నిద్రముందు ఇంటర్నెట్టా... నో...!

 

రోజంతా పనులతో హడావిడిగా గడిపేస్తాం. కాబట్టి నిద్రపోయే ముందు కాస్త ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్స్ ఏం షేర్ చేశారో చూద్దాం అనుకుంటూ ఇంటర్నెట్ ముందు కూర్చుంటున్నారా? జాగ్రత్త... నిద్రలేమితో బాధపడతారు. దానినుంచి ఇంకెన్నో అనారోగ్యాలు చుట్టుముడతాయి అంటున్నారు జపాన్ పరిశోధకులు. నిద్ర సరిగ్గా పట్టకపోవడం, కలత నిద్ర వంటివి వేధిస్తుంటే దానికి కారణం పడుకునే ముందు టీవీ, ఇంటర్నెట్ వంటివి చూడటమే అని వీరు గట్టిగా చెబుతున్నారు. సాధారణంగా అందరూ పడుకునేంత సమయమే పడుకున్నా నిద్ర సరిపోనట్టు అనిపించిందంటే ఆలోచించాల్సిందేని హెచ్చరిస్తున్నారు.

 

ఎక్కువగా టీవీ, ఇంటర్నెట్ ముందు గడిపేవారికి, గడపని వారికి మధ్య నిద్రపోయే సమయంలో పెద్దగా తేడా లేకపోయినా, నిద్రలో నాణ్యత విషయంలో మాత్రం భారీగానే తేడా వుంటోందని తేలింది వీరి అధ్యయనంలో. 5 వేల మందిపై చేసిన ఈ అధ్యయనంలో ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో వున్నవారిలో చాలామంది నిద్రకు ముందు ఇంటర్నెట్ వాడుతున్నట్టు తేలిందిట. దానివల్ల వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతున్నట్టు కూడా గుర్తించారు ఆ పరిశోధనలో. నిద్రకు ఓ రెండు గంటల ముందు నుంచి టీవీ, ఇంటర్నెట్‌లకు దూరంగా వుంటే కంటినిండా నిద్రపోవచ్చుట.

 

-రమ