బీహార్ రాజకీయాల్లో లూలూ శకం ముగిసిందా?

బీహార్ రాజకీయాలలో మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ప్రభావం కనిపించడం లేదా? అన్న చర్చ ఇప్పుడు విస్తృతంగా జరుగుతోంది. గతంలో అయితే  ఒక్క బీహార్ అనేమిటి దేశ వ్యాప్తంగా, ఆ మాటకొస్తే అంతర్జాతీయంగా లాలూ ప్రసాద్ యాదవ్ ఒక జైగాంటిక్ పొలిటీషియన్. ఒక విధంగా చెప్పాలంటే అప్పట్లో లాలూ ప్రసాద్ యాదవ్ ది పుష్ప రేంజ్ అంటే నేషనల్ అనుకుంటివా ఇంటర్నేషనల్ అన్నట్లుగా ఉండేది.  రైల్వే మంత్రిగా లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్న సమయంలో.. రైల్వేలను లాభాల బాట పట్టించారు. దీంతో జాతీయ స్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలోనూ లాలూ సెంటరాఫ్ అట్రాక్షన్ గా మారిపోయారు. ఒక పశువుల కాపరి కొడుకు.. ఇంతటి రేంజ్ కి ఎలా ఎదిగారు? అంటూ హార్వర్డ్  యూనివర్సిటీ వంటి విశ్వవిద్యాలయాలు ఆయన జీవితాన్ని ఒక కేస్ స్టడీలా తీసుకుని పరిశీలించాయి. అదీ అప్పట్లో లాలూ ప్రసాద్ యాదవ్ స్టామినా. అయితే ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ పొలిటికల్ గా సొంత పార్టీలోనే ఇన్ సిగ్నిఫికెంట్ అయిపోయారు. అంతటి స్టేచర్ ఉన్న వ్యక్తి ఇప్పుడు కనీసం కుమారుడిని కూడా మందలించలేని, నియంత్రించలేని పరిస్థితిలో ఉన్నారు.   

ఇప్ప‌టి వ‌ర‌కూ లాలూ ప్రసాద్ యాదవ్ ను ఆయన ప్ర‌త్య‌ర్ధులే   ఇర‌కాటంలో ప‌డేసేవారు.. ఇప్పుడు ఏకంగా ఆయన కుమారుడే పక్కన పెట్టేస్తున్నారు.  లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ అధినేతగా  పార్టీ  లీడ‌ర్ల‌కు ఇచ్చిన బీఫామ్స్ ను ఆయన కుమారుడు తేజస్వి యాదవ్ వెనక్కు తీసేసుకున్నారు.  అదేమంటే మ‌హా ఘ‌ట్ బంధ‌న్ లోనే ప్రధాన  పార్టీ అయిన కాంగ్రెస్ ఇదేం ప‌ద్ధ‌తి? ఇంకా సీట్ల సర్దుబాటు కాకుండానే పార్టీ అభ్యర్థులకు బీఫామ్ లు ఎలా ఇస్తారంటూ నిలదీయడమే కారణమంటున్నారు.  ఈ ఎన్నిక‌ల్లో గానీ ఆర్జీడీ పరిస్థితి ఏమాత్రం అటూ ఇటూ అయినా, అంటే పార్టీ విజయం సాధించి అధికారం చేజిక్కించుకోలేకపోతే మాత్రం.. లాలూ ప్రసాద్ యాదవ్ పొలిటికల్ కెరీర్ కు ఎండ్ కార్డ్ పడినట్లేనని పరిశీలుకుల విశ్లేషిస్తున్నారు.   ఒక్క లాలూ ప్రసాద్ యాదవ్ పొలిటికల్ కెరీరే కాదు, ఆర్జేడీ ఉనికి కూడా నామమాత్రం అయిపోతుందంటున్నారు. ఈ పరిస్థితుల్లోనే ఒకప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఓ రేంజ్, నేమ్ అండ్ ఫేమ్. బీహార్ ఒక స‌మోసాలాంటిదైతే లాలూ అందులో మ‌సాలాతో కూడుకున్న ఆలూ అన్న ఫేమ్ ఉండేది. అయితే కేసులు, జైలు, వయస్సు పైబడటం ఇత్యాది కారణాలతో అదంతా గతంగా మిగిలిపోయింది. ఇప్పుడు సొంత పార్టీలోనే, అందునా సొంత కుమారుడే పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వని పరిస్థితి నెలకొంది. 

వాటీజ్ లాలూస్ బ‌యోగ్ర‌ఫీ అని ఒక లుక్కేసుకుంటే.. పాట్నా యూనివ‌ర్శిటీలో విద్యార్ధి నాయ‌కుడిగా మొద‌లైన లాలూ ప్ర‌స్థానం.. అంచెలంచెలుగా ఎదిగింది. జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ్ వ‌ద్ద శిష్య‌రికం చేసిన లాలూ.. ఎమ‌ర్జెన్సీ హ‌యాంలో ఇందిరాగాంధీకే చార్ట‌ర్ ఆఫ్ డిమాండ్స్ అందించిన ధీశాలిగా పేరు సాధించారు.

