చీరలోని అందం

ప్రపంచం మారుతోంది. ప్రపంచీకరణతో మన దేశం కూడా మారిపోతోంది. కానీ వేల సంవత్సరాలుగా హైందవ స్త్రీలు ధరిస్తున్న చీరకు మాత్రం ఆకర్షణ తగ్గలేదు కదా, కొన్నాళ్లు పాశ్చత్య దుస్తులను ప్రయత్నించిన తరువాత మళ్లీ చీరనే ఎంచుకుంటున్నారు. చీరలోనే అందం, సౌఖ్యం ఉందని చాటుతున్నారు. ఎందుకలా అని ఓ పదినిమిషాలు ఆలోచిస్తే చాలు... వందల కారణాలు తడతాయి. 

 

- వస్త్రం అనేది ఉంటే దాన్ని మనం ధరించేందుకు అనుకూలంగా రకరకాల కుట్లూ కావాలి. చచ్చీచెడీ కుట్టుకున్నాక, అది మనకు నప్పుతుందా లేదా అని మరో సందేహం  మొదలవుతుంది. నప్పినా మన శారీరిక మార్పులకు అనుకూలంగా సరిపోతుందా అంటే అదీ లేదు. ఆరు గజాల చీరతో ఆ బాధేముంటుంది.

 

- భారతదేశంలో వాతావరణం ఎప్పుడెలా ఉంటుందో చెప్పలేం. ఒక రోజు ఉక్కపోత ఉంటే మరో రోజు చలికి బిగుసుకుపోతాము. ఒక రోజు గాలికి చిరాకుపడితే మరోరోజు వర్షానికి తడిసిపోక తప్పదు. ఇలా అన్నిరకాల వాతావరణాల నుంచి రక్షణగా నిలుస్తుంది చీర. తలకి చుట్టుకున్నా, నడుముకి బిగించుకున్నా, సిగ్గుతో పరదాలా మార్చుకున్నా చీరతోనే చెల్లుతుంది.

 

- అందానికి చీరను మించిన ఆభరణం లేదు. స్త్రీలు చీరలో ఉన్నంత అందంగా మరే దుస్తులలోనూ కనిపించరన్నది నిరంతరం వినిపించే కాంప్లిమెంటే! ధరించే తీరుని బట్టి, వస్త్రం రూపుని బట్టి, ఆఖరికి చీర రంగుని బట్టి...అవతలివారి భావాలను ప్రభావితం చేయగల నేర్పు ఒక్క చీరకట్టులోనే ఉంది.

 

- చీరకు డబ్బుతో పనిలేదు. కటిక పేదరికంలో ఉన్నవారు వంద రూపాయల నార చీర కట్టుకున్నా అద్భుతంగా నెగ్గుకొచ్చేస్తారు. లక్షరూపాయల బంగారు చీర కట్టుకున్నవారూ వెలిగిపోతారు. అంతేకాదు! ఎలాంటి శరీర ఆకృతి ఉన్నవారికైనా చీర నప్పి తీరుతుంది. కట్టుకునే తీరులోను, ఎంచుకునే రంగులోనూ కాస్త జాగ్రత్త పడితే చీర ఎవరికైనా సరిపోతుంది.

 

- చీర ఒక్కటే! కానీ దాన్ని ధరించే తీరుని బట్టి మనం ఎక్కడివారమో చెప్పేస్తుంది. ఈ దేశంలో ప్రతి ప్రాంతానికీ తనదైన చీరకట్టు ఉంది. ఆ ప్రాంతంలో కొన్ని వర్గాలు మరింత భిన్నమైన చీరకట్టుని ధరిస్తారు. చీరకట్టుని బట్టి బెంగాళీలా, తమిళురా అన్నది చెప్పేయవచ్చు. మనం ఏ సమాజానికి చెందినవారమో అన్న ఉనికిని చాటే గుర్తు చీరకట్టు.

 

చెప్పుకొంటూ పోవాలే కానీ, చీర గురించి ఏదో ఒక విషయం తడుతూనే ఉంది. భారతీయ సంప్రదాయంలో మతాలకు అతీతంగా చీరకట్టు ఎంతగా నిలిచిపోయిందంటే... మనకు అమ్మ ఒడి అనగానే చీరే గుర్తుకువస్తుంది. ప్రస్తుతానికి మన ఇళ్లలో నైటీలు, పంజాబీ డ్రస్సుల ప్రాబల్యం పెరిగిపోయి ఉండవచ్చు. అయినా ఇప్పటికీ నిండుగా కనిపించాలన్నా, వేడుకలో పాలుపంచుకోవాలన్నా చీరకే తొలి ప్రాధాన్యత. నుదుటిన పట్టిన చిరుచెమటను తుడుచుకున్నా, తాళాలను కొంగున ముడివేసుకున్నా.. అది చీరతోనే చెల్లుతుంది. మన మధ్యతరగతి గృహిణులు వాడి వాడి చీలికలు పీలికలుగా మారిపోయిన చీరముక్కలను బొంతగా మార్చుకుంటుంటే, లేదా స్టీలు సామాన్ల వాడితో మార్పిడి చేసుకుంటుంటే... మన భారతీయ సంస్కృతిలాగానే చీరకు కూడా ఆరంభమే కానీ అంతమనేది ఉండదేమో అనిపిస్తుంది.

 

 - నిర్జర.