శివసేనకు రెండు, తెదేపాకు ఒక కేంద్ర మంత్రి పదవి
posted on Nov 7, 2014 9:52AM

ఈ ఆదివారంనాడు ప్రధాని మోడీ తన మంత్రి వర్గంలో మరో 10 నుండి 12మంది కొత్త మంత్రులను చేర్చుకోబోతున్నారు. ప్రస్తుతం ఆయన మంత్రివర్గంలో 22మంది క్యాబినెట్ హోదా గల మంత్రులు 22మంది సహాయమంత్రులతో కలిపి మొత్తం 44మంది ఉన్నారు. మంత్రివర్గ విస్తరణతో ఇప్పుడు ఆ సంఖ్య 54-56కు చేరవచ్చును. ఇటీవల మహారాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికలలో ఎన్డీయే భాగస్వాములుగా బీజేపీ, శివసేనలు తెగతెంపులు చేసుకొని వేర్వేరుగా పోటీ చేసినప్పటికీ, ఎన్నికల తరువాత వారు మళ్ళీ కలిసి పనిచేసేందుకు సిద్దపడటంతో, మంత్రివర్గ విస్తరణలో శివసేనకు కూడా రెండు కేంద్రమంత్రి పదవులు ఇచ్చేందుకు మోడీ అంగీకరించినట్లు సమాచారం. అదే నిజమనుకొంటే, తనతో తెగతెంపులు చేసుకొన్న శివసేనకు రెండు మంత్రి పదవులు, మిత్రపక్షమయిన తెదేపాకు ఒకటే మంత్రి పదవి కేటాయించడం కొంచెం ఆశ్చర్యంగానే ఉంది. తెదేపా నుండి సుజనాచౌదరికి కేంద్రమంత్రి పదవి ఇవ్వబోతున్నారు. బీజేపీ నుండి బండారు దత్తాత్రేయ, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, మనోహర్ పారిక్కర్ తదితరులు కేంద్రమంత్రి పదవులు దక్కనున్నాయి. పారిక్కర్ కు రక్షణశాఖ కేటాయిస్తునట్లు ఇప్పటికే అనేక వార్తలు వచ్చాయి. దానిని బీజేపీ వర్గాలు ఖండించనందున ఆయనకు రక్షణశాఖ ఖరారయినట్లే భావించవచ్చును.