అడుసుతొక్కనేల.. సామెతను గుర్తు చేస్తున్న కొలికిపూడి!
posted on Jul 24, 2025 10:19AM

తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావును వివాదాలు వెంటాడతాయా? లేక ఆయనే వివాదాల వెంటపడతారా తెలియదు కానీ, ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత ఆయన తరచూ వివాదాలతోనే సహవాసం చేస్తున్నారని అనిపించక మానదు. తాజాగా కొలికిపూడి శ్రీనివాసరావు వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి షేక్ హ్యాండిచ్చి మాట్లాడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. దీనిపై కొలికిపూడిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యేగా తిరువూరు నియోజకవర్గంలో తెలుగుదేశం క్యాడర్ తో సఖ్యత లేకుండా చేసుకున్న కొలికిపూడి శ్రీనివాసరావు తన చర్యలు, తీరుతో అధిష్ఠానం ఆగ్రహానికీ గురయ్యారు.
ఇప్పుడు తాజాగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి మాట్లాడిన వీడియో బయటకు రావడం సంచ లనంగా మారింది. ఇప్పటికే పార్టీలోని సీనియర్లు కొలికపూడి చర్యలతో సీరియస్ గా ఉన్నారు. ఇప్పటికే మద్యం స్కాం లో పీకల లోతు కూరుకుపోయి అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి షేక్ హ్యాండిచ్చి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చిందని పార్టీ సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా తాను పెద్దిరెడ్డి రామచందరారెడ్డితో మాటలు కలిపిన వీడియో మొత్తం పది సెకండ్లేనని, యాథృచ్ఛికంగా హైదరాబాద్ విమానాశ్రయంలో ఎదురుపడిన పెద్దిరెడ్డి రామచం ద్రారెడ్డిని కేవలం పలకరించాననీ కొలికిపూడి వివరణ ఇస్తున్నప్పటికీ, టీడీపీ శ్రేణుల, నేతల ఆగ్రహం చల్లారడం లేదు.
పలు అవినీతి కేసులలో అభియోగాలు ఎదుర్కొంటున్న పెద్దిరెడ్డిని, అందులోనూ తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కనిపించగానే అత్యుత్సాహంతో ఆయన వెంటపడి మరీ పలకరించాల్సిన అవసరం ఏం వచ్చిందని పార్టీ నాయకులు కొలికిపూడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో తెలుగుదేశం అధిష్ఠానం కూడా కొలికిపూడిపై సీరియస్ గా ఉందంటున్నారు. ఇప్పటికే తిరువూరు పార్టీ శ్రేణులలో పరపతి పోగొట్టుకున్న కొలికిపూడిపై ఇప్పటికే చంద్రబాబు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు పెద్దిరెడ్డితో మాటామంతీ కారణంగా ఉన్న కొద్దిపాటి సానుకూలత కూడా కోల్పోయారని అంటున్నారు.