది,’’ అన్నాడు. ఆ మాటలకు ఊరిపెద్ద గబగబా తన ఇంట్లోకి వెళ్లి అరబస్తా బియ్యపుపిండీ, ఓ మూడు క్యాబేజీలూ తీసుకువచ్చాడు. వాటిని నీటిలో వేసిన సైనికుడు మళ్లీ ఓసారి రుచి చూసి ‘‘పులుసంటే ఇలా ఉండాలి! కాకపోతే కాస్త పసుపూ, ఉప్పూ, కారం తగిలితే ఇంకా ఘుమఘుమలాడిపోతుంది,’’ అని ఊరించాడు. ఆ మాటలతో మరో పెద్ద మనిషి తన ఇంట్లోకి వెళ్లి సదరు సరుకులన్నీ తీసుకువచ్చాడు.

 

సైనికుడు చెప్పినట్లు నిజంగానే పులుసు ఘుమఘుమలాడటం మొదలుపెట్టింది. అయినా సైనికుడు ఒకోసారి రుచి చూస్తూ మరో పదార్థం చేరిస్తే ఇంకా బాగుంటుంది అని జనాల్ని రెచ్చగొట్టడం మొదలుపెట్టాడు. అలా క్యారెట్లు, ఉల్లిపాయలు, మాంసం, లవంగాలు.... ఒకదాని తరువాత ఒకటిగా పులుసులోకి చేరుకున్నాయి. ఎట్టకేలకు అద్భుతమైన పులుసు తయారైంది. దాన్ని తను కాస్త పుచ్చుకొని, ఊరివారికి తలాకాస్తా పంచి సైనికుడు గుర్రుపెట్టి నిద్రపోయాడు. జనం మాత్రం అతని దగ్గర ఉన్న మాయా గులకరాయి గురించి మాట్లాడుకుంటూ ఉండిపోయారు. మాయ ఆ రాయిలో లేదనీ, తమ ఐక్యతలోనే ఉందని వారికి అర్థమవుతుందో లేదో!

 

`The Stone Soup’ పేరుతో వినిపించే ఈ జానపద కథ ఫ్రాన్స్, హంగేరి, జర్మనీ, పోర్చుగల్‌ వంటి ఎన్నో పాశ్చాత్య దేశాలలో విస్తృత ప్రచారంలో ఉంది. ప్రాంతాన్ని బట్టి కథనాలు మారినా, కథలో మాత్రం పెద్దగా మార్పు కనిపించదు. ఈ కథ ఆధారంగా ఎన్నో పుస్తకాలు, నాటకాలు వెలువడ్డాయి. వనరులు ఏమీ లేని చోట, నలుగురూ నాలుగు చేతులు వేసినప్పుడు అద్భుతాలు జరుగుతాయనే ఈ సూత్రాన్ని ఆఖరికి అమెరికా సైన్యంలో కూడా అమలు చేసిన సందర్భాలూ ఉన్నాయి.

 

- నిర్జర.