అంతే కాదు 29 ఏళ్ల అతి పిన్న‌వ‌య‌సులోనే ఆయ‌న లోక్ స‌భ‌కు ఎంపిక‌య్యారు. కేవ‌లం ప‌దేళ్ల స‌మ‌యంలోనే ఆయ‌న బీహార్ రాజ‌కీయాల్లో న‌వ యువ శ‌క్తిగా ఎదుగుతూ వ‌చ్చారు. సంకీర్ణ ప్ర‌భుత్వాన్ని విజ‌య‌ప‌థాన న‌డిపించారు. అంతేనా 1990లో సీఎం అయ్యారు. ఆర్ధికంగా ఎదుగుతోన్న బీహార్ పై ప్ర‌పంచ బ్యాంకు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించిందంటే అర్ధం చేసుకోవ‌చ్చు లాలూ ఆర్ధిక‌ప‌రంగా ఎంత‌టి నిష్ణాతుడో. 1996లో బ‌య‌ట ప‌డ్డ రూ.950 కోట్ల‌ ప‌శుగ్రాస కుంభ‌కోణం ఆయ‌న జీవితాన్ని తారు మారు చేసేసింది. ఆ స‌మ‌యంలో త‌న స‌తీమ‌ణి ర‌బ్రీదేవిని ముఖ్య‌మంత్రి చేశారు లాలూ. 1997లో ఆయ‌న జ‌నతా ద‌ళ్ నుంచి విడిపోయి రాష్ట్రీయ జ‌న‌తా ద‌ళ్ ని ఏర్పాటు చేశారు.

లాలూ అతి పెద్ద విజ‌యం రైల్వే మంత్రిగా ఉండ‌గా.. న‌ష్టాల్లో ఉన్న ఆ శాఖ‌ను లాభాల బాట ప‌ట్టించ‌డం. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌పై అంత‌ర్జాతీయ స్థాయి ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిసింది. ఒక స‌మ‌యంలో కొన్ని అంత‌ర్జాతీయ యూనివ‌ర్శిటీలు.. రైల్వేలో లాలూ పాటించిన  యాజ‌మాన్య ప‌ద్ధ‌తుల‌పై ప‌రిశోధ‌న‌కు దిగాయంటే అర్ధం చేసుకోవ‌చ్చు ఆయ‌న శ‌క్తి  సామ‌ర్ధ్యాలు ఏపాటివో.

అయితే లాలూ జీవితాన్ని త‌ల‌కిందులు చేసింది మాత్రం.. దాణా కుంభ‌కోణ‌మ‌నే చెప్పాలి. ఇప్పటి వరకు నాలుగు కేసుల్లో తీర్పులు వెలువరించిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ప్రతి కేసులోనూ లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు జైలు శిక్ష  విధించింది. చివరిది, అయిదోది అయిన డొరండా ఖజానా కేసులో ఆయనకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం 2022 ఫిబ్రవరి 21న ఐదేళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. రూ.60 లక్షల జరిమానా కూడా విధించింది. 

ఒక ప‌శువుల కాప‌రి కొడుకు ఇంత‌టి అంత‌ర్జాతీయ స్థాయికి ఎద‌గ‌డం.. భార‌త ప్ర‌జాస్వామ్యం సాధించిన విజ‌యం.. అంటూ ఆయ‌న త‌న‌కు తాను స్వ‌యంగా ఏషియా టైమ్స్ ప‌త్రిక ఇంట‌ర్వ్యూలో ఎలా చెప్పుకున్నారో. స‌రిగ్గా అదే స‌మ‌యంలో ప‌శువుల‌ దాణా కుంభ‌కోణంలో ఆయ‌న పీక లోతు కూరుకుపోవ‌డం ద్వారా..  త‌న ప‌త‌నాన్ని త‌నే శాసించుకున్నారని  చెప్పాల్సి ఉంటుంది.

ఇప్ప‌టికే రాజ‌కీయంగా ఎంతో అప్ర‌దిష్ట‌పాలైన లాలూ.. ప్ర‌స్తుతం త‌న కొడుకు నుంచి కూడా ఛీత్కార స‌త్కారాలు పొంద‌డం  ఆయన రాజకీయ జీవితంలో అతి పతనావస్థ అనే చెప్పాలి. ఇప్పుడు బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు లాలూను మళ్లీ పతాక స్థాయికి తీసుకెడతాయా, మరింత పతనావస్థలోకి దిగజార్చుతాయా అంటే వేచి చూడాల్సిందే అంటున్నారు పరిశీలకులు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu