చేయి చాస్తే మనసుని గెలవాల్సిందే!

కొత్తగా ఒక వ్యక్తి పరిచయం అయినప్పుడో లేక పాత పరిచయస్తుడే ఎక్కడన్నా తారసిల్లినప్పుడో కరచాలనం చేయడం సంప్రదాయం. వేల సంవత్సరాల ఈ ఆచారం బహుశా గ్రీసులో మొదలై ఉండవచ్చని చరిత్రకారుల అంచనా. ఇద్దరు సైనికులు ఒకరికొకరు ఎదురుపడినప్పుడు, తమ చేతిలో ఏ ఆయుధమూ లేదనీ, తాము స్నేహానికి సిద్ధంగా ఉన్నామనీ తెలియచేసేందుకు మొదలైన అలవాటే కరచాలనంగా మారి ఉంటుందని భావిస్తున్నారు. చాలా ఆషామాషీగా చేసే ఈ కరచాలనం వెనుక ఒక శాస్త్రం ఉందనీ, మనం చేసే కరచాలనం మన స్వభావాన్ని బయటపెడుతుందనీ అంటున్నారు మనస్తత్వ శాస్త్రవేత్తలు. ఈ విషయాన్ని పైకి ఎవ్వరూ చెప్పకపోయినా, మన కరచాలనం అవతలివారిలో మన మీద ఒక అభిప్రాయం ఏర్పడేందుకు దోహదపడుతుందని హెచ్చరిస్తున్నారు. అందుకే ఎదుటివారి మనసుని గెలుచుకోవాలంటే కరచాలనం చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి...

 

 

* కరచాలనం చేసేటప్పుడు ఎటో చూస్తూ ఉంటే, మనం ఏదో మొక్కుబడిగా కరచాలనం చేసినట్లు ఉంటుంది. అందుకని చిరునవ్వుతో ఎదుటివారి కళ్లలోకి చూస్తూ కరచాలనం చేయాలి.

* చాలా సందర్భాలలో అవతలి మనిషి కరచాలనానికి చేయిచాచగానే అసంకల్పితంగా మనం కూడా చేయి చాచేస్తాము. చేతులు చెమటతో తడిగా ఉన్నా, లేక చేతులకి ఆహారపదార్థం ఉన్నా పెద్దగా పట్టించుకోము. ఇలాంటి చేతులతో కరచాలనం చేస్తే అవతలి వ్యక్తికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకని ముందుగా అరచేతులని చటుక్కున ప్యాంటుకి తుడుచుకుని కరచాలనం చేయడంలో తప్పులేదు.

* కరచాలనం ఎప్పుడూ నేరుగా, స్పష్టంగా ఉండాలి. ఎదుటి వ్యక్తి ఎవరితోనన్నా మాట్లాడుతున్నప్పుడు మధ్యలోకి చొరబడిపోయి కరచాలనం చేయడం, నడుము సందుల్లోంచి చేయి చాచడం మర్యాద అనిపించుకోదు. అవతలి మనిషి హడావుడిగా ఉన్నప్పుడు అతనితో కరచాలనం చేయాలి అనుకుంటే, ముందుగా అతన్ని పలకరించి, అతని దృష్టిని ఆకర్షించి తరువాత అతనితో కరచాలనం చేస్తే సరిపోతుంది.

* కరచాలనం చేసేటప్పుడు అరచేయి మొత్తాన్నీ అవతలి వ్యక్తి అరచేతితో కలపాలి. మరీ గట్టిగానూ, అలాగని మరీ సున్నితంగానూ కాకుండా స్థిరంగా కరచాలనం చేయాలి. మరీ గట్టిగా కరచాలనం చేస్తే మీరు అతివిశ్వాసం ఉన్న మనిషన్న భావన అవతలివారిలో కలుగుతుంది. అలాకాకుండా మరీ సున్నితంగా కరచాలనం చేస్తే మీకు అవతలి వ్యక్తంటే చులకన్న అన్న భావం ఏర్పుడుతుంది.

* కరచాలనం చేసేటప్పుడు చేతులను రెండుమూడుసార్లు ఊపితే సరిపోతుంది. అలా కాకుండా చేతిని వదలకుండా పట్టుకునే ఉంటే, అవతలి వ్యక్తిలో ఇబ్బంది మొదలవుతుంది. అలాగే కరచాలనం చేసేటప్పుడు అరచేయి పక్కకే ఉండాలి. కరచేలనం చేస్తూ అరచేతిని పైకి తిప్పితే అవతలి వ్యక్తి మీద మనం ఆధిపత్యం చెలాయిస్తున్నామన్న సూచనను అందించినట్లు అవుతుంది.

చిన్నపాటి కరచాలనం వెనుక ఇన్నేసి సూత్రాలు ఇమిడి ఉన్నాయన్నమాట. అందుకనే ఈ హడావుడి అంతా ఎందుకు! హాయిగా మన భారతీయ సంప్రదాయంలో నమస్కారం చేస్తే సరిపోలా అనుకుంటే ఏ బాధా లేదు. అది మరింత గౌరవంగానూ, హుందాగానూ ఉంటుంది. కాకపోతే అవతలి వ్యక్తి కరచాలనం చేసేందుకు సిద్ధపడినప్పుడు నమస్కారం పెడితే అసలుకే ఎసరు వస్తుంది. అందుకని కరచాలనం చేయాల్సిన సందర్భాలలో పై విషయాలను కాస్త గమనించుకుంటే సరి!

- నిర్జర