జూబ్లీహిల్స్ బై పోల్స్.. మంటలు రేపుతున్న కన్నీళ్లు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో  దొంగ ఓట్ల వ్య‌వ‌హారంతో పాటు క‌న్నీటి  క‌థ‌లు కూడా భారీగానే న‌డుస్తున్నాయ్.  బీఆర్ఎస్ అభ్య‌ర్ధి మాగంటి సునీత త‌న భ‌ర్త‌ను త‌లుచుకుని క‌న్నీటి ప‌ర్యంతం అయ్యారొక స‌భ‌లో. అయితే ఈ క‌న్నీటి క‌హానీలు కేటీఆర్, హ‌రీష్ కావాల‌నే ద‌గ్గ‌రుండి  నడిపిస్తున్న‌ారంటూ  కామెంట్ చేస్తున్నారు కాంగ్రెస్ లీడ‌ర్లు పొన్నం త‌దిత‌రులు. త‌మ‌కు సునీత మీద సానుభూతి ఉందంటూనే.. ఆమెను కావాల‌నే రెచ్చ‌గొట్టి  ఏడిపించి సీన్ క్రియేట్ చేస్తున్నది మాత్రం  హ‌రీష్, కేటీఆరే అంటూ విమర్శలు చేస్తున్నారు.  

అస‌లు బీఆర్ఎస్ త‌మ అభ్య‌ర్ధిగా సునీత‌ను నిలబెట్టిందే ఇందుకు అంటున్నారు.  వాస్తవానికి జూబ్లీ బైపోల్ లో బీఆర్ఎస్ అభ్యర్థిగా తొలుత పార్టీ అనుకున్న వ్యక్తులు వేరు అంటూ గుర్తు చేస్తున్నారు. జూబ్లీ బైపోల్ లో  బీఆర్ఎస్ అభ్యర్థిగా తొలుత  కేటీఆర్ స‌తీమ‌ణి  శైలిమ పేరు, ఆ తరువాత   పీజేఆర్ త‌న‌యుడు విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి పేరు కూడా బీఆర్ఎస్ పరిశీలించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. 

అయితే శైలిమ, విష్ణువర్దన్ రెడ్డిలలో ఒకరిని నిలిపినా.. జూబ్లీ ఉప ఎన్నిక జరుగుతుందే కానీ, బీఆర్ఎస్ కు అవసరమైన సెంటిమెంట్ పండదన్న భావనతోనే మాగంటి సునీతకు టికెట్ ఇచ్చారని అంటున్నారు.   బేసిగ్గా బీఆర్ఎస్ ఆయువు ప‌ట్టు మొత్తం సెంటిమెంటులో దాగి ఉంటుంది. అయితే ప్రాంతీయ సెంటిమెంటు, లేకుంటే ఇదిగో ఇలాంటి సెంటిమెంట్లు ఆధారంగా వారు త‌మ కారు  న‌డిపిస్తుంటారు. ఎంద‌రో బ‌లిదానాల పునాదుల మీద క‌ట్టుకున్న పార్టీ క‌దా? అలాగే ఉంటుంద‌ని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.  

బీఆర్ఎస్ దంతా  ఎమోష‌న్ చుట్టూ ఆడే డ్రామానే అంటారు వారు. ఇవేవీ కాకపోతే.. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబును అప్పు తెచ్చుకుని మరీ ఆయనపై విమర్శలు గుప్పించి పబ్బంగడుపుకోవడం చూస్తున్నాం కదా అని ఎద్దేవా చేస్తున్నారు.   మొత్తం సెంటిమెంట్ ఆధారంగానే బీఆర్ఎస్ రాజకీయం ఉంటుందనీ, అటువంటి పార్టీకి అందివ‌చ్చిన అవ‌కాశంలా సునీత క‌న్నీళ్లు చెంత‌నే ఉంటే వాడుకోకుండా ఎలా ఉంటారు అంటూ పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